మత్స్య విప్లవం


Sun,May 26, 2019 12:56 AM

Fishers-Men
నాడు చెరువుల్లో చేపపిల్లల్లేక కన్నీరు పెట్టిన కొంగబావ నేడు దొంగజపం చేస్తూ ఆనందంగా వేటాడుతున్నాడు. నాడు వలవల ఏడ్చుకుంటూ వలసెల్లిన మత్స్యకారులు నేడు వలలు భుజానేసుకొని సంతోషంగా షికారికి పోతున్నరు. నాడు పూడికతో బీటలు వారిన చెరువులు ఇప్పుడు మిగులు జలాలతో కళకళలాడుతున్నాయి. ఆ నిండైన జలాల్లో రవ్వలు రాగాలు పాడుతుంటే, వాలుగలు వయ్యారాలు పోతున్నాయి. రొయ్యలు మీసాలు మెలేస్తుంటే, బొచ్చలు భాజాలు మోగిస్తున్నాయి. కొర్రమట్టలు, పక్కెలు, పిత్తబరికెలు, జెల్లలు, వల్లింకలు ఆనందంతో నాట్యమాడుతున్నాయి. ఎన్నో యేండ్ల తర్వాత ఆ మత్స్యవికాసాన్ని చూస్తున్న పల్లెకారులు తన్మయం చెందుతున్నారు. అమ్మలాంటి చెరువుపై ఐదేండ్ల నుంచి ఆనందంగా బతుకుతున్న గంగపుత్రుల సంక్షేమ వికాసంపై ఈ వారం ముఖచిత్ర కథనం.
Fishers-Men1
ఊరంతా నీసు వాసన కమ్ముకున్నది. ఎన్నాైళ్లెందో ఇలా ఊరంతా వాసన రాక. పొద్దుగాల నుంచే అంతా హడావుడి. ఊరి పల్లెకారులు నీలం రంగు టీవీఎస్‌పై వలలు భుజాన వేసుకొని రయ్ మంటూ చెరువువైపు దూసుకెళ్తున్నారు. అప్పుడర్థమైంది చెర్ల చేపలు పడుతున్నారని! పోయిన వానలకు చెరువును చూస్తే సంబురమైంది. ఒక్కో చేప ఎన్ని కేజీలు పెరిగిందో చూడాలని తహతహ మొదలైంది. కొర్రమీను కూర తల్చుకుంటే నోరూరుతున్నది. మనసాగక చెరువువైపు వెళితే అక్కడంతా జాతరలా ఉంది. చుట్టుపక్కల మూడూళ్ల జనం అక్కడే ఉన్నారు. పల్లెకారులు చేపలు పడుతుంటే సంతోషంగా చూస్తున్నరు. వలలు పగిలేలా చేపలు తన్నుకుంటున్నాయి. మందు మాకూ లేకుండా పెరిగే మా ఊరి చేపలను జనాలు ఎగబడి కొంటున్నారు. బండిపై దర్జాగా కూర్చొని డబ్బులు లెక్కేసుకుంటున్నడు అచ్చయ్య మామ. యూరియా సంచి నిండుగా చేపలు తీసుకొచ్చి పెడ్లాం ముందు పోశాడు పుల్లారావు. నాలుగైదు కేజీల బరువున్న బొచ్చను చూసి నేనూ దానిలాగే నోరెల్లబెట్టా. నా చిన్నప్పుడెప్పుడో చూశా అలాంటివి. మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయ్. చేపలు.. పచ్చేపలోయ్ అంటూ శంకరన్న కేకలు. కట్టపై నీలం రంగు బండ్లను చూడగానే ఆశ్చర్యమేసింది. అందరికీ ఐస్ పెట్టెలున్నాయ్. దండ కాంటాలకు బదులు.. ఎలక్ట్రిక్ కాంటాలొచ్చాయ్. ఎన్నడూ లేనిది యువకులు జోరుగా షికారు చేస్తున్నారు. ఆరా తీస్తే.. ఈ ఏడాదే కొత్త సభ్యులుగా చేరారట. ఆ దృశ్యాలను చూస్తుంటే.. చెరువంత సంబురమైంది.
Fishers-Men2
ఇలాంటి దృశ్యాలు తెలంగాణ పల్లెల్లో మస్తుగ కనిపిస్తున్నయ్. చేతికొచ్చిన చేపలను సంబురంగా పట్టుకొని అమ్ముకుంటున్నారు మన మత్స్యకారులు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా చెరువుల్లో చేపలు పట్టుడు జోరందుకున్నది. గతంలో నెత్తిన బుట్ట పెట్టుకొని, అందులో కాంటా పెట్టుకొని, ఊరూరు తిరుక్కుంటూ చేపలు అమ్మిన పల్లెకారులు.. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బండిపై, ఐస్ పెట్టెల్లో చేపలు వేసుకొని ఎలక్ట్రిక్ కాంటాలతో అమ్ముకుంటున్నారు. కారణం, సబ్బండ వర్గాల సంక్షేమమే పరమావధిగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలవడమే. ప్రభుత్వమే చెరువుల్లో పూడిక తీయించి, నీటి నిల్వలు ఉండేలా ఏర్పాట్లు చేసి, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేసి బతుకుబాట చూపింది. వీటికి తోడుగా అధిక రాయితీపై వాహనాలు, వలలు, కాంటాలు ఇచ్చింది. ప్రమాద బీమానూ పెంచి, కమ్యూనిటీ హాళ్లను నిర్మించి మత్స్యకార వర్గాన్ని మునుపెన్నడూ లేనంతగా ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా తెలంగాణలో మత్స్యవికాసం పరిఢవిల్లుతున్నది.
Fishers-Men3
Fishers-Men4

