వాస్తు


Sun,June 16, 2019 12:09 AM

VASTHU

వేలానికి పెట్టే ఇండ్లను కొనుక్కోవచ్చా? వాటిల్లో దోషాలు ఉంటాయా?

-కె.శివలింగం, పోచంపల్లి
చాలామంది ఇంటిమీద వ్యామోహంతో వెనుకా ముందు చూడక అప్పులు చేసి లోన్లు తీసి ఇండ్లు కొంటూ ఉంటారు. దాదాపు దిశ, నిర్మాణం గదుల అమరికను కూడా పట్టించుకోరు. కొంత కాలానికి తీసుకున్న అప్పు కట్టలేక అవస్థలు పడతారు. వేలానికి వచ్చే ఇండ్లల్లో ఎక్కువ శాతం వాయవ్య దోషాలతో ఉంటాయి. వాయవ్యంలో గొయ్యి, నుయ్యి, నైరుతిని మించి వాయవ్యం ఎత్తు ఉండడం, ఇంట్లో ద్వారాలు ఆగ్నేయ వాయవ్యాల నడకలో ఉంటాయి. ఆగ్నేయ వాయవ్యం మూలల కొలతలు చాలా పెరిగి ఉంటాయి. వాయవ్యం వీధిపోటు ఉంటుంది. ఇలాంటి ఇండ్లు సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. ముందు అది మార్పులకు వీలుగా ఉందా అనేది చూడాలి. అంటే స్థలం సహకరిస్తుందా, వీధిపోట్లు మొదలైనవి చూడాలి. అలా అయితే బాగు చేసుకొని ఉండొచ్చు.

మా స్థలంలో పడమర వైపు మధ్య భాగం తగ్గి ఉంది. పడమర రోడ్డు ఇల్లు కట్టుకోవచ్చా?

-కోలాటం చంద్రయ్య, సంస్థాన్‌పూర్
పడమర తగ్గిన స్థలంలో రెండు వైపుల స్థలం యు ఆకారం పెరిగి ఉంటుంది. ఆ పెరుగుదలలు తప్పక కత్తిరించాల్సి ఉంటుంది. కారణం ఇది ఇంటి స్థలం కాబట్టి. చాలా పెద్ద స్థలం ఎకరాలలో ఉన్నప్పుడు పడమర తగ్గినా ఫరవాలేదు. ముందుగా మీరు ఆ స్థలాన్ని చతురస్రంగా లేదా దీర్ఘచతురస్రంగా మూల మట్టానికి సరిచేయండి. తద్వారా పెరిగిన స్థలాన్ని వదిలి వేయండి. సరిచేసిన స్థలంలో ఇంటి ప్లాను చేసుకోండి. పడమర తగ్గడం, దక్షిణం తగ్గడం అనేది స్థలం విస్తీర్ణం ఎక్కువగా ఉన్న వాటికి వర్తిస్తుంది. కానీ గృహ స్థలాలకు పనికిరాదు. మీరు సరిచేసి ఇల్లు కట్టుకోవచ్చు.

ఈశాన్యం మూల చూసే విధంగా సింహద్వారం పెట్టొచ్చా?

-రామారావు, కొత్తకోట
మూలలకు ద్వారాలు పెట్టడం కొన్ని ఆఫీసులు, ఇండ్లలోపలి పడక గదులకు పెడుతుంటారు. అలా ద్వారాలు పెడితే ఆ గృహం లేదా గదికి ఈశాన్యం మూల తెగిపోతుంది. పైగా సింహద్వారం పెట్టడం ఇంటికి చాలా దోషం. ఈశాన్యం మూల అనేది కోణాన్ని సూచించేమాట కాదు. తూర్పు ఈశాన్యం లేదా, ఉత్తర ఈశాన్యాన్ని సూచిస్తుంది. అటుగా సమపట్టుతో గుండు దారానికి ద్వారాన్ని నిలబెట్టాలి. అప్పుడే ఆ ద్వారం యోగిస్తుంది. ఇంటికి ద్వార నిర్ణయం అనేది మూల విషయం దానికి దిశలో తేడాను మొత్తం లోపాన్ని కల్పించకూడదు. పిల్లర్‌కు ఆనించి కట్టొద్దు. కంటి నిర్మాణం ఎంత సూక్ష్మ స్థాయిలో ప్రకృతి శిశువుకు ప్లాన్‌చేసి నిర్మిస్తుందో ఇంటి సింహద్వారం పలు జాగ్రత్తలతో బిగించాలి. అప్పుడే శుభం గృహానికి.

మాకు నైరుతి స్థలంలో బావి ఉంది. అందులో నీళ్లు కూడా ఉన్నాయి. ఇల్లు ఎలా కట్టుకోవాలి. బావిని కూడ్పకుండా?

-జలగం పావని, బాలానగర్
బావిని వదులుకోవద్దని అనుకున్నప్పుడు ఇంటిని కూడా వదులుకోవాలి. ఇంటి స్థలంలో నైరుతి బావి అనేది అది మృత్యు కూపంగా మారుతుంది. భవిష్యత్తులో అనేక అకాల మరణాలు తెచ్చిపెడుతుంది. మీ స్థలంలో నైరుతి బావిని ఇతరులకు ఇచ్చి దానిని వెనుక ఇంటి వారు ఈశాన్యం బావిగా మార్చుకొని ప్రహరీలను మార్చి సరిచేసుకుంటే ఆ నైరుతి బావి దోషం మీకు పోతుంది. ఇది మీకు సాధ్యమా? అలా నీరున్న బావిని వదులుకోలేరు కదా. కాబట్టి ఇంటి నిర్మాణం ఆ స్థలంలో చేయడం మంచిది కాదు. ఇప్పుడు కూడా మీకు ఆ బావి ప్రభావం పడి ఉంటుంది. ఇంతవరకు ఇంటిపని ముందుకు పోలేదంటేనే దానిని మీరు అర్థం చేసుకోవచ్చు.
SUDHHALA
సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678

264
Tags

More News

VIRAL NEWS