ప్రపంచ విజేత అంతిమయాత్ర


Sun,May 26, 2019 12:35 AM

ALEXANDER
యుద్ధం అంటే అతనికి కొత్తకాదు.. శత్రువు ఎలాంటి వాడైనా.. ఎంతటి వాడైనా కూడా యుద్ధంలో ఎలా ఓడించాలో తెలిసిన మేసిడోనియన్ వీరుడు.. యుద్ధం చేస్తే ఇలాగే చేయాలని యావత్ లోకానికి చాటి చెప్పిన వీరుడు, ప్రపంచానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్. యుద్ధానికే కొత్త నిర్వచనం ఇచ్చిన ఈ గ్రీకు వీరుడు చిన్న వయసులోనే ప్రపంచాన్నంతా జయించి ఒక్కటి చేయాలని తహతహలాడాడు. అతనొస్తున్నాడంటే రాజులు, సామంతులు, సామ్రాట్టులు, చక్రవర్తులు గజగజ వణికిపోయారు. నేనొస్తున్నా అని చెప్పి మరీ వచ్చి రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలని వచ్చి పురుషోత్తముడి ఎదురుదాడితో వెనుదిరిగి వెళ్లిపోతూ అనారోగ్యంతో మరణించాడు. ఆయన మరణించినా ఎంతోమంది చక్రవర్తులతో, గొప్ప నేతలతో సెల్యూట్ కొట్టించుకున్న అలెగ్జాండర్ చివరిపేజీ.

అతను సింహంలా గర్జించలేదు, పులిలా గాండ్రించలేదు, ఏనుగులా ఘీంకారించలేదు. కానీ ఆయన వస్తున్నాడంటే మాత్రం గొప్ప గొప్ప చక్రవర్తులే గజగజ వణికిపోయారు. ఆయన వయసును చూసి పిల్లకుంక అని విర్రవీగిన వారే ఓటమెరుగని విజయాలను చూసి తమ చేతకాని తనానికి వలవలా విలపించారు. ప్రపంచాన్ని జయిస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసినవారు సైతం ఆయన ముందు నిలబడలేక తోకముడిచారు. క్రీ.పూ. 356-323 మధ్య ప్రపంచ చరిత్రలో అతను జీవించింది చాలా తక్కువ కాలమే అయినా ప్రపంచంతో అలెగ్జాండర్ ది గ్రేట్ అనిపించుకున్నాడు.

అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్ రాజనీతిజ్ఞుడు. సైనిక వ్యూహకర్త. అలాంటి తండ్రికి తగ్గ కొడుకు అలెగ్జాండర్. తండ్రి ఫిలిప్ శౌర్యం, తల్లి ఒలింపియస్ సౌందర్యం కలిస్తే... అలెక్స్. ప్రాచీన గ్రీకు పట్టణం పెల్లా అతడి పుట్టినిల్లు. గురువు అరిస్టాటిల్. గొప్ప తత్వవేత్త. బాల్యం నుండే రాజనీతితో పాటు ప్రపంచ పోకడను ఆయనకు వంటబట్టించాడు. ఒకవైపు తండ్రి, మరోవైపు గురువుల బోధనలతో అలెగ్జాండర్ రాటుదేలాడు. అలెగ్జాండర్ రాజ్యం మేసిడోనియా! గ్రీకుల సాంస్కృతిక కేంద్రం. ఫిలిప్ వరుసగా రాజ్యాలను జయించే పనిలో ఉండేవాడు. అప్పటికే గ్రీకు రాజ్యాలన్నీ అతడి వశమై ఉన్నాయి. ఏథెన్స్ కూడా స్వాధీనమయింది. అలెగ్జాండర్ ఇరవై ఏండ్ల వయస్సులో తండ్రి శత్రువుల చేతిలో హతమయ్యాడు. నూనూగు మీసాల యవ్వనంలో అలెగ్జాండర్ రాజయ్యాడు. నిన్న మొన్నటివరకు తండ్రిచాటు కొడుకు మనల్నేం చేస్తాడులే అనుకుని తోక జాడించిన విలీన దేశాలను నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. అంతే, ముందడుగు వేయాలనుకున్న ఇతర దేశాలు తోక ముడుచాయి. ఆ విజయం ఆయనలో ప్రపంచాన్ని జయించాలనే బలమైన కోరికకు పునాది వేసింది. ఇరవై సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్టించిన అలెక్స్ (అలెగ్జాండర్) ఇరవై రెండో యేట ఆసియా మైనర్‌ను (టర్కీ) తన వశం చేసుకున్నాడు. ఇరవై ఐదో యేట పర్షియా పాదాక్రాంతం అయింది. తర్వాత ఏడేండ్లలో.. ఇప్పటి యుగోస్లేవియా నుంచి ఇండియా వరకు అన్ని ప్రాంతాలు అలెగ్జాండర్ అధీనంలోకి వచ్చాయి.

ఇరవై ఐదేళ్ల వయసు అంటే యువకుడిగా ఎదిగే వయసు, చక్రవర్తికైనా యవ్వనాన్ని ఎంజాయ్ చేయాల్సిన వయసు. కానీ అలెగ్జాండర్ ప్రపంచదేశాలను జయించాలనే లక్ష్యంతో జైత్రయాత్రకు సిద్ధమయ్యాడు. ఒకరోజు ఉదయం లేస్తూనే సేనాపతులను పిలిచి పర్షియాపై దండెత్తబోతున్నాం అన్నాడు. నిజానికి పర్షియా చాలా పెద్దరాజ్యం. ఆర్థికంగా, సైనికపరంగా ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అలాంటి రాజ్యంపైన కేవలం ముప్ఫై వేల మంది సైనికులు, ఐదువేల గుర్రాలతో దాడికి దిగాడు. యుద్ధం మొదలైంది. అలెక్స్ సేనలు పర్షియా సైనికులను ఊచకోత కోస్తున్నాయి. ఆయుధాలకున్న బలం కాదది. అలెగ్జాండర్ ఇచ్చిన గుండె ధైర్యం. యుద్ధం మధ్యలోనే పర్షియా రాజు డెరియస్ పారిపోయాడు. అయితే పర్షియా దేశంలోని యువకులను, సైన్యాన్ని బానిసలుగా చేసుకోకుండా తన సైన్యంలో కలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు అలెక్స్.

పర్షియా తర్వాత, గ్రీకులకు తెలిసిన భూభాగాలన్నింటినీ జయించాడు అలెగ్జాండర్. చివరిగా భారతదేశం వైపు వచ్చాడు. క్రీ.పూ 326లో భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర మొదలైంది. తన సొంత రాజ్యం మేసిడోనియాను మరచి అప్పటికే ఎనిమిదేళ్లయింది. సైనిక పటాలం చిక్కిపోయింది. మిగిలిన అరకొర సైనికులు అలిసి ఉన్నారు. అయినా అలెగ్జాండర్ యుద్ధపిపాస తీరలేదు. సింధూనదిని దాటి తక్షశిల నగరంలోకి చొరబడ్డాడు. తక్షశిల పాలకుడైన అంభి ఆయనకు సాదర స్వాగతం పలకకుండా ఉన్నట్టయితే, అలెగ్జాండర్‌ను భారత భూభాగంపై పాదం మోపకుండా తరిమి కొట్టి ఉండవచ్చు. అంభి ఆ చర్యకు కారణం అతిథుల పట్ల ఆదరభావం కాదు.

జీలం నదీ తీరంలో సిరిసంపదలతో, శాంతి భద్రతలతో రాజ్యమేలుతున్న తన పొరుగు రాజు పురుషోత్తముణ్ణి ఓడించాలన్న దురాశే అందుకు కారణం! పరాయి చక్రవర్తికి పాదాక్రాంతుడై, తాను దాసోహం అవడమే గాక, అంభి ఇరుగు పొరుగు రాజులను సైతం, తన సభకు రప్పించి, అలెగ్జాండర్ ఆధిపత్యాన్ని అంగీకరించేలా చేయడానికి ప్రయత్నించాడు. చిన్నా చితక పాలకులు అందుకు సమ్మతించి తలలు ఒగ్గారు. జీలమ్, చీనాబ్ నదుల మధ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడిని కూడా సంధికి ఆహ్వానించాడు. కానీ, దైర్యశాలీ, మానధనుడూ అయిన పురుషోత్తముడు మాత్రం అందుకు అంగీకరించలేదు! పౌరవ వంశస్థుడైన పురుషోత్తముడు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. అతనితో యుద్ధంలో తలపడ్డాడు అలెగ్జాండర్. అప్పటికే ఒక ఆదివాసీ రాజ్యంతో జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ గాయపడ్డాడు. పురుషోత్తమునితో యుద్ధంలో అలెగ్జాండర్ గుర్రం మరణించింది. తన తొలి దండయాత్ర నుండి అలెగ్జాండర్ ఆ గుర్రం పైనే ప్రయాణించాడు. అలాంటిది తన గుర్రం మరణించడంతో అలెగ్జాండర్ కొంత నిరాశకు గురయ్యాడు. దీనితో పాటు భారతదేశంలోని వాతావరణం సైనికులకు కలిసిరాలేదు. ఫలితంగా చాలామంది అనారోగ్యం పాలయ్యారు.

పైగా ఆ యుద్ధంలో అతని సైన్యం చాలావరకు దెబ్బతిన్నది. ఆ కాలంలో మన రాజులు యుద్ధాలలో గజబలాన్ని, అంటే ఏనుగులను ఉపయోగించేవారు. శిక్షణ పొందిన బ్రహ్మాండమైన ఆ జంతువులను ఎలా ఎదుర్కోవాలో గ్రీకుసైనికులకు తెలియదు. అయితే, అంభి వారికి ఏనుగులను ఎదుర్కొనే పద్ధతులను, మెళకువలను నేర్పి సాయపడ్డాడు.

అలెగ్జాండర్ జీలం నదీ వైపు సేనలను నడిపించి నదీ తీరం చేరాడు. నదిని దాటడం అంత సులభంగా తోచలేదు. సైనికులు పడవలలో వెళ్ళేప్పుడు పురుషోత్తముడి సేనలు ఎదుర్కోవచ్చు. అలెగ్జాండర్ కొన్నాళ్ళు అక్కడే బసచేసి తీవ్రంగా ఆలోచించసాగాడు. అంతలో అంభి అంతగా లోతులేని నదీ ప్రాంతాన్ని చూపాడు. వెంటనే అలెగ్జాండర్ ఒక పథకం ఆలోచించాడు. కొందరు సైనికులను పడవలలో నదిని దాటమని ఆజ్ఞాపించాడు. పడవలలో వస్తున్న సైనికులను ఎదుర్కోవడంలోనే పురుషోత్తముడు గురిగా ఉన్న సమయంలో, అలెగ్జాండర్ సేనలు మరోవైపు నీళ్ళు తక్కువగా ఉన్న చోట నదిని దాటి అవలి తీరం చేరాయి. అనూహ్యమైన ఈ పరిణామానికి దిగ్భ్రాంతి చెందిన పురుషోత్తముడు, మరుక్షణమే శత్రుసేనలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు.

అలెగ్జాండర్, పురుషోత్తముని మధ్య యుద్ధం జరిగేటప్పుడు రోజులు గడిచే కొద్దీ యుద్ధంలో పురుషోత్తముడిదే పైచేయిలా కనిపించసాగింది. ఇరవై వేలకు పైగా సైనికులు హతులయ్యారు. అతని చేతిలో అలెగ్జాండర్ చనిపోవడం ఖాయమనుకున్నారంతా. ఆ విషయం తెలుసుకొన్న అలెగ్జాండర్ భార్య రొక్సానా, పురుషోత్తముడికి ఒక రాఖీని పంపింది. దాంతోపాటు యుద్ధంలో కనుక నా భర్త నీ కంటపడితే దయచేసి అతణ్ని ఏమీ చేయవద్దు అన్న సందేశాన్ని కూడా అందించిందట. ఆ తరువాత యుద్ధంలో అలెగ్జాండర్‌ను హతమార్చే అవకాశం వచ్చినా పురుషోత్తముడు తన మాటను నిలబెట్టుకున్నాడంటారు.

మొదటిసారి అలెగ్జాండర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఓటమిని తట్టుకోలేకపోయాడు. మానసికంగా కుంగిపోయాడు. అలెగ్జాండర్‌ను ఊరడించేందుకు జరుగాల్సిన ప్రయత్నాలన్నీ జరిగాయి. అంతటి యోధుడికి కూడా ఓటమి భయం పుట్టించిన దేశం భారతదేశం. మేసిడోనియాకు తిరిగి వెళ్లవలసిన సమయాన్ని విధి మనకు గుర్తు చేసింది తప్ప నిజానికి మనం ఓడిపోలేదు అన్నారు సేనాపతులు. నాలుగు నదులు దాటాం. యుగోస్లేవియా నుంచి ఇండియా వరకు - బల్గేరియా ఇజ్రాయిల్ ఈజిప్టు, లిబియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, సోవియెట్ యూనియన్లపై దండయాత్రలు జరిపి గ్రీసు సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాం. హిందుఖుష్ పర్వతాలలో సైన్యం దాటలేకపోయిన ఐదవ నది హైఫాసిస్.. (నేటి పంజాబ్‌లోని బియాస్ నది) హైఫాసిస్ ఎందువల్లో కలిసి రాలేదు. ఈ భూభాగంలో మొదటి నుంచీ శకునాలేవీ బాగోలేవు అని అలెగ్జాండర్ తొందరపాటును కప్పిపుచ్చారు త్రికాలజ్ఞులు. మొత్తానికి అందరూ కలిసి అలెగ్జాండర్ తప్పేమీ లేదని తేల్చేశారు. అయిష్టంగా వెనుదిరిగాడు అలెక్స్. అంతదూరం వచ్చినందుకు ఆనవాళ్లుగా పన్నెండు మంది గ్రీకు దేవుళ్లకు పన్నెండు ప్రార్థనా పీఠాలను ప్రతిష్టించి గుర్రాలను వెనక్కి దౌడు తీయించారు. అతను ఓడిపోయి వెను తిరిగిపోయేటప్పుడు చాలా బాధపడ్డాడు.

ఖండాలు సరిపోనివాడైనా పుడమి కడుపులో ఇమిడిపోవలసిందేనని అంటున్నారెవరో. అప్పుడుగానీ తను జబ్బున పడిన విషయం గ్రహింపునకు రాలేదు అలెక్స్‌కు. బాబిలోన్ వెళ్లేప్పటికీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. రాజ వైద్యులు ఏవో ఔషధాలు కాచి వడబోసి తెస్తున్నారు. ఆకార్నేనియా నుంచి ఫిలిప్ అనే ధన్వంతరి వచ్చాడు. అతడి పేరు వినగానే తన ఆరోగ్యం మెరుగవుతుందన్న నమ్మకం కలిగింది. ఫిలిప్! వారసత్వంగా అతడికి నమ్మకాన్ని ఇచ్చిన పేరు! తండ్రి పేరు. కానీ వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. అలెగ్జాండర్ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడని మరికొన్ని రోజుల్లో చనిపోతాడని వైద్యులు చెప్పారు. అలెగ్జాండర్‌కు ఆరోగ్యం బాగలేదన్న వార్త బయటికి పొక్కింది. ఒకరొకరుగా వచ్చి పలకరిస్తున్నారు. ముఖ్యాధికారి ఒకరు అలెగ్జాండర్ సమీపానికి వచ్చి కుశలం అడిగాడు. మొదటి భార్య రొక్సానా, ఆమె కుమారుడు నాల్గవ అలెగ్జాండర్, రెండో భార్య స్టాటెయిరా, మూడో భార్య పారిశాటిస్, తల్లి ఒలింపియస్ అతడి పక్కనే ఉన్నారు. చివరిసారిగా వాళ్లవైపు చూసి, ఓపికలేని కనుసైగతో సమీపంలో ఉన్న ముఖ్య సైనిక అధికారులను దగ్గరకు రప్పించుకున్నాడు అలెక్స్.

మృత్యువు సమీపిస్తున్నది. అంతిమ క్షణాలు నన్ను ప్రక్షాళన చేస్తున్నాయి. నమ్మకస్తులైన నా రాజ్యాధికారులారా... మీకు కృతజ్ఞతలు. మీకు అభివాదాలు. నా ఆఖరి ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం వినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరింత సమీపానికి రండి అన్నాడు అలెగ్జాండర్. అతడిని ఆ స్థితిలో చూస్తుండడం వల్ల పట్టుతప్పుతున్న గాంభీర్యాన్ని చిక్కబట్టుకుని ముందుకు వచ్చారు రాజ్యాధికారులు.
వినండి మిత్రులారా.. నా శవపేటికను వైద్యశిఖామణులను మోయనివ్వండి.

వినండి హితులారా.. నా శవపేటిక వెంబడి మణులు మాణిక్యాలు వెదజల్లించండి.
వినండి ఆప్తులారా.. నన్ను ఖననం చేసిన మట్టిలోంచి నా చేతులను పైకి ఉండనివ్వండి అన్నాడు అలెగ్జాండర్.
బాబిలోన్ ప్రాంతంలో క్రీ.పూ. 323 (జూన్ 10 లేదా 11)లో అలెగ్జాండర్ తుదిశ్వాస విడిచాడు.
ఖననం చేసిన మట్టిలోంచి అలెగ్జాండర్ తన చేతులను పైకి ఉండనివ్వండి అని ఎందుకు చెప్పాడంటే.. ఈ ప్రంపంచాన్నే జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా చివరికి ఒట్టి చేతులతో వెళ్లిపోయాడని ఈ ప్రపంచానికి తెలియాలని. ఎన్ని దేశాలను గెలిచినా, ఎన్ని ధనరాశులను కొల్లగొట్టినా పోయేటప్పుడు పట్టుకు పోలేం. పుట్టినప్పుడు ఒట్టి చేతులే, ప్రాణం పోయినప్పుడు కూడా ఒట్టి చేతులే అని సందేశాన్నిచ్చాడు అలెగ్జాండర్.
ALEXANDER1
మృత్యువు సమీపిస్తున్నది. అంతిమ క్షణాలు నన్ను ప్రక్షాళన చేస్తున్నాయి. నమ్మకస్తులైన నా రాజ్యాధికారులారా... మీకు కృతజ్ఞతలు. మీకు అభివాదాలు. నా ఆఖరి ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం వినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరింత సమీపానికి రండిఅన్నాడు అలెగ్జాండర్.అతడిని ఆ స్థితితో చూస్తుండడం వల్ల పట్టుతప్పుతున్న గాంభీర్యాన్ని చిక్కబట్టుకుని ముందుకు వచ్చారు రాజ్యాధికారులు.

- మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

514
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles