దైవ నిర్ణయం


Sun,May 19, 2019 12:47 AM

devudu

- సౌభాగ్య

ఆమె భర్త లోభి. ఆమె చేసే ప్రతి పనికి ఆటంకం కలిగించేవాడు. పిల్లికి కూడా బిచ్చం పెట్టని లోభి. ఆమె ఎక్కడ దుబారా చేస్తుందో అని జాగ్రత్తగా ఉండేవాడు. అయినా ఆమె ఏదో సందర్భంలో వీలయినంతగా రహస్యంగా పేదల్ని ఆదుకునేది.

పూర్వం మీరాబాయి అన్న పేరుగల రాజకుమారి ఉండేది. ఆమెకు ఇద్దరు మేనత్తలు. ఆమె అంటే ఇద్దరికీ ఎంతో ఇష్టం. ఆమె ఎంతో కాలం తరువాత తన మేనత్తల్ని చూడాలని అనుకుంది. వాళ్ళ సంసారాలు ఎలా ఉన్నాయో చూడాలనిపించింది. ఇద్దరూ సంపన్నులయిన భర్తల్నే పొందారు. వాళ్ళ అనుబంధాలు కుటుంబ జీవనం ఎలా ఉన్నాయో చూడాలని రాజకుమారికి కోరిక కలిగింది.

మీరాబాయి రాజకుమారి మొదట తన చిన్న మేనత్త ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. ఒకరోజు బయలుదేరి చిన్నత్త ఇంటికి వెళ్ళింది.

మేనకోడల్ని చూస్తూనే చిన్నత్త ఎంతో సంబురపడింది. ప్రేమతో, సంతోషంతో హత్తుకుంది. మేనకోడల్ని తన వెంట తిప్పి ఇంటిని, పరిసర వాతావరణాన్ని పరిచయం చేసింది. మీరాబాయి రాజకుమారి తన చిన్న మేనత్త ఇంటిని, మేనత్త చర్యల్ని నిశితంగా పరిశీలించింది. మేనత్త పెదాలపై చెరగని చిరునవ్వుని చూసింది.

ఆమె మేనత్త అనాథలను ఆదుకునేది. ఇంటిముందు నుంచి పేదవాళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళకు తిండి పెట్టి బట్టలిచ్చేది. దగ్గరున్న అడవిలో జలాశయం కట్టించి జంతుజాలానికి కూడా దాహం తీర్చింది. చిన్నత్త దయాంతరంగానికి మీరాబాయి ఎంతో పరవశించింది. మీరా! ఇదంతా నేను చేయగలుగుతున్నానంటే మా ఆయన సహకారం, సౌజన్యం వల్లనే వీలయింది. నేను ఏం చేసినా ఆయన కాదనరు. నేను మంచి పనిచేస్తున్నానని ఆయన నిశ్చయం. ధనం ఉన్నది ఇతరుల్ని ఆదుకోవడానికే అంటారాయన. అందుకే ఆయన నా చర్యల్ని ప్రోత్సహిస్తారు. అట్లాంటి సంస్కారవంతుడైన భర్తను పొందడం నా అదృష్టం అని చెప్పింది చిన్నత్త.

మీరాబాయి రాజకుమారి తన మేనత్త మంచితనానికి మురిసిపోయింది. వాళ్ళ అనుకూల దాంపత్యానికి ఆనందించింది.

కొన్నాళ్ళ పాటు అక్కడ హాయిగా గడిపి సెలవు తీసుకొని తన పెద్ద మేనత్త దగ్గరకు బయల్దేరింది.

పెద్ద మేనత్త కూడా ఆమెను ఎంతో ఆనందంతో ఆహ్వానించింది. పెద్ద మేనత్త భర్త కూడా మీరాబాయి రాజకుమారిని ఎంతో ప్రేమగా ఆదరించాడు. మీరాబాయి అక్కడి కుటుంబ పరిస్థితుల్ని పెద్ద మేనత్త కుటుంబానికి ఉన్న తారతమ్యం చూసి విస్తుపోయింది.
పెద్ద మేనత్త చిన్న మేనత్తలాగే ఎంతో ఔదార్యం ప్రదర్శించేది. దయాదాక్షిణ్యాల్ని కలిగింది. పేదల్ని ఆదరించాలని, దానధర్మాలు చేయాలని ఆరాటపడేది. కానీ, ఆమె భర్త లోభి. ఆమె చేసే ప్రతి పనికి ఆటంకం కలిగించేవాడు. పిల్లికి కూడా బిచ్చం పెట్టని లోభి. ఆమె ఎక్కడ దుబారా చేస్తుందో అని జాగ్రత్తగా ఉండేవాడు. అయినా ఆమె ఏదో సందర్భంలో వీలయినంతగా రహస్యంగా పేదల్ని ఆదుకునేది. భర్తమాటకు ఎదురు పలికేది కాదు. అతని మాటల్ని సహనంగా భరించేది. అతని ఆలనాపాలనా చూసేది.
పెద్ద మేనత్త మీరాబాయి ఆంతర్యాన్ని గ్రహించింది.

మీరా! నువ్వు చురుకయిన దానివి. అన్నీ గమనించావు. గ్రహించావు. దైవమార్గాలు చిత్రంగా ఉంటాయి. కొందరికి అన్నీ సానుకూలంగా జరుగుతాయి. కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. ఆటంకాలు ఉన్నప్పుడే ఆత్మబలం రెండింతలవుతుంది. దైవం ఏ ఉద్దేశంతో ఆయనకు ధనం పట్ల వ్యామోహం కలిగించాడో నీకూ, నాకూ తెలియదు. ఆ కారణంగా నేను దైవంతోనూ, నా భర్తతోనూ ఘర్షించడం అర్థం లేనిపని. నేను వీటిని అధిగమించి చూడాలని దైవం ఉద్దేశించిందేమో! దీనివల్ల నేను ఎంతో బలాన్ని పొందాను. నా భర్త పట్ల నేను జాలిపడే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు అంది కన్నీళ్ళతో!
మీరాబాయికి పెద్ద మేనత్తపట్ల గౌరవం పెరిగింది. సంతృప్తిగా రాజకుమారి తన నగరానికి వెళ్ళింది.

539
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles