పద్య రత్నాలు-3


Sun,May 19, 2019 02:05 AM

Uthama-samskaram

ఉత్తమ సంస్కారం

పర పురుషులన్న దమ్ములు
వరుడే దైవమ్ము తోడి పడుచులు వదినల్
మరదండ్రు నత్తమామలు
దరదల్లియు తండ్రియనుచు తలపు కుమారీ!

- కుమారీ శతకం

తాత్పర్యం:కొత్తగా అత్తవారింటికి వెళ్లే అమ్మాయికి ఉండాల్సిన ఉత్తమ సంస్కారాల్ని బోధించే పద్యమిది. భర్త మినహా పర పురుషులందరినీ అన్నదమ్ములుగా భావించుకోవాలి. తన భర్తే తనకు దైవసమానుడు. భర్త అక్కలూ, చెల్లెండ్లనూ తన అక్కాచెల్లెండ్లలానే తలచుకోవాలి. అలాగే, అత్తామామలను తల్లిదండ్రులుగా ఎంచుకొని మెలగాలి.

Pattu-dala-ante-eela-undali

పట్టుదల ఇలా ఉండాలి!

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టేనేని బిగియ బట్టవలయు
బట్టి విడుచుకన్న బరగ జచ్చుట మేలు
విశ్వదాభిరామ! వినురవేమ!

- వేమన శతకం

తాత్పర్యం:పట్టుదల అంటే ఎలా ఉండాలో చాలా చక్కగా చెప్పిన పద్యమిది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ముందే నిర్ణయించుకొని పట్టుదలకు సిద్ధం కావాలి. ఒకసారి పట్టు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విడవకూడదు. పట్టిన పట్టును మధ్యలోనే వదిలేయడమంటే మనిషి మరణంతో సమానం. అంటే, పట్టుదలకు అంత విలువ ఇవ్వాలన్నమాట.

Rama-nama-swaranama

రామనామ స్మరణకు వేళ ఇదే!

ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్
గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదో నాటి కిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!

- దాశరథీ శతకం

తాత్పర్యం:
శ్రీరామా! నిన్ను సేవించడానికి.. వృద్ధాప్యంలో యమభటులు వాకిట్లోకి వచ్చినప్పుడో, రోగం ఎక్కువైపోయి కఫం గొంతులో నిండినప్పుడో, బంధుగణం చుట్టూ మూగినప్పుడో.. నీ పేరు తలుస్తానో లేదో. కీర్తనలు, భజనలు చేస్తానో లేదో. అందుకే, ఆలస్యం చేయకుండా తక్షణం నీ సేవకు సిద్ధమవుతాను.

Sahanam-thone-vijaya

సహనంతోనే విజయం!

తడ వోర్వక, యొడ లోర్వక
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే
తడ వోర్చిన, నొడ లోర్చిన
జెడిపోయిన కార్యమెల్లజేకుఱు సుమతీ!

- సుమతీ శతకం

తాత్పర్యం:
కొన్ని సందర్భాలలో సహనం విజయాన్ని చేకూరుస్తుంది. ఎలాగో.. సుమతీ శతకకారుడు (బద్దెన) ఈ పద్యరత్నంలో చక్కగా చెప్పారు. ఆలస్యాన్ని, శరీర శ్రమను తట్టుకోకుండా తొందరపాటు ప్రదర్శించకూడదు. ఈ హడావుడిని తగ్గించుకొని, రెంటినీ తట్టుకొంటూ.. ముందుకెళ్లినప్పుడే చెడిపోయిన పనైనా సరే విజయవంతంగా పూర్తవుతుంది.

268
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles