నెట్టిల్లు


Sun,June 16, 2019 12:30 AM

కథ ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది. అందులోని పాత్రలు, ట్విస్టులు దాన్ని మరింత రక్తి కట్టిస్తాయి. ఈ రోజుల్లో వస్తున్న ఫీచర్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అదే కోవలోకి వస్తాయి. కథలో పెద్దగా కొత్తదనం లేకున్నా స్క్రీన్‌ప్లే, మేకింగ్ ద్వారా హిట్టు కొడుతున్నారు. ఇదిప్పుడు షార్ట్‌ఫిలిమ్స్ మేకర్స్ కూడా ఫాలో అవుతున్నారు. ఈ వారం యూట్యూబ్‌లో విడుదలై హిట్టు కొట్టిన లఘు చిత్రాల సమీక్ష ఇది.

బావ మరదలు

దర్శకత్వం: చందు
నటీనటులు : రాజేష్ ఖన్నా, తేజస్విని రావు, సత్య, శర్మ


Total views 184,775+
(జూన్ 8 నాటికి) Published on Jun 6, 2019

రిలేషన్స్‌లో బెస్ట్ కాంబినేషన్ బావామరదళ్లది. ఆటపాటలకైనా, సరదా సందళ్లకైనా చిరునామా ఆ అనుబంధం. పదిహేనేండ్ల తర్వాత ఇంటికొచ్చిన మామ కూతురితో ఇంట్లో వాళ్లు మాట్లాడడం చూసి హ్యాపీగా ఫీలవుతాడు ఆ యువకుడు. సీఏ చదువుతున్న తను అమెరికాలో సంబంధం వస్తే పెళ్లి చేసుకొని వెళ్లి స్థిరపడిపోతా అన్నప్పుడు అతడి గుండె ఒక్కసారిగా బరువెక్కుతుంది. చిన్నప్పటి సంఘటనలను గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టుకుంటాడు. తనకు తానే ధైర్యం చెప్పుకొని ఎప్పటికైనా తనకు ప్రపోజ్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఐ లవ్యూ అని ప్రపోజ్ చేస్తాడు. బావ మీద అలాంటి ఫీలింగ్ లేదని సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది మరదలు. అంతలోనే వచ్చి రేపు లంచ్‌కి వెళ్దామా అని అడుగుతుంది. మరదలే కాబట్టి తను ఎప్పటికైనా తననే ప్రేమిస్తుందన్న నమ్మకం అతడికి ఉంది. కొన్ని సీన్లు బాగున్నాయి. ల్యా...గ్ అయింది. ైక్లెమాక్స్ కంక్లూజన్ బాగుంది.


కాస్టింగ్ కౌచ్

దర్శకత్వం: మురళీ వేమూరి
నటీనటులు : రవి కటారి, ధను శ్రీ, శ్రీజ


Total views 11,094+
(జూన్ 8 నాటికి) Published on Jun 3, 2019

ఈ మధ్య కాలంలో అన్నీ వుడ్‌లను ఓ ఊపు ఊపిన అంశం కాస్టింగ్ కౌచ్. దర్శకులు దగ్గర ఎదురయ్యే సమస్యలు, అమ్మాయిలు ఎదుర్కొనే కష్టాలను ఈ లఘ చిత్రం ద్వారా చూపించాలనుకున్నాడు దర్శకుడు. టెక్నికల్‌గా చాలా పూర్‌గా ఉన్నది. కానీ మంచి సామాజిక అంశాన్ని, బాధ్యతను గుర్తు చేసే షార్ట్ ఫిలిం ఇది. ప్రతి వందమంది సినిమా కళాకారుల్లో ఇద్దరు మాత్రమే కలతలు లేని జీవితాన్ని గడపగలుగుతున్నారు. కారణాలు చాలా ఉన్నా.. ముఖ్య కారణం మాత్రం కాస్టింగ్ కౌచ్. ధైర్యంగా బయటికి వచ్చి చెప్పే వాళ్లు కొందరైతే, పదిమందికి తెలిస్తే భవిష్యత్తు నాశనం అవుతుందేమోనని లోలోపల కుమిలి దాచుకునే వారు ఇంకొందరు. ఏది ఏమైనా ఈ సమస్యను లేవనెత్తిన తర్వాత కొందరిలో మార్పు వచ్చింది. అలాగని మొత్తం మారిందని అనలేం. దర్శకుడు ఎంచుకున్న కథాంశం మంచిది. నాలుగు గోడల మధ్య జరిగే రహస్య ఒప్పందాలు, అక్రమ సంఘటనల గురించి పదిమందికి తెలియజేసే ప్రయత్నమే ఇది.

