ఆ ఊర్లో ఇంటికొక విమానం!


Sun,May 19, 2019 12:43 AM

Aeroplane
మన దగ్గర మనిషికొక ఫోన్ ఉన్నట్లు.. ఇంటికొక టీవీ ఉన్నట్లు.. అక్కడ ఇంటికొక విమానం ఉంది. కొన్ని ఇళ్లలో రెండు మూడు కూడా ఉన్నాయి. మనింటి ముందు బైక్ పార్క్ చేసినట్లే.. వాళ్లు కూడా విమానాలను ఇంటి ముందే పార్క్ చేస్తారు. ఏదైనా పనిపడితే హెలికాఫ్టర్ తీసి.. రయ్‌మంటూ గాల్లో వెళ్తారు. ఏంటి..? నమ్మకం లేదా? అయితే ఆ విమానాల గ్రామం గురించి తెలుసుకోండి మరి.

కారులో షికారుకెళ్తే చాలా గొప్పగా ఫీలవుతుంటాం. కానీ స్ప్రూస్ క్రీక్ అనే గ్రామంలో టిఫెన్ చెయ్యడానికి కూడా విమానం తీసుకెళ్తారు. అవసరమైతే విమానంలో వాషింగ్టన్‌లో వాకింగ్ వెళ్లి.. అలస్కాలో ఆమ్లేట్ తిని.. లూసియానాలో లంచ్ చేస్తారు. అంతటి ధనవంతులు ఆ గ్రామస్తులు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందంటే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో. ఈ స్ప్రూస్ క్రీక్ గ్రామంలోని అన్ని ఇళ్లకు రన్‌వే ఉంటుంది. మనం కొత్త బైక్‌లు, కార్ల గురించి ఆరా తీసినట్లే.. ఇక్కడంతా కొత్త విమానాలు, వాటి విశేషాల గురించి ఆరా తీస్తుంటారు. ఈ గ్రామంలో ఏ నలుగురు కలుసుకున్నా.. విమానాల ముచ్చటే.
Aeroplane1

ఇదొక ఫ్లయింగ్ కమ్యూనిటీ!

స్ప్రూస్ క్రీక్ గేటెడ్ కమ్యూనిటీ జనాభా దాదాపు 6,000. ఇక్కడ ప్రతి ఇంటికి ఓ విమానముంటుంది. అమెరికాలో ఇలాంటి ఫ్లయింగ్ కమ్యూనిటీలు 600కుపైగా ఉన్నాయి. ఆరిజోనా, ఫ్లోరిడా, టెక్సాస్, కొలరొడో, వాషింగ్టన్ రాష్ర్టాల్లో ఇవెక్కువ. అయితే వీటన్నింటిలో ఈ స్ప్రూస్ క్రీక్ అతిపెద్ద ఫ్లయింగ్ కమ్యూనిటీ. మన దేశంలో ఇంటి ముందు కార్లు, బైకులు పార్కు చేసినట్లే ఇక్కడి వాళ్లు ఇంటిముందే విమానాలను పార్కు చేస్తారు. కొందరేమో వాటికి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసుకుంటే, మరి కొందరేమో రహదారులపైనే పార్క్ చేస్తారు. విమానాలను వరుసగా పార్కు చేసినపుడు స్ప్రూస్ క్రీక్ గేటెడ్ కమ్యూనిటీ ఓ చిన్న ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తుంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత..

డేటోనా బీచ్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో స్ప్రూస్ క్రీక్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇదొక ప్రైవేటు ఎయిర్‌పోర్ట్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నావికా దళాన్ని, వైమానిక దళాన్ని అనుసంధానించేందుకు దీన్ని నిర్మించారు. అయితే 1946లో నావికాదళం ఈ ఎయిర్‌పోర్ట్‌ను ఖాళీ చేయించింది. అప్పటి నుంచి ఇది ధనవంతుల ప్రైవేట్ విమానాశ్రయంగా మారింది. అప్పటి నుంచి ఈ గ్రామస్తులు ఇలా కొత్తగా జీవించడం మొదలుపెట్టారు. ఈ స్ప్రూస్ క్రీక్ గేటెడ్ కాలనీలో నివసించే వారంతా ధనవంతులే. అంతేకాదు వీరందరికీ విమానాలంటే ఎంతో ఇష్టం. ఇక్కడ కారు, బైక్ రేసులు మరో ప్రధాన ఆకర్షణ. స్ప్రూస్ క్రీక్‌లో నిపుణులైన కారు, బైక్ రేసర్లున్నారు. ప్రతి నెలా బైక్ వీక్ కూడా జరుగుతుంది. ఈ గేటెడ్ కాలనీని, రేసులను చూడటానికి ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు.
Aeroplane2

సాటర్ డే మార్నింగ్ గాగ్ల్

స్ప్రూస్ క్రీక్ ప్రజలు ప్రతి శని, ఆదివారాల్లో విమానాలు తీసుకుని దగ్గర్లోని మరో విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడ టిఫిన్, భోజనాలు చేసి, కొత్త విమానాల గురించి తెలుసుకొని తిరుగు ప్రయాణమవుతారు. ఈ తతంగానికి వారు ఓ పేరు కూడా పెట్టుకున్నారు. అదే సాటర్ డే మార్నింగ్ గాగ్ల్. ఇక్కడుండే వారిలో చాలామంది వృత్తిరీత్యా పైలెట్లే. కొందరు డాక్టర్లు, లాయర్లు లాంటివారూ ఉన్నారు. ఇప్పుడు వీరి దగ్గర ఖరీదైన హెలికాఫ్టర్లతో పాటు.. అత్యంత విలాసవంతమైన కార్లూ ఉన్నాయి. ఇక్కడి వారిలో చాలామంది సర్టిఫైడ్ పైలెట్లే. పేరొందిన సెస్నాస్ అండ్ పైపర్స్, ఎక్లిప్స్ 500, మిగ్-15ఫైటర్ జెట్...లాంటి ఎన్నో రకాల హెలికాఫ్టర్లు ఈ ఊర్లో ఉన్నాయి.

613
Tags

More News

VIRAL NEWS