మాతృదేవోభవ


Sun,May 12, 2019 01:22 AM

కోడికూయక ముందే లేచి వాకిలి ఊడ్చి, నీళ్లు చల్లి ముత్యాల ముగ్గులెట్టేది అమ్మ. పాచిగిన్నెలన్నీ కడిగి, అన్నం, కూరలు వండి పిల్లలకు పాలుపట్టి, స్నానం పోసి, బట్టలువేసి కడుపునిండా బువ్వపెట్టి స్కూలుకు పంపేది అమ్మ. ఇంటి పనులన్నీ చేసుకుని డ్యూటీ నుండి వచ్చిన భర్తకు, స్కూల్‌నుండి వచ్చిన పిల్లలకు సపర్యలు చేసేది అమ్మ. పిల్లలకు హోంవర్క్ చేయించి, అన్నం పెట్టి లాలించి నిద్రపుచ్చేది అమ్మ. కష్టమొచ్చినా నష్టమొచ్చినా కనురెప్పల మాటున కన్నీటిని
దాచి కుటుంబాన్ని తీర్చిదిద్దేది అమ్మ. పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు అన్నీ తానై కుటుంబాన్ని నడిపిస్తుంది అమ్మ. అన్నీ అమ్మయినప్పుడు కుటుంబపాలన పగ్గాలు అమ్మ చేతికిస్తే..? మే 12 మాతృదినోత్సవం సందర్భంగా మాతృస్వామ్య వ్యవస్థపై కవర్‌స్టోరీ కథనం.

-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, రేణుకా ఎల్లమ్మ, జోగులమ్మ, గంగమ్మ ఒక్కో వూళ్లో ఒక్కొక్క పేరుతో వెలిగే గ్రామదేవతలకు మన ప్రాచీన చరిత్రతో సంబంధం ఉంది. అప్పట్లో మన సమాజంలో మాతృస్వామ్యం అమలులో ఉండేది. మాతృస్వామ్యం అంటే కుటుంబంలో పెత్తనం తల్లిది. అన్ని నిర్ణయాలకూ ఆమె అధికారిణి. కుటుంబ పెద్ద తల్లి కాబట్టి ఆనాటి సమాజంలో సహజంగానే దేవతలూ ఆడవాళ్లయ్యారు. హరప్పా, మొహంజొదారో సహా ప్రపం చ ప్రసిద్ధ నాగరికతలన్నీ మాతృస్వామ్య వ్యవస్థలుగానే మొదలయ్యాయని చరిత్ర చెబుతున్నది. అంటే ఈ నాగరికతకు మహిళే ఆద్యురాలు.నాగరికతకు పురుషుడు బీజం వేస్తే స్త్రీ క్షేత్రంగా వర్ధిల్లింది. నిజానికి ఆదిలో, ప్రకృతే ఆమెకు ఆ పట్టం కట్టింది. కానీ ఆ తర్వాత మాతృకేంద్రక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసి వాటి అస్తిత్వాన్ని నాశనం చేసి పురుషస్వామ్య వ్యవస్థ లు విస్తరించాయి. పురుషుడిలో స్వార్థం పెరిగేకొద్దీ మాతృస్వామ్యానికి బీటలు పెరిగాయి. క్రమంగా పురుషాధిపత్యానికి తలవంచి మాతృస్వామ్యాలు తెరమరుగయ్యాయి.
MothersDay

అన్నీ తానై...

మానవజగతికి బీజం వేసింది పురుషుడే కావచ్చు కానీ ప్రాణం పోసింది స్త్రీ. కడుపులో మరో జీవి రూపుదిద్దుకునేది మొదలు స్త్రీ మాతృత్వాన్ని స్వయంగా అనుభవిస్తుంది. ఆ అనుభూతికోసం ఆరాటపడుతుంది. తనలో పెరుగుతున్న భారాన్ని బాధ్యతగా భావిస్తుంది. పురిటినొప్పుల బాధను పంటిబిగువున ఒడిసిపట్టుకుని మరోజీవికి జన్మనివ్వడమే కాదు తను మరో జన్మనెత్తుతుంది. పుట్టిన బిడ్డను అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ కడుపునింపడానికి తన రక్తాన్నే పాలధారలు చేస్తుంది. ఊరడించడానికి చేతుల్నే ఊయల చేస్తుంది. నిద్ర పుచ్చడానికి పరుపు దిండవుతుంది. జోకొట్టడానికి జోలపాటవుతుంది. తడబడే అడుగులకు వేలుపట్టి ఆసరా అవుతుంది. వచ్చీరాని మాటలకు మాతృభాషవుతుంది. పిల్లల ఆలనకోసం సంచార జీవితానికి స్వస్తిచెప్పి స్థిరత్వానికి మళ్లించింది ఆమెనే. వారిని ఆడించడానికి ఆటవస్తువుల రూపంలో కొత్త ఆవిష్కరణలకు జీవం పోసింది ఆమెనే. మరి నాన్న? అ భావ న ఒక నమ్మకం. నిజానికి అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు. అవును, బిడ్డ స్త్రీకి జన్మిస్తాడు కాబట్టి అతను తన తల్లిని గుర్తిస్తాడు. తల్లే తండ్రిని బిడ్డకు చూపుతుంది. పితృత్వం ఎప్పుడూ పరోక్ష అనుభూతే. మగవారిది కుటుంబంలో పెద్దపాత్రే. కానీ పెద్దగా బాధ్యతలు లేని పాత్ర. పూర్వం పాలనలో ఆయన నిమగ్నమై ఉంటే కుటుంబపాలననంతా తన భుజాలపై మోసి పిల్లల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధ్దులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన బాధ్యతలను అమే చేపట్టింది. ఒక్కోసారి యుద్ధభూమిలోనూ కత్తి చేపట్టి కాలుదువ్వింది కూడా అమెనే. అలసివచ్చిన ఆయనకు కొంగుపరిచి సేదతీర్చి కొత్త ఉత్తేజాన్ని నింపింది అమెనే. మగాడు ఆమె ప్రేమను బలహీనతగా భావించాడు. ఆమె చేసే సపర్యలన్నీ ఆమె అశక్తతకింద లెక్కేశాడు. ఒక్కొక్కటిగా... పాలనా పగ్గాలన్నీ చేజిక్కించుకుని తనే పాలకుడై కూర్చున్నాడు. ఆమె కూడా పురుషాధిపత్యానికి తలవంచి ఆయన వెనుకే నిలబడి పోయింది.

ప్రాధాన్యం తగ్గలేదు

కాలం మారుతున్నా, తరాలు అంతరిస్తున్నా మగవాడు స్త్రీని ఒక వస్తువుగా మాత్రమే చూస్తున్నా ఆమె ప్రాధా న్యం, పాత్రా ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉండిపోయాయి. బిడ్డలను పెంచి, పోషించి వాళ్ళను తీర్చిదిద్దేది నిస్సందేహంగా తల్లే. అందుకే తల్లిని తొలి గురువు అని కూడా అంటారు. తల్లిని బట్టే బిడ్డల పెంపకం ఉంటుందనేది నిజం. అందుకే మాతృదేవోభవ అని ముందు స్త్రీకే అంతటి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక భారతదేశం కర్మభూమి. భారతమాతను మనం ఎంత అభిమానించి ఆరాధిస్తామో అలాగే భారత స్త్రీని కూడా మనం పూజ్యనీయ దృష్టితోనే చూస్తాం. స్త్రీకి ఈ దేశంలో ఇచ్చే గౌరవం, సమానస్థాయి మరే దేశంలోనూ సాటిరావు.

ఏం సాధించాడు?

ఒకటి కాదు, రెండు కాదు వేల సంవత్సరాల నుంచీ మగాడు కుటుంబాన్ని, ప్రపంచాన్ని అన్నీ తానై పాలిస్తున్నాడు. తన పాలనలో తను సాధించిందేమిటీ? ఇప్పటికీ బతుకునిండా బాధలే. అడుగడుగునా అవాంతరాలే. ఆయన పాలనలో ఎవరికీ రక్షణలేదు. అమ్మ కడుపులోని ఆడపిల్ల సురక్షితంగా భూమిమీదా పడుతుందన్న నమ్మకం లేదు. పుట్టిన పువ్వు ఫలవంతమై చివరిదాకా మనుగడ సాగిస్తుందన్న విశ్వాసమూ లేదు. అడుగడుగున కాచుకు కూర్చునే గుంటనక్కలెన్నో. జీవితమంతా అనుమానపు చూపులే. రోజూ ఏదో చోట లైంగిక దోపిడీ అర్తనాదాలే. భ్రూణహత్యల వివాదా లే. కడుపులో ఉన్నది ఆడపిల్ల ఐతే చాలు ఏ చెత్తబుట్టలోనో, మురికి కుంటలోనో దర్శనమివ్వాల్సిందే. ఇదీ పితృస్వామ్యపు పాలనలో రోజూ కనిపించే దృశ్యాలు. మొత్తమ్మీదా పితృస్వామ్య వ్యవస్థలో ఆడజాతికి రక్షణ లేకుండా పోయిందన్నది వాస్తవం. మాతృస్వామ్యం లో ఇలాంటివి మచ్చుకైనా కనిపించవు. ఆడవారికి, మగవారికి సమాన గౌరవం ఉంటుంది. ఆడవారే పాలకులైతే ఆ కుటుంబం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందన్నది సామాజికవేత్తల అభిప్రాయం.

ఇప్పటిదేం కాదు

మాతృస్వామ్యం ద్రావిడ సంప్రదాయమనీ, పితృస్వామ్యం ఆర్య సంప్రదాయమనీ సంప్రదాయవాదుల అభిప్రాయం. ఆర్యుల ప్రవేశం మూలంగానే మాతృస్వామ్యానికి గడ్డుకాలం మొదలైందనేది వారి వాదన. అప్పుడున్న మాతృస్వామ్య పాలనలో శాతవాహనులను గురించి చెప్పుకోవాలి. ఆ వంశంలో ముఖ్యులైన శాతకర్ణి, పులోమావిలు ఇద్దరూ కూడా తమ తల్లుల పేర్లు తమపేర్ల ముందు చేర్చుకున్నారు. తద్వారా గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీపుత్ర పులోమావిలుగా స్థిరపడ్డారు. అయితే వారి తర్వాత మాతృస్వామ్యం కుప్పకూలిపోయిందనడానికి ఉదహరణగా అదే వంశానికి చెందిన మరో సుప్రసిద్ధ పాలకుడు హాలుడు తల్లిపేరును చేర్చుకున్న దాఖలాల్లేవు. మహాభారత కాలంలో కొంతమేర మాతృస్వామ్యం ఉందన్నది పరిశోధకుల అభిప్రాయం. కురుక్షేత్ర యుద్ధం తర్వాత, పాండవులు అశ్వమేధయాగం చేస్తారు. అర్జునుడు యాగాశ్వంతో బయల్దేరతాడు. ఆ గుర్రం స్త్రీమండలమైన ప్రమీల రాజ్యానికి చేరుతుంది. అది పురుషుల్లేని రాజ్యమని పేర్కొన్నారు. అయితే పూర్తిగా పురుషులు లేరని చెప్పలేం. కానీ అక్కడి పురుషులకు అధికారాలు లేవని భావించవచ్చు. అయితే ఇక్కడ అర్జునుడు ప్రమీలతో యుద్ధం చేయడం, ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుంటాడు. వీటితోపాటు కేరళలోని ట్రావన్‌కోర్ రాజవంశంలో అమ్మాయిలు లేనందున మహిళా వారసత్వాన్ని కొనసాగించడానికి 800 సంవత్స రాల్లో 8మంది బాలికల్ని దత్తత తీసుకుందీ వంశం.

మాతృస్వామ్యం బతికే ఉంది

నిజానికి మాతృస్వామ్యం పూర్తిగా కనుమరుగైందా అంటే లేదనే చెప్పాలి. అది ఎక్కడో కాదు మన దేశంలోనే. అవును మేఘాలయలో. ఖాసీలు, గారోలు, జయంతియాలు మేఘాలయలోని ప్రధాన తెగలు. ఇక్కడి గిరిజన తెగల వారు మాతృస్వామ్యం అనుసరిస్తారు. దీంతో వారసత్వం, వంశావళి తల్లుల ద్వారా వస్తుంది. ఖాసీ, జయంతియా గిరిజన తెగల వారు సంప్రదాయ మాతృస్వామ్యాన్ని పాటిస్తారు. గారో వంశావళిలో అందరికన్నా చిన్న కూతురికి కుటుంబ ఆస్తి స్వాభావికంగా చెందుతుంది. అప్పుడు ఆమెను నొకనా అంటారు, అంటే ఇంటి కోసం అని అర్థ్ధం. మాతృపాలన క్రమక్రమంగా మైదానప్రాంతాల్లో కనుమరుగైనా, పచ్చని అడవుల్లో అచ్చమైన మనుషుల మధ్య ఇంకా బతికే ఉంది. అక్కడి ప్రజలు, ఎంతో తృప్తిగా, సంతోషంగా ఉన్నారు. పితృస్వామ్య సమాజంలో మహిళ స్థానం అట్టడుగునే ఉంది. ఆమెకు తీవ్ర వివక్ష ఎదురవుతూ ఉంది. కానీ మాతృస్వామ్యంలో అలా కాదు. పురుషుడికెప్పుడూ తగిన గౌరవం ఉంటుంది. ఇతర వ్యవహారాలన్నీ మగవారు చూసుకున్నా ఆలనాపాలనా మాత్రం తన చేతిలో ఉంచుకుంటుంది. తల్లి ఇంటిపేరే పిల్లల పేర్ల చివరన చేరుతుంది. ఆస్తిపాస్తులకు అమ్మాయిలే అసలు వారసులు. పురుషుడికి ఆస్తి హక్కు ఉండదు. అయినా సరే. మగవారి పట్ల వివక్ష, వేధింపులు వంటివి కనిపించవు. అంతేకాదు వారిలో అప్పుల బాధలు అసలు ఉండవు.

మేం మేముగా...

మాతృస్వామ్య వ్యవస్థను కోరుకోవడానికి చాలా కారణాలున్నాయి. అనేక సంవత్సరాలుగా వివక్షకు గురికావడం, మహిళను ద్వితీయశ్రేణిగానే చూడడం ఒక కారణమైతే, సమాజంలో మగవారితో హింసకు గురైనవారు, అవమానాలకు గురైనవారు మగవారి ప్రమేయం లేని పాలనను కోరుకుంటున్నారు. ఏ రంగంలోను మేం తక్కువ కాదంటూ అనేక రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్నారు. అందులోనూ మగవారి సాయం, వారితోడు లేకుండా. అంతేకాదు. వారికంటూ ప్రత్యేక వ్యవస్థలనూ ఏర్పా టు చేసుకుంటున్నారు. పురుషాధిక్య సమాజానికి సమాంతరంగా... మహిళతో, మహిళ కోసం మహిళలే ఏర్పాటు చేసుకుంటున్న ఆధునిక వ్యవస్థలూ చాలానే ఉన్నాయి. దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇవెన్ కార్గో సంస్థలో అయితే అందరూ మహిళా ఉద్యోగులే. ఇవేకాదు ఇప్పటికే షీ ఆటోలు, టాక్సీలు, బస్సులు ప్రయాణాలంటే ఇష్టపడే మహిళల కోసం షి-ట్రావెల్ గ్రూపులూ పుట్టుకొస్తున్నాయి. ఈ వ్యవస్థలన్నీ పురుషాధిపత్యానికి సవాలే!

మదర్ మార్కెట్

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఇమా కీథెల్ మార్కెట్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ మార్కెట్‌లో బట్టల దగ్గరి నుంచి బ్యాగుల దాకా, స్నాక్స్ నుంచి సబ్జీ దాకా అన్నింటినీ మహిళలే అమ్ముతారు. మార్కెట్లోకి మగవ్యాపారులకు ప్రవేశం లేదు. ప్రతీ రోజూ సుమారు 5 వేల మంది మహిళలు రకరకాల వ్యాపారాలు చేసే ఇమా కీథెల్ (ఇమా అంటే తల్లి, కీథెల్ అంటే మార్కెట్) చరిత్ర ఇప్పటిది కాదు... సుమారు 500 ఏళ్ల నాటిది. ఆసియాలోనే అతిపెద్ద మదర్ మార్కెట్‌గా చెప్పుకునే ఇమాకు ఘనమైన చరిత్ర ఉంది. అప్పట్లో ఇంఫాల్, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మగవాళ్లు యుద్ధాల్లో పాల్గొనేందుకు, పనికోసం వేరే ప్రాంతాలకు నెలల తరబడి వెళ్లేవారట. దాంతో అక్కడి పొలాలు, ఇంటి బాధ్యతలను మహిళలే చూసేవారు. క్రమక్రమంగా పొలాలనుంచి వచ్చినవాటిని, ఇంట్లో తయారుచేసిన వస్తువులను మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మేవారు. ఆ విధంగా నెమ్మది నెమ్మదిగా ఇమా మార్కెట్లో వారిదే పైచేయిగా మా రింది. ఇక్కడ షాపు పెట్టాలంటే పెళ్లయిన మహిళలకే అవకాశం ఉంటుంది. ఆ షాపును తల్లి నుంచి గానీ అత్త నుంచి గానీ వారసత్వంగా తీసుకుంటుంటారు.

సమానత్వమెక్కడా?

ఒక దేశ ఆర్థికపరమైన, చట్టపరమైన అంశాలనూ.. అలాగే ఉద్యమ స్వేచ్ఛ, ప్రసూతి, ఆస్తి నిర్వహణ, గృహహింస వంటి ఇతర అంశాల్లోనూ గత పదేళ్ల గణాంకాలను ప్రపంచబ్యాంక్ పరిశీలించి ఒక నివేదికను విడుదల చేసింది.మహిళలు,వ్యాపారం, చట్టంఅనే పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 187 దేశాల్లో లింగబేధం లేకుండా పూర్తి సమానత్వాన్ని ఆరుదేశాలు మాత్ర మే ఇస్తున్నాయి. లాత్వియా, లక్సంబర్గ్, స్వీడన్, బెల్జియం, ఫ్రాన్స్, డెన్మార్క్ మాత్రమే స్త్రీలకు హక్కులను ఇస్తూ చట్టాలు చేశాయని ఈ నివేదిక చెబుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంది మహిళలు మాత్రమే సమాన హక్కులను పొందగలుగుతున్నారని నివేదిక స్పష్టం చేసిందంటే ఆడవారి హక్కులెలా హరించబడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

నమ్మకం కోల్పోతున్నారు

మన దేశంలో కార్పొరేట్ రంగంలోనూ మగవారితో పోలిస్తే ఆడవారికే ప్రాధాన్యం పెరుగుతుందన్నది కాదనలేని నిజం. ఇది ఒక రకంగా మాతృస్వామ్యం బలపడుతుందనడానికి నిర్వచనంగా చెప్పుకోవచ్చు. దేశంలోని ప్రముఖ బ్యాంకులన్నింటికీ నిన్న మొన్నటి వరకు మహిళలే ప్రాతినిథ్యం వహించారు. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు, సంస్థలు వారి చేతుల్లోనే ఉన్నా యి. అరుంధతీ భట్టాచార్య, శిఖాశర్మ, వినితాబాలి , ఏక్తాకపూర్, ఇంద్రనూయి, నీలం థావన్, అనన్య బిర్లా, రాఖీ కపూర్, రోష్నినాడర్ ఇలా ఎందరో మాతృమూర్తులు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంస్థలు మార్కెట్‌ను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయంటే అతిశయోక్తికాదు. ఆయా యాజమాన్యాలు ఎందరో పురుషుల్ని పక్కన పెట్టి వారి చేతికి పగ్గాలిచ్చాయంటే వారిలో నైపుణ్యం, మనోనిబ్బరం, పనితనంలో పరిణతి, పనిచేయాలనే సంక ల్పం ఎక్కువని గుర్తించాయన్నది వాస్తవం. ఆయా సంస్థలన్నీ లాభాల బాటలోనే నడుస్తున్నాయంటే మాతృస్వామ్య వ్యవస్థ ఎంత బలంగా పనిచేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.

ఏమో గుఱ్ఱం ఎగురవచ్చు

కాలచక్రం తిరుగుతూ తిరుగుతూ మళ్లీ పూర్వకాలానికే వచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు. అప్పుడు ఈ వ్యవస్థలో ఒక గొప్ప మార్పు వస్తుంది. అవును ఒకప్పుడు మాతృస్వామ్యం. ఆ తర్వాత పితృస్వామ్యం. మళ్లీ మాతృస్వామ్యం రాదని నమ్మకం ఏంటీ? ఇప్పటికే ఈ మార్పుకు పునాది పడుతున్నది. మన స్కూల్ పిల్లల ప్రొగ్రెస్ కార్డు మీదా ఒకప్పుడు తండ్రి పేరు మాత్రమే ఉండేది. ఇప్పుడు తల్లి, తండ్రి ఇద్దరి పేర్లూ ఉంటున్నాయి. కొన్ని రాష్ర్టాల్లో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాలు ఆడవారి పేరుమీదే ఉంటుంది. అంతెందుకు మన తెలంగాణ సర్కార్ రేషన్ కార్డుల స్థానంలో ప్రవేశపెట్టిన ఆహార భద్రతా కార్డులను ఇంటి యజమాని పేరుపై కాకుండా ఆడవారి పేరుతో ఇచ్చారు. ఫుడ్‌కార్డు హోల్డర్ ఇంటి యజమాని కాకుండా ఇంటి ఇల్లాలు అవుతుంది. ఎందుకంటే ఆడవారి పేరుతో ఇవ్వడం వల్ల వారి కుటుంబానికి రక్షణగా ఉంటుందని, సరుకులు వృథా కావన్నది ప్రభుత్వ ఆలోచన.
గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు మహిళా నాయకత్వంలోనే మనుగడ సాగిస్తున్నాయి. భర్త ఇతర పనుల్లో లీనమైతే ఇంటి పనులతోపాటు కూలీలను పిలవడం, వ్యవసాయ పనులు చేయించడం, పండిన ధాన్యాన్ని ఇంటికి చేర్చడం, ఆ తర్వాత మార్కెట్‌కు తరలించడం వంటి పనులన్నీ మహిళలే చూస్తున్నారు. ఆర్థిక చెల్లింపులు, వసూళ్లు అన్నీ ఆమెనే చూస్తున్నది. అలా మహిళా నాయకత్వంలో ఉన్న ప్రతి కుటుంబమూ ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకుంటుంది. అంటే, ఆమె నాయకత్వాన్ని ఆ కుటుంబం ఆమోదించిందనే కదా! అన్ని రకాల కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో అమ్మ ముందుంటున్నపుడు సమాజంలోని రుగ్మతల పరిష్కారం కూడా అమ్మతోనే సాధ్యమన్నది వాస్తవం. పక్కదారి పడుతున్న బిడ్డలను సక్రమమార్గంలో నడిపించడం, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్డడం కూడా ఆమెతోనే అవుతుంది. అందుకే ఆమె చేతికి పగ్గాలిస్తే గొప్ప మార్పు సాధ్యమన్నది వాస్తవం. ఆ పగ్గాలు కూడా నాన్నే స్వయంగా ఇస్తే ఎంత బావుంటుందో.

మగవారే లేని గ్రామం

ఉత్తర కెన్యాలోని సాంబూర్ ప్రాంతంలో యుమోజా గ్రామం ఉంది. 1990లో రెబెక్కా లొలోసోలి అనే మహిళా నాయకత్వంలో ఓ 15 మంది బాధిత మహిళలు ఈ గ్రామా న్ని ఏర్పాటు చేశారు. వారిలో ఎక్కువమంది బ్రిటన్ సైనికుల అత్యాచారాలకు గురై భర్తల నుంచి వేధింపులు ఎదుర్కొన్నవారే. ఆ గ్రామం ఏర్పడి ఇప్పటికి పాతిక సంవత్సరాలయింది. మగవారి తోడు, నీడ అవసరం లేకుండా ఇంతకాలం స్వతంత్రంగా బతికామన్న ఆనందంలో వారు గతంలో గ్రామం వార్షికోత్సవాలను కూడా జరుపుకున్నారు. గ్రామం ఏర్పాటైన సంవత్సరం మినహా వారికి తేదీలు, నెలలు గుర్తులేవు. 15 మందితో మొదలైన యుమోజి గ్రామంలో ఇప్పుడు 47 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నారు. పిల్లల్లో కొంతమంది బాల్య వివాహాలకు బలై వచ్చిన వారు కాగా, ఎక్కువ మంది ఈ 47 మంది మహిళల పిల్లలే. రకరకాల మగవాళ్ల వేధింపులతో ఈ గ్రామానికి చేరుకున్న తమలో ఎవరికి మళ్లీ పెండ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదని, చేసుకునే ప్రసక్తే లేదంటూ అక్కడి ఆడవారు చెబుతారు. ఇక తమ పిల్లలను మాత్రం వారి ఇష్టానికే వదిలేస్తున్నామని, పెండ్లి చేసుకుంటే మాత్రం వారు ఊరిడిచి వెళ్లి పోవాల్సిందేనంటారు. పర్యాటకుల కోసం గ్రామస్థులు ప్రధానంగా పూసలతో చేసిన గాజులు, నగలను, వెదురు చాపలను పర్యాటకులకు విక్రయించడం ద్వారా లభించే ఆదాయంతో వీరు జీవిస్తున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉండే ఓ నది పక్కన వారు ఓ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ విడిది చేసే పర్యాటకుల కోసం వారు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. యునిటి పేరిట మరో కుగ్రామంలో వంటచేసి పెడతారు. సమీపంలోని పర్వత ప్రాంతాల్లో విహరించాలనుకునే వాళ్లకు గైడ్‌గా వ్యవహరిస్తారు. గ్రామస్థులు స్థానిక ప్రభుత్వంపై పోరాటం జరిపి ఊరికి ఓ ప్రాథమిక పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా తమకు భూములపై హక్కులు కావాలని గ్రామంలోని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో భూములపై హక్కులు మగవాళ్లకే ఉంటాయి. యుమోజిఉమెన్.నెట్ పేరిట గ్రామస్థులకు వెబ్‌సైట్ కూడా ఉంది.
MothersDay1

తల్లిపాలన రావాలి

తల్లి అంటే అలనా చేస్తది, పాలన చేస్తది అంటారు. ఆ తల్లే పాలన కూడా చేస్తే కుటుంబం, యథావిధిగా సమాజం మానవీయం అవుతుంది. ఒకప్పుడు సమస్వా మ్యం రావాలని అనుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు మాతృస్వామ్యం రావాలనే కోరుకుంటున్నాం. మాతృస్వామ్యం వస్తే ఇప్పుడు జరుగుతున్న వికృతాలు, అత్యాచారాలు, అమానవీయ ఘటనలు తగ్గిపోతాయి. ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది. మాతృపాలనను ఆలోచించాలి. కుటుంబం, సమాజం అమ్మపాలనను ఆమోదించాలి. అందరూ మాతృస్వామ్యాన్ని ఆపాదించుకోవాలి.
-అనిశెట్టి రజిత, స్త్రీవాద రచయిత్రి

మహిళలకు మాత్రమే

ఫిన్లాండ్ తీరంలో అందమైన ఓ ద్వీపం ఉంది. దాని విస్తీర్ణం 8.4 ఎకరాలే! పచ్చదనంతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ఈ ద్వీపం పేరు సూపర్‌షీ. పేరుకు తగ్గట్టే ఈ దీవిలోకి మహిళలను మాత్రమే అనుమతిస్తారు. క్రిస్టియానా లోథ్ అనే మహిళ ఈ దీవిని అభివృద్ధి చేసింది. ఇందులోకి ప్రవేశించాలంటే ముందుగా సూపర్ షీ గ్రూపులో సభ్యత్వం తీసుకోవాలి. తర్వాత క్రిస్టియానా లోథ్ నిర్వహించే ఇంటర్వ్యూలో విజయం సాధించాలి. అప్పుడే దీవిలోకి ప్రవేశం లభిస్తుంది. సూపర్ షీ ద్వీపంలో అందమైన కాటేజీలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే మహిళామణుల కోసం యోగా, మెడిటేషన్, తోటపని తదితర కార్యకలాపాలు రూపకల్పన చేశారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సూపర్ షీ దీవి గత ఏడాది జూన్‌లో ప్రారంభమైంది.
MothersDay2

సమానన్యాయం జరుగుతుంది

పురుషులకంటే స్త్రీల వ్యక్తిత్వమే గొప్పది. పితృస్వామ్యం కంటే మాతృస్వామ్యమే గొప్పదని నమ్ముతాను. స్త్రీ ఇంట్లో అన్ని రకాల పనులు చేయాలి. అదే పురుషుడు తాగుడు, జల్సాలు, అవసరమైతే ఎన్ని పెండ్లిళ్లయినా చేసుకుంటాడు. అదే స్త్రీ ఒకరిని మాత్రమే స్వీకరిస్తుంది. ఒక స్త్రీ విద్యావంతురాలయితే మరో పదిమందిని ఎడ్యుకేట్ చేయగలదు. ఇంట్లో తల్లి విద్యావంతురాలయితే ఆ కుటుంబం సమాజంలో గౌరవాన్ని పొందుతుంది. స్త్రీ సమాజాన్ని జాగృతం చేయగలదు. స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు అని మాట్లాడుకోవడం తప్ప ఎక్కడావారికి హక్కులు లేవు. అన్ని పనులు చేసే ఆడపడుచు కుటుంబ పాలన బ్రహ్మాండంగా చేయగలదు. ఆమె పాలనను పురుషుడు అంగీకరించాలి. స్త్రీ పాలనలో అందరికీ న్యాయం జరుగుతుంది. అందరికీ సమాన హక్కులు కలుగుతాయి. ఆడవారే మగవారి గురించి కూడా ఆలోచించగలుగుతారు. కనుక మాతృస్వామ్య పాలన రావడం అత్యవసరం.
-భూపాల్, రచయిత

సమానత్వం కావాలి

మాతృస్వామ్యం పితృస్వామ్యం అని కాకుండా సమానత్వం కావాలని కోరుకుంటా. అందరూ సమానంగా ఉంటే ఏ స్వామ్యమైనా ఒక్కటే. అయితే మాతృస్వామ్యంలోని మంచి లక్షణాలను ఆచరించడం మంచిదే. పితృస్వామ్యంలో పవర్‌ను డామినేషన్‌గా చూస్తారు. అయితే పవర్ అనేది అందరి మంచిని కోరుకుంటుంది. పవర్ అనేది డామినేషన్ అయితే ఏ స్వామ్యమైన వృథానే. ఒకవేళ మాతృస్వామ్యం వస్తే స్త్రీలు కూడా పవర్‌ను డామినేషన్‌గా చూసే మూసలో పడితే పాలనలో ఎలాంటి మార్పు ఉండదు. అందుకే సమిష్టి బాగుకోసం చూసే పవర్ కావాలి. అలా అందరూ కలసి ముందుకు సాగాల్సిందే.
-విమల కొల్లాపూర్, స్త్రీవాద రచయిత్రి

యోగ్యకర్తలో మహిళా విప్లవం

ఇండోనేషియాలో కూడా మహిళా శక్తి చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జావా ద్వీపంలో సుందర ప్రదేశం యోగ్యకర్త! స్వయంప్రతిపత్తి కల్గిన ఈ ప్రావిన్సుకు రాజు.. సుల్తాన్ హామెన్‌కుబువాంగ్. రాణి.. గస్తి కాంజెంగ్ రాతు హేమాస్. 1945లో డచ్ వారిపై పోరాడినందుకు గౌరవ సూచకంగా యోగ్యకర్త సుల్తానులే ప్రావిన్స్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రాజవంశాన్ని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు. ప్రస్తుత సుల్తాన్ హామెనుకు అబ్బాయిలు లేరు. ఇద్దరూ అమ్మాయిలే! వారిని యువరాజుల్లాగే పెంచారు! వారిని యూరప్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదివించారు. ఆయన తదనంతరం యోగ్యకర్త సుల్తాన్ తన పెద్ద కూతురేనని ఆయన ఇప్పటికే సంకేతాలిచ్చారు. రేపో మాపో పెద్దకూతురు మాంగ్ కుబుమిని తన వారసురాలిగా ప్రకటించి.. యోగ్యకర్త మహారాణిగా సింహాసనం మీద కూర్చోబెట్టనున్నారు. మరి ఆమె పట్టాభిషేకానికి సిద్ధంగా ఉందా? అంటే ఉన్నా అనే అంటుందామె. నేను, నా చెల్లి అదృష్టవంతులం. ఇది అమ్మాయిల పని అని ఏనాడూ మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచలేదు. మేం పదవులకు బానిసలం కాదు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అంటున్నారు యువరాణి మాంగ్‌కుబుమి.
MothersDay3

ఇవేకాదు, టిబెట్ సరిహద్దుల్లోని మొసూవో, ఇండొనేషియాలోని మినంకబు, ఘనాలోని అకన్, కోస్టారికాలోని బ్రిబ్రి - ఇలా ఏ వ్యవస్థను తీసుకున్నా పురుషాధిపత్య సమాజాలతో పోలిస్తే, ఇక్కడే పురుషులు సంతోషంగా ఉన్నారు. మహిళలైతే ఆనందానికీ ఆత్మవిశ్వాసానికీ ప్రతీకలుగా కనిపిస్తారు.మగవాడు పట్టువిడుపులు పాటించి...మాతృస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించుకోగలిగితే, మానవ వికాస చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైనట్టే.

1213
Tags

More News

VIRAL NEWS