బుర్జ్ ఖలీఫాలో చింతగింజల వ్యాపారి..!


Sun,May 12, 2019 01:02 AM

చింతగింజల పొట్టుతో వ్యాపారం చేసిన ఓ వ్యక్తి.. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణం బుర్జ్ ఖలీఫాలోని 22 అపార్ట్‌మెంట్లకు యజమాని అంటే నమ్ముతారా? ఆ ఆకాశ సౌధంలో అతనే ఎక్కువ అపార్ట్‌మెంట్లు కొన్నాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. చింతగింజల పొట్టు నుంచి బుర్జ్ ఖలీఫా వరకూ అతని ప్రయాణం ఆసక్తికరం. ఆ వ్యక్తి ఏ విదేశీయుడో కాదండోయ్.. మన దేశస్థుడే..!

బుర్జ్ ఖలీఫా నిర్మాణం 2010లో పూర్తయింది. ఆ సమయంలో.. ఆ ప్రఖ్యాత ఆకాశసౌథం గురించి.. అంతా చర్చించుకుంటున్నారు. ఓ ఇద్దరు స్నేహితుల వ్యాపార లావాదేవీల మధ్యలో దాని ప్రస్తావన వచ్చింది.చూశావా జార్జ్.. బుర్జ్ మొత్తాన్ని ఒకేసారి చూడలేమట. అందులోకి అడుగుపెట్టడమూ కష్టమే. ఇక అందులోనే జీవించాలంటే అసాధ్యం అంటూ నిట్టూర్చాడు ఓ స్నేహితుడు.అవునా అన్నట్లు తల ఊపాడు జార్జ్. రెండ్రోజుల తర్వాత నుంచి జార్జ్ కనిపించలేదు. అనుమానం వచ్చిన స్నేహితుడు ఆరా తీయగా.. ఆ మరుసటి రోజే బుర్జ్ ఖలీఫాలో ఓ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసి జార్జ్ అందులోనే ఉంటున్నాడని తెలుసుకున్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అసాధ్యం అనే మాటను జార్జ్ ఒప్పుకోడనే.. విషయాన్ని నిర్ధారించుకున్నాడు. నేరుగా వెళ్లి క్షమాపణ చెప్పాడు. అదే జార్జ్ వి నెరియపరంబిల్ గొప్పతనం. అంత పట్టుదల ఉన్న మనిషి కాబట్టే.. నేడు బుర్జ్ ఖలీఫాలో 22 అపార్ట్‌మెంట్లు కొనగలిగాడు. ఎవరైనా అమ్మితే ఇంకా కొంటా అంటున్నాడు కూడా. అంతటి కోటీశ్వరుడా? అంటే.. అవుననే చెప్పాలి. ఎందుకంటే అతని సంపాదనంతా కష్టార్జితం. చెమట చుక్కలు చిందిస్తూనే.. పక్కా ప్రణాళికతో, తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగాడు జార్జ్.
Jorge

ఇలా మొదలు!

జార్జ్ ప్రయాణం ఎంతోమందికి ఆదర్శం. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన ఆ వ్యక్తి.. ఉన్నత చదువులు కూడా చదువని ఓ వ్యక్తి.. బుర్జ్ ఖలీఫాలో 22 అపార్టుమెంట్లు కొనడమంటే మాటలా? కేరళలోని తిరుచూర్ దగ్గర ఓ పల్లెటూళ్లో పుట్టారు జార్జ్. తండ్రి ధాన్యం వ్యాపారి. వృథాగా పడేసే చింత గింజల్ని సేకరించి వాటిపైన పొట్టుని పశువుల దాణాగా అమ్మేవారు. చిన్నప్పట్నుంచీ జార్జ్ తండ్రితో పాటు మార్కెట్‌కు వెళ్తూ వ్యాపార పాఠాలు నేర్చుకున్నారు. పత్తి విత్తనాలు కొనుగోలు చేసి.. 90 శాతం లాభానికి జిగురు పరిశ్రమలకు అమ్మేవారు. 1976లో ఆటోమొబైల్ మెకానిక్‌గా షార్జాకు వెళ్లారు జార్జ్. అక్కడ ఏసీల వ్యాపారానికి డిమాండ్ ఉండడంతో ఏసీలూ, ఫ్రిజ్‌ల రిపేర్లు, అమ్మకాలు ప్రారంభించారు. ఆ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించారు. వాటితో షార్జాలో జీయీవో ఎలక్ట్రికల్స్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో ఎల్‌ఎల్‌సీ పేరుతో పెద్ద దుకాణాన్ని తెరిచారు జార్జ్. అందులో అన్ని బ్రాండ్‌ల ఏసీలూ, కూలర్లూ, ఫ్రిజ్‌లను అమ్మకానికి పెట్టారు. డిమాండ్‌కు తగ్గట్లు లాభాలు ఉండడంతో జియాన్ ఎయిర్ పేరుతో ఏసీలూ, కూలర్ల తయారీని ప్రారంభించారు. వీటితోపాటుగా మరిన్ని వ్యాపారాలను విస్తరించారు.

ఎలా సాధ్యమైంది?

తెలివితో.. ప్రక్కా ప్రణాళికతో తన వ్యాపారాలను లాభాల బాట పట్టించారు జార్జ్. అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యారు. ఆరోజు స్నేహితుడు సరదాగా అన్న ఆ మాటల్ని సీరియస్‌గా తీసుకొని..ఆ మరుసటి రోజే ఒక ఫ్లాట్ కొన్నారు. అది దుబాయి మెట్రోకి చేసిన ఒక ప్రాజెక్టులో వచ్చిన డబ్బు. ఆ తర్వాత ఆరేండ్లలో 22 అపార్ట్‌మెంట్ల వరకూ కొన్నారు జార్జ్. వీటిలో కొన్నింటిని అద్దెకు ఇస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్ల నిర్వహణకే ఏటా అయిదున్నర కోట్ల రూపాయల్ని ఖర్చుచేస్తున్నారు జార్జ్. దుబాయితోపాటు షార్జా, రస్ అల్ కైమా, మేదాన్, అజ్మాన్‌లలో స్థిరాస్తులు సంపాదించారు. ఇంకో విషయం ఏంటంటే.. బుర్జ్‌లో 900 అపార్ట్‌మెంట్‌లుంటే అందులో 150 వరకూ భారతీయులూ, ప్రవాస భారతీయులే కొన్నారట. నాకిప్పుడు బుర్జ్‌లో 22 ఫ్లాట్‌లు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని కొనాలనుకుంటున్నా. ఆరోజు నా స్నేహితుడి మాటల్ని నేను సీరియస్‌గా తీసుకున్నాను. అసాధ్యం అనే పదం నాకు నచ్చదు అని అంటున్నారు జార్జ్.

ఎయిర్‌పోర్ట్ నిర్మాణం..

జార్జ్ వి నెరియపరంబిల్ స్థిరపడింది దుబాయ్‌లోనే అయినా.. మాతృదేశంపై ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. 1977లో జార్జ్ తండ్రి చనిపోయారు. అప్పుడు దుబాయి నుంచి కొచ్చీ రావడానికి ఆయనకు 4 రోజులు పట్టింది. అప్పుడే గల్ఫ్, కేరళల మధ్య దూరాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కొచ్చీ విమానాశ్రయ పనులు నిధులు లేక ఆగిపోవడంతో.. ఆర్థికంగా తోడ్పాటు అందించారు జార్జ్. అందులో 14 శాతం వాటా కూడా కొన్నారు. విదేశాల్లో స్థిరపడ్డ లక్షలాది కేరళవాసులకు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడుతున్నది. జార్జెటా రాగం పేరుతో తిరుచూర్‌లో సినిమా థియేటర్‌ని నిర్మించారు జార్జ్. త్వరలో ఆ స్థలంలో మాల్‌ని నిర్మిస్తారట. జార్జ్ భార్య మోలీది ఆయన ఎదుగుదలలో కీలక పాత్ర. వీరికి ముగ్గురు పిల్లలు. మన దేశంలో కూడా ఏసీలూ, కూలర్ల అమ్మకం, స్థిరాస్తి రంగాల్లో అడుగుపెట్టారు జార్జ్ వి నెరియపరంబిల్. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూ.. కలల్ని సాకారం చేసుకోవాలి అంటూ నేటి యువతకు సందేశమిస్తున్నారు.

6749
Tags

More News

VIRAL NEWS