పద్య రత్నాలు-7


Sun,June 16, 2019 12:21 AM

నిజానిజాలు తెలుసుకోండి!


వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!
- సుమతీ శతకం
Nijanijaalu-teluskondi
తాత్పర్యం:
నిజానిజాలు తెలుసుకోకుండా తొందర పడడం ఎవరికీ మంచిది కాదు. ఎవరు చెప్పేవైనా సరే ముందు శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలి. ఆ వెంటనే తాడో పేడో తేల్చుకొంటానంటూ తొందరపడకూడదు. వారు చెప్పిన దానిలో నిజం ఎంత? అబద్ధం ఎంత? అన్నదీ విచక్షణ చేసుకోవాలి. తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలి. అలాంటి మనిషే అసలైన నీతిపరుడు.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.

కోపంతో సాధించేదేమీ ఉండదు!


Kopam
కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమును మిగులగోడు గలుగు
గోపమడచెనేని గోర్కెలు నీడేరు
విశ్వదాభిరామ! వినురవేమ!
- వేమన శతకం

తాత్పర్యం:
కోపంతో మనుషులు సాధించేదేమీ ఉండదని చెప్పిన నీతిపద్యమిది. ఎదుటివ్యక్తుల పట్ల కోపాన్ని ప్రదర్శించడం వల్ల నష్టమే తప్ప లాభమేమీ ఉండదు. పైగా మన ఘనత కాస్తా వారి దృష్టిలో కొంచెమై పోతుంది. ఫలితంగా మనకు ఏదో రూపంలో దు:ఖమూ కలుగుతుంది. కోపాన్ని తగ్గించుకోగలిగితే మన కోర్కెలను నెరవేర్చుకోవచ్చు.

సజ్జనుల తోడిదే లోకం


Sajjanula
సద్గోష్ఠి సిరియు నొసగును
సద్గోష్ట్యె కీర్తి బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!
- కుమార శతకం

తాత్పర్యం:
ఎప్పుడూ మంచివారితోనే సహవాసం చేయాలి. సజ్జనుల తోడిదే లోకంగా ఉండేవారికి అంతా మంచే జరుగుతుందని చెప్పే చక్కని నీతిపద్యమిది. సిరిసంపదలను, కీర్తి ప్రతిష్ఠలను, సంతృప్తిని మాత్రమే కాదు, ఆఖరకు సర్వపాపాలను హరించే శక్తి సైతం సజ్జనుల సావాసంతోనే లభిస్తుంది. అరుదుగా ఉండే అటువంటి మంచివారు లభించడం ఎవరికైనా అదృష్టమే మరి.

సర్వమూ శ్రీకృష్ణమయమే!


Sarvamu
నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!
- కృష్ణ శతకం

తాత్పర్యం:
పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణునే సర్వస్వంగా భావించినపుడు మనకిక తిరుగుండదు. ఆ స్వామినే తల్లిగా, తండ్రిగా, తోడు నీడగా, స్నేహితుడిగా, గురువుగా, దైవంగా భావిస్తూనే అంతటితో ఊరుకోరు చాలామంది. తన ప్రభువూ ఆయనే. ఆఖరకు తనకు దిక్కూమొక్కూ అన్నీ నువ్వే అని వేడుకోవడంలో లభించే తృప్తి అంతటి భక్తులకు తప్ప అన్యులకు తెలియదు.

227
Tags

More News

VIRAL NEWS