వాస్తు


Sat,June 1, 2019 09:39 PM

పూజ గదిని గ్లాస్‌తో కట్టుకోవచ్చా?-కల్వల రత్నాకుమారి, శేరిలింగంపల్లి

ఇంట్లో పూజగది నిర్మాణం సముచిత స్థానంలో ఉంచుకోవడంతో పాటు ఆ గదికి ప్రైవసీ కూడా అవసరం. ఆ స్థానం ఇంట్లో హాలుకు ఈశాన్యంలో చక్కగా అమరుతుంది. తద్వారా పూజను మనస్సు పెట్టి చేసుకోవచ్చు. ఇక ఆ గదిని గ్లాసు గోడలతో కట్టాలి అనేది నియమం కాదు. అది మీ ఆడంబరం. ఇటుకలతో కట్టడం సముచితం. ఇల్లు దేనితో కడతారో దాంతోనే పూజగది కట్టండి. ఒక మెటీరియల్ మరొక మెటీరియల్ సింక్ అవ్వదు. ఇవాళ ప్రతి ఇల్లు హైక్లాస్‌తో, ఆడంబరాలతో కనబడుతుంది. కానీ అమ్మలా కనబడడం లేదు. మనం ఇంటికి వాడే ముడిసరుకు ఇంటి ఆత్మిక వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. ఎందుకు ఇనుముతో మన వాళ్లు ఇండ్లు కట్టలేదు. అది దొరకక కాదు. అది నరకంలా ఉంటుంది కాబట్టి. ప్రకృతి సహజసిద్ధమైన మెటీరియల్ అవసరం నిర్మాణాలకు. పూజగది చక్కగా ఇటుకలతోనే కట్టుకోండి. అది మీ మనస్సు ఏకాంతం చేయడానికి దోహదపడుతుంది.
VASTHU

నైరుతి ఎత్తు చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయా?-విశ్వనాథ్, పార్శిగుట్ట

ఇల్లు కట్టే నేపథ్యంలో అవసరాలను బట్టి ఆయా నిర్మాణాలు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. ఒక్కో ఇంటిని బట్టి కొన్నికొన్ని చేరుతుంటాయి. అందరికీ మేడ మీద ఒక గది అవసరం కాకపోవచ్చు. ఓపెన్ టెర్రస్ వదులుకోవాలనిపించవచ్చు. మనం ఒకసారి పల్లె ఇళ్లకు వెళితే ఇంటి కప్పులన్నీ పెంకులతో చేసినవే కదా ఒకనాడు. ఇంటిమీద ఇంటి అవసరం వాళ్లకు తక్కువ. నేలమీదనే వారందరి జీవన అవసరాలు తీర్చుకునేవారు కదా. అలాంటప్పుడు నైరుతి ఎత్తు తప్పనిసరి అనే వాదన ఎందుకు వచ్చింది. ఇంటి కప్పు ఒకప్పుడు యూనివర్సల్‌గా పిరమిడ్ షేపులో అద్భుతంగా వేసేవారు. ఆర్‌సిసి వచ్చాక అవన్నీ చేరాయి. కాబట్టి అవసరాన్ని బట్టి మేడమీద గది ఒకటి వేయాల్సి వస్తే లేదా వాటర్ ట్యాంక్ పెట్టాల్సి వస్తే నైరుతి దిశలో సూచించడం జరుగుతుంది. అంతేగానీ అవసరం లేకున్నా ఎత్తు చేయమని కాదు.

ఊరిలో దక్షిణం ఇల్లు ఉంది. సిటీలో తూర్పు ఇల్లు కొనవచ్చా?-రాచమల్లు లావణ్య, గోపన్‌పల్లి

ఇంటికి ముఖద్వారాలు నాలుగు వైపులా వస్తూ ఉంటాయి. కొందరు బిల్డర్స్ దక్షిణం పడమర వైపు ద్వారాలు రాకుండా చాలా జాగ్రత్త పడుతూ కడుతుంటారు. నిజానికి ఏ ఇంటి బలం ఆ ఇంటిదే. దాని ప్రాధాన్యం అనుసరించి ముఖాలు ఏర్పడుతుంటాయి కానీ ఇంటికి అన్ని వైపులా ద్వారం పెట్టి కట్టినవే ఛత్రశాల భవంతులన్నీ కూడా. ఇంటికి శాస్త్ర ప్రాధాన్యం అత్యవసరం కానీ సింహద్వార ప్రాధాన్యం లేదు. ఇల్లు ఒళ్లు యూనివర్సిల్ స్ట్రక్చర్స్. వాటిలో శాస్త్ర అంశాలే లీడ్ చేస్తాయి. ఆ విధంగా ఒకచోట ఒక ఇల్లు మరొకచోట మరో సింహద్వారం ఇల్లు ఉన్నా ఇబ్బంది లేదు. కట్టిన స్థలం కట్టిన తీరు ముఖ్యం. మీరు ఏ చోట ఏ సింహద్వార గృహం అయినా కొనండి కానీ దానికి దిక్కులు ఉన్నాయా వాస్తు పాటించారా చూడండి అంతే. అందరికీ అవి పనికివస్తాయి.

ప్రభుత్వ ఆఫీసులు ఎవరి సొంతం కావు కదా, వాటికి వాస్తు అవసరమా?-వీరమల్ల జయశంకర్

సొంతమైన వాటికే వాస్తు ఉండాలి అనేది కాదు. గృహాలు మాత్రం ఎవరి సొంతం. కొన్నాళ్లు మనం ఉంటాం. తరువాత మరోతరం.. ఎవరు ఉన్నా ఎంత కాలం ఉన్నా మానవులకు శాస్త్రం అవసరం. ప్రభుత్వ నిర్మాణాలకే తప్పక అవసరం అక్కడి కార్యకళాపాలు సమస్త సమాజానికి దిశానిర్దేశం చేస్తుంటాయి. తద్వారా పూర్ణ ఫలాలు అందరికీ అందుతాయి. ప్రకృతి మనిషిని నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఒక సాయంకాలం చల్లనిగాలి నిండు పున్నమి, ఏటి ఒడ్డు చక్కని గులాబీతోట ఇవన్నీ హృదయాన్ని కదిలించేవే..ఆ ఆహ్లాద వేళ నిర్ణయాలు గొప్పగా జరుగుతాయి. మెదడులో ఆల్ఫాతరంగాలు పుడతాయి. ఒక అధికారి నిర్ణయం ఆ రాష్ట్ర భవిష్యత్ కావచ్చు. ఆ జిల్లా వాసుల బాగోగులు కావచ్చు. అతని మనో నిశ్చింతకు, వారి కార్యదక్షతకు శాస్త్రంలో ఎన్నో అంశాలు దోహదపడతాయి. కాబట్టి ప్రభుత్వ నిలయాలకు కూడా వాస్తు అవసరమే. అందుకే వాస్తుకు మనుష్యాలయం అనే పేరుంది.

సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

206
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles