కరంట్‌కు దూరమై.. ప్రకృతికి చేరువై..


Sun,May 19, 2019 12:23 AM

hemasane
ఇంట్లో ఒక గంట కరంట్ లేకపోతే.. ఉక్కపోతతో విలవిలలాడుతాం. ఒక రోజు లేకుంటే టీవీలు, ఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు మూగబోతాయి. జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఒక నెలపాటు కరంటుకు దూరంగా ఉన్న జీవితాన్ని ఊహించండి.. బాబోయ్ అని అనిపిస్తుంది కదా.. మరి సంవత్సరంపాటు మీ ఇంట్లో కరంటు లేకుంటే.. వద్దు బాబోయ్ ఇక ఊహించుకోవడం కష్టం అంటారా. కానీ ఒక మహిళ 79 సంవత్సరాలుగా విద్యుత్‌కు దూరంగా ఉంటున్నది. అసలు ఆమె నివసిస్తున్న ఇంటికి విద్యుత్ కనెక్షనే లేదు. అలాగని ఆమె మతిస్థిమితం లేని వ్యక్తి కాదు. రిటైర్డ్ ప్రొఫెసర్.

మహారాష్ట్రలోని పుణెకు చెందిన రిటైర్డ్ బోటనీ మహిళా ప్రొఫెసర్ హేమాసనే (79) భుధవార్ పేట్‌లోని ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె 79 ఏళ్లుగా కరంటుకు దూరంగా నివసిస్తున్నారు. అలాగని ఆమె ఇల్లు ఊరికి దూరంగా లేదు. నగరం నడిబొడ్డున ఉంది. ఆ స్థలం విలువే కొన్ని కోట్లు ఉంటుంది. విద్యుత్ కనెక్షన్ తీసుకునే డబ్బులు ఉన్నాయి. అయినా.. ప్రకృతి, పర్యావరణంపై ప్రేమతో విద్యుత్తు జోలికి వెళ్లడం లేదని హేమ చెప్తున్నారు. పర్యావరణం మీద ఉన్న ప్రేమతోనే ఆవిడ విద్యుత్‌కు దూరంగా ఉంటున్నారు

ఈ జీవితమే ఇష్టం

తన జీవన విధానం గురించి హేమాసనే వివరిస్తూ ఒక మనిషికి తిండి, గూడు, గుడ్డ అనేవి కనీస అవసరాలు. ఒకప్పుడు మనకు విద్యుత్ సదుపాయం లేదు. అయినా అప్పుడు జీవించాం కదా.. నేను ఇప్పుడు అలాగే ఉంటున్నాను. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాల మధ్య హాయిగా బతుకుతున్నాను. నాకు కరంటు అవసరం రాలేదు. రాత్రిపూట లాంతర్లు పెట్టుకుంటాను. నా జీవన విధానాన్ని చూసి చాలామంది నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారు. కానీ నేను వాటిని పట్టించుకోను. ఇలా జీవించడమే నాకు ఇష్టం అని ఆమె అంటున్నారు.

దేవుడిచ్చిన ఆస్తులు

కరంట్ లేకుండా ఎలా జీవిస్తున్నారని ఎవరైనా అడిగితే.. కరంటుతో ఎలా బతుకుతున్నారని ఎదురు ప్రశ్నిస్తారు. టీవీలు, ఫోన్లు లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేని యాంత్రిక జీవితాన్ని తాను ఊహించుకోలేనని, అది తన శైలి కాదని చెప్తున్నారామె. పూరి గుడిసెలో ఉండడమే ఇష్టమని చెప్పుకుంటారు హేమాసనే. చాలామంది ఈ ఆస్తిని అమ్మేయమని తనకు సలహా ఇస్తుంటారని అంటున్నారు డా.హేమాసనే. కానీ తనకు ఆ ఉద్దేశం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. తన ఆస్తిపాస్తులన్నీ తనతో పాటు జీవిస్తున్న కుక్క, పిల్లులు, ముంగిస, పక్షులకే చెందుతాయని అంటున్నారామె. వాస్తవానికి ఇదంతా వాటికి చెందిన ఆస్తే అని, తాను కేవలం దాన్ని సంరక్షిస్తున్నానని అంటారు. అవన్నీ డా.హేమాసేన్ నేస్తాలే. ఆమె తన ఇంటిపని చేసుకొంటూ ఉంటే.. అవి తన చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెబుతారామె.

లాంతర్ల వెలుగులో పీహెచ్‌డీ

హేమాసనే పుణెలోని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ నుంచి బోటనీలో పీహెచ్‌డీ చేశారు. పుణెలోని గార్వెర్ కాలేజ్‌లో చాలా ఏళ్లు ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అనేక ప్రాంతాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. వేల మందికి అవగాహన కల్పించారు. వృక్షశాస్త్రం, పర్యావరణంపై ఆమె అనేక పుస్తకాలు రచించారు. ఇవన్నీ ఇప్పటికీ మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆమె కొత్త పుస్తకాలను రాస్తున్నారు. అది కూడా లాంతర్ల వెలుగులోనే.
hemasane1

ప్రకృతి ఒడిలో జీవితం

పొద్దున్నే పక్షుల కిలకిలరావాలతో నిద్ర లేస్తాను. రాత్రుళ్లు చల్లని చంద్రుడు, మిణుమిణుకుమనే నక్షత్రాలను చూస్తూ నిద్రపోతాను. ఇలా ప్రకృతి ఒడిలో జీవించే అవకాశం ఎంతమందికి ఉంటుంది చెప్పండి అంటూ ఆమె ప్రశ్నిస్తారు.

447
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles