బట్టతలకు తైలం!


Sun,June 2, 2019 12:00 AM

నందుడు అందగాడు. అతనికి నల్లని రింగులు తిరిగిన ఒత్తయిన జుట్టు ఉండేది. తన జుట్టును చేతుల్తో తడుముకుని ఎంతో గర్వపడేవాడు. అతను అందగాడు. ఊళ్ళో అందరికీ ఇష్టమైనవాడు.ఇట్లా ఉండే ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. గుడిలో బస చేసి ఎన్నో విలువైన విషయాలు చెప్పాడు. సాయంత్రమయ్యేసరికి గ్రామంలోని జనమంతా గురువుగారి బోధనలు వినడానికి గుడికి చేరేవాళ్ళు. నందుడు కూడా ఆ సన్యాసి బోధనలతో ఎంతో ప్రభావితుడయ్యాడు. అందరూ వెళ్ళిపోయాక ఒకరోజు నందుడు గురువు గారికి నమస్కరించి స్వామీ! మీ లక్ష్యమేమి? అన్నాడు. సన్యాసి భగవంతుడే నా లక్ష్యం అన్నాడు. మీరు వారం తరువాత వెళ్ళిపోతున్నారని విన్నాను. నిజమా! అన్నాడు నందుడు. అవును. హిమాలయాల్లో నా ఆశ్రమముంది. అక్కడ నా శిష్యులు నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు అన్నాడు సాధువు. నందుడు స్వామీ నన్ను కూడా మీ శిష్యుడిగా స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు. సన్యాసి అలాగే కానీ నువ్వు గురుదీక్ష పొందే ముందు నీ స్వధర్మమేదో నిశ్చయించుకోవాలి అన్నాడు.
నందుడు తప్పక స్వామీ! వచ్చేవారం మా గ్రామంలో నాటకం వేయబోతున్నాం. అందులో నాయకపాత్ర నాది. ఆ నాటకమయ్యాకా నేను మీతోపాటు వచ్చేస్తాను అన్నాడు నందుడు.గురువు సరే! అంతదాకా ఎదురుచూస్తాను అన్నాడు.గ్రామంలో నాటకం జరిగింది. నందుని అభినయానికి అందరూ ఎంతో ఆనందించి అభినందించారు. ఇంతలో ఒక సంపన్నుడైన భూస్వామి కూతురు నందునికి ప్రేమలేఖ రాసింది. ఆ ఉత్తరం చూసి నందుడు పొంగిపోయాడు. తనకు ఐశ్వర్యం, అందమైన భార్య దొరుకుతున్నందుకు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆమె అభ్యర్థనకు అంగీకారం తెలిపాడు. ఆమె తండ్రి కూడా నందుని గురించి తెలిసినవాడు కావడం వల్ల నందుణ్ణి అల్లుడిగా చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు.అంతా సజావుగా జరుగుతోందన్నంతలో ఇంకో సమస్య వచ్చిపడింది. ఆ గ్రామంలో ఒక వ్యాపారి నందుని తండ్రికి డబ్బు అప్పు ఇచ్చాడు. అప్పు తీర్చడానికి నందుని తండ్రి శతవిధాల ప్రయత్నించినా వీలుకాలేదు. వ్యాపారస్తుడు తన కూతురిని నందుని భార్యగా చేసుకుంటే అప్పు ఇవ్వక్కర్లేదు. తనే మరింత ధనం ఇస్తానని అన్నాడు. దీంతో వ్యాపారస్తుని కూతురు కూడా నందుణ్ణి ఇష్టపడడమే కాక అతనికి ప్రేమలేఖ కూడా రాసింది.ఇంట్లో పెద్ద ఘర్షణ మొదలయింది.
Batatalaku-thailam

చివరికి ఇద్దర్నీ పెళ్ళాడడానికి అంగీకారం కుదిరింది. నందుడు పరిగెత్తుకుంటూ సన్యాసి దగ్గరకు వెళ్ళి విషయం వివరించి స్వామీ! పరిస్థితి ఇది. నేను ప్రస్తుతానికి హిమాలయాలకు రాలేను. కొంత సమయమివ్వండి అన్నాడు.సన్యాసి నాయనా! వాళ్ళిద్దరూ నిన్ను ప్రేమిస్తున్నారా? అన్నాడు సన్యాసి. నందుడు ఒత్తయిన తన జట్టును చేతితో తడుముకున్నాడు. సన్యాసి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. నందునికి పెళ్ళయింది.పెళ్ళయింది మొదలు భార్యలిద్దరూ చీటికి మాటికీ గొడవపెడుతూ ఇంటిని నరకం చేశారు. సంవత్సరాలు గడిచాయి. నందునికి మధ్య వయసు వచ్చింది. భార్యలో వ్యాపారి కూతురు పెద్దది. భూస్వామి కూతురు చిన్నది. పెద్దామెకు వెంట్రుకలు తెల్లబడసాగాయి. చిన్న భార్యకు మాత్రం జుట్టు నల్లగా ఉండేది.ఒకసారి నందుడు అనారోగ్యంతో మంచమెక్కాడు. ఆరునెలలు కదల్లేకపోయాడు. వంతుల వారీగా భార్యలు సేవలు చేశారు.మెల్లగా కోలుకొని లేచి అడుగులో అడుగు వేసుకుంటూ అద్దం దగ్గరికి వెళ్ళి ఆరునెలల తరువాత నందుడు తన మొహం చూసుకొని అదిరిపోయాడు. వాడిన మొఖం అట్లా ఉంచితే అతనికి పూర్తి బట్టతల ఏర్పడింది. అసలు విషయం మొదటి భార్య భర్త జుట్టు తన జట్టులా తెల్లగా ఉండాలని రోజుకు కొన్ని కొన్ని నల్ల వెంటుకల్ని లాగేది. తన భర్త జుట్టు తన జుట్టులా ఉండాలని తన రెండో భార్య రోజూ కొన్ని అతని తెల్ల వెంట్రుకల్ని పీకేది. ఫలితం నందునికి బట్టతల! హిమాలయాలకు పారిపోదామనుకున్నాడు కానీ అప్పటికే అతనికున్న అవకాశం, వయసు చేజారిపోయాయి!

-సౌభాగ్య

520
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles