పోరాడారు.. గెలిచారు


Sun,June 2, 2019 12:48 AM

క్యాన్సర్.. ఒక మహమ్మరి.. ఈ వ్యాధి చాప కింద నీరులా మనుషులను కబళించేస్తున్నది.. రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తూ.. మనిషిని నిలువునా మింగేస్తున్నది.. చిన్నా.. పెద్ద తేడా లేకుండా దీని బారిన పడి.. ప్రాణాలు కోల్పోతున్నవాళ్లే ఎక్కువ.. కానీ ఈ వ్యాధితో పోరాడి గెలిచినవాళ్లు చాలామందే ఉన్నారు.. ఈ రోజున నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే. ఈ సందర్భంగా క్యాన్సర్‌తో బాధపడి.. ఇప్పుడు హాయిగా ఉన్న బాలీవుడ్ సెలెబ్రిటీల గురించే ఈ జంటకమ్మ..

సోనాలీ బింద్రే - మెటాస్టిక్ క్యాన్సర్

మురారి, శంకర్‌దాదా సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన నటి సోనాలీ. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే పెండ్లి, పిల్లలతో కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడిపోయింది. అడపాదడపా కొన్ని యాడ్స్‌ల్లో మెరిసినా ఈ భామ గత సంవత్సరం ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌తో అందరినీ బాధకు గురిచేసింది. ఆరోగ్యం బాగాలేదని తెలిసి హాస్పిటల్‌కి వెళితే క్యాన్సర్ అని తేలింది. పైగా ఇది వ్యాప్తి చెందే క్యాన్సర్, అది కూడా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందని తేలింది. వెంటనే అప్రమత్తమై యూఎస్‌కి వెళ్లింది. అక్కడ చికిత్స చేయించుకొని ఇటీవలే ఇండియాకి తిరిగొచ్చింది. ఇప్పుడు క్యాన్సర్ అవగాహన మీద సదస్సులు ఇస్తున్నది. ఈమె తరుచుగా టెస్ట్‌లు చేయించుకుంటేనే బతికే చాన్స్ ఎక్కువని డాక్టర్లు నిర్ధారించారు.
Sonali

ఇర్ఫాన్ ఖాన్ - న్యూరోఎండోక్రిన్ క్యాన్సర్

సైనికుడు సినిమా గుర్తుందా? అందులో విలన్‌గా చేసిన నటుడే ఇర్ఫాన్. థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరుంది. బాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించాడీ నటుడు. సోషల్ మీడియా ద్వారా తనకొచ్చిన వ్యాధి గురించి ప్రపంచానికి తెలిసింది. హై గ్రేడ్‌లో ఈ క్యాన్సర్ మహమ్మారి అతడిని కబళిస్తున్నట్లు తెలిపాడు. లండన్‌లో ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నది. అయితే అతను హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పుడు ఆ బాధ గురంచి ఒక పోస్ట్ పెట్టాడు. అందులో.. ఎందుకో భయం, నిర్లిప్తత నన్ను అవరిస్తున్నది. నేను చికిత్స చేయించుకొనే హాస్పిటల్ ముందు ఒక స్టేడియం ఉంది. రిచార్డ్స్ నవ్వుతున్న ఫొటోను చూసి నా బాధలు కాసేపు మరచిపోయాను. నా బలాలు ఏంటో నాకర్థమయ్యాయి. ఇక నా జీవితమనే ఆటని నేను ఇంకా బాగా ఆడాలనుకుంటున్నాను అని రాశాడు. ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది.
Irfan

లిసారే - బ్లడ్ క్యాన్సర్

టక్కరి దొంగలో ఈ భామ మెరిసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలో కనిపించకపోయినా.. బాలీవుడ్‌లో కూడా తక్కువ సినిమాలే చేసింది. ఆ తర్వాత పెండ్లితో సినిమాలు చేయడం మానేసింది. బయట కనిపించిన దాఖలాలు కూడా తక్కువే. 2009లో తనకు మల్టిపుల్ మైలోమా అనే వ్యాధి ఉందని తేలింది. ఇదొక రకమైన బ్లడ్ క్యాన్సర్. 2010లో పత్రికాముఖంగా ఈ వ్యాధి ఉన్నట్లు చెప్పింది. స్టెమ్ సెల్స్ రీప్లేస్‌మెంట్ చేసి ఈ వ్యాధి నుంచి బయటపడింది. ఈ క్యాన్సర్‌కి ట్రీట్‌మెంట్ చేయొచ్చు. కానీ పూర్తిగా నివారించలేం. ఏ క్షణన్నైనా ఈ వ్యాధి కబళించవచ్చనేది లిసారేకి తెలుసు. అయినా ధైర్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నది.
lisaray

ముంతాజ్ - బ్రెస్ట్ క్యాన్సర్

అలనాటి అందాల తారగా ఈమెకు మంచి పేరుంది. బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన నటి.లండన్‌లో పుట్టి, పెరిగిన ఈ నటి సినిమాల మీద ఇష్టంతో ముంబైకి చేరుకుంది. 45యేండ్ల వయసు ఉన్నప్పుడు ఈమె బ్రెస్ట్ క్యాన్సర్‌కి గురైనట్లు తెలిసింది. పదకొండు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసింది. మొత్తానికి ఇప్పుడు క్యాన్సర్ బారి నుంచి బయటపడింది. క్యాన్సర్ పై అవగాహన కలుగాలని వన్ ఎ మినిట్ అనే డాక్యుమెంటరీలో నటించింది. 2010లో ఈ డాక్యుమెంటరీ విడుదలయింది. సినిమాలకు దూరంగా ఉన్నా.. క్యాన్సర్ పై అవగాహన కోసం పోరాటం చేయడానికి సిద్ధం అంటున్నది.
Mumtaz

అనురాగ్ బసు - బ్లడ్ క్యాన్సర్

హిందీలో బర్ఫీ సినిమా ఓ ఆణిముత్యం. జగ్గా జాసూస్‌లాంటి సినిమాలు తీసిన ఘనత అనురాగ్ బసుకే దక్కుతుంది. ఇతడికి ప్రోమోలోస్టిక్ ల్యుకేమీయా వ్యాధి సోకింది. ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. అప్పటి వరకు బొద్దుగా, ముద్దుగా ఉండే ఇతడు ట్రీట్‌మెంట్ మొదలయ్యాక సన్నబడ్డాడు. అయితే ఇతడికి ఆ క్యాన్సర్ అని తెలిసినప్పుడు డాక్టర్లు 50శాతం మాత్రమే బతికే చాన్స్ ఉందని చెప్పారు. కానీ అనురాగ్ ఆత్మవిశ్వాసమే అతడిని తొందరగా రికవర్ అయ్యేలా చేసింది. త్వరలోనే మంచి ప్రాజెక్ట్‌లు చేయడానికి ఈ దర్శకుడు సిద్ధమవుతున్నాడనే వార్తలు బాలీవుడ్‌లో నడుస్తున్నాయి.
Anuragbasu

మనీషా కొయిరాలా - ఓవేరియన్ క్యాన్సర్

నేపాలీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మనీషా. తెలుగు తెరపై కూడా ఎన్నో సినిమాల్లో మెరిసింది. పెండ్లి, ఆ తర్వాత విడాకులయ్యాయి. కొన్ని రోజులకే ఓవేరియన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించింది. 42యేండ్ల వయసులో ఆమెకు ఈ క్యాన్సర్ అటాక్ అయింది. న్యూయార్క్ వెళ్లి ఎన్నో సర్జరీలు, కీమో థెరపీలు చేయించుకుంది. మొత్తానికి ఆమె ధైర్యమే ఆమెను నిలబెట్టింది. 2015లో పూర్తిగా ఆ క్యాన్సర్ నుంచి బయటపడింది. ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పుడు, ఆ తర్వాత తన ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేయడానికి కూడా ఈ నటి వెనుకాడలేదు. గ్లామర్ ప్రపంచంలో ఉండి.. గుండుతో కనిపిస్తే ఎలా ఫీలవుతారనే భయం లేకుండా ఫొటోలను పోస్ట్ చేసింది.
manisha

రాకేష్ రోషన్ - స్కామస్ సెల్ కార్సినోమా

యాక్టర్, ఫిల్మ్‌మేకర్‌గా రాకేష్ రోషన్ అందరికీ తెలుసు. హృతిక్ తండ్రిగా కూడా అందరికీ సుపరిచితుడే! క్రిష్, కరణ్-అర్జున్, కహోనా ప్యార్ హై.. ఆయన నిర్మించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్. ఇతడికి ఒక రకమైన గొంతు క్యాన్సర్ వచ్చింది. అప్పటికే తన కూతురు సునయన రోషన్ సర్వైకల్ క్యాన్సర్‌తో పోరాడింది. మొత్తానికి ఆమె ఆ క్యాన్సర్ నుంచి బయటపడిందని తెలిసిన కొన్ని రోజులకే రాకేష్ రోషన్‌కి ఈ వ్యాధి రావడం వారి కుటుంబాన్ని కుంగదీసింది. కానీ రాకేష్ మాత్రం ధైర్యంగా క్యాన్సర్‌ని ఎదుర్కొంటున్నాడు.
Rakesh_Roshan

యువరాజ్ సింగ్ - లంగ్ క్యాన్సర్

టీమ్ ఇండియాలో మంచి ప్లేయర్‌గా ఇతడికి పేరుంది. 2011 వరల్డ్ కప్ చేతికి రావడానికి ఒక రకంగా మనోడే కారణం. ఆ తర్వాత నుంచి అతడిని ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా పిలువడం మొదలు పెట్టారు. కానీ కొన్ని రోజులకే ఆ ప్లేయర్‌కి లంగ్ క్యాన్సర్ అటాక్ అయిందని తెలిసింది. యూఎస్‌లో దీనికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌కు వెళ్లాడు యువీ అక్కడ కీమో, సర్జరీలతో మార్చి 2012లో ఇండియా తిరిగొచ్చాడు. ఆ సంవత్సరం చివరలోనే తిరిగి నీలిరంగు జెర్సీ వేసుకొని ఇండియా తరుపున కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాడు. తన ధైర్యమే తనకు రక్షగా పని చేసింది. క్యాన్సర్ వచ్చిందని బాధపడుతూ కూర్చోవడం కంటే దాన్ని ఎదుర్కొని నిలబడాలనే ధైర్యం యువీని చూసి నేర్చుకోవచ్చు.
Yuvaraj

662
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles