మంచివారిని అర్థం చేసుకోవాలి!


Sat,June 1, 2019 09:44 PM

మిరపగింజ చూడ మీద నల్లగ నుండు
కొరికి చూడ లోన చురుకు మనును
సజ్జనులగు వారి సారమిట్టుల నుండు
విశ్వదాభిరామ వినురవేమ!
- వేమన శతకం

తాత్పర్యం:మిరపగింజలు (మిరియాలు) పైకి నల్లగా ఉన్నా వాటిని కొరికి చూస్తే లోపలి కారం చురుక్కున తగులుతుంది కదా. అలాగే, మంచివారు బయటకు కఠినంగా ఉంటారు. వారి మాటలు మనల్ని నొప్పించవచ్చు కూడా. కానీ, వాళ్ల మనసును, విలువను తెలుసుకోగలిగితే అలా ఎందుకు ప్రవర్తించారో, మన శ్రేయస్సునే ఎలా కోరుకుంటున్నారో అర్థమవుతుంది.
GoodPeople

స్నేహం చెడితే చూపు తలకిందులు!


కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!
- సుమతీ శతకం

తాత్పర్యం:అందరూ ఇలా వుండకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టిలో ఇదే నిజం. ఏ ఇద్దరి మధ్యయినా స్నేహం చెడకూడదన్నది నీతి. పరస్పరం మిత్రత్వంతో ఉన్నపుడు ఒకరి నేరాలు మరొకరికి నేరాల్లా కనిపించవు. కానీ, అదే స్నేహం చెడిందా, అంతే. ఎదుటి వ్యక్తి చేసే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి, ఎంతటి వారికైనా స్నేహం కొనసాగితే ఏ బాధా ఉండదు.

చేసిన మేలు చెప్పుకోరాదు!


చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయిన గాని దాని హర్షింపరుగా
గొప్పలు చెప్పిన నదియును
దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!
-కుమారీ శతకం

తాత్పర్యం: ఆడవారికైనా, మగవారికైనా వర్తించే నీతి ఇది. చేసిన మేలు ఎప్పుడూ చెప్పుకోకూడదు. అలా చెప్పుకొంటే, దానికి విలువ ఉండదు. ఏదో ప్రచారం కోసం చేశారనుకోవచ్చు. పైగా, అదేదో గొప్పలు చెబుతున్నట్టుగానూ ఉంటుంది. నిజంగానే మనం గొప్ప పనే చేసినా సరే, ఎవరికీ చెప్పుకోకుండా ఉండడమే ఉత్తమం. దీనిని మనసులో పెట్టుకొని మెలగాలి సుమా.

శ్రీరాముని గొప్పతనం ఇదీ!


భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
ఢాండ డఢాండ ఢాండ నినదంబుల జాండమునిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ!
- దాశరథీ శతకం

తాత్పర్యం:శ్రీరామచంద్రమూర్తి గొప్పతనాన్ని ఘనంగా చాటిన పద్యరత్నమిది. ఆర్తజనులకు తిరుగులేని దైవానివి, రణరంగంలో శత్రువులను భయభ్రాంతికి లోను చేసేవాడవు, కష్టాలలో వున్నవారిని వేడుకొన్నంతనే ఆదుకొనే బంధువువి, గొప్పనైన విలువిద్యలో కళాకోవిదుడివి, నీకు సాటిగల రెండవ దైవమే లేదు సుమా. బ్రహ్మాండమైన నీ కీర్తిని ఏనుగు పైకెక్కి ఢాంఢాం ధ్వనులతో మార్మోగి పోయేలా చాటింపు వేస్తాను స్వామీ! అంటూ శతకకర్త హామీ ఇస్తున్నాడు.

400
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles