వెన్నెల పెదవుల మీద వెలిగిన పుట్టుమచ్చ మార్లిన్ మన్రో


Sun,June 9, 2019 02:24 AM

Marilyn-Monroe
ఆమె అందానికి ప్రపంచమంతా దాసోహమంది. అందానికి తోడు ఆహార్యం.. ఆ ఆహార్యానికి సరిపడు అభినయం ఆమెను తిరుగులేని నటిగా నిలబెట్టాయి. ఆమెతో నటించాలని హాలీవుడ్ మేటి నటరాజులెందరో క్యూ కట్టారు. ఆమె చిత్రాల ద్వారా ఎందరో యువకుల శృంగారదేవతై కలలరాణిగా అవతరించింది. ఆమె నవ్వితే ప్రపంచమంతా నవ్వింది. ఏడిస్తే శోకసముద్రమే అయ్యింది. కేవలం నటిగానే కాకుండా పాటలు పాడి ఒక మంచి గాయనిగా కూడా నిరూపించుకుంది. నిర్మాతగా మారి చిత్రాలు రూపొందించింది. కానీ ఒంటరితనం ఆమెను వెంటాడింది. నిద్రలేని రాత్రులు డ్రగ్స్‌కు చేరువచేశాయి. అవే ఆమెకు శాపంగా మారి అవకాశాలను దెబ్బతీశాయి. ఒక్కసారిగా తన కలల సౌధం కుప్పకూలిపోతుంటే ఎవరూ లేని ఏకాకి జీవితానికి పుల్‌స్టాఫ్ పెట్టి తనువు చాలించింది. ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో చివరిపేజీ ఇది.

- మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

ఓ వర్షం కురిసిన రాత్రి.. చిటపట చినుకులు పడుతుంటే కిటికీలో నుంచి వర్షపు అందాన్ని, చినుకుల సౌందర్యాన్ని గమనిస్తూ వెచ్చని కాఫీ తాగుతుంది నోర్మా. బయటి చల్లదనం, కాఫీ ఇస్తున్న వెచ్చదనం ఆమెను ఆలోచనల సవ్వడిలోకి తీసుకెళ్లాయి. నోర్మా మోర్టెన్సన్.. ఏమిటిది? ఇది ఒక పేరా? అందులోనూ తన పేరా? పేరంటే ఎలా ఉండాలి? ఇంకా కొద్ది కాలంలో హాలీవుడ్ నా గురించి మాట్లాడుకోబోతోం ది. నా మీద ఏదో ఒక వార్త రాయనిదే సినిమా పత్రికలు బతకలేని స్థితికి వస్తాయి. ప్రపంచమంతా ఉచ్చరించే నా పేరు సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుం ది?- వర్షం ఆగిపోయింది. నిశ్శబ్దం ఆ గదిలోకి వచ్చి చేరింది. మెరుపులా ఒక ఆలోచన మెరిసింది. నా పేరు నోర్మా.. గార్మా కాదు.. నా పేరు మార్లిన్ మన్రో! ఎస్.. నా పేరు మార్లిన్ మన్రో.. మీడియా అంతా హాలీవుడ్ సూపర్‌స్టార్ మార్లిన్ మన్రో అని పిలవాలి. మార్లిన్ మన్రో.. అని ఈ లోకమంతా తలుచుకోవాలి. మార్లిన్ మన్రో.. అలా తనకు తాను ఎన్నిసార్లు అనుకుందో.. అంటే ఏంటో తెలుసా వెన్నెల పెదవుల మీద వెలిగిన పుట్టుమచ్చ. అంతేకాదు తన జుట్టు, తన ఆహార్యం అన్నీ మార్చేసింది. చూడగానే మత్తెక్కించే కళ్లు, ఎన్నిసార్లు చూసినా తల తిప్పుకోలేని అందం.