సహస్ర

దర్శకత్వం: ప్రపుల్లా, ఉస్మాన్
నటీనటులు : త్రిష్, స్నేహాల్ కామత్


Total views 14,822+
(జూన్ 8 నాటికి) Published on Jun 7, 2019

రెండేండ్లు ప్రేమించుకున్న మనసులు, మనుషులు మరిచిపోవడం కష్టం కదా! రెండు మనసులు కలిశాయి. ఒకదానికొకటి నచ్చడంతో రెండూ ప్రేమించుకున్నాయి. ఆ ప్రేమను ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్న క్రమంలో పెండ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. సహస్ర తన తండ్రిని ఒప్పించి అతడి వద్దకు తీసుకెళ్దాం అనుకుంటుంది. అంతలోనే సహస్రకు విషయం తెలిసింది. తనను వద్దనుకుంటున్నాడని, వదిలేశాడని తెలుసుకున్నది. తీసిన విధానం బాగుంది. అందని దాని కోసం ఆశపడడం, అవకాశంగా వచ్చిన దానిని సద్వినియోగం చేసుకోకపోవడం రెండూ తప్పులే. ఈ రెండు విషయాలను చూపించాలనుకోవడంలో దర్శకుడు సఫలమయ్యాడు. దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోవచ్చు. చివరకు వాళ్లిద్దరూ కలుసుకున్నారా?లేదా అన్నది మాత్రం ట్విస్ట్. ఇద్దరు మనుషులు, రెండు మనసులు ప్రేమ అనే ప్రయాణాన్ని ప్రారంభించి గమ్యాన్ని చేరుకున్నాయా? ముగిసింది అనుకున్న ప్రేమ మళ్లీ చిగురించిందా?

రోహింగ్యా

దర్శకత్వం: రమేష్ రాజుపాలెం
నటీనటులు : జితేంద్ర, తాజుద్దీన్, కార్తీకేయ, సుభాని, పద్మారావు


Total views 6,299+
(జూన్ 8 నాటికి) Published on Jun 5, 2019

ఒక ముస్లిం, ఒక హిందువు ఇద్దరు యువకులు బెస్ట్ ఫ్రెండ్స్. కులమత భేదం లేకుండా చాలా యేండ్లుగా బాగుంటారు. అతడు మసీదుకెళ్తే, ఇతడు గుడికికూడా వెళ్తాడు. ఒకరంటే ఇంకొకరికి చాలా ప్రేమ. కానీ ఇద్దరి తమ్ముళ్లు సోషల్‌మీడియాలో మత ఘర్షణలకు సంబంధించిన వీడియోలు చూసి భగభగ మండడం ప్రారంభిస్తారు. హిందువులు, ముస్లింలు భాయ్ భాయ్ కాదు. వాళ్లు మన శత్రువులు అన్నట్టు భావించి మనసుల్లో ద్వేషాలను పెంచుకుంటారు. నువ్వా.. నేనా అన్నట్టు సమయం వస్తే చూసుకుందాం అన్నట్టు సిద్ధమవుతారు. మనుషులుగా విడిపోయి, మానవత్వం ఉన్న మనుషులుగా ఓడిపోయి మతాలుగా మారుతారు. చివరకు ఓ ఫైట్ సీన్.. ఆ తర్వాత మంచి సందేశాన్నిచ్చే ైక్లెమాక్స్. సమాజంలో మార్పు తీసుకురావడానికి వస్తున్న ఇలాంటి లఘచిత్రాలు మరిన్ని రావాలి. మనుషుల ద్వారా మతాలు పుట్టాయి కానీ మతాల ద్వారా మనుషులు పుట్టలేదనే అంశాన్ని బాగా చెప్పారు.


-అజహర్ షేక్, సెల్: 9963422160

233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles