తెలంగాణ ఓ గురుకులం


Sun,June 9, 2019 02:47 AM

Gurukul
ఒకప్పుడు అప్పో సొప్పో చేసి, వేలకు వేలు పోసి కాన్వెంటుకే పంపాలనే ధ్యాస!తాకట్టు పెట్టయినా ఇంగ్లీషు చదువులు చదివిస్తే.. తమ బిడ్డలు తమలాగా కష్టం చేసుకొని బతుకాల్సిన స్థితిరాదని ఆశ! కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది! పక్కా భవనాలు, విశాలమైన ప్రాంగణాలు.. నాణ్యమైన విద్య, సాంస్కృతిక, క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ, పౌష్టికాహారం, ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణతో గురుకులాలు శోభిల్లుతున్నాయి. ఇదేదో సంపన్న వర్గాల స్కూళ్ల సంగతి కాదు! విద్యార్థులు తల్లిదండ్రులను ఆర్థికంగా పీల్చి పిప్పిచేసే కార్పొరేట్ పాఠశాలలకు భిన్నంగా.. కార్పొరేట్ స్థాయి విద్యాబోధనను తలదన్నేలా ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల ఘనత. మన తెలంగాణ విద్యా విధానంలో కీలకంగా మారిన గురుకులాల సక్సెస్‌పై ఈ వారం ముఖచిత్ర కథనం.

- వరకవుల దుర్వాసరాజు, సెల్: 9182777782
బొర్రా సురేష్ బాబు, సెల్: 8688107733

Gurukul1
తెలంగాణలో గురుకుల విద్యావ్యవస్థలు వచ్చాక విద్యార్థులు ఫీజు కట్టాల్సిన పనేలేదు. యూనిఫాంలు, టెక్ట్స్, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఇవేవీ కొనాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రభుత్వమే చక్కటి ఆశ్రయం కల్పించి.. నెలకు నాలుగుసార్లు చికెన్, రెండు సార్లు మటన్‌తో భోజనం పెట్టించి, నాణ్యమైన విద్యను బోధిస్తున్నది. ఇదీ.. సర్కారీ విద్య సరికొత్త స్వరూపం! ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా ఏర్పాటు చేసిన గురుకులాల స్వభావం. పేద విద్యార్థులను రేపటి పోటీ ప్రపంచానికి దీటుగా తయారు చేసే సంకల్పం. చాలీ చాలని అన్నం.. వానకాలం చదువుల స్థానంలో సామాజిక బాధ్యతతో విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దుతున్న మహా సంకల్పమిది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణలో 284 గురుకులాలుంటే.. ఆ తర్వాత వాటి సంఖ్యను 863కు పెంచి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకున్నది. విద్య ద్వారానే సామాజిక ఆర్థిక ప్రగతి సాధ్యమన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు గురుకుల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఏటా గురుకులాల సంఖ్యను పెంచుతూ, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టి కారణంగానే ఇవాళ గురుకుల విద్యాలయాలు ఎంతో ఉన్నత స్థాయిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
Gurukul2

రాష్ట్రంలో 863 గురుకులాలు..!

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలలు 284 ఉండగా.. రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా (ఈ విద్యాసంవత్సరం కొత్తగా ప్రారంభించనున్న 119 బీసీ గురుకుల విద్యాలయాలను కలుపుకొని) 863 గురుకులాలకు అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల సంఖ్య 923కు చేరింది. 2017-18 విద్యా సంవత్సరంలోనే 119 బీసీ గురుకుల విద్యాలయాలను నెలకొల్పడం విశేషం. 2019-20 విద్యా సంవత్సరంలోనూ 119 బీసీ గురుకులాలను ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలువనున్నది. అంతేకాకుండా సాంఘిక సంక్షేమశాఖ ద్వారా మహిళా డిగ్రీ కళాశాలలు 30, గిరిజన సంక్షేమశాఖ ద్వారా మహిళా డిగ్రీ కళాశాలలు 15, బీసీ సంక్షేమశాఖ ద్వారా 7 పురుషుల డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించింది. మరో మూడేండ్లలో ఈ సంఖ్యను 1200 వరకు పెంచేవిధంగా ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది.
Gurukul3

కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు

రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో కార్పొరేట్ స్థాయి విద్యా సౌకర్యాలు కల్పించారు. తరగతి గదుల్లో విద్యార్థుల కోసం డెస్క్ టేబుళ్లు, కంప్యూటర్లు, డిజిటల్ విద్యాబోధన సామాగ్రితోపాటు, సందేహాల నివృత్తికోసం కియోస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్, నైట్ డ్రెస్, పీటీడ్రెస్, మంచాలు, బెడ్లు, దుప్పట్లు, పెట్టెలు, పుస్తకాలు, నోట్సు, డిక్షనరీలు, దినచర్య రాసుకోవడానికి డైరీలు, ప్లేటు, గ్లాసు, కిట్, నేర్చుకోవడానికి సైకిల్ కూడా ఇస్తారు. ఎన్నడూ లేని విధంగా చలికి తట్టుకోవడానికి రగ్గులు కూడా ఇస్తున్నారు. పిల్లలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం తగిన సదుపాయాలు కల్పిస్తున్నది. గురుకులాలను ప్రభుత్వం ఆదర్శంగా తీర్చిదిద్దుతుండడంతో ఎక్కడ చూసినా అడ్మిషన్లు నిండిపోయాయి అనే బోర్డులు వెలుస్తున్నాయి.
Gurukul4

ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.లక్ష ఖర్చు

గురుకుల విద్యాలయాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం, తగిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నది. ఇందులోనే విద్యార్థులకు భోజనం, వసతి కల్పించడంతోపాటు అవసరమైన పుస్తకాలు, నోటు బుక్కులు, దుస్తులు, కాస్మొటిక్ వస్తువులను అందజేస్తారు. విద్యాబోధనతోపాటు సాంస్కృతిక, క్రీడాంశాల్లోనూ విద్యార్థులకు నైపుణ్యం పెంచేందుకు దృష్టి సారించారు. పేదింటి పిల్లలు నిరంతరం చదువును కొనసాగించాలన్న ఉద్దేశంతో స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాలకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నది.

ప్రతి రోజూ పౌష్టికాహారం

కార్పొరేట్ స్థాయిలో భవనాలు కట్టించి పిల్లలకు నాణ్యమైన విద్యతోబాటు మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. ఊహించని విధంగా సన్నబియ్యంతో, నెలకు నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్, రోజూ నెయ్యి, చట్నీలు, పెరుగు, గుడ్లు, అలాగే సాయంత్రాల్లో స్నాక్స్, బజ్జీలు, పకోడీలు ఆయా కాలాల్లో దొరికే పండ్లు, బూస్ట్, పాలు ఇస్తున్నారు. ఉదయం టిఫిన్‌లలో బోండాలు, చపాతీ, పూరీ, నూడుల్స్, ఇడ్లీ వంటివి పెడుతున్నారు. ప్రత్యేకంగా పండుగలకు స్వీటు, సేమియా, భక్షాలు అలా పలు రకాల పదార్థాలతో పిల్లలకు ఇంటిని మరిపింపజేస్తున్నారు. అలా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేటట్టు చూస్తున్నారు. గతంలో అన్నంలో పురుగులు ఏరుకునే పరిస్థితి నుంచి పంచభక్షాలు తినే స్థితికి తెలంగాణ గురుకుల విద్యార్థులు వచ్చారు. దీంతో డ్రాపౌట్ల సంఖ్య భారీగా తగ్గింది.

విదేశీ బృందాలతో ప్రశంసలు

రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలను దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల ప్రతినిధులే కాకుండా విదేశీ బృందాలు సైతం సందర్శిస్తున్నాయి. ఇటీవల 13మంది సభ్యులతో కూడిన విదేశీ బృందం వారు మన గురుకులాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. థాయిలాండ్, కంబోడియా, మయన్మార్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం దేశాల నుంచి వచ్చిన అధికారులు గురుకులాల్లోని అన్ని అంశాలను పరిశీలించి ప్రశంసించారు. ఇండోనేషియా, కంబోడియాకు చెందిన అధికారులు తమ దేశంలో చదువుకోవడానికి అవకాశం మాత్రమే కల్పించామని, పేద విద్యార్థులకు అన్ని సదుపాయాలు, రుచికరమైన భోజనం అందించడం ప్రభుత్వ గొప్పదనంగా అభివర్ణించారు.

ఆడపిల్లలు రక్షణ రంగంలో...

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అడపిల్లలు రక్షణ రంగంలో చేరేలా శిక్షణ ఇప్పించేందుకు ఆర్ముడ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ కళాశాలను ఏర్పాటుచేసింది. రక్షణ రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు వారిని ముందునుంచే సమాయత్తపరుస్తున్నారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో 450 మంది విద్యార్థినులకు డిగ్రీ పాఠ్యాంశాలతోపాటు మిలటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ వంటి రక్షణ రంగాల్లో చేరేందుకు శిక్షణ పొందుతున్నారు.

మైనార్టీలకు ప్రయోజనం

గతంలో మైనార్టీ వర్గానికి చెందిన పలు తెగల చిన్నారులు విద్యకు దూరమై.. ఫ్యాక్టరీలలో, మెకానిక్ షాపుల్లో మగ్గే పరిస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క మైనార్టీ గురుకుల విద్యాలయాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం దూరదృష్టితో మైనార్టీ జనాభాను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాల్లో మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. వీటిలో మైనార్టీ వర్గానికి చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలతో సమానంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నారు.

ప్రతిభను వెలికి తీసే సమ్మర్ క్యాంపులు

కేవలం చదువుతోనే జీవితంలో స్థిరపడటం అందరికీ సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గురుకులాల్లోని విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో రాణించేందుకు అవకాశం కల్పిస్తూ.. తగిన శిక్షణ ఇచ్చేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. తద్వారా విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు అవకాశం దక్కుతున్నది. మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆలోచించని గుర్రపుస్వారీ లాంటి వాటిని కూడా గురుకులాల విద్యార్థులు నేర్చుకోగలుగుతున్నారు. పాశ్చాత్య సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, సెయిలింగ్, కుస్తీ, విలువిద్య, సినిమాలు తీయడం, స్టాక్ మార్కెట్‌పై అవగాహన వంటి కళలను పేద పిల్లలు నేర్చుకుంటున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ గురుకులాల విద్యార్థులు తాము ఎవ్వరికీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు.

జేఈఈ మెయిన్స్‌లోనూ ప్రతిభ

ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణతా శాతం 65 ఉంది. పదో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా 92.43 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో గురుకులాలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ గురుకుల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ 2019 పరీక్షల్లో తగిన ఫలితాల్లో అర్హత సాధించారు. ఎస్సీ సంక్షేమ గురుకుల విద్యార్థులు 307, ఎస్టీ సంక్షేమ గురుకుల విద్యార్థులు 199, బీసీ గురుకుల విద్యార్థులు 44 మంది కలిపి మొత్తం 550 మంది అర్హత సాధించడం విశేషం.
Gurukul16

సీఎం కేసీఆర్ చొరవతో..

నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్ధేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు చూపే ప్రత్యేక చొరవ కారణంగానే గురుకుల విద్యాలయాలపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కారణంగానే ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతున్నాం. గురుకుల విద్యాలయాలే కాకుండా జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించగలుగుతున్నాం.
ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి.
Gurukul5

గురుకులాల్లో విద్యార్థుల దినచర్య

ఉదయం 5 గంటలకు నిద్రలేవడం
5.15.-6.15 వరకు వ్యాయామం, యోగ, ఆటలు
6.15- 7.15 కాలకృత్యాలు
7.15- 8 అల్పాహారం
8.00-8.15 అసెంబ్లీ
8.15-1.30 బోధనా తరగతులు
1.30-2.30 మధ్యాహ్న భోజనం
2.30-4.00 ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పిల్లల చదువు
4.00-4.30 క్లబ్‌ల నిర్వహణ
4.30-5.00 అల్పాహారం (స్నాక్స్)
5.00- 6.00 ఆటలు
6.00- 6.30 విరామం
6.30- 7.30 రాత్రి భోజనం
7.30 - 9.00 పిల్లల స్వీయ అధ్యయనం
9.00 - 9.15 డైరీ రాయడం
9.15- 9.30 పిల్లల హాజరు తీసుకోవడం
9.30 - 5.00 రాత్రి నిద్ర

Gurukul6

Gurukul7

కన్న బిడ్డల్లా చూస్తారు..

ఇక్కడ మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రిళ్లు భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. రుచికరమైన భోజనం ఉంటుంది. డాక్టర్లు కూడా అందుబాటులోనే ఉంటారు. గురుకులంలో చేరాక నా చదువులో మార్పు వచ్చింది. నేనిప్పుడు ఇంగ్లిష్ స్పష్టంగా మాట్లాడగలుగుతున్నా. సమ్మర్ సమురాయ్ క్యాంప్‌నకు కూడా ఎంపికయ్యా. మా దగ్గర అన్ని ఆటలు నేర్పిస్తారు. మాకు అందుతున్న సదుపాయాలు చూసి మా అమ్మానాన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా చదివి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని, ప్రజలకు సేవ చెయ్యాలని ఉంది.
- బండి శ్రుతి, ములకలపల్లి గురుకుల విద్యార్థిని
Gurukul8

క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులు

ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఒక వైపు చదువుల్లో ప్రతిభను చాటుతూనే క్రీడా రంగంలోనూ రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పతకాలు సాధించి తెలంగాణ రాష్ర్టానికి వన్నె తెస్తున్నారు. క్రీడాపోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. దీంతో విద్యార్థులు మరింత ఉత్సాహంగా క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పతకాలు సాధించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థుల సంఖ్య...
Gurukul9

Gurukul10

Gurukul11

ఖండాంతరాలు దాటిన కీర్తి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అయిదు పర్వతాలను అధిరోహించి మాలావత్ పూర్ణ తెలంగాణ కీర్తిని ఖండాంతరాలు దాటించింది. అతి చిన్న వయసులోనే (14)ఏళ్లలో 2014లో భారతదేశంలోని ఎత్తైన మౌంట్ ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ తర్వాత 2016లో మౌంట్ కిలిమంజారోను, 2017లో మౌంట్ ఎల్‌బ్రస్‌ను, 2019 జనవరిలో మౌంట్ అకాన్‌కాగ్నాను, ఇండోనేషియాలోని 4,884మీటర్ల కార్టెంజ్ పిరమిడ్‌ను అధిరోహించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆరో ఖండం అయిన అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ డెనాలీని పూర్ణ తాజాగా అధిరోహించింది. పూర్ణతో పాటు 2014 మే 24న ఖమ్మం ఎస్సీడబ్ల్యూఆర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాధనపల్లి ఆనంద్ కూడా ఎవరెస్ట్ అధిరోహించాడు. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ విద్యార్థులుగా వీరు అపూర్వమైన ఘనతను తమ సొంతం చేసుకున్నారు. ఎవరెస్టుపై కాలు మోపిన తొలి దళిత విద్యార్థిగా ఆనంద్ చరిత్ర సృష్టించాడు. పూర్ణ తల్లిదండ్రులు దినసరి కూలీలు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్ తండ్రి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
Gurukul12

Gurukul13

పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు దక్కనుంది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో గురుకులాలను అభివృద్ధి పరచడం వల్లే మన గురుకులాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు దక్కింది. కేవలం చదువుల్లోనే కాకుండా పేద కుటుంబాలకు చెందిన చిన్నారులు క్రీడారంగంలో కూడా రాణించేందుకు గురుకులాల ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నారు. తద్వారా గురుకులాల్లో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాపోటీల్లో తమ ప్రతిభను చాటగలుగుతున్నారు.
- రామ్‌లక్ష్మణ్, టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్, స్పోర్ట్స్ ఆఫీసర్.

Gurukul14

జనరల్ గురుకులాలు

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీ ఆధ్వర్యంలో 37 గురుకులాలు (టీఆర్‌ఈఐఎస్) కొనసాగుతున్నాయి. వీటిలో 16 బాలుర కోసం, 21 బాలికల కోసం ఏర్పాటు చేశారు. ప్రతి సెక్షన్‌లో 40 మందికి ప్రవేశాలు ఉంటాయి. ప్రతి 20 మందికి ఒక టీచర్ నియమాకం ఉంది. వాటిలో పదో తరగతి ఫలితాలలో 20 గురుకుల పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. మిగిలిన 17 గురుకులాల్లో 98.8 శాతం నుంచి 93 శాతం వరకు ఫలితాలు నమోదయ్యాయి. ఈ విధంగా మొత్తం గురుకుల విద్యాలయాల సంస్థలో 98.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ క్రమంలో 2,510 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరుకాగా వారిలో 2,474 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో 40 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. తెలంగాణ గురుకులాల సంస్థ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెండు గురుకుల జూనియర్ కాలేజీలలో ద్వితీయ సంవత్సరం చదివిన విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో 96.0 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 90 శాతానికి పైగా 455 మంది, 95 శాతానికి పైగా 238 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎనిమిది టీఎస్‌ఆర్‌జేసీలలో బాలానగర్, కీసరలో 100 శాతం ఫలితాలు వచ్చాయి.

ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి...

గురుకులాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1.25 వరకు తరగతులు నిర్వహిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సబ్జెక్టుల వారీగా ట్యుటోరియల్ పద్ధతి కొనసాగుతుంది.
- తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27 తెలంగాణ గురుకులాలను జూనియర్ కాలేజీలకు అప్‌గ్రేడ్ చేశారు. వీటిలో 2018-19 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు జరుపుతున్నారు.
- అన్ని గురుకులాల్లో టీచింగ్ లెర్నింగ్ స్కిల్స్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమాన్ని గత నాలుగేండ్ల నుంచి అమలు పరుస్తున్నారు. దీనివల్ల గురుకుల విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2 వరకు రెండు రోజులు స్టేట్ లెవెల్ ఇంగ్లీష్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో ఇంగ్లీష్ సాహిత్యం, లెటర్ రైటింగ్ వంటివి విడుదల చేశారు.
- ఇంటెన్సివ్ కోచింగ్ ః టీఎస్ ఆర్‌జేసీ ఆధ్వర్యంలో ఇంటెన్సివ్ కోచింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనివల్ల ఎంసెట్, ఐఐటీ, ఎంసెట్‌లో విద్యార్థులు ర్యాంకులు సాధించడం కోసం ఇంటెన్సివ్ కోచింగ్ విధానాన్ని ఇక్కడ అమలు పరుస్తున్నారు.
- ఈ గురుకులాల్లో ఆన్‌లైన్ వీడియో ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ఈ మేరకు నూతన సదుపాయాన్ని కల్పించారు. 2018-19 నుంచే తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీ ప్రధాన కార్యాలయం నుంచి ఆన్‌లైన్ వీడియో లెసన్స్ బోధిస్తున్నారు.

- ప్రతి గురుకులంలో ఒక మల్టీ ఫంక్షనల్ డివైస్ (కంప్యూటర్ కం ప్రొజెక్టర్)ను ఏర్పాటు చేశారు. అందుకు కావాల్సిన డిజిటల్ కంటెంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
- నాలుగు సంవత్సరాల నుంచి సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి ఏడాది దాదాపు 1,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.
- తాజా నియామక ప్రక్రియ ద్వారా 234 పోస్టులను భర్తీ చేశారు.
- ఆటలలో మేటి! గురుకుల విద్యార్థులు ఆటలలో పలు విజయాలు సాధిస్తున్నారు. తెలంగాణ గురుకుల విద్యాలయాలకు చెందిన 2,500 మంది విద్యార్థులు 2018-19లో నిర్వహించిన ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్, అలాగే 2018-19లో అన్ని గురుకులాల సొసైటీల మధ్య నిర్వహించిన ఇంటర్ స్టేట్ ఆర్ట్, పెయింటింగ్ పోటీలలో భాగస్వాములయ్యారు. విద్యార్థులను ఆటలలో ప్రోత్సహించడం కోసం రీజనల్ స్పోర్ట్స్ మీట్ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగింది.
- ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బండారుపల్లి టీఎస్‌ఆర్ స్కూల్ (బాలురు)కు చెందిన బీ గణేష్ నేపాల్‌లో ఉన్న పొఖారా ప్రాంతంలో గత ఏడాది డిసెంబర్ 18 నుంచి 25 వరకు నిర్వహించిన తొలి ఇంటర్నేషనల్ వాలీబాల్ గేమ్‌లో అండర్ 17 టీమ్‌కు ఎంపికయ్యారు.
Gurukul15

ప్రగతి బాటలో తెలంగాణ మోడల్ స్కూళ్లు

రాష్ట్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ సోసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ప్రగతి పథంలో నిలుస్తున్నాయి. ఇవి విద్యాపరంగా వెనకబడి ఉన్న గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు వరమయ్యాయి. మోడల్ స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ.. వాటిని తెలంగాణ ప్రభుత్వం 100 శాతం నిధులతో బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నది. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. గ్రామీణ విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జాతీయ స్థాయిలోని అన్ని విద్యాసంస్థల్లో గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ఈ మోడల్ స్కూళ్లను రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యాపరంగా వెనకబడి ఉన్న 27 జిల్లాలలో 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. చదువులతో పాటు ఆటలు, పాటలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ స్కూళ్లు నడుస్తున్నాయి. ఇందులో ప్రతి ఏడాదీ మంచి ఫలితాలు నమోదవుతున్నాయి. ఈ ఏడాదిలో మోడల్ స్కూళ్లలో చదివిన 210 మంది పదో తరగతి విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. ఈ ఏడాదిలో 17,434 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు.

వారిలో 17,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మోడల్ జూనియర్ కాలేజీలలో కూడా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో 66.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యాపరంగా వెనకబడి ఉన్న మండలాలను గుర్తించి ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే తరగతులు బోధిస్తున్నారు. దీనివల్ల ఆయా మండలాల్లో ఉన్న బాలబాలికలకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యావిధానం అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉండడంతో జాతీయ స్థాయిలో ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షలకు, మెడికల్ కాలేజీలలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌లో కూడా మోడల్ జూనియర్ కాలేజీలు మంచి ఫలితాలు సాధించాయి. ఇక్కడి నుంచి 2018-19లో 8 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

- మోడల్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 100 పాఠశాలల్లో బాలికల కోసం ఉచిత హాస్టల్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అక్కడి విద్యార్థులు వృత్తిపరంగా జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో ఒకేషనల్ కోర్సులను నిర్వహిస్తున్నారు.
- మోడల్ స్కూల్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతున్నది. ఉచిత యూనిఫారాలు, స్కాలర్‌షిప్‌లు, ఉచిత బస్‌పాస్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

1116
Tags

More News

VIRAL NEWS