మన్రో టీనేజ్ రోజుల్లో మోడలింగ్ చేసేది. సినిమా వేషాలు వస్తున్న తొలిరోజుల్లో ఒక కేలండరుకు నగ్నం గా ఫోజిచ్చి సంచలనం సృష్టించింది. లక్షలాదిమంది ఆ కేలండర్ కోసం ఎగబడ్డారు. ఇలాంటి ఫోజు ఎందుకిచ్చారని ఒక విలేకరి ప్రశ్నిస్తే, ఏం చేయను ఆకలి, అవసరం అలాంటిది.. నేను కుదరదంటే, నా వెనుక క్యూలో ఎంతోమంది ఉన్నారు అని సమాధానమిచ్చింది. అయితే సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయి. ఏమిటి నాలో లోపం? తనను తాను ప్రశ్నించుకుంది. స్నేహితులను ప్రశ్నించింది. అందరూ ఒక్కటే అన్నారు దేనికైనా టైం రావాలి.. ఆ టైం ఎప్పుడొస్తుంది?.. ప్రముఖ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో అని మీడియా ఎప్పుడు అంటుంది.. అవే ఆలోచనలు. ఆమెను వెంటాడేవి. చిన్న చిన్న పాత్రలే వస్తుండడంతో తీవ్రంగా ఆలోచించేది. తను హాలీవుడ్ నటిగా స్థిరపడగలనా అని రోజూ ప్రశ్నించుకునేది. సమయం కోసం ఎదురుచూస్తూ ఉండేది.ఆ టైమ్ సరిగ్గా నాలుగు సంవత్సరాల తరువాత వచ్చింది.

ది అస్పాల్ట్ జంగిల్ సినిమాలో మన్రోకు అవకాశం వచ్చింది. హీరోయిన్‌గా కాదు.. చిన్న పాత్ర! కానీ చేయాలా వద్దా అని తటపటాయింపు. కానీ, చేయక తప్పని పరిస్థితి. చేసింది. అదే సంవత్సరం ఆల్ అబౌట్ ఈవ్ అనే సినిమాలో కూడా నటించింది. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ, అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. అలా మరో మూడు సంవత్సరాలు గడిచాయి. నయాగరా సినిమా రూపంలో ఒక బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో కొత్తగా పెళ్లయిన అమ్మాయిగా మన్రో నటించింది. ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసే పాత్ర అది. సినిమా సూపర్‌డూపర్ హిట్ కావడంతో మన్రో సెక్స్ సింబల్ అయిపోయింది. ఏ నోట విన్నా, ఏ మాట విన్నా ఆమె పేరే. హాలీవుడ్ మన్రో జ్వరంతో మంచం పట్టింది. ఆమె నటించిన హౌ టు మ్యారీ ఎ మిలియనీర్ సినిమా కూడా దుమ్ము లేపింది. భిన్నమైన గొంతు, భిన్నమైన హావభావాలు ఆమెకు ప్రత్యేక నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి. విజయం మీద విజయం... విజయమే విజయం. ఇంటర్నేషనల్ స్టార్‌గా మన్రోకు గుర్తింపు వచ్చింది. ఇక ఆమె వెనక్కి తిరిగిచూసుకోలేదు.

తన కెరీర్‌లో ఎదగడం కోసం, డబ్బు, కీర్తిప్రతిష్టలకోసం సినిమా అవకాశాల కోసం ఫలానా వ్యక్తి దోహదపడతాడని తెలిస్తే మార్లిన్ వారితో చనువుగా వ్యవహరించేదని హాలీవుడ్ మీడియా అంటుంది. తొలి రోజుల్లో అలా వేషాలు సంపాదించడానికి జానీ హైడ్ ఆమెకు ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత ట్వంటీయత్ సెంచరీఫాక్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జోసెఫ్ ఎమ్ షెంక్‌తో అనుబంధం పెంచుకుని పాపులర్ హీరోయిన్ హోదాకు చేరుకుందంటారు. ఇలా కెరీర్‌లో బస్టాప్, ద ప్రిన్స్ అండ్ ద షో గర్ల్, సంలైక్ ఇట్ హాట్ వంటి చిత్రాలు ఆమెకు మరింత పేరు తెచ్చాయి. సొంతంగా మార్లిన్ మన్రో ప్రొడక్షన్స్ స్థాపించింది. వార్నర్ బ్రదర్స్‌తో కలిసి ప్రసిద్ధ నటుడు లారెన్స్ ఒలివర్ దర్శకత్వంలో ఆయన సరసన ద ప్రిన్స్ అండ్ ద షో గర్ల్ (1957లో) హీరోయిన్‌గా ఓ చిత్రం నిర్మించింది కూడా! ఆమె నటించిన సెవెన్ ఇయర్ ఇచ్ చిత్రం ఎంతో ఘన విజయం సాధించింది. 1959లో ఉత్తమ నటి ఇన్ కామెడీ అవార్డ్‌తో పాటు 1959 సంవత్సరానికి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది.

అప్పటి వరకు విజయాలకు, ఘన విజయాలకు అలవాటు పడిన మన్రోకు ఆ తర్వాత అపజయాలు ఎదురవ్వసాగాయి. వృత్తిలో ఇలాంటివి సహజమే అనుకోకపోవడం వల్ల ఆ అపజయ భారంతో మన్రో మనసు కుంగిపోయింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న లెట్స్ మేక్ లవ్, ది మిస్ఫిట్స్ సినిమాలు కూడా బాక్సాఫీసు దగ్గర బిక్కమొఖం వేశాయి.

ఒకవైపు వృత్తి జీవితం, మరోవైపు వ్యక్తిగత జీవితం రెండూ సంక్షోభంలో పడ్డాయి. సుదీర్ఘకాలపు ఒంటరితనాన్ని అనుభవించిన మన్రో పెళ్ళి రూపంలో తోడు వెదుక్కోవాలనుకుంది. కానీ, అది భ్రమ అని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు. ఒకటి రెండు వివాహాలు విఫలమైన తరువాత బేస్బాల్ క్రీడాకారుడు జోయి డిమాగ్గియోను పెళ్ళి చేసుకొంది. నవమాసాలకే ఆ పెళ్ళి పెటాకులైంది. కొంతకాలానికి ఆర్థర్ మిల్లర్ అనే నాటక రచయితను పెళ్లాడింది. అది కూడా నిలువలేదు. అదే సమయంలో ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీతో మార్లిన్ మన్రోకు ఎఫైర్ ఉన్నట్లు పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. ఇక చివరగా 1961లో జాన్ హాస్తన్‌తో కలిసి నటించిన ది మిస్ఫిట్స్ అనే చిత్రం తన యధార్థ జీవితానికి దగ్గరగా ఉంటూ సాగింది.. ఈ చిత్రం తర్వాతే మన్రో ఇక సినిమాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పవలసి వచ్చింది. మన్రో నటించిన పూర్తిస్థాయి చివరి చిత్రం కూడా ఇదే.

1962వ సంవత్సరం.. సమ్థింగ్ గాట్ టు గివ్ సినిమా నుంచి మన్రోను తొలగించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అవి పుకార్లు కాదని, నిజాలే అని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. తరచుగా షూటింగులు ఎగ్గొట్టడం వల్లే ఆమెను సినిమా నుంచి తీసేయాల్సి వచ్చిందని నిర్మాతలు వివరణ ఇచ్చారు. ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించినా, అనిర్వచ నీయమైన భయం, అభద్రతాభావం మార్లిన్ మన్రోను వెంటాడేవని ఆమె సన్నిహితులనేవారు. ఎప్పుడూ అభద్రతా భావమే. నిర్ణయాలు తీసుకోవాలంటే కలవరపడేది. స్థిమితం లేకుండా ప్రవర్తించేది. జీవిత వాస్తవాలు చూసి భయపడేది. మానసికంగా ఆందోళనకు గురయ్యేది. అవన్నీ స్క్రిజో ఫీనియా లక్షణాలే. ఆమెకు నిద్ర పట్టేది కాదు. డాక్టరు సలహాతో నిద్రమాత్రలకు అలవాటు పడింది. ప్రసిద్ధ నటుడు మార్లిన్ బ్రాండోను ఆమె అభిమానించింది. ఆయనతో గైస్ అండ్ డాల్స్‌లో నటించేందుకు విఫలయత్నం చేసింది.

Marilyn-Monroe1
ఒక వైపు వృత్తిజీవితం, మరోవైపు వ్యక్తిగత జీవితం రెండూ సంక్షోభంలో పడ్డాయి. సుదీర్ఘకాలపు ఒంటరితనాన్ని అనుభవించిన మన్రో పెళ్ళి రూపంలో తోడు వెదుక్కోవాలనుకుంది. కాని అది భ్రమ అని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు. ఒకటి రెండు వివాహాలు విఫలమైన తరువాత బేస్బాల్ క్రీడాకారుడు జోయి డిమాగ్గియోను పెళ్ళి చేసుకొంది. నవ మాసాలకే ఆ పెళ్ళి పెటాకులైంది. కొంతకాలానికి ఆర్థర్ మిల్లర్ అనే నాటక రచయితను పెళ్లాడింది. అది కూడా నిలవలేదు. అదే సమయంలో ప్రెసిడెంట్ జాన్ ఎఫ్.కెనడీతో మార్లిన్ మన్రోకు ఎఫైర్ ఉన్నట్లు పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి.

చివరకు అతనితో సాంగత్యం ఏర్పరచుకునే వరకూ ఆమె విశ్రమించలేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఆమెను వెన్నంటి ఉండేది. అశాంతి, సంక్షోభాలు మార్లిన్ సినీ జీవితంపై ప్రభావం చూపించాయి. షూటింగ్‌లో డైలాగులు మరిచిపోయేది. కెమెరా ధ్యాస ఉండేది కాదు. ముఖ్యమైన సన్నివేశాల్లో యాభై లేదా అంతకంటే ఎక్కువ టేకులు తీసుకునేది. గంటలతర బడి సహనటులు ఆమె కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ఆల్కహాల్, ట్రాంక్విలైజర్ల వాడకం వల్ల బరువు పెరిగిపోయేది మార్లిన్. పదిహేనేళ్ళ సినీ జీవితంలో ఆమె నటించిన చిత్రాలు ముఫ్ఫై దాటలేదు. ఆమె చివరి చిత్రం మిస్ ఫిట్స్ (1961). ఆ తర్వాత సమ్‌థింగ్ గాట్ టు గివ్ చిత్రాన్ని పూర్తిచేయలేకపోయింది. దాంతో కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించిందంటూ ట్వంటీ యత్ సెంచరీ ఫాక్స్ వారు ఆమెపై దావా వేశారు.

1962 ఆగస్టు 5న అనుమానాస్పదమైన పరిస్థితుల్లో మార్లిన్ మన్రో ఆత్యహత్య చేసుకుందన్న వార్త వెలువడింది. ఆమె పడకగదిలో నిద్రమాత్రల సీసా ఉందన్నారు. అయితే, ఆమె శరీరంపై గాయాల గుర్తులు కూడా ఉన్నాయి, అది హత్యే, ఆధారాలు లేకుండా చేసేశారు, దీని వెనుక పెద్ద కుట్ర జరిగింది అని నేటికీ కొందరు వాదిస్తూ ఉంటారు. కొందరు ఆత్మహత్య అన్నారు. ఇంకొందరు డ్రగ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయింది అన్నారు. చివరికి చివరి కారణాన్నే అధికారికంగా ధ్రువీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చకు దారితీసిన కుట్ర వార్తలలో మన్రో మరణం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఒక జీవితానికి 36 ఏళ్ల వయసు ఏమంత పెద్దది కాదు. ఆమె మరణ వార్త విని తట్టుకోలేక ప్రపంచ వ్యాప్తంగా 24 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు.

Marilyn-Monroe2
ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చకు దారితీసిన కుట్రసిద్ధాంతాలలో మన్రో మరణం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. ఒక జీవితానికి 36 ఏళ్ల వయసు ఏమంత పెద్దది కాదు. ఆమె మరణ వార్త విని తప్పుకోలేక ప్రపంచ వ్యాప్తంగా 24 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు.

907
Tags

More News

VIRAL NEWS