వేలాది చెరువుల్లో పెంపకం

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా చెరువులకు నవజీవం వచ్చింది. మిషన్‌కాకతీయ ద్వారా 45 వేల చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఒక యజ్ఞంలా సాగిన ఈ కార్యక్రమంతో వేలాది చెరువులు జలాలతో కళకళలాడాయి. వ్యవసాయ ఆధారిత రంగాలు పుంజుకున్నాయి. దీంతో ఇటు రైతులు, అటు మత్స్యకారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రస్తుతం 21,500 చెరువుల్లో ప్రభుత్వం చేపల పెంపకాన్ని చేపట్టింది. 4 నుంచి 6 నెలలు నీరు నిల్వ ఉన్న చెరువుల్లో చేపల పెంపకం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఒక్కో చేపపిల్ల ఏడాది కాలానికి కేజీ నుంచి రెండు కేజీల వరకూ పెరుగుతున్నది.

మీసాలు మెలేస్తున్న రొయ్య!

ఎలాంటి కలుషిత నీరు, ఆహారం లేకుండా చాలా స్వచ్ఛంగా పెరుగుతున్నది మన రాష్ట్రపు రొయ్య. కేవలం మంచినీటిలోనే వీటి పెంపకం కొనసాగుతున్నది. రిజర్వాయర్లు, పెద్ద పెద్ద చెరువుల మధ్యలో కేజ్ కల్చర్ ద్వారా వీటిని పెంచుతున్నారు. ఈ విషయంలో అధునాతన పద్ధతులను అవలంభిస్తున్నారు మన మత్స్యశాఖ అధికారులు. స్థానిక మత్స్యకారుల సహకారం, పర్యవేక్షణలో ఈ రొయ్యల సాగు అవుతున్నది. 2017-18లో 7,782 టన్నుల రొయ్యల ఉత్పత్తి జరగ్గా.. 2018-19లో 7,238 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 చెరువులు, రిజర్వాయర్లలో ఈ మంచినీటి రొయ్యలను పెంచుతున్నారు.
Fishers-Men8

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా..

జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ.1000 కోట్ల రుణం తీసుకొని.. సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని (ఐఎఫ్‌డీఎస్) రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. దీనికింద 75 నుండి 90 శాతం రాయితీపై మత్స్యకారులకు వాహనాలు, వలలు, కాంటాలు, ఐస్‌బాక్స్ తదితరాలను అందిస్తున్నది. మహిళా మత్స్య సహకార సంఘం సభ్యులకు వంద శాతం సబ్సిడీతో అందించారు. అంతేకాకుండా మత్స్యకారులకు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాళ్లను నిర్మించింది ప్రభుత్వం. ఇక ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు రూ.6 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నది. చేపలను మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో మార్కెట్ యార్డులను నిర్మించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మన చేపలను ఇతర రాష్ర్టాలకు, దేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన కోల్ట్ స్టోరేజీల నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నది ప్రభుత్వం. ఎక్కడ నీటి వనరులున్నా, వాటిమీద హక్కు మత్స్యకారులకే ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన.
Fishers-Men9
Fishers-Men10
Fishers-Men5

లక్షల టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా..

తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రతి యేటా లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. 2015-16 సంవత్సరంలో భారీగా 2,28,185 టన్నుల ఉత్పత్తి జరిగింది. 2016-17లో 1,93,732 టన్నుల ఉత్పత్తి అయింది. వర్షాలు సరిగా లేకపోవడం, చెరువుల్లో నీరు నిల్వ ఉండకపోవడంతో రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉత్పత్తి తగ్గింది. 2017-18లో 2,62,252 టన్నుల ఉత్పత్తి పెరిగింది. 2018-19 కాలంలో డిసెంబర్-18 నాటికి 2,25,826 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. 2019 మార్చి చివరి వరకూ 3 లక్షల టన్నులు లక్ష్యాన్ని చేరుకున్నామని చెబుతున్నారు మత్స్యశాఖ అధికారులు. అయితే, అన్ని చెరువుల్లో చేపలు పట్టడం పూర్తయిన తర్వాత.. జిల్లాల నుంచి నివేదిక రాగానే అధికారికంగా ప్రకటిస్తామని వారుఅంటున్నారు. గడిచిన ఐదేండ్లలో కేవలం తెలంగాణ చెరువులు, రిజర్వాయర్ల నుంచి 9,09,995 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. ఈ క్రమంలో లక్షలాది మంది మత్స్యకారులు లబ్ది పొందారు.

ఉచితంగా విత్తన పంపిణీ

మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా, చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. గడిచిన ఐదేండ్లలో ఇప్పటి వరకూ 213 కోట్లకుపైగా చేప పిల్లలను, 5 కోట్ల వరకు రొయ్య పిల్లలను పంపిణీ చేసింది ప్రభుత్వం. కొన్ని చెరువుల్లో వాటికి మేతను కూడా ఉచితంగానే అందించింది. ఇందుకుగాను 208 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఖర్చుకు వెనుకాడకుండా అన్ని వర్గాలూ అభివృద్ధి చెందాలనే యోచన చేస్తున్నది తెలంగాణ సర్కార్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,200 ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. 3,15,000 మంది మత్స్యకారులు సంతోషంగా చేపలవేట సాగిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఈ ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం పట్ల పలు రాష్ర్టాల మత్స్యకారులు ఆకర్షితులవుతున్నారు. తమ రాష్ర్టాల్లో కూడా ఇదే విధానాన్ని అవలంభించాలని అక్కడి ప్రభుత్వాలను మత్స్యకారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇలా ఆచరణాత్మక ఆలోచనతో ముందుకెళ్తున్న మత్స్యశాఖకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించి, దిశానిర్దేశం చేస్తుండడంతో మన మత్స్యకారులు అభివృద్ధిబాటలో పయనిస్తున్నారు.
Fishers-Men6

ఫలిస్తున్న నీలి విప్లవం

ప్రభుత్వ సహకారంతో నీలి విప్లవం ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ఆక్వా కల్చర్‌ను బాగా మెరుగుపర్చాలని అనుకుంటున్నాం. కొత్తగా పెన్‌కల్చర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నాం. తెలంగాణలో 5 అనువైన ప్రాంతాలను గుర్తించాం. పైలెట్ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత, ఈ విధానంలో చేపల పెంపకానికి ముందుకొచ్చే వారికి భారీ రాయితీలు ఇస్తాం. గతంలో ఫిషరిష్‌కు చాలా తక్కువ బడ్జెట్ ఉండేది. కేవలం రూ.10 కోట్ల నిధులు మాత్రమే విడుదలయ్యేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 500 కోట్ల రూపాయలు మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేశాం. దీంతో ఫిషరిష్ సెక్టార్ గాడిన పడింది.
- డా.సువర్ణ, ఫిషరిష్ కమిషనర్
Fishers-Men7

ఎన్ని రకాల చేపలు?

తెలంగాణ చెరువుల్లో చాలా రకాలు చేపలు కనువిందు చేస్తున్నాయి. వాటిల్లో రవ్వ(రొహు), కొర్రమీను, శీలావతి(మ్రిగాల), బొచ్చ(కట్ల), బంగారుతీగ, రొయ్యలు, గడ్డి పులస, గ్యాస్ కట్, వాలుగ, బురదమట్ట, వల్లింక, మార్కు, కొమ్ముజెల్ల, ఏటి జెల్ల, మాలుగు మీను, పూమేను, గండెలు, ఉసికదండు, బొమ్మిడాలు, పక్కెలు, పిత్తబరికెలు వంటి రకాలు ఉన్నాయి. శీలావతి(మ్రిగాల) చేప నీటి అడుగున ఉండే నాచు, తుంగ మొదళ్లను తిని బతుకుతుంది. రవ్వ (రొహు) నీటి మధ్యకు పెరిగిన తుంగ, జమ్మి, నాచును, తామర ఆకులను తింటుంది. ఇక బొచ్చ(కట్ల) నీటిపై పెరిగే నాచు, చిన్న మొక్కలు, తామర ఆకులను తిని జీవిస్తుంది. కొర్రమీను, నీటి అడుగునున్న మట్టి నుంచి నీటిపై పెరిగే నాచు వరకు అంతా తినేస్తుంది. ఈ నాలుగు రకాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటికి తోడు తాబేళ్లు, పీతలు, నత్తలు, పలు రకాల పిట్టలు, పాములు, అరుదైన నాచు మొక్కలున్న చెరువులపైనే ఆధారపడుతున్నాయి. ఈ విధంగా తెలంగాణ చెరువుల్లో జీవ వైవిధ్యం తొణికిసలాడుతున్నది. ఇలా చెరువమ్మ చెంతన ఎన్నో జీవరాశులు ఆశ్రయం పొందుతున్నాయి.
Fishers-Men11

రుచిలో రారాజు మన చేప!

చెరువులో పెరిగిన చేపలను ఎంతోమంది చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఎలాంటి మందులు, ఎరువులు, కోళ్ల పెంట వెయ్యకుండా పెరిగే చేపలవి. కేవలం చెరువులో స్వచ్ఛంగా పెరిగిన నాచు తిని బతికే సహజమైన చేపలు. వాటి కూర తింటే ఎవ్వరైనా మైమరిచిపోవాల్సిందే. పక్కెపిల్లను కాల్చుకొని తిన్నా ఆ రుచే వేరు. అందుకే ఎవరినోట విన్నా చెరువుల్లో దొరికే చేపల రుచే వేరంటారు. సముద్రాలు, నదులు, సరస్సుల్లో పట్టే చేపలను నెలల తరబడి ఐస్‌లో ఉంచడంతో రుచితో చాలా తేడా ఉంటుంది. పెద్ద చేపలను తిన్నా దొరకని రుచి చెరువు చేపల్లో ఉంటుంది.
Fishers-Men12

మా బతుకులు మారాయి

కేసీఆర్ సారు వచ్చాకే మా మత్స్యకారుల బతుకులు మారాయి. మా ఊరి సొసైటీకి 85 బండ్లు వచ్చాయి. వందకు పైగా కొత్త సభ్యత్వాలు వచ్చాయి. సొసైటీ బిల్డింగ్ కూడా వచ్చింది. చనిపోయిన మత్స్యకారులకు డబ్బులొస్తున్నాయ్. చేపలు పట్టుకొని బండ్లపై అమ్ముకుంటున్నాం. గతంలో మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. జెండాలు మోసినా, జైళ్లకు పోయినా మా బతుకులు మారలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో చల్లగా బతుకుతున్నాం.
- తోటపల్లి జాషువా, కలకోట మత్స్య సొసైటీ చైర్మన్
Fishers-Men14

19,476 చెరువులు ఆయా గ్రామ పంచాయతీల్లో చేపలు పెంచేందుకు అనువుగా ఉన్నాయి. వాటి విస్తీర్ణం 1.554 లక్షల హెక్టార్లు.

తెలంగాణలో 74 పెద్ద, మధ్యస్థ, చిన్న రిజర్వాయర్లు ఉన్నాయి. రాష్ట్రంలో వాటి విస్తీర్ణం 1.776 లక్షల హెక్టార్లు.

4,324 చెరువులు మత్స్యశాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. వాటి విస్తీర్ణం 2.622 లక్షల హెక్టార్లు.

ఇప్పటి వరకు కేజ్ కల్చర్, పాండ్ కల్చర్, ప్రాన్ కల్చర్‌తో చేపలు, రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నారు. అతి త్వరలో పెన్ కల్చర్‌ను ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణలో 3,15,000 మంది మత్స్యకారులున్నారు. వీరిపై 27,14,000 మంది కుటుంబసభ్యులు ఆధారపడ్డారు.

కొర్రమీనును తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చేపగా గుర్తించింది.

తెలంగాణలో 4,200 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి.
Fishers-Men13

- డప్పు రవి,
సెల్: 9951243487

759
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles