పొగమంచు


Sun,June 2, 2019 12:05 AM

ఆకాశం నిండా నల్లరంగు మబ్బులు. కింద మంచుతెర. ఆ పెద్ద ఓడలోని ఏండ్రూ వేనర్ మనసుకూడా ఆ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నది. డెక్‌మీంచి న్యూయార్క్ నగరం వంక చూస్తూ, అనేక పడవల ఫాగ్ హారన్‌లను వింటూ, తన ఇరవయ్యవ పుట్టినరోజు జరుపుకోవడానికి అది సరైన ప్రదేశం కాదని అనుకున్నాడు. ముఖ్యంగా తన తోటి ప్రయాణీకుడంటే ఏండ్రూకి అసలు ఇష్టం లేదు. ఆయన తన మేనమామ మేక్స్.నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నించీ నాకీ సముద్ర శబ్దాలు బాగా ఇష్టం మేక్స్ ఉత్సాహంగా చెప్పాడు.ఇవి పూర్తి సముద్ర శబ్దాలు కావు అంకుల్. మనం ఇంకా న్యూయార్క్ ఓడరేవుకి దూరం కాలేదు ఏండ్రూ చెప్పాడు.మెడచుట్టూ ఉలెన్ మఫ్లర్‌ను చుట్టుకొని, ముతక ఉలెన్ కోటును ధరించిన మేక్స్‌ను చూసి ఏండ్రూ స్వల్పంగా వణుకుతూ అడిగాడు. నీకు చలిగా లేదా?దీన్ని చలి అంటారా? మీ తరం వాళ్ళతో ఇదే పేచీ. దేన్నీ తట్టుకోలేరు. పొద్దున కాసేపు నడిచి చన్నీళ్ళ స్నానం చేస్తే నీకు ఎంతో శక్తి వస్తుంది. అనవసరంగా ఆలోచనలు పెట్టుకోకు మేక్స్ ఆఖరి వాక్యాన్ని హెచ్చరికగా చెప్పాడు.ఆయన దేని గురించి ఆ హెచ్చరిక చేసాడో ఏండ్రూకి తెలుసు. తన ప్రియురాలు బెటీనాని వదిలి వెళ్ళడం గురించి. గత రెండు నెలలుగా మేక్స్ అతన్ని బెటీనాని మర్చిపొమ్మని కోరుతున్నాడు.

తన మరణానంతరం ఏండ్రూ వారసుడయ్యే ఆస్తిపాస్తులు, బాండ్స్, స్టాక్స్, షేర్ల గురించి చెప్తున్నా, ఏండ్రూ తన మనసుని బెటీనా మీంచి మళ్ళించుకోలేక పోయాడు. తనకి ఇష్టం లేకపోయినా ఆ ఓడలో తన మేనమామతో ఇటలీకి వెళ్తున్నాడు.లాస్ వెగాస్ క్లబ్‌లో బెటీనా జీవించి ఉన్న విగ్రహంలా నిలబడే ఉద్యోగం చేస్తున్నది. ఏండ్రూకి ఆమెతో అక్కడే పరిచయం. ఆ విగ్రహం చాలామంది యువకులని ఆకట్టుకునేది. కానీ, ఆ విగ్రహాన్ని ఏండ్రూ ఆకట్టుకోగలిగాడు. అతనికి అంటిన ప్రేమనే ఆ వ్యాధికి మందు. కొద్దికాలం ఆమెకి దూరంగా విదేశంలో గడపమని మేక్స్ నిర్ణయించాడు.అటుగా వెళ్ళే ఓ స్టివారడ్స్‌ని ఆపి మేక్స్ ప్రశ్నించాడు. ఏం జరుగుతోంది? మనం ఇవాళ కదుల్తున్నామా? లేదా? కొద్దికొద్దిగా పొగమంచు సర్దుకుంటున్నది. ఇంకో అరగంటలో బయలుదేరవచ్చు సర్ అతను జవాబు చెప్పాడు.మంచిది... ఏండ్రూ, మనిద్దరం లాంజీకి వెళ్ళి క్రిబ్బేజ్ బోర్డ్ గేమ్ ఆడదాం. బోర్ కొట్టాక మళ్ళీ ఇక్కడికి వచ్చి డెక్‌మీద నడుద్దాం ఏండ్రూ అందుకు నిరాకరించాడు. సరే. నేను మిగిలిన వాళ్ళతో ఆడుతూంటాను. నువ్వు చూసి నేర్చుకో
మేక్స్ అతని చేతిని పట్టుకొని కిందకి తీసుకెళ్ళాడు.
Poga-manchu

సాయంత్రం ఆరుకి ఎస్‌ఎస్ అమాపోల్ ఓడ ఇంజిన్లు స్టార్టయిన శబ్దాలు, గుడ్ బై హార్న్ మోతని ఏండ్రూ విన్నాడు. అతనికి అంతదాకా కనిపించిన వాళ్ళంతా ముసలివాళ్ళే. ఓడలో ఒక్క పడుచు అమ్మాయి కూడా కనపడలేదు. మరో బెటీనా తనకా ఓడలో తారసపడదని అనుకున్నాడు. ఇటలీ దాకా ఇది బావుండని ప్రయాణమే అనుకుని నిట్టూర్చాడు.డిన్నర్ టేబిల్ దగ్గర ఏండ్రూకి ఓ భయంకర ఆలోచన కలిగింది. మేక్స్ వెయిటర్ తన భోజనాన్ని ఎలా చేయాలో వివరిస్తూంటే ఏండ్రూ ఆవులించాడు. అందులో మాంసం, పచ్చి కూరగాయలు, నూనె, వెన్న ఉండకూడదు. హోల్ వీట్ బ్రెడ్‌మీద కాల్చిన కూరగాయలని పరిచి, దానిమీద ఇంకో ముక్క ఉంచి ఇవ్వాలి. వెయిటర్ విసుగ్గా మొహం పెట్టి వెళ్ళిపోయాక మేక్స్ నవ్వుతూ ఏండ్రూతో చెప్పాడు.
చూశావా? ధనవంతుడు అవడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి ఇతరులు నీ గురించి ఏం అనుకుంటున్నారు అన్నది నువ్వు పట్టించుకోనక్కర్లేదు ఏండ్రూ బలహీనంగా నవ్వాడు.మేక్స్ రుచి, పచి లేని ఆ వెజిటబుల్ సేండ్‌విచ్‌లని తింటూండటం చూసిన ఏండ్రూ ఆ రకం కఠినమైన డైట్, నిత్యం నడకతో అంకుల్ మేక్స్ డ్బ్బై ఒకటో ఏట కూడా ఏభై ఏళ్ళ వాడిలా కూడా కనిపించడు అనుకున్నాడు. కానీ, అతను ఆరోగ్యంగా, బలంగానే ఉన్నాడు. ఆయన అలా చాలాకాలం జీవించగలడనీ అనుకొన్నాడు.
రుచిగా ఉంది ఏండ్రూ. నువ్వూ ఒకటి తిను మేక్స్ కోరాడు. ఏండ్రూ తన కేబిన్‌కి వెళ్తూంటే అతని కడుపు తిప్పి వాంతైంది.ఇది సీ సిక్‌నెస్ తప్ప నువ్వు తిన్నదాని వల్ల కాదు. అడ్జస్ట్ అవడానికి కొంత సమయం పడుతుంది. రేపు ఉదయానికల్లా అంతా సర్దుకుంటుంది. చూస్తూండు. నీ సంగతి తెలీదు కాని నేను రేపు సూర్యోదయానికి మునుపే లేచి డెక్‌మీద ముప్పావు గంట నడుస్తాను. నువ్వూ వస్తావా? మేక్స్ అడిగాడు.నేను రాను అంకుల్ ఏండ్రూ నిర్మొహమాటంగా చెప్పాడు. అర్ధరాత్రి దాటాక ఏండ్రూ ఒంటిమీది దుప్పటిని పక్కకి జరిపి లేచి, సూట్‌కేస్‌ని తెరచి అందులోంచి అలారం క్లాక్‌ని బయటకి తీసాడు. నాలుగున్నరకి అలారం పెట్టి, కీ ఇచ్చి పడుకున్నాడు. అది చేసే టిక్‌టిక్ శబ్దం వింటూంటే నిద్ర పట్టింది.

ఉదయం దాని బెల్‌కి మెలకువ వచ్చింది. బద్దకంగా లేచి, ఒళ్ళు విరుచుకుని పోర్ట్ హోల్లోంచి చూస్తే అంతా చీకటిగా ఉంది. అట్లాంటిక్‌లో ఎప్పుడు సూర్యోదయం అవుతుందో అతనికి తెలీదు.పది నిమిషాలు తక్కువ ఐదుకి బట్టలు తొడుక్కుని, పైన రెండు దళసరి స్వెట్టర్లు వేసుకొన్నాడు. కారిడార్లో మేక్స్ కేబిన్ తలుపు దగ్గరకి వెళ్ళి తట్టాడు. తలుపు తెరవకపోవడంతో పేరుపెట్టి పిలిచాడు. ఐనా, తలుపు తెరచుకోకపోవడంతో ఆయన అప్పటికే వాకింగ్‌కి డెక్ మీదకి వెళ్ళుంటాడు అనుకుని, తనూ డెక్‌మీదకి చేరుకున్నాడు.డెక్ మొత్తం చీకటి. పొగమంచు. తన చేతిని ముందుకి చాపి తడుముకుంటూ నడిచాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ డెక్‌మీది ప్లాస్టిక్ కుర్చీలు పొగమంచుకి తడిసిపోయి ఉన్నాయి. వణుకుతూ డెక్ రైట్స్ దగ్గరకి చేరుకున్నాడు. దూరంగా పొగమంచులోంచి ప్రత్యక్షమైన ఓ ఆకారాన్ని చూసి కొద్దిగా ఉలిక్కి పడ్డాడు. అది దగ్గరకి వచ్చాక కాని, ఆ ఆకారం తన అంకుల్ మేక్స్ అని గ్రహించలేక పోయాడు.నిన్నిక్కడ చూడటం ఎంతో ఆనందం ఏండ్రూ. నువ్వు తెల్లారే దాకా పడుకుంటావని అనుకున్నాను ఆనందంగా చెప్పాడు. నాకు ఎక్సర్‌సైజ్ తగ్గింది కాబట్టి, నీ సలహాని పాటించాలని అనుకున్నాను ఏండ్రూ జవాబు చెప్పాడు.ప్రపంచంలో దీన్ని మించిన వ్యసనం, దీన్ని మించిన ఆనందం ఇంకోటి లేదు. ప్రతి నిత్యం ఈ సమయంలో ఓ గంట నడక, తర్వాత ఈత. నాకు ఈత ఇష్టమని నీకు తెలుసా ఏండ్రూ? ఇవాళ ఈదుదామని అనుకుంటున్నాను నిజంగా? అవును. పై డెక్‌మీద పెద్ద మంచినీళ్ళ ఈతకొలను ఉంది. టెన్నిస్ కోర్ట్‌కూడా. మనం టెన్నిస్ ఆడాలి ఏండ్రూ తప్పకుండా అంకుల్ మేక్స్
చాలా రోజులుగా నిన్నొకటి అడగాలని అనుకుంటున్నాను ఏమిటది? నీకు షేర్లు, బాండ్లు, స్టాక్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర ఆస్తులు చాలా ఉన్నాయి కదా? వాటి మొత్తం విలువ ఎంతో నీకు తెలుసా? సరిగ్గా గుర్తు లేదు.

ఇరవై లక్షల డాలర్లకి తక్కువ మాత్రం ఉండదు. అది ఎందుకు ఇప్పుడు? మేక్స్ నవ్వి అడిగాడు. అంత ఆస్తిని మేనేజ్ చేయడం కష్టం కదా? నీకా సమయం వచ్చేసరికి నువ్వు అన్నీ నేర్చుకుంటావు. బాధ్యత చాలా నేర్పుతుంది ఐనా, నేనింకా చాలా సంవత్సరాలు ఉంటానుఅది నిజమా? అంటే? ఏండ్రూ చేత్తో తడిమి రైలింగ్ ఎక్కడ ఉందో చూసాడు. నువ్వు అంత గట్టిగా ఎలా చెప్పగలవు? అలా మాట్లాడకు ఏండ్రూ! నాకు ఇలాంటి మాటలు నచ్చవు ఆయన కంఠంలో కోపం ధ్వనించింది. వెంటనే ఏండ్రూ చేతులు ఆయన నడుముని గట్టిగా చుట్టుకున్నాయి. అది సన్నగా ఉంది. ఏం చేస్తున్నావు? మేక్స్ అరిచాడు. కొత్త రకం ఎక్సర్ సైజ్ అంకుల్. నీకు ఇష్టమైన ఈత ఈదుదువు గాని అయన్ని ఎత్తి వీపుని రైలింగ్ మీద ఆనించి, తర్వాత నీళ్ళల్లోకి తోస్తూ చెప్పాడు. నీకు ఈత వచ్చన్నావు కదా? పైగా ఇష్టమన్నావు కదా? ఈదు. యూరప్ దాకా ఈదిరా. ఎదురు చూస్తూంటాను పకపక నవ్వుతూ చెప్పాడు.ఏండ్రూ! అయన నీళ్ళల్లో దబ్బున పడ్డ శబ్దం కొద్ది క్షణాల తర్వాత వినిపించింది. ఏండ్రూ తన మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉండటం గుర్తించి కొద్దిగా ఆశ్చర్యపోయాడు. అంతా చీకటి. జరిగింది ఎవరూ చూడకుండా అడ్డుకున్న పొగమంచు, తను తోడు దొంగలు అనుకున్నాడు.తర్వాత తన కేబిన్‌వైపు వెళ్తూంటే అదృష్టవశాత్తు దారిలో అతనికి ఎవరూ తారసపడలేదు.పక్కమీద పడుకుని, దుప్పటి కప్పుకుని తన తర్వాతి పథకాన్ని గుర్తు చేసుకున్నాడు. అతనికి ఆవులింతలు వచ్చి త్వరలోనే నిద్ర పట్టింది. ఆ నిద్రలో కలలో బెటీనా కనిపించింది.

తలుపు తట్టిన శబ్దానికి ఏండ్రూకి మెలకువ వచ్చింది. లేచి వెళ్ళి తలుపు తెరిస్తే ఎదురుగా స్టివార్డ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఏండ్రూ. ఎనిమిదైంది గుడ్ మార్నింగ్, నాకు కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ తెస్తావా? ఏండ్రూ అడిగాడు. తప్పకుండా సర్
అంకుల్ బ్రేక్ ఫాస్ట్ చేసారా? లేదు. ఆయన కేబిన్ తలుపు తడితే తీయలేదు. ఆయన చాలాసేపు నిద్ర పోతారు ఇవాళ పొగమంచు పోయినట్లుంది? పోర్ట్ హోల్లోంచి చూస్తూ అడిగాడు. అవును సర్. మనం కొద్ది సేపట్లో రేవుకి చేరుకుంటాం స్టివార్డ్ చెప్పాడు.
అప్పుడే రేవుకా? ఇటలీ ఒక్క రాత్రి దూరంలో లేదే? ఏండ్రూ ఆశ్చర్యంగా అడిగాడు.అవును. నిజానికి నిన్న రాత్రంతా దట్టమైన పొగమంచు కెప్టెన్‌ని ఇబ్బంది పెట్టింది. దాంతో అర్ధరాత్రి రెండున్నరకి ఓడని వెనక్కి తిప్పి తిరిగి రేవుకి తీసుకువచ్చాడు
వెనక్కి రేవుకా? ఏండ్రూ తుళ్ళిపడి అడిగాడు.అవును సర్. ఇవాళ తెల్లవారు ఝామున మూడున్నర నించి మన ఓడ రేవులోనే ఆగి ఉంది. కానీ, భయపడకండి. అమపోల్ చాలా శక్తివంతమైన పెద్ద ఓడ. అది సమయానికి ఇటలీకి చేరుకుంటుంది
ఏండ్రూ నమ్మలేనట్లుగా పోర్ట్ హోల్ దగ్గరకి వెళ్ళి బయటకి చూసాడు. దూరంగా న్యూయార్క్ స్కై స్నైపర్స్ కనిపించాయి. ఓడనించి రేవుమీదకి గేంగ్ వేసి దింపుతూంటే ఓడ పక్కనే ప్లాట్‌ఫాం మీద ఆగిన పోలీస్ కార్, పక్కనే నించుని దిగే ప్రయాణీకుల కోసం వేచి ఉన్న పోలీసులు కనిపించారు. చక్కగా ఈది ఎక్సర్‌సైజ్ చేసిన అంకుల్ మేక్స్ కూడా వాళ్ళ పక్కన కనిపించాడు.
(హెన్రీ ప్లెసర్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

217
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles