పాత చీరలు.. సరికొత్తగా!


Sun,June 9, 2019 02:17 AM

saress
అమ్మ.. అమ్మమ్మ.. నాన్నమ్మ.. ఆ కాలంలో కట్టుకున్న చీరలు వాళ్లకి తీపి గుర్తులు.. మనకు మాత్రం వాటి విలువ వెలకట్టలేనిదనిపిస్తుంది.. ఏ ఫ్యాషన్ అయినా కొంతవరకు మాత్రమే కంటిన్యూ అవుతుంది.. కాబట్టి ఆ కాలం నాటి చీరలకు ఇప్పుడంత ఆదరణ ఉండదు.. అలా అని ఆ చీరలను బీరువాలోనే పెట్టేస్తే చీకిపోతాయి.. బయట పారేసి వారి తీపి గుర్తులను చెరిపేయలేం.. ఈ చీరలను సరికొత్తగా ఉపయోగించే ఆలోచన చెప్పాలనుకుంటున్నాం.. ఆ వెలకట్టలేని చీరలకు ఒక విలువ తీసుకురావాలనుకుంటున్నాం.. అందుకే ఈ జంటకమ్మలో పాత పట్టు చీరలను ఎలా మార్చి.. సరికొత్తగా చేయొచ్చో మీరే తెలుసుకోండి.

- సౌమ్య పలుస
saress1

చిన్న మార్పులే..

ఎన్నో యేండ్ల చీరలైనా వాటిని నాలుగైదు సార్లకు మించి కట్టరు. పాతబడ్డ చీరలు అలా వార్డ్‌రోబ్‌లో పెరిగిపోతూనే ఉంటాయి. ఇంకోవైపు కొత్త చీరలు వార్డ్‌రోబ్‌ని ఆక్రమించేస్తుంటాయి. అలా అని ఆ పట్టు చీరలను ఎవ్వరికీ ఇవ్వడానికి మనసొప్పదు. అలాగే ఉంచితే కొన్నిరోజులకి బార్డర్‌లు పాడైపోతాయి. చీరంతా బాగున్నా బార్డర్ లేకపోతే దాన్ని ఏమీ చేయలేం అనుకునేరు. బార్డర్ వరకు తీసేసి వాటికి సరికొత్త బార్డర్‌లను జతచేయొచ్చు. ప్లెయిన్ చీర అయితే కనుక బ్లాక్ ప్రింట్, థ్రెడ్ వర్క్‌లను చేయించొచ్చు. అదే కుందన్, జరీ ఉన్న రెడీమేడ్ బార్డర్‌లు మార్కెట్‌లో లభ్యమవుతాయి. వాటిని వేస్తే కొత్త చీరలాగే కనిపిస్తుంది. బ్లౌజ్‌ని కూడా మార్చేస్తే టోటల్ అదో కొత్త చీర సెట్ అయిపోతుంది. ఒకవేళ అది కుదరకపోతే రెండు పట్టు చీరలను సగానికి కట్ చేసి మరొక దానికి అటాచ్ చేయాలి. హాఫ్ అండ్ హాఫ్‌లో కొత్తగా రెండు చీరలు తయారవుతాయి.
saress2
అదిరేటి డ్రెస్‌గా: కంచిపట్టు, బెనారస్ పాత చీరలను లాంగ్ అనార్కలీగా డిజైన్ చేసి చూడండి. వీలైతే డబుల్ బార్డర్‌లా, పల్లూని పైన అటాచ్ చేయడం.. ఇలా మీ మెదడుకు పదును పెడితే బోలెడు రకాలుగా కుట్టించుకోవచ్చు. మీ ఓపిక, మీ క్రియేటివిటీకి ఇంకా పదును పెట్టండి. ప్లెయిన్ పట్టు చీరలయితే వాటిని సింపుల్‌గా కుర్తీలతో సరిపెడితే సరి. వాటిని కూడా వీలయితే డిఫరెంట్‌గా కుట్టించడానికి ట్రై చేయండి. చందేరీ, కాంజీవరం చీరలను టాప్‌లుగానే కాదు.. మ్యాక్సీ డ్రెస్‌లుగా, కాక్‌టెయిల్ పార్టీకి సూటయ్యేలా పొట్టి గౌన్లుగానూ కుట్టించొచ్చు. కేవలం ఒక్క చీరలోనే రెండు డ్రెస్‌లు కుట్టించుకోవచ్చు. కొద్దిగా ప్యాటర్న్ మార్చి ఈ గౌన్లు కుట్టించుకుంటే అందరిలో మీరే సరికొత్తగా మెరిసిపోతారు. చిన్న, పెద్ద కోట్స్‌ని కుర్తీల మీదకు ట్రై చేయొచ్చు. పిల్లలకు కూడా ఈ చీరలతో గౌన్లు, లంగా జాకెట్లను కుట్టించొచ్చు.
saress3
భలే బాటమ్స్: పాత చీరలను బొంతలుగా కుట్టించేవాళ్లు. ఇప్పటికీ పల్లెటూళ్లో ఆ పనులు చేసేవాళ్లున్నారు. కానీ పట్టు చీరలను మాత్రం ఇప్పటికీ బీరువాల్లో మడత నలగకుండా పెట్టేస్తున్నారు. ఈ చీరలను లంగా-ఓణీలుగా మార్చొచ్చు. పండుగలకు, ఇతర ఫంక్షన్లకు కొత్త కళ తీసుకురావొచ్చు. లేకపోతే చిట్టి, పొట్టి స్కర్టులుగా, లాంగ్ స్కర్టులుగా కూడా ట్రై చేయొచ్చు. లాంగ్ స్కర్టులను లేయర్లుగా కుట్టిస్తే ఆ అందమే వేరంటారు ఫ్యాషనిస్టులు. వీటి బార్డర్‌లలో కొన్ని మార్పులు చేస్తే డ్రెస్‌కి ఒక గ్రాండ్ అప్పిరియన్స్ తీసుకురావొచ్చు. లెహంగాలుగానే కాదు.. ఈ చీరలను పలాజో పాయింట్స్‌గా కుట్టిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వీటి మీద ప్లెయిన్ టీ షర్ట్‌లాంటివి ధరిస్తే మరింత బాగుంటారు. దుపట్టాలుగా కూడా పట్టు చీరలను వాడొచ్చు.
saress4
ఇంటిని మార్చేలా: చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చీరలను ఉయ్యాలగా కట్టి పడుకోబెట్టేవాళ్లు. ఇప్పుడు రెడీమేడ్ ఉయ్యాలలే అయ్యాయి. కాబట్టి చీరలను అలా కూడా వాడుకోలేం. కాబట్టి ఇంటికి కర్టెన్లుగా, పిల్లో కవర్లుగా, టేబుల్ కవర్లుగా.. మీకు నచ్చిన రీతిలో ఆ చీరలను సరికొత్తగా మార్చేయొచ్చు. కాకపోతే అన్ని చీరలు ఇలా ఇంటి డెకరేషన్‌కి పనికిరాకపోవచ్చు. కొన్ని స్టిఫ్ట్‌గా ఉండవు. కాబట్టి... వాటికి మరొక కొత్త బటన్ అటాచ్ చేసి ఓపికగా మార్చాల్సి ఉంటుంది. వీటి చివరలకు లట్కన్స్, ఇతర డెకరేటివ్ ఐటమ్స్ అటాచ్ చేస్తే సూపర్‌గా ఉంటాయి. వీలైతే వీటిని ఫ్లవర్‌వాజ్‌కి కూడా అందంగా చుట్టేయొచ్చు. ఇలా ప్రతీ అంగుళాన్ని ఆ పట్టు చీరలతో అలంకరించేయొచ్చు.
saress5
చేతిలో అందంగా: చేతిలోనే కాదు.. చేతికి కూడా ఈ చీరలను అందంగా అమర్చొచ్చు. అదెలాగా అని ఆలోచిస్తున్నారా? మామూలు గాజులను తీసుకొని వాటికి ఈ క్లాత్‌ని చుట్టేయొచ్చు. మామూలుగా ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మ్యాచ్ అయ్యేలా ఈ బ్యాంగిల్స్ ఉంటాయి. ఇక చేతిలో ఇమిడిపోయేలా పొట్టి బ్యాగులను కూడా ఈ చీరలతో తయారు చేయొచ్చు. వాటికి వీలైతే కుందన్స్, ఇతర మెషీన్ వర్క్స్ చేయించి వాడుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఫంక్షన్‌లాంటివి జరిగినప్పుడు పేపర్ రాపర్‌లో చుట్టిస్తాం. కానీ ఒక్కసారి ఈ చీరలతో గిఫ్ట్ రాపర్‌లాగా ఉపయోగించి చూడండి. అందరిలో మీ బహుమతే ప్రత్యేకంగా నిలుస్తుంది. అంతేకాదు.. ల్యాప్‌టాప్, మొబైల్ కేస్‌ల కోసం ఏవేవో షాపులు వెతుకుతున్నారా? కాటన్ సిల్క్, జరీ చీరల్లాంటి వాటితో వీటిని తయారు చేస్తే చాలా బాగుంటాయి. మీవే యూనిక్‌గా మెరుస్తాయి.
saress6
saress7
saress8
saress9

1060
Tags

More News

VIRAL NEWS