ఆపరేషన్ కుకూన్ వీరప్పన్ ఎన్‌కౌంటర్


Sun,May 12, 2019 01:08 AM

తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లోని సత్యమంగళం అడవులను కేంద్రంగా చేసుకుని మూడు దశాబ్దాలకు పైగా ఎర్రచందనం, ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఎదిగిన వాడు కూసె మునిస్వామి వీరప్పన్ ఆలియాస్ గంథపు చెక్కల వీరప్పన్. అతన్ని పట్టుకునేందుకు 1991లో పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఇది 23 సంవత్సరాల పాటు సాగి 2004లో వీరప్పన్ ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. ఆపరేషన్ కుకూన్ పేరుతో సాగిన ఈ వేట రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అధికంగా ఖర్చయిన ఆపరేషన్ గా నిలిచింది.

-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

అది 2003..

వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ పోర్స్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇలాంటి సమావేశాలు రెండు దశాబ్దాలుగా వందలసార్లు జరిగాయి. కానీ ఇది అత్యంత కీలక సమావేశం. ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ నాయకత్వంలో సాగిన అంతర్గత సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరప్పన్‌కు కొట్టిన పిండి వంటి సత్యమంగళం అడవుల్లో ఆయనతో తలపడడం అంటే కొరివితో తలగోక్కోవడమే అనేది అప్పటికే చాలాసార్లు రుజువైంది. అందుకే ఈసారి ప్లాన్ మార్చాలనుకున్నారు. అది అమలు కావాలంటే వీరప్పన్‌ను అడవి బయటకు రప్పించడం ఒక్కటే మార్గం అన్నది అందరీ నిర్ణయం.
VEERAPPAN

జనవరి, 2004

వీరప్పన్‌ను పట్టుకునేందుకు వ్యూహాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధమైంది. టాస్క్‌పోర్స్ అడవి మీదా దృష్టిపెట్టడం మానేసి, అడవి నుండి బయటకు వచ్చే అతని అనుచరులపై దృష్టి సారించింది. ఎక్కువకాలం వేచి చూడకుండానే ఒక సాయంత్రం వారి పని సులువైంది. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తతో వీరప్పన్‌కు ఎంతోకాలంగా సన్నిహిత పరిచయముంది. దీంతో ఆ పారిశ్రామికవేత్తపై పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు అనుమానించినట్లే వీరప్పన్ వర్గంలోని గూఢచారి ఒకరు పారిశ్రామికవేత్తను కలుసుకునేందుకు ఒక హోటలుకు వచ్చాడు. ఆ గూఢచారి వెళ్లిపోగానే కమెండో దళాలు పారిశ్రామికవేత్తను చుట్టుముట్టాయి. అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు అతన్ని ఎస్టీఎఫ్ కార్యాలయానికి తరలించారు. ఎన్నో హామీల అనంతరం అతను నోరువిప్పాడు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం తనకు అదనంగా మారణాయుధాలు అవసరమని, చూపు మందగించినందున కంటి ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా వీరప్పన్ కోరినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ సమాచారంతో వీరప్పన్‌ను పట్టుకునేందుకు పథకం పన్నారు. ఆ ఆపరేషన్ విజయవంతం కావాలంటే ధైర్యవంతుడైన పోలీస్ అధికారి కావాలి. దానికోసం ఎక్కువ శ్రమ పడకుండానే చెన్నైలో పేరుమోసిన రౌడీ అయోధ్యకుప్పం వీరమణిని ఎన్‌కౌంటర్ చేసిన ఎస్‌ఐ వెల్లదురై వారి మదిలోకి వచ్చాడు. వెల్లదురైనే తమ అపరేషన్‌కు తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్న విజయ్‌కుమార్ ఆయనకు తగిన విధంగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత వీరప్పన్ వద్దకు మారువేషంలో పంపాలని నిర్ణయించారు.

నిజానికి గతంలో అనేకసార్లు జర్నలిస్టులుగా, ఔషధాల సేకరణదారులుగా, టూరిస్టులుగా ఎంతోమంది పోలీసులు సత్యమంగళం అడవుల్లోకి వెళ్లి వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఎత్తులు వేశారు. కానీ వారి ఎత్తులను చిత్తుచేస్తూ ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నాడు వీరప్పన్. అంతేకాదు పోలీసుల అనేక ఎన్‌కౌంటర్‌లలో తప్పించుకున్నాడు కూడా. ఈ క్రమంలో తనతో పాటు ఉన్న వందలాది మంది అనుచరులను కూడా కోల్పోయాడు. చిదంబరం అనే అటవీ అధికారిని హత్య చేయడంతో వీరప్పన్ మొదట వార్తల్లోకి ఎక్కాడు. 1991లో కర్ణాటక రాష్ర్టానికి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేసిన పి. శ్రీనివాస్ ను చంపి, తలను కాళీ ఆలయం వద్ద వేరు చేశాడు. 1997లో కర్ణాటక అటవీ అధికారులను అపహరించి, నక్కీరన్ సంపాదకుడు మధ్యవర్తిగా అనేక దఫాల సంప్రదింపులు జరిపాకా చివరకు విడుదల చేశాడు. అదే సంవత్సరం 21మంది పర్యాటకుల్ని అపహరించి విడిచిపెట్టాడు. 2000లో కన్నడ కంఠీరవుడిగా ప్రఖ్యాతి చెందిన నటుడు రాజ్ కుమార్‌ను అపహరించినప్పుడు వీరప్పన్ జాతీయవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాడు. వీరప్పన్ చేసిన ఆఖరి కిడ్నాప్ కర్ణాటక మాజీ మంత్రి నాగప్ప అపహరణ. తదనంతరం నాగప్ప మృతదేహం అడవిలో దొరికింది, ఐతే తాను హత్యచేయలేదంటూ వీరప్పన్ వివరణ ఇచ్చాడు. ఇలా తన అక్రమ వ్యాపారానికి అడ్డువస్తారని భావించిన పోలీసు అధికారులు, గిరిజనులను చంపాడు. అందుకే ఈసారి ఆపరేషన్ ఫెయిల్ కావద్దనే పక్కాఫ్లానింగ్‌తో ముందడుగు వేశారు విజయ్‌కుమార్. పారిశ్రామికవేత్త ఇచ్చిన సమాచారం మేరకు వీరప్పన్ తన గూఢచారిని పంపాడు. ఆ గూఢచారి ధర్మపురికి చేరుకుని ఒక టీ దుకాణంలో పారిశ్రామికవేత్తను కలిశాడు. తాను ఒక మనిషిని పంపుతానని.. అతనితోపాటుగా వస్తే మధురై లేదా తిరుచ్చిలో వీరప్పన్‌కు కంటి ఆపరేషన్ చేయిస్తానని గూఢచారికి చెప్పాడు. దీంతో వీరప్పన్ మనిషి ఒక లాటరీ చీటీని కొని దాన్ని సగం చించి ఒక ముక్కను తన వద్ద ఉంచుకుని రెండో ముక్కను పారిశ్రామికవేత్తకు ఇచ్చాడు. రెండో ముక్కను తెచ్చే వ్యక్తితోనే వీరప్పన్ వస్తాడన్నాడు.
VEERAPPAN1

వీరప్పన్‌ను మట్టుబెట్టేందుకు ఎంచుకున్న రోజు రానే వచ్చింది. తుది అపరేషన్‌కు పది నెలల పాటు ప్రణాళిక, 3 వారాల అమలు. తుది ఆపరేషన్ కేవల 45 నిమిషాల పాటు సాగింది. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ మనుషులు వీరప్పన్ సంచరిస్తాడని అంచనా వేసుకున్న గ్రామాల్లో అమ్మకందార్లుగా, కూలీలుగా, స్థానిక చిరుద్యోగులుగా వేషాలు వేసుకుని చొరబడ్డారు. సంవత్సరాలుగా వయసు మీదపడుతూ ఉండడం, అతని దళసభ్యుల్ని పోలీసులు చంప డం వంటి కారణాలతో చివరకు వీరప్పన్ దళం నలుగురికి కుంచించుకుపోయింది. అడవి బయటకు తప్పించుకుని దక్షిణ ఆర్కాట్‌లో కంటికి వైద్య చికిత్స చేయించుకుందామని వీరప్పన్ ప్రణాళిక వేసుకున్నాడు. పోలీస్ ఆపరేషన్ జరిగిన రోజు ధర్మపురి జిల్లాలోని పపిరప్పటి గ్రామం వద్ద ఉన్న అంబులెన్స్ వద్దకు వీరప్పన్ సంరక్షకులతో వెళ్తున్నాడు. ఐతే నిజానికి ఆ అంబులెన్స్ గ్యాంగు లో రహస్యంగా చొరబడ్డ పోలీస్ చేర్చిన పోలీస్ వాహ నంలో 35 మంది పోలీస్ ట్రూప్ గ్రామంలో వేచి ఉన్నారు. వారిలో కొందరు సెక్యూరిటీ ట్యాంకర్లతో రోడ్లపైనా, ఇతరులు రహస్యంగా పొదల చాటున నక్కారు. పోలీసు మనిషి అయిన అంబులెన్స్ డ్రైవర్ వీరప్పన్ దళం నుంచి సమయానికి తప్పించుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం, వీరప్పన్, అతని గ్యాంగ్ సభ్యులను లొంగిపొమ్మని పోలీసులు హెచ్చరించారు, వారు దానికి అంగీకరించక పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. పోలీసులు ప్రతిఘటిస్తూ గ్రెనేడ్లు, తుపాకులతో కాల్పులు జరిపారు. వీరప్పన్ అక్కడికక్కడే మరణించగా, అతని దళసభ్యులు అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్తున్న మార్గంలో మరణించారు. ఆపరేషన్ తర్వాత స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు 12 బోర్ రెమింగ్టన్ పంప్ యాక్షన్ తుపాకీలు, యాక్షన్ గన్, రెండు ఎకె-47లు, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్, రెండు హ్యాండ్ గ్రనేడ్లు, రూ. 3.5 లక్షల క్యాష్ దొరికాయి.

పోలీసులు విడుదల చేసిన ఫైల్ ఫొటో ప్రకారం వీరప్పన్ మృతదేహంపై నుదుటి మీద ఒకటి, పక్కటెముకలు, తొడల్లో ఒకటొకటి మొత్తం మూడు బుల్లెట్ దెబ్బలు తగిలాయి. ధర్మవరం హాస్పిటల్లో ఉండగా అనేకమంది ప్రజలు అతని మృతదేహాన్ని అనుమతి లేకున్నా సందర్శించేందుకు వచ్చారు. పోలీసులకు ఆసుపత్రి బయటి గుంపును నియంత్రించడమే కష్టమైంది. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వీరప్పన్ మృతదేహాన్ని దహనం చేయడాన్ని వ్యతిరేకించింది. అతని సోదరుడి గృహంలో ఉంచాలని పట్టుబట్టారు. అంత్యక్రియలు చేసే హక్కు కుటుంబసభ్యులకే ఉంటుందని వారు వాదించారు.వీరప్పన్‌ని చంపిన ఆపరేషన్ కుకూన్ పలు వివాదాలు రేకెత్తించింది. వీరప్పన్ సాధారణంగా పెద్ద మీసంతో ప్రాచుర్యం పొందాడు, మృతదేహానికి మీసాలు లేవు. దాంతో పలువురు ఈ మృతదేహం వీరప్పన్‌ది కాదని సందేహించారు. పోలీసులు వేలిముద్రల ద్వారా గుర్తింపు నిర్ధారించారు. వీరప్పన్ బంధువులతో కూడా నిర్ధారించుకున్నారు. బుల్లెట్ దెబ్బలు తగిలిన విధానం పోలీసులు ఎన్‌కౌంటర్ గురించి చెప్తున్న కథనానికి సరిపోలేదని కొందరు వాదించారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్టులు, బాలిస్టిక్ నిపుణుల పరిశీలనలు పోలీసుల కథనాన్ని ఆమోదించాయి. వీరప్పన్‌ని బతికివుండగానే పట్టుకుని రాజకీయ కారణాలతోనే హత్య చేశారని మీడియాలోని కొన్ని వర్గా లు ఆరోపించాయి.

ఏప్రిల్ 28 నాటి బతుకమ్మ సంచికలో భక్త ప్రహ్లాద బతికే ఉన్నాడు శీర్షికన చివరి పేజీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ కథనంలో 2001లో ఉదయం దినపత్రిక మొదటి పేజీలో భక్త ప్రహ్లాద బతికేఉన్నాడు వార్త ప్రచురితమైనట్లు ముద్రించాం. కానీ, వాస్తవానికి ఆ కథనం వార్త దినపత్రికలో 11 మే, 2001న ప్రచురితమైంది. సమాచార లోపం వల్ల జరిగిన ఈ లోపాన్ని పాఠకులు గమనించగలరు. ఈ కథనాన్ని ప్రముఖ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య రాశారు. గోదావరిఖని సురభి సమాజంలో పనిచేస్తున్న కృష్ణాజిరావును ఆయనే చాలాకాలం తర్వాత వెలుగులోకి తీసుకువచ్చారు.

చిదంబరం అనే అటవీ అధికారిని హత్య చేయడంతో వీరప్పన్ మొదట వార్తల్లోకి ఎక్కాడు. 1991లో కర్ణాటక రాష్ర్టానికి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పనిచేసిన పి. శ్రీనివాస్ ను చంపి, తలను కాళీ ఆలయం వద్ద వేరు చేశాడు.

పోలీసులు విడుదల చేసిన ఫైల్ ఫోటో ప్రకారం వీరప్పన్ మృతదేహంపై నుదుటి మీద ఒకటి, పక్కటెముకలు, తొడల్లో ఒకటొకటి మొత్తం మూడు బుల్లెట్ దెబ్బలు తగిలాయి. ధర్మవరం హాస్పిటల్లో ఉండగా అనేకమంది ప్రజలు అతని మృతదేహాన్ని అనుమతి లేకున్నా సందర్శించేందుకు వచ్చారు. పోలీసులకు ఆసుపత్రి బయటి గుంపును నియంత్రించడమే కష్టమైంది.

1876
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles