విడాకుల ఆలయాలు!


Sun,June 9, 2019 01:52 AM

Japan
కలిసి బతుకడం వృథా ప్రయాసే అనుకున్న దంపతులు విడాకుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు లాయర్లను కొనడం, డబ్బులు ఖర్చు చెయ్యడం, నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరుగడం చేస్తుంటారు. అయినా ఏదో ఒక సమస్యతో కేసు మొదటికొస్తుంది. అయితే జపాన్‌లో ఇలా కాదండోయ్. అక్కడ ప్రత్యేకంగా విడాకుల దేవాలయాలున్నాయి. వాటిల్లో పూజలు చేస్తే.. నెల తిరక్కుండానే విడాకులు వచ్చేస్తాయట. అంతేకాదు.. ఇక వద్దు అనుకున్న ఏ బంధమైనా, ఉద్యోగమైనా ఇట్టే వీగిపోతుందట.

జపాన్‌లోని క్యోటో నగరం..

ఈ నగరంలో అదో ప్రధాన రహదారి. ఆ దారిలో ఓ సందులోకి కొందరు విచారంగా వెళ్తుంటే.. మరికొందరు సంతోషంగా వెళ్తున్నారు.ఆ సందులో కొద్దిదూరం వెళ్లగానే మరీ అంత భారీగా కాకపోయినా కాస్త క్యూ ఉంది. ఆ లైనులో నిల్చున్న వారంతా తమ వంతు ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. అక్కడొక పెద్ద రాయి ఉంది. దానికి మధ్యలో మనిషి పట్టేంత రంధ్రం ఉంది. అయితే ఆ రాయి మొత్తం అతికించిన స్లిప్పులతో నిండిపోయింది. ఓ అందమైన యువతి.. ఆ రాయి చుట్టూ రెండుసార్లు ప్రదక్షిణలు చేసింది. మూడోసారి రాయి మధ్యలో ఉన్న రంధ్రంలో రెండుసార్లు అటు, ఇటు వెళ్లి.. రాయికి మొక్కింది. రాయికి తాను తెచ్చుకున్న స్లిప్పు కట్టేందుకు స్థలం లేకపోవడంతో పక్కనే మరో స్థలంలో అవి కట్టింది. ఆ పక్కనే ఉన్న దేవాలయంలోకి వెళ్లింది. తాడు కట్టిన పెద్ద గంటను మూడుసార్లు మోగించి సంతోషంగా వెనుదిరిగింది. ఆ వివాహిత ఒక్కరే కాదు.. అక్కడికి వచ్చినవారంతా అలాగే చేస్తున్నారు. ఎందుకూ అంటే.. తాము వద్దనుకున్న బంధం అతి త్వరలోనే విడిపోనున్నది కాబట్టి. అంతటి పవర్‌ఫుల్ దేవాలయమది.

ఇక్కడికొస్తే విడాకులు ఖాయం

మన దేశంలో కొన్ని రాష్ర్టాలలోని దేవాలయాలలో పూజలు చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందనే విశ్వాసం ఉంది. అయితే జపాన్‌లో ఈ గుడికి వెళ్లి పూజలు చేస్తే విడాకులు ఖాయం అని నమ్ముతారు. విడాకుల కోసమే చాలామంది ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. జపాన్‌లోని క్యోటో నగరంలో ఉన్న యాసుయ్ కోన్ప్రేగు అనే ఈ ఆలయానికి ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఎవరైనా తమ జీవిత భాగస్వామితో విడిపోవాలన్నా, తమ ప్రేమ బంధానికి ముగింపు పలకాలనుకున్నా, ఒప్పందం చేసుకున్న ఉద్యోగం నుంచి వారంతట వారుగా కాకుండా కంపెనీయే వారిని బయటకు పంపాలన్నా, వ్యాపార భాగస్వామితో వ్యాపారాన్ని ముగించాలనుకున్నా ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలట. ఎటువంటి గొడవలు లేకుండా కోరుకున్న బంధం తెగిపోతుందని ఇక్కడ విశ్వాసం. సాధారణంగా ఇలాంటి బంధాలను తెంచుకోవాలంటే గొడవలు జరగడం, కోర్టు కేసులు ఎదుర్కొనడంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఈ ఆలయ సందర్శనం ద్వారా ఇలాంటి సమస్యలు ఏవీ ఎదురుకాకుండా సమస్య సామరస్యంగా ముగిసిపోతుందట.

బండ మధ్యలో దూరితే..!

యాసుయ్ కోన్ప్రేగు దేవాలయంలోని పెద్ద బండకి మధ్యలో మనిషి వెళ్లగలిగేంత రంధ్రం మాత్రమే ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లిన భక్తులు తాము తెంచుకోవాలనుకుంటున్న బంధాన్ని ఒక కాగితంపై రాసి, బండ మధ్యలోని రంధ్రం గుండా రెండుసార్లు వెళ్లి రావాలి. తర్వాత బండపై ఉన్న వస్ర్తానికి ఆ కాగితాన్ని కట్టి తాము కోరుకున్న బంధాన్ని తెంచివేయమని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల కచ్చితంగా వారి కోరిక తీరుతుందని జపాన్ వాసుల విశ్వాసం. అందుకే బంధాల నుంచి విముక్తి చేసే ఆలయంగా ఇది ప్రసిద్ధి.
Japan1

షోకోజాన్ టోకీజీ

ఈ కింది ఫొటోలో కనిపిస్తున్న గుడి పేరు డైవర్స్ టెంపుల్. ఇది కూడా జపాన్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన కమకూరలో ఉన్నది. ఈ ఆలయం అసలు పేరు షోకోజాన్ టోకీజీ. అందమైన తోటలో, ప్రశాంతమైన వాతావరణం మధ్య ఉండే ఈ ఆలయంలోకి అడుగు పెడితే చాలు.. మనసులోని ఒత్తిడి మటుమాయం అవుతుంది. ప్రకృతితో మమేకమైనట్లు అనిపిస్తుంది. అలాంటి ఈ ఆలయానికి ఈ పేరు రావడానికి ప్రాచీన కథ ఒకటి ఉందంటారు అక్కడివారు. షోకోజాన్ టోకీజీ అంటే జపనీయుల భాషలో ఎన్‌కిరి-డెరా. అనుబంధాలను తెంచడం అని అర్థం. 12వ శతాబ్దంలో జపాన్ దంపతుల్లో భర్త, భార్యతో విడిపోవాలనుకుంటే నేను విడిపోతున్నా.. అంటే చాలు. అతడికి భార్య నుంచి విడిపోయే అధికారం ఉండేదట. అదే భార్య విషయంలో అయితే విడాకుల తంతు పూర్తవడానికి మూడేండ్లు పట్టేది. ఆ మూడేండ్ల పాటు భర్త నుంచి విడిపోవాలనుకున్న భార్య, తన భర్తకు దూరంగా ఈ ఆలయంలో ఉండేవారట. అలా ఆలయం వారికి బసగా మారింది. అప్పటి రాజులు ఈ ఆలయంలో ఉండే మహిళలకు సదుపాయాలన్నీ ఉచితంగా అందించేవారు. విడిపోవాలనుకునే వారు ఇక్కడ ఉండడంతో ఈ ఆలయానికి విడాకుల ఆలయం అనే పేరు స్థిరపడింది. విడాకులు కావాలనుకునే వారు ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే.. త్వరగా విడాకులు వస్తాయని విశ్వాసం. కొన్ని శతాబ్దాలుగా ఈ ఆలయానికి సందర్శకులు వస్తూనే ఉన్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది.

243
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles