అంతిమ ప్రస్థానం


Sat,June 1, 2019 11:57 PM

హల్లో ఎవరండీ ఫోన్ చేశారు? మీ పేరేమిటి? అడిగాడు తన మొబైల్‌లో వచ్చిన కాల్‌ను విని వెంకట్రామయ్య.అవతలి వ్యక్తి నాపేరు నీ ఫోన్‌లో కనబడడం లేదంటే నీవు నాపేరును ఫీడ్ చేసుకోలేదన్నట్లేగా? నేనంటె నీకంత చులకనయ్యాన్నార వెధవ? గౌరవంగానే అడిగి దులిపిండు మాటలను అవతలి వ్యక్తి.ఎవరయ్యా మీరు? అంతంత మాటలను అంటున్నారు? నేను నా ముక్కు పోగును పెట్టుకోకుండానే తొందరలో మీ కాల్‌ను రిసీవ్ చేసుకున్నాను. ఇంతకూ మీ పేరు ఏమిటో చెప్పండి? సంతోషిస్తాను అడిగాడు వెంకట్రామయ్య మర్యాదపూర్వకంగానే.నాపేరు మళ్ళీ ఫోన్‌చేసి తెలియపరుస్తాను ఆగండి అవతలి వ్యక్తి అనేసరికి కాల్‌ను నిలిపేసి మళ్ళీ కాల్ వస్తుందని వేచి ఉన్నాడు వెంకట్రామయ్య.కొద్ది సేపటికి మళ్ళీకాల్ వచ్చింది. ఆన్‌చేసి ఆఁ చెప్పండి? అడిగాడు వెంకట్రామయ్య అవతలి వ్యక్తిని.అవతలి వ్యక్తి హల్లో! నేను రంగన్నను. నీ మిత్రుడిని. ఇంతకు ముందు నీకు కాల్‌చేసి మాట్లాడిన వాడు. మన మరో మిత్రుడు గోపాలం. నువ్వు ముక్కుపోగు పెట్టుకోలేదనడంతో అర్థంగాక నన్ను మాట్లాడమని ఫోన్ నాకిచ్చాడు. ఔనూ, మగవాడికి ముక్కు పోగు ఎందుకు? దాని అవసరం నీకెందుకొచ్చిందిరా సన్యాసి వెధవ? ఆ వివరాలేంటో చెప్పవా? అడిగాడు తెలుసుకోవాలనే కాంక్షతో.ఒరే! ఒరే! మీరేనారా మిత్రులు? మరెవరో ననుకున్నానురా. సరే ముక్కుపోగు గురించి వివరిస్తాను. మా ఇంటికి మీరు ఇద్దరు రండి. ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మనం కలుసుకొని చాలారోజులయింది కదా? బదులు చెప్పాడు వెంకట్రామయ్య కాస్త నెమ్మది అయి.కోరినట్లుగానే గోపాలం, రంగన్న వెంకట్రామయ్య ఇంటికెళ్ళి కలిసారు ఆయన్ని.వెంకట్రామయ్య ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోమని కుర్చీలు వేసాడు వారికి. వాళ్ళు కూర్చున్నాక మంచినీళ్ళు ఇచ్చి తను కూర్చున్నాడు.
Anthima-prasthanam

మంచినీళ్లు తాగాక ఒకరినొకరు తమ కుటుంబాల యోగక్షేమాల్ని తెలుసుకున్నారు. నెమ్మది అయ్యారు.వెంకట్రామయ్య నేను అన్న ముక్కుపోగు గురించి వివరిస్తాను వినండి. ఆ పదం ఒక కోడ్‌వర్డ్. నేను ముక్కుపై పెట్టుకునే కళ్ళజోడును శోభగ ఉంటుందని ముక్కుపోగు అని ముద్దుగ అంటాను. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు తొందరలో దానిని పెట్టుకోకుండానే మీతో మాట్లాడాను. అందువల్ల మీ పేరును స్పష్టంగా చూడలేకపోయాను. సారీరా! కళ్ళద్దాలను పెట్టుకోకుంటే అక్షరాలను, అంకెలను గుర్తించలేము కదా!విన్న మిత్రులు నవ్వుకున్నారు విషయం తెలిసి.అయితే ఈ కళ్ళజోడు విషయమొక్కటే కాదు ఇంకా ఉన్నాయి. చెప్పుతాను వినండి. నాకు చెవుల వినికిడి చాలా తగ్గింది. అందుకని మా కొడుకు ఇదిగో ఈ హియరింగ్ పరికరాన్ని కొనిచ్చాడు. ఎదుటివారి మాటలను, ఇతర శబ్దాలను పెంచి మైక్ లాగా వినిపిస్తుంది. దాంతో విషయం నాకు అర్థమై స్పందించగలుగుతాను వివరించాడు వెంకట్రామయ్య.మరి దీని కోడ్ వర్డ్ ఏమిట్రా? అడిగాడు రంగన్న.దీనిని నేను చెవిపోగు అని అంటానురా జవాబు చెప్పాడు వెంకట్రామయ్య.భలే బాగుందిరా ఆ పదం. ఆఁ ఆ తర్వాత ఇంకేమున్నాయ్ చెప్పు? అడిగాడు గోపాలం కుతూహలంతో.అయితే వయసు మళ్ళడంతో ఇవి దాపురిస్తున్నాయి. ఇంకా మీకు అవి రాలేదు. మీకూ వస్తాయి తొందరలోనే. మరొకటి చూడండి! ఇది హస్త భూషణం తన చేతికర్రను ఎత్తిచూపాడు వెంకట్రామయ్య వారికి.విన్న ఇద్దరు మిత్రులు నవ్వుకున్నారు ఆ పదంతో.వెంకట్రామయ్య మళ్ళీ ఈ హస్త భూషణంతో బలం తగ్గిన కాళ్ళకు ఆధారమై ధీమాగా నడువగల్గుతున్నాను. ఇక మరొక దాని గురించి చెప్పుతాను. తాదాత్మ్యం పడక ఈ వృద్ధాప్యంలో నడవలేను కూర్చోలేను. ఇక మంచమే శరణాగతి. పడుకునే ఆహార పదార్థాలను సేవించాల్సి ఉంటుంది. పడుకుని రామా కృష్ణా అని స్మరిస్తూ గడపాల్సి ఉంటుంది. ఆ తాదాత్మ్యంతో మనలోని బాధలను దూరం చేసుకోగలం వివరించాడు తాదాత్మ్యం గురించి.ఇంకా ఏమున్నాయంటావ్? అడిగాడు రంగన్న జిజ్ఞాసతో.

పూర్తవలేదు. చెప్పుతాను వినండి. పిదప వీడ్కోలు రథం. అంటే ప్రాణం పోయాక పార్థీవ శరీరాన్ని మోసుకుని వెళ్ళేందుకు ఉపయోగించె పాడె. ఆ పిదప చివరి ఘట్టానికి ఆసరగా ఉండేది యజ్ఞ సంస్కారం. అదేంటో మీకు అర్థమై ఉంటుంది. అదేరా పీనుగను దహనం చేయడానికి పేర్చే చితి. అదికాకున్నా ఖననం చేయ భూమిని లోతుగ తవ్వి తీసే గోతి. అంటే మహాసాధ్వి సీతమ్మ వారిని తన ఒడిలోకి చేర్చుకున్న తల్లి భూదేవి ప్రేమానురాగం. అదే అంతిమ సంస్కారం. నేను దానికి యజ్ఞ సంస్కారం అని ఓ పవిత్ర పదాన్ని వాడదల్చాను. మనిషి జీవితపు తుదిదశలో తప్పనిసరిగా అవసరమయ్యే ఆసరాలు ఇవన్నీను. తుది ఘట్టంలో నిరాశకు లోనవకుండా అందమైన ఈ పదాలు ఆనందాన్నిస్తాయి.డబ్బు, ఆస్తి, హోదాలు ఉన్నవారికైనా లేనివారికైనా ఈ ఆసరాలు తప్పనిసరియైనవి. వీటితోనే మానవుని తుదికార్యం నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. ఆ ఆత్మ పరమాత్మలో లీనమై తనవాళ్ళందరినీ ఆ దివి నుండి ఆశీర్వదిస్తుంది. మిత్రులూ! ఇవేరా నేను భావిస్తోన్న ఆసరాలకు పరోక్ష వర్ణనలు వివరించి ముగించాడు వెంకట్రామయ్య ఆసరాల అర్థాలను.గోపాలం చక్కగా నీలో కల్గిన భావాలకు తగినట్లుగ మన తుదిదశలో అక్కరకొచ్చే వాటిని కోడ్ పదాలతో ఆభరణాలకు ఉండే అందాన్ని చేకూర్చావుర వెంకట్రామయ్య మెచ్చుకున్నాడు ఆయన్ని.ఈరోజు మనం ముగ్గురం కలవడం ఓ శుభదినంగా ఉందిరా. అలా హోటల్లో కాఫీ సేవించి వెళ్దాం పదండి మన ఇళ్ళకు కోరాడు వెంకట్రామయ్య ఇద్దరు మిత్రులనూ.అందుకు వారు సరేననడంతో ముగ్గురు హోటల్ వైపుకు నడిచారు తెలిసిన అంతిమ ప్రస్థానపు జ్ఞానంతో.

తోట సదానందం
సెల్: 99085 94669

242
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles