భయోత్పాతం


Sun,May 19, 2019 01:38 AM

Animals
మనిషి విచక్షణారా హిత్యం వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటున్నది. ప్రకృతి విధ్వంసకర పనుల వల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. నానాటికీ కాలుష్యం పెరిగిపోవడం.. విస్తరించాల్సిన జీవజాతుల శాతం తగ్గిపోవడం జీవ వైవిధ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవాళికి భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నాయి ప్రపంచ పర్యావరణ, జీవవైవిధ్య సదస్సుల నివేదికలు. భయోత్పాతం భయపెడుతున్నది.. బహుపరాక్. నెల 22న ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం. ఈ సందర్భంగానైనా జీవవైవిధ్యం గురించి తెలుసుకుందాం.

వినోద్ మామిడాల,
సెల్:7660066469

Animals7

అవగాహన కల్పిస్తున్నాం:

రాష్ట్రంలోని అన్ని శాఖలనుతో కలిసి జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు బోర్డు కృషి చేస్తున్నది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో డాక్యుమెంటేషన్లు జరుగుతున్నాయి. బయోడైవర్సిటీ చట్టం అమలుకు గ్రామీణ స్థాయి వరకూ కమిటీలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు వారి పరిధిలోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి సర్వ హక్కులు కలిగి ఉంటారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

జి. సాయిలు,
రీజినల్ కో-ఆర్డినేటర్,
తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు

Animals1
భూమ్మీద ఉన్న ప్రతీ జీవికి ప్రకృతి ఉమ్మడి ఆస్తి. ఈ పకృతిలో ప్రతిజీవి ఇంకో జీవి మీద ఆధారపడి మనుగడ సాగిస్తుంది. ఇదే జీవ వైవిధ్యం. అయితే.. నాగరికత నేర్చిన మానవుడి విచక్షణారాహిత్యం వల్ల ఈ జీవవైవిధ్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. మనుగడ సాగించాల్సిన జీవజాతులు అంతరిస్తున్నాయి. ఇలా ఒక రకమైన జీవులు అంతరిస్తే వాటి మీద ఆధారపడే జీవులూ నశిస్తున్నాయి.

జీవవైవిధ్యం దెబ్బతింటే?

జీవుల మధ్య ఆహార గొలుసు దెబ్బతిని ప్రాణులన్నింటికీ ప్రమాదం ఏర్పడుతుంది. మొక్కలు నశిస్తే వాటి మీద ఆధారపడే జంతువులు నశిస్తాయి. కీటకాలు నశిస్తే వాటినే ఆహారంగా తీసుకొనే పక్షులు నశిస్తాయి. పక్షులు నశిస్తే మొక్కలు పెరుగడం, పంటలు పండడం ఆగిపోతుంది. అంతిమంగా ఏ జీవికైనా ఆహారోత్పత్తి దెబ్బతిని మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఇష్టానుసారంగా చేపల వేట, మితిమీరిన ప్లాస్టిక్ వాడకం, వ్యవసాయ ఉత్పత్తుల కోసం అధికమైన యంత్రాల వాడకం, శిలాజ ఇంధనాలను మండించడం, గనుల తవ్వకం, కర్బన ఉద్ఘారాల నియంత్రణాలోపం జీవ వైవిధ్య విధ్వంసానికి ప్రధాన కారణాలు.

మనుగడ ప్రమాదమా?

లక్షల ఏండ్ల కిత్రం అగ్నిపర్వతాలు, ఉల్కాపాతాలు భూమిపై మార్పులను తీసుకొచ్చాయి. ఇప్పుడు మనిషి మళ్లీ ఈ భూమి సమూలంగా మారిపోవడానికి కారణమవుతున్నాడని పరిశోధకులు అంటున్నారు. భూమిపై మనుగడ సాధిస్తున్న సమస్త జీవరాశుల వినాశనానికి మానవుల చర్యలే కారణమవుతున్నాయి. తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న మూర్ఖపు చర్చలు కనిపిస్తున్నాయి అని ఈ నెల మొదటి వారంలో పారిస్‌లో జరిగిన జీవవైవిధ్య పర్యావరణ వ్యవస్థల అంతర ప్రభుత్వ వైజ్ఞానిక విధాన వేదిక (ఐపీబీఈఎస్) స్పష్టం చేసింది. ఇది అంతిమంగా మానవ మనుగడకే ప్రమాదం అని వారు హెచ్చరిస్తున్నారు.

జనాభా కోసం చెట్లూ పెంచాలి

ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ ైక్లెమెట్ ఛేంజ్ (ఐపీసీసీ) నివేదిక ప్రకారం.. పారిశ్రామిక విప్లవానికి ముందు నమోదైన సగటు ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదైతే భూ ఉపరితల ఉష్ణోగ్రతను అదుపు చేయడం అసాధ్యం. అదే ఉష్ణోగ్రతలు మరో 0.5 డ్రిగీల సెంటీగ్రేడ్ అధికమైతే ప్రపంచం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుంది. 20-30% జీవవైవిధ్యం అస్తవ్యస్థమైపోతున్నది. ఇప్పటికే ఎన్నో దేశాలు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుతుంది. 2050 వరకు మరో రెండు వందల కోట్లకు జనాభా పెరుగుతుంది. వీరందరి కోసం ఇంధన, శక్తి వనరులను సమకూర్చాలి. ఆహారాన్ని అందించే పంటలను ఉత్పత్తి చేయాలి. బొగ్గు ఉత్పత్తి కోసం కలపను ఇచ్చే చెట్లను పెంచాలి.

వన్యప్రాణులెక్కడ?

మనిషి సృష్టిస్తున్న విపత్తుల వల్ల 2020 నాటికి 3/2 శాతం సకశేరుకాలు అంతరించే ప్రమాదం ఉందని లివింగ్ ప్లానెట్ రిపోర్టు చెప్తున్నది. ప్రపంచ వన్య మృగాల పరిస్థితులను సమీక్షిస్తూ రెండేండ్లకోసారి వరల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ నేచర్ ఈ రిపోర్టును విడుదల చేస్తున్నది. 1972 నుంచి ఇప్పటి వరకూ 61 శాతం వన్యమృగాలు అంతరించినట్టు ఈ నివేదిక చెప్తున్నది. రోడ్లు, రైల్వే మార్గాలు, డ్యాంలు, అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణులకు నష్టం కలుగుతున్నది. బయటి జాతుల ప్రమేయం స్థానిక జాతుల జీవుల మీద ప్రమాదం చూపుతుంది. ఉదాహరణకు ఆస్ట్రేలియాలోని పొలాల్లో ఎలుకలను నివారించడానికి వారు ఉద్దేశపూర్వకంగానే అమెరికన్ కేన్ డోన్ అనే కప్పను తమ దేశంలోకి తెచ్చారు. ఈ భారీ కప్ప ఆస్ట్రేలియాలోని కప్పలను, సర్పజాతి జీవులను సమూలంగా నాశనం చేసే స్థాయికి చేరింది.
3Animals

డెడ్‌లైన్ 2050

భూమ్మీద అనేక రకాల జీవజాతులు ఉన్నాయి. 10-14 మిలియన్ల జాతుల జీవులు భూమి మీద నివశిస్తున్నట్టు శాస్త్రవేత్తల అంచనా. 2 లక్షల 80 వేల వృక్షజాతులు, 59 వేల జంతు జాతులు, 9 లక్షల 50 వేల కీటకాలు ఉన్నాయి. ఏటా 10వేల రకాల జాతులు కొత్తవి గుర్తింపులోకి వస్తున్నాయి, అంతే సంఖ్యలో అంతరించిపోతున్నాయి. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి వాతావరణ ప్రణాళిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్ ఏమంటున్నారంటే.. వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ జీవి వైవిధ్యంపై ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. 2050 నాటికి కార్బన్ ఉత్పత్తులను పూర్తిగా అరికట్టడమో లేదా, ఏ పద్ధతుల్లోనైనా సరే గాలిలోని కార్బన్‌డయాక్పైడ్‌ను తొలగించడమో చేయాలి అన్నారు.
Animals4

తెలంగాణలో జీవవైవిధ్యం

రాష్ట్రం జీవ వైవిధ్యానికి కేంద్రంలాంటిది. అనేక రకాల జంతు, పక్షి జాతులకు నెలవు. దేశంలో అడవులు అధికంగా విస్తరించి ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ వ్యాప్తంగా 2800 రకాల మొక్కల జాతులు ఉన్నాయి. అందులో 1800 రకాల జాతుల మొక్కలు ఔషధ మొక్కలే. 900 రకాల ఔషధ మొక్కలు హైదరాబాద్ కేంద్రంగా అందుబాటులో ఉన్నాయి. 108 జాతుల క్షీరదాలు, 486 పక్షి జాతులు తెలంగాణలో మనుగడలో ఉన్నాయి. తెలంగాణ బయోడైవర్సిటీ రిపోర్టు ప్రకారం.. మన రాష్ట్రంలో అంతరించిపోయే దశలో ఉన్న వాటిలో అడవి కుక్క, ఉడుత, చిరుతపులి, హైనా, మౌస్‌డీర్, రాబందు, బాతు, హంస, మొసలి, మరిన్ని చేప జాతులు ఉన్నాయి. జీవవైవిధ్యాన్ని రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా పరిధిలోనే జీవవైవిధ్యాన్ని రక్షించడానికి ఈ బోర్డు కృషి చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్ సైట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగానే కూకట్‌పల్లి శివారులోని అమీన్‌పూర్ లేక్‌ను అభివృద్ధి చేసింది. 2016 నుంచి ఈ చెరువును వలస పక్షుల కోసం, చుట్టు పక్కల జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసం ఉపయోగించుకుంటుంది. 93 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పరిధిలో కొన్ని వందల స్థాణీయ పక్షులు, వలస పక్షులు ఆశ్రయం పొందుతున్నాయి. కేవలం తెలంగాణలో మనుగడలో ఉన్న జీవులను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఐకాన్‌గా ప్రకటించాయి. అందులో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, జంతువుగా జింక, రాష్ట్ర చెట్టుగా జమ్మిచెట్టు, రాష్ట్ర పువ్వుగా తంగేడు పువ్వును గుర్తించాయి. అట్లాగే రాష్ట్రంలో అరుదుగా కనిపించే మన్ననూర్ గిత్తను ప్రత్యేక స్థానం కల్పించబోతున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో కనిపించే ఈ అరుదైన జాతి గిత్తను తెలంగాణ గిత్తగా గుర్తించడానికి తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Animals6

సముద్రమంతా ప్లాస్టిక్‌మయం

చిన్న చిన్న చెరువుల నుంచి మహా సముద్రాల వరకూ అన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇప్పటికే సముద్ర జలాలు ఆమ్లపూరితమవుతున్నాయి. ఆక్సీజన్ శాతం తగ్గి నీటిలో, భూ ఉపరితలంలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే 1.5 డ్రిగీల సెంటిగ్రేడ్ పెరిగితే ముప్పై లక్షల టన్నుల సాగరజీవులు అంతరిస్తాయి. మరో 0.5 డ్రిగీలు పెరిగినట్టయితే అరవై లక్షల టన్నుల జీవరాశులకు ప్రమాదం వాటిల్లుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా సముద్ర జీవుల సంఖ్య గణనీయంగా నశిస్తున్నది. 1970 నుంచి ఇప్పటి వరకూ 49 శాతం సముద్రంలో జీవివైవిధ్యం దెబ్బ తిన్నది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 78 మిలియన్ టన్నులు ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నది. దీనిలో ఎక్కువ భాగం సముద్రంలోకే చేరుతుంది. ఇది ఇలాగే కొనసాగితే 2025 వరకూ 155 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లో చేరుతుందని అంచనా.

అంతరించి పోతున్నాయి

ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచంలో అత్యధిక జీవవైధ్యం కలిగిన దేశాల జాబితాలో మనదేశం ఒకటి. ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య పరిరక్షణ సమితి 17 మెగా బయోడైవర్సిటీ దేశాలను గుర్తించింది. అందులో భారతదేశం పదో స్థానంలో ఉంది. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ 2019 లెక్కల లెక్కల ప్రకారం దేశంలో లక్షా ఆరువందల తొంభై ఆరు జాతుల జంతువులు ఉన్నాయి. 48వేల 6వందల 55 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇది ప్రపంచ జీవ వైవిధ్యంలో 7-8శాతం ఉంటుంది. ఇదొక రికార్డు కానీ ఇక్కడ వన్యప్రాణాలు ప్రమాదపుటంచున ఉన్నట్టు బయోడైవర్సిటీ నివేదికలు చెప్తున్నాయి. దేశంలో ఏడు శాతం పక్షులు అంతరించే దశకు చేరాయి. 57శాతం ఉభయచరాలు దాదాపు అంతరించాయి. 70శాతం జల చేపల జాతులు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఏటా 33శాతం వృక్షాలు రోగాలకు గురవుతున్నాయి. 1500 రకాల జాతుల మొక్కలు అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి. అంతరించిపోతున్న జంతువుల్లో బెంగాల్ టైగర్ కూడా ఉంది. బయోడైవర్సిటీ అథారిటీలు విడుదల చేసిన అంతరించిపోయే దశలో ఉన్న జంతువుల్లో గ్యాంజెస్ డాల్పిన్, మంచు చిరుత, రెడ్ పాండ, ఖడ్గమృగం, నీలగిరి తాహ్,్ర కాశ్మీర్ రెడ్ స్గాగ్, ఆసియా సింహం వంటివి మన దేశంలో అంతరించే దశలో ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులను అదుపు చేయడానికి ప్రభుత్వం అటవీ చట్టాలను, జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతంలో చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ 2002లో ప్రత్యేక జీవ వైవిధ్య చట్టాన్ని ప్రకటించింది. అది 2003నుంచి దేశవ్యాప్తంగా అమలులో ఉంది. ఈ చట్టం పరిధిలోకి జాతీయ జీవవైవిధ్య అథారిటీ, జాతీయ జీవవైవిధ్య బోర్డు, జాతీయ జీవవైవిధ్య కమిటీలు వస్తాయి. ఇతర శాఖలతో సంయుక్తంగా పని చేసి దేశంలో జీవివైవిధ్య బాధ్యతలను నిర్వర్తిస్తాయి.
Animals5

పగడపు దీవుల్ని కాపాడలేమా?

సముద్ర ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే ఎక్కువ పెరగడంతో జలచరాలు మృత్యుబారిన పడుతున్నాయి. ఒక విర్జిన్ ఐలాండ్స్ పరిసరాల్లో సముద్ర జలాల అడుగున ఉండే పగడపు దిబ్బలు గత రెండేండ్లలోనే 40% విధ్వంసానికి గురయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ పగడాల దీవులు అంతరించిపోతాయి. ఈ దీవుల్లో మనిషికి కావాల్సిన విలువైన ముడిపదార్థాలు లభిస్తాయి. సముద్రాల్లో దొరికే ప్రాంజ్, సీవిప్ కోరల్స్ అనే ఒక రకమైన పగడాల నుంచి సేకరించిన పదార్థాలు పెయిన్ కిల్లర్స్, యాంటి అలెర్షిక్ వంటి ఔషధ ఉత్పత్తుల్లో వాడుతారు. సముద్రంలో దొరికే నత్తగుల్లలు, శంఖులు అలంకరణ కోసం, ఇతర ప్రయోగాల కోసం వాడుకలో ఉన్నాయి. ఇంతటి అమూల్యమైన సంపదను ఇచ్చే దీవులను రక్షించాలంటే పెరుగుతున్న వాతావరణ వ్యతిరేక పరిణామాలను కొంతైనా అదుపు చేయాలి. అలా చేయగలిగితే 10% వరకు ఈ పగడపు దీవులను మిగుల్చుకోవచ్చు.

ఇంతటి ఆవశ్యకత కలిగిన జీవవైవిధ్యాన్ని సరైన మార్గంలో వాడుకొని, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిశోధకుడు డెబ్రా రాబర్ట్ చెప్పినట్టు సదస్సులు, నిర్ణయాలు ఇసుక మీద రాసిన సన్నని గీత మాత్రమే. ఇవి సకల మానవాళికి శాస్త్రవేత్తలు వినిపించే మృత్యుఘంటికలు. ఇప్పటికైనా మనమంతా మేల్కొని కఠిన చర్చలు తీసుకోకపోతే సమీప భవిష్యత్‌లోని భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. నిజమే.. పర్యావరణాన్ని రక్షించుకోకపోతే ముప్పు తప్పదు.

607
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles