మ్యూజియమ్స్! మ్యూజింగ్స్!!


Sun,May 12, 2019 01:48 AM

salar-jang-museum
మనిషి మనుగడ ఎలా సాగించాడు?ఒకప్పటి పరిస్థితులకు అద్దం పట్టే వస్తువులను చూడాలన్నా.. మన చరిత్ర గురించి సమగ్ర సమాచారం దొరుకాలన్నా.. ఎక్కడా అంటే వచ్చే సమాధానం.. మ్యూజియం! మన రాచరిక వ్యవస్థను చూడాలనుకున్న వాళ్లు.. సాలార్‌జంగ్ మ్యూజియాన్ని సందర్శిస్తారు.. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మ్యూజియాలు ఎన్నో ఉన్నాయి.. వాటిలో ఎక్కువగా సందర్శించే..అతిపెద్ద మ్యూజియాల గురించి ఈ జంటకమ్మ.

మ్యూజీ డూ లూరే

ప్రారంభ సంవత్సరం : క్రీ.శ1793
స్థలం : పారిస్, ఫ్రాన్స్
సందర్శకులు : సుమారు 97,20,260 (సంవత్సరానికి)
ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాల్లో ఇది మొదటి స్థానంలో ఉంది. అంతేకాదు.. ఎక్కువగా సందర్శించే మ్యూజియాల్లో కూడా ఇదే ఫస్ట్. సిటీకి ఇదొక ల్యాండ్ మార్క్‌గా ఉంది. 7,82,910 అడుగుల విస్తీర్ణంలో ఈ మ్యూజియం నిర్మితమైంది. ఇందులో సుమారు 38,000 వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. అందులో యాంటిక్ పీస్‌లు, ఇస్లామిక్ ఆర్ట్, శిలలు, డెకరేటివ్ ఆర్ట్స్‌ని ప్రదర్శిస్తున్నారు. ముందుగా 12, 13వ శతాబ్దంలో ఫిలిప్ రెండవ చక్రవర్తి దీన్ని నిర్మించినట్లు చెబుతారు. ఆ తర్వాత అనేక మార్పులతో 10 ఆగస్టు 1793లో 537 పెయింటింగ్‌లతో ఈ మ్యూజియం ప్రారంభమైంది.
Musee-Du-Louvre


ద మెట్రోపాలిటన్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్

ప్రారంభ సంవత్సరం : క్రీ.శ.1870
స్థలం : న్యూయార్క్, యూఎస్‌ఏ
సందర్శకులు : సుమారు 61,15,881 (సంవత్సరానికి)
యునైటెడ్ స్టేట్స్‌లో అతిపెద్ద మ్యూజియంగా దీనికి పేరుంది. ఈ మ్యూజియాన్ని 17 విభాగాలుగా ప్రద ర్శిస్తున్నారు. మొత్తం మీద 2 మిలియన్ వర్క్స్ ఇక్కడ ప్రదర్శితమవుతాయి. సుమారు 5 వేల సంవత్సరాల క్రితం నాటి కళాఖండాలను ఇక్కడ చూడొచ్చు. పైగా ఈ మ్యూజియంలో ప్రతీ విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ఆడియో గైడ్