బద్ధకస్థుడు


Sun,May 19, 2019 12:09 AM

- మల్లాది వెంకట కృష్ణమూర్తి
BADAKASTHUDU
అది ఎవరిదో తెలుసుకోండి. అది నా దగ్గరకి ఎలా వచ్చిందో, నాది అతని దగ్గరకి ఎలా వెళ్ళిందో విచారించండి. అప్పుడు హంతకుడు ఎవరో తెలుస్తుంది

మిగిలిన ఎనిమిది మంది గార్డులతోపాటు మార్విన్ కూడా సమాధి గోతి ముందు ఆనర్ గార్డుగా నిలబడ్డాడు. మరణించిన ఓ కామ్రేడ్‌ని గౌరవించడానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఆ విధంగా అనేకమంది కామ్రేడ్ల గౌరవార్థం వారు అక్కడికి అనేక సార్లు వచ్చారు. కానీ, మార్విన్ మాత్రం ఈసారి దాన్ని హత్య చేయడానికి వినియోగించుకున్నాడు. కొద్ది నిమిషాల్లో ప్రీస్ట్ సర్వీస్‌ని ముగించగానే ఆనర్ గార్డ్స్‌ను కెప్టెన్ పెద్ద కంఠంతో ఆజ్ఞాపిస్తాడు.

లోడ్. ఎయిమ్... ఫైర్
మూడుసార్లు ఫైర్ చేయమని ఆజ్ఞాపిస్తూంటే గార్డ్‌లంతా తమకి ఇవ్వబడ్డ డమ్మీ బుల్లెట్లని లోడ్ చేసి పేలుస్తారు. కానీ, మార్విన్ మూడోసారి స్ప్రింగ్ ఫీల్ తుపాకీని మామూలు బుల్లెట్‌తో లోడ్ చేసి కాలుస్తాడు. గుండు సరాసరి వెళ్ళి అతను చంపాలనుకున్న వ్యక్తి గుండెలో దిగబడుతుంది.

ఆ రైఫిల్ నంబర్ అతని కజిన్ లోగాన్ పేరుమీద రికార్డుల్లో ఉంది. లోగాన్ చాలా అశ్రద్ధ మనిషి. మార్విన్ తన రైఫిల్‌ను అతని రైఫిల్ స్థానంలో ఉంచి అతనిది దొంగిలించాడు. మిలటరీలో పనిచేసే వారు చిన్న విషయాల్లో అశ్రద్ధగా ఉండకూడదని, ప్రతీది పద్ధతి ప్రకారం చేయాలని ఆనర్ గార్డ్ కెప్టెన్ లోగాన్‌ను అనేకసార్లు హెచ్చరించాడు. రైఫిల్, పరిసరాలు, దుస్తులని శుభ్రంగా ఉంచుకోవడంలో లోగాన్ అశ్రద్ధగా ఉంటాడు.

మార్విన్ తన పక్కన నించున్న లోగాన్‌ను ఓరకంట చూసాడు. తమ అంకుల్ డేనియల్‌ని హత్య చేసిన గుండు ఏ రైఫిల్ నించి వచ్చిందో పరీక్షిస్తారు. గార్డ్‌ల దగ్గరున్న ఎనిమిది రైఫిల్స్ నించి పేల్చిన గుళ్ళతో ఫోరెన్సిక్ నిపుణుడు పరీక్ష చేసినప్పుడు అది లోగాన్‌దని తెలుస్తుంది. లోగాన్‌కి మరణశిక్ష తప్పదు. అప్పుడు తను అతని ఏభై లక్షల పెసో(కరెన్సీ)లకి వారసుడై జీవితాంతం అనుభవించచ్చు.

మార్విన్ చర్చి ఆవరణ ఎదురుగా ఉన్న ఇంటి బాల్కనీలో కూర్చున్న తను చంపబోయే తొంభై రెండేళ్ళ అంకుల్ డేనియల్స్‌ను చూసాడు. ఆయన కాళ్ళకి పక్షవాతం వచ్చాక గత రెండేండ్లుగా చక్రాల కుర్చీకి పరిమితమై పోయాడు. ఆయన కొడుకు హెన్రీ అకాల మరణం పొందడంతో ఆయన ఆస్తికి ఇక తను, లోగాన్‌లే వారసులు. ఒక్క గుండుతో ఆయన్ని, పోటీ వారసుడ్ని తొలగించే ఆలోచనని ఇచ్చిన తన భార్యని మనసులో మెచ్చుకున్నాడు.
గుండు తాకగానే ఆయన పక్కనే ఉన్న తన భార్య కెవ్వున అరుస్తుంది. ఆ అరుపులు విన్నాక అంతా తమ రైఫిల్స్‌ని వదిలి బాల్కనీలోకి కంగారుగా పరిగెత్తుతారు. తను కూడా లోగాన్ రైఫిల్‌ని నేలమీద పడేసి పరిగెత్తుతాడు. ఆ తర్వాత ఎవరి రైఫిల్‌ని ఎవరు వాడారో తెలుసుకోలేరు. సెరమనీలో భాగంగా అందరి చేతులకి తెల్లటి గ్లవ్స్ తప్పనిసరి కాబట్టి, వేలిముద్రలు కూడా ఉండవు. ఆ తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు ఆ గుండుని పేల్చిన రైఫిల్‌ని కనుక్కునే దాకా తను వేచి చూడాలి. లోగాన్ రైఫిల్‌లోని నిజమైన బుల్లెట్‌ని షెల్లి వాళ్ళు కనుగొంటారు.

తనకో లక్ష పీసోలు ఇవ్వమని అంకుల్ డేనియల్‌ను తన భార్య అడిగితే తిరస్కరించాడు. ఆ తిరస్కరణతోనే ఆయన తన చావుని తనే కొని తెచ్చుకుంటున్నాడు. ఇచ్చి ఉంటే తన భార్యకీ ఆలోచన ఖచ్చితంగా వచ్చేది కాదు. ఇప్పుడు డేనియల్‌ని చంపడం వల్ల లోగాన్‌కి వచ్చే సగం ఆస్తి లాభం. సాక్షాన్నిబట్టి అతనికి శిక్ష పడక తప్పదు. లోగాన్ తన లాభానికి డేనియల్‌ని చంపేంత అవివేకి అని అంతా అనుకుంటారు.
అకస్మాత్తుగా ప్రీస్ట్ సంప్రదాయంగా చెప్పే మాటలు ఆగిపోయాయి. కొద్ది క్షణాల తర్వాత ఆయన ఆఖరి మాటలు మాట్లాడాడు. వెంటనే కెప్టెన్ గట్టిగా అరిచాడు.

ఫైరింగ్ పార్టీ. అటెన్షన్
వెంటనే ఎనిమిది మంది అటెన్షన్‌లో నిలబడ్డారు.
అంతా రైఫిల్స్ ఛాంబర్లలో బ్లాంక్ కేట్రిడ్జ్‌లని లోడ్ చేసే శబ్దం వినిపించింది.
ఎయిమ్
ఎనిమిది మంది రైఫిల్ గొట్టాలని గాల్లోకి ఎత్తారు. ఐతే అవి సమాంతరంగా లేవు. కొన్ని డిగ్రీల తేడాతో ఉన్నాయి. ఆర్మీలోంచి రిటైరైన వారి గురిలో తేడాలుండటం సహజమే.
* * *

ఫైర్ కెప్టెన్ కంఠం గట్టిగా వినిపించింది.
ఎనిమిది రైఫిల్స్ ఒకేసారి డమ్మీ గుళ్ళని పేల్చిన శబ్దాలు ఢాం ఢాం అని వినిపించాయి. తర్వాత అన్ని రైఫిల్స్ కిందకి వాలాయి. మళ్ళీ ఇందాకటి కెప్టెన్ ఆజ్ఞలు వినిపించాయి.
లోడ్... ఎయిమ్...ఫైర్
మరోసారి రైఫిల్ పేలిన శబ్దాలు వినిపించి, అక్కడ తుపాకీ మందు వాసన అలుముకుంది. పెట్టెలోంచి మూడోసారి మార్విన్ తీసిన బుల్లెట్ ప్రాణాంతకమైంది. అది డమ్మీ కాదు. పేలగానే దూసుకు వెళ్ళే ఇనుపగుండు.
కెప్టెన్ ఆజ్ఞ వినగానే స్ప్రింగ్ ఫీల్ రైఫిల్‌లో దాన్ని లోడ్ చేసాడు.
ఎయిమ్
బాల్కనీలోని అతని భార్య మార్విన్ రైఫిల్ వంక ఉత్కంఠగా చూడసాగింది. పేలేప్పుడు అతని రైఫిల్ కొద్దిగా కిందకి వాలుతుందని ఆమెకి తెలుసు. మార్విన్ వేలు ట్రిగ్గర్‌మీద ఆజ్ఞకోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉంది. రైఫిల్ బటన్‌ను తన భుజానికి బలంగా ఆనించాడు.
ఫైర్
మార్విన్ వేలు ట్రిగ్గర్‌ను లాగిన మరుక్షణం అంకుల్ డేనియల్ తల ముందుకి వాలిపోవడం గమనించాడు. కొద్ది క్షణాల తర్వాత భార్య అరుపులు వినిపించడంతో తన గురి తప్పలేదని గ్రహించాడు.
* * *

గార్డ్ ఆఫ్ ఆనర్‌కి చెందిన ఎనిమిది మంది, ఇంకా యూనిఫారాల్లోనే షెరీఫ్ ఆఫీస్ బయట బెంచీలమీద కూర్చుని ఉన్నారు. బల్లమీద షెరీఫ్ ఉంచిన ఆ ప్రాణాంతక కేట్రిడ్జ్ వంక అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఒక్క మార్విన్ తప్ప. అతను కేవలం ఆశ్చర్యాన్ని నటిస్తున్నాడు.
ఇది డమ్మీ కాదు. లోగాన్! దీన్ని కాల్చిన రైఫిల్ నీది. నువ్వు కాల్చిన రైఫిల్‌లో దీన్ని ఎందుకు లోడ్ చేసావో చెప్తావా? షెరీఫ్ ప్రశ్నించాడు.
నాకు తెలీదు. కానీ, నేను లోడ్ చేసింది మాత్రం ఇది కాదు. డమ్మీ బుల్లెట్టే అని నాకు బాగా తెలుసు. ఎవరో నా రైఫిల్ దొంగిలించారు లోగాన్ తడారిన గొంతుతో చెప్పాడు.
ఇంకాసేపట్లో నీ రైఫిల్ నించి పేల్చిన గుండుతో ప్రాణాంతక గుండుని పోల్చి ఆ రెండూ ఒకే రైఫిల్ నించి కాల్చారో, లేదో తేలుస్తారు. అంతదాకా నువ్వు నిరపరాధివనే చట్టం భావిస్తుంది. కానీ, అది నీ రైఫిల్‌లోకి నీకు తెలీకుండా ఎలా వస్తుంది?
కానీ, వేలిముద్రల మాటేమిటి? నా రైఫిల్ దొంగిలించిన వ్యక్తి వేలిముద్రలు దానిమీద ఉంటాయి కదా? లోగాన్ అడిగాడు.
నువ్వు మూర్ఖుడిలా ఉన్నావే? అంతా గ్లవ్స్ వేసుకున్నారు కదా? వాటిల్లోంచి వేలిముద్రలు ఎలా పడతాయి? షెరీఫ్ అడిగాడు.

నా వేలిముద్రలు నేను ఉపయోగించిన రైఫిల్ మీద పడ్డాయి వెంటనే లోగాన్ అరిచాడు.
అంతా అతని వంక ప్రశ్నార్థకంగా చూసారు. వెంటనే అతను అందరికీ తన ఎడమచేతిని చూపించాడు. ఆ గ్లవ్ బొటన వేలి దగ్గర చిరిగి, వేలు బయటకి కనిపిస్తోంది.
నేను పట్టుకున్న రైఫిల్‌మీద ఈ వేలిముద్ర తప్పక ఉంటుంది. దాని నంబర్ చూడండి. అది ఎవరిదో తెలుసుకోండి. అది నా దగ్గరకి ఎలా వచ్చిందో, నాది అతని దగ్గరకి ఎలా వెళ్ళిందో విచారించండి. అప్పుడు హంతకుడు ఎవరో తెలుస్తుంది లోగాన్ సూచించాడు.
అసలు నువ్వు నియమాలకి విరుద్ధంగా చిరిగిన గ్లవ్‌ని ఎందుకు వేసుకున్నావు? కెప్టెన్ అరిచాడు.
తను పట్టుబడబోతున్నాడని, తన తుపాకీ లోగాన్ దగ్గర ఉంటే, అతనిది తన దగ్గరే ఉందనే నమ్మకం వల్ల, డేనియల్ని చంపడానికి తనకి గల బలమైన కారణం వల్ల జ్యూరీ సభ్యులు తను హంతకుడని తేలిగ్గా నమ్ముతారని, మార్విన్‌కి వెంటనే స్ఫురించింది.
(జార్జ్ ఫీల్డింగ్ ఇలియట్ కథకి స్వేచ్ఛానువాదం)

386
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles