పద్య రత్నాలు-6


Sun,June 9, 2019 01:16 AM

Murkunaku-avi-teliyavu

మూర్ఖులకు అవి తెలియవు!

ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్
దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే
ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే?
తెడ్డది కూరలోగలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!

- భాస్కర శతకం

తాత్పర్యం:వెడ్డివారి (మూర్ఖులు) స్వభావం ఎలా ఉంటుందో తెలిపే నీతిపద్యమిది. సత్పురుషులతో ఎన్నాళ్లు సావాసం చేసినా సరే, మూఢులైన వారు సద్గుణాలను ఎప్పటికీ ఒంట పట్టించుకోరు. మంచివాళ్ల ప్రజ్ఞాపాటవాలు వారి మనసుకు ఎక్కవు కాక ఎక్కవు. ఎలాగంటే, వంట ఎంత రుచిగా ఉందో తినే నాలుకకు తెలుస్తుంది కానీ, కలిపే గరిటెకు తెలియదు కదా.

ఈ శీర్షికపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 9182777177 వాట్సప్ నంబర్‌లో తెలియజేయండి.
Murkunaku-avi-teliyavu2

సంసార భ్రమలు తొలగాలి

అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతాపుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా
చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!

- కాళహస్తీశ్వర శతకం

తాత్పర్యం:జగత్తంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అని తెలిసిన తర్వాత కూడా మానవులు మోక్షసిద్ధి మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారు కదా. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఎంతసేపూ భార్యాబిడ్డలు, ధనధాన్యాలు, శరీర పోషణ.. ఇవే శాశ్వతమనే భ్రాంతిలో ఉంటారు. ఈ మాయలోంచి బయటపడే నీ నామపఠనం పట్ల చింతాకు అంతైనా ధ్యాస నిలుపరు కదా.
Murkunaku-avi-teliyavu1

నిష్ఠూర సత్యాలు

ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్పు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ!

- సుమతీ శతకం

తాత్పర్యం: కొన్ని విషయాలు ఎంతో నిష్ఠూరంలా అనిపించినా నిజానికి ప్రపంచంలో అవే వాస్తవాలు. విద్య లేదా చదువు ఏదైనా సరే, మనిషిని ప్రయోజకుణ్ణి చేసేలా ఉండాలి. ధైర్యంతో పోరాడటానికైనా సిద్ధపడే వాడినే ధీరుడు, పౌరుషవంతుడు అంటారు. మన నేర్పరితనాన్ని కవిశ్రేష్ఠులైన వారు మెచ్చుకోగలగాలి. అలాగే, తగవులేవైనా హాని చేసేవే ఉంటాయి.
Murkunaku-avi-teliyavu3

మోక్షమొక్కటి చాలు

ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు
కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు.
సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు
నేను గోరినదొక్కటే నీలవర్ణ!
చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

- నారసింహ శతకం

తాత్పర్యం:భగవంతుణ్ణి దేనికోసం ప్రార్థించాలో చెప్పిన నీతిపద్యమిది. ఐశ్వర్యం కోసమో, ద్రవ్యం ఆశించో, బంగారమీయమనో, పల్లకి కావాలనో, సొమ్ములివ్వమనో ఇంకా భూములు, కీర్తి, సామర్థ్యం, ఆఖరకు బతుకుదెరువు కోసం ఏవైనా పనులు అప్పజెప్పమనీ.. ఇలాంటివేవీ అడగకుండా కేవలం మోక్షమొక్కటి ఇస్తే చాలు అన్నదే మన వేడుకోలు కావాలి.

145
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles