ఇది సామాన్యుడి ఐస్‌క్రీమ్


Sun,June 2, 2019 12:08 AM

ఎండలు మండుతున్నాయి. గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. నిత్యం రద్దీగా ఉండే మన హైదరాబాద్ మహానగరంలో ఆ ఎండ నుండి కాస్త సేదతీరడానికి సామాన్యుడికి.. ఒక ఒయాసిస్‌లా కనిపించేదే మన హైదరాబాద్ కి షాన్ - ఫేమస్ ఐస్‌క్రీమ్ పార్లర్. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న మొజాంజాహి మార్కెట్ లోని ఫేమస్ ఐస్‌క్రీమ్ పార్లర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.

దాదాపు 65 ఏండ్ల క్రితం మహమ్మద్ హలీమ్ అనే వ్యక్తి మొజాంజాహి మార్కెట్లో ఫేమస్ ఐస్‌క్రీమ్ పార్లర్ పేరుతో ఓ షాపును ప్రారంభించారు. ఎటువంటి రసాయనాలు గానీ, కలర్స్‌గానీ వాడకుండా స్వయంగా చేతితో చేసే హ్యాండ్‌మేడ్ ఐస్‌క్రీమ్ తయారుచేయడమే ఈ పార్లర్ ప్రత్యేకత. ఇప్పటికి కూడా ఆయన వారసులు అదే పద్ధతిని కొనసాగిస్తూ ఎప్పటిలాగే హ్యాండ్‌మేడ్ ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నారు.ప్రస్తుత ధరల ప్రకారం ఈ పార్లర్‌లో స్కూప్ ఐస్‌క్రీమ్ కేవలం రూ.15 మాత్రమే. హైదరాబాద్ జంటనగరాలలో అనేక చోట్ల పలురకాల ఐస్‌క్రీమ్ సెంటర్స్ వచ్చినప్పటికీ ఈ ఫేమస్ ఐస్‌క్రీమ్ పార్లర్‌కు ఉండే ప్రాముఖ్యం ఏమాత్రం తగ్గలేదు. దీనికి కారణమేంటంటే - ఇక్కడ సీజన్‌కు తగ్గట్టుగా దొరికే పండ్లతో తయారుచేసే ఐస్ క్రీమ్స్ లభ్యమవుతుండడం. అవి కూడా అత్యంత సహజంగా ఎటువంటి కలర్స్ లేదా షుగర్ కోటెడ్ మిశ్రమాలు కలపకుండా తయారవ్వడం. అలాగే ఈ పార్లర్లో ఇతర ఐస్ క్రీమ్ పార్లర్స్‌తో పోలిస్తే ధరలు చాలా వెసులుబాటుగా ఉండటం.ఇక్కడ దొరికే ఐస్‌క్రీమ్స్‌లో ప్రధానంగా మ్యాంగో ఐస్‌క్రీమ్‌కి మంచి ఆదరణ ఉంది. ఆ ఐస్‌క్రీమ్ రుచి చూస్తే అచ్చం మామిడిపండు తిన్న అనుభవం కలుగుతుంది. వేసవికాలంలో ఈ దుకాణం వద్ద ప్రజల తాకిడి విపరీతంగా ఉంటుంది. ప్రధానంగా వేసవి సెలవుల్లో హైదరాబాద్‌లో ఉండేవారు లేదా సెలవులకి నగరానికి వచ్చేవారు..ఫేమస్ ఐస్‌క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ రుచి చూడాల్సిందే.
IceCream

ఈ ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వచ్చే కస్టమర్లలో ఎక్కువమంది చిరు వ్యాపారస్తులతో పాటు రోజు వారీ పనులు చేసుకొనేవారు కూడా ఉండడం విశేషం. అత్యంత తక్కువ ధరల్లో వేసవి తాపాన్ని ఈ పార్లరు తీర్చడమే ఇందుకు ప్రధాన కారణం. అలాగని.. ఈ పార్లరుకి దిగువ, మధ్యతరగతి కస్టమర్లే వస్తారనుకుంటే పొరపాటే. అనేకమంది బిగ్‌షాట్స్, సెలబ్రిటీలు కూడా ఈ ఐస్‌క్రీమ్‌కు ఫ్యాన్స్‌గా ఉన్నారు. సంవత్సరం పొడువునా ఇక్కడ ఐస్‌క్రీమ్ విక్రయం జరిగినా.. ప్రధానంగా వేసవికాలం, రంజాన్ సీజన్లలో ఇక్కడ దొరికే ఫ్లేవర్స్ అత్యంత రుచికరంగా, మధురంగా ఉంటాయి. దాదాపు రూ.15 నుండి మొదలై రూ.200 ధర వరకూ ఇక్కడ ఐస్‌క్రీములు లభిస్తాయి. అందుకే హైదరాబాద్‌లోని బెస్ట్ ఫుడ్ స్పాట్స్‌లో ఫేమస్ ఐస్‌క్రీమ్ పార్లర్ ఒకటిగా నిలిచిపోయింది.ఇక ఈ పార్లర్ పక్కనే మరికొన్ని షాపులు ఐస్‌క్రీమ్ వ్యాపారంలో బాగా రాణిస్తున్నా యి. గఫుర్, షా పార్లర్స్ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఐస్‌క్రీమును తయారుచేస్తూ.. కస్టమర్ల తాకిడితో కిటకిటలాడుతున్నాయి.హైదరాబాద్ మధ్యలో రోడ్డు పక్కనే దాదాపు ఒక 50 నుండి 70 ప్లాస్టిక్ టేబుల్స్, చైర్స్ మధ్య.. మన కుటుంబ సభ్యులతో కూర్చొని ఐస్‌క్రీమ్ తింటుంటే వచ్చే ఆ మజానే వేరు కదా. ఇక్కడి నుండి బెంగళూరు, ముంబైకి ఐస్‌క్రీములు పార్సిల్స్ కూడా వెళతాయంటే వీటి రేంజ్ ఏంటో అర్థమవుతుంది కదూ!
ice-cream

621
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles