ఆ ఊర్లో అంతా పైల్వాన్లే!


Sun,May 12, 2019 02:00 AM

ఢిల్లీ సమీపంలోని ఆ ఊర్లో అడుగు పెడితే గల్లీగల్లీలో కండల వీరులే కనిపిస్తారు. ప్రతి ఇంట్లో ఓ బాడీ బిల్డర్ దర్శనమిస్తాడు. ఏం చేస్తావ్ అని అడిగితే ఎవరి నుంచైనా వచ్చే సమాధానం ఒక్కటే వ్యాయామం. ఆదాయ మార్గం ఏంటి? అని అడిగినా అదే సమాధానం వ్యాయామం. అవును! అ ఊర్లో అందరికీ వ్యాయామమే ప్రధాన ఆదాయ వనరు. 90శాతం మందికి అదే వృత్తి.

ఢిల్లీ, దాని చుట్టు పక్కల పట్టణాల్లో ఉండే బార్లకు, పబ్బులకు, డిస్కోలకు సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువ అవసరం పడుతుంది. సెలబ్రెటీ ఈవెంట్లు, ర్యాలీలు జరిగినా రక్షణ విషయంలో ఎక్కువ ప్రైవేటు బాడీగార్డుల పాత్ర ఉంటుంది. ఇలా ఢిల్లీలో, దాని శివారు నగరాల్లో ప్రైవేటు బాడీగార్డులు అవసరమైనవేళ నిర్వాహకులకు గుర్తుకు వచ్చే ఏకైక ఊరు అసోలా-ఫతేపూర్. ఈ గ్రామంలో బాడీగార్డులకు కొదువలేదు. కండలు పెంచిన యువకులకు తిరుగు లేదు. నోయిడా, గర్గావ్ వంటి నగరాల్లోని పబ్బులు, బార్లలో ఈ గ్రామానికి చెందిన బౌన్సర్లే పనిలో ఉంటారు.
Vustaz

ఊరంతా పైల్వాన్లే

అసోలా గ్రామస్తుల్లో 90 శాతం మంది బాడీ బిల్డర్లే. చిన్న పిల్లల నుంచి 50 ఏండ్లలోపు ఉన్న వారు కూడా బాడీబిల్డింగ్ చేస్తారు. శరీరాకృతితోనే వీరికి ఆదాయం వస్తుంది. చిన్న పిల్లలకు కూడా శిక్షణ ఇవ్వడం, వారికి వ్యాయామం నేర్పడం సీనియర్ల పని. సమయం దొరికినప్పుడల్లా యువకులు కుస్తీ పోటీలు పెట్టుకొని, మరింత దృఢంగా తయారవుతారు. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. బౌన్సర్లుగా పని చేసే వ్యక్తులు రోజూ అరటిపండ్లు, పెరుగు, పాలు, బాదంపాలు తప్పకుండా తీసుకుంటారు. వచ్చే ఆదాయంలో ఇరువై నుంచి ముప్ఫై శాతం ఆహారానికే వెచ్చిస్తారు. వీళ్లంతా మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉంటారు. అయితే బాడీ ఉంది కదా అని గొడవలకు దిగరు. బౌన్సర్లుగా విధులు నిర్వహించేప్పుడు వీళ్లకు కొన్ని కోడ్‌లు ఉంటాయి. కోడ్‌ను ఉల్లంఘించకుండా పని చేస్తారనీ ఈ ఊరి బౌన్సర్లకు మంచి పేరుంది. అయితే జీతం ఇచ్చిన యజమాని రక్షణ కోసం తమ శక్తిని చూపించడానికి వెనుకాడరు.

డిమాండ్ ఎక్కువ

క్రమశిక్షణ గల బౌన్సర్లకు ఈ ఊరు పెట్టింది పేరు. దీంతో వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద కంపెనీలు, వీరికోసం ఆరా తీస్తుంటారు. అయితే ఇక్కడ సదరు యజమాని దగ్గర బౌన్సర్‌గా పని చేసే సామర్థ్యం ఉందా లేదా అని ఆ బౌన్సర్లు అంచనా వేసుకుంటారు. ఒకవేళ లేకపోతే వెంటనే సీనియర్లకు సమాచారం అందిస్తారు. 40 నుంచి 45 ఏండ్ల తర్వాత బౌన్సర్లుగా ఉండడం కష్టం అవుతుంది. అందుకే ఆ వృత్తి నుంచి రిటైర్డ్ అయిన తర్వాత వ్యాయామశాలలు ప్రారంభించడం, పిల్లలకు శిక్షణ ఇవ్వడం లేదా ఇతర వ్యాపారాన్ని ప్రారంభించడం చేస్తాం అంటున్నారు. ప్రస్తుతం ఈ ఊరి బౌన్సర్లు ఒక్కొక్కరు నెలకు 25 వేల నుంచి 30 వేల వరకూ సంపాదిస్తున్నారు. అయితే ఆహారం కోసం అందులో పదివేలకు పైగా ఖర్చు చేస్తారు. శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా చేసుకుంటే, అది మనకు అంత ఉపాధిని కల్పిస్తుంది అంటారు. ఆ శరీరాన్ని అనవసరమైన వ్యసనాలకు బానిసను చేయడం కంటే ఇలా బాడీబిల్డింగ్ చేసి సంపాదించడం ఉత్తమం అంటున్నారు.

ఢిల్లీ సమీపంలో అసోలా ఓ చిన్న గ్రామం. అక్కడ చాలా గ్రామాలు ఢిల్లీకి అనుకోని ఉన్నా అసోలా మాత్రం ఒక్కటే విడిగా ఉంటుంది. శివారు గ్రామాల వారితో పోలిస్తే వీరి ఆదాయం తక్కువగా ఉండేది. దీంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల మీద దృష్టి పెట్టారు. తమ తెగకు చెందిన వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న సంప్రదాయ అఖాద యుద్ధకళనే వారికి జీవనాధారంగా కనిపించింది. ఈ యుద్ధకళకు నూతన వ్యాయామ పద్ధతులను కలిపి తమ శరీరాకృతులను మెరుగుపరుచుకుంటున్నారు. ఈ విధమైన పద్ధతి వారికి శరీరాకృతిని, ఆరోగ్యాన్నే కాదు.. ఆదాయాన్నీ తెచ్చిపెడుతున్నది. దీని ఫలితంగా గ్రామంలో బౌన్సర్లకు డిమాండ్ పెరిగింది. ఇలా అసోలా బౌన్సర్లకు పుట్టినిల్లుగా పేరు తెచ్చుకుంది.

752
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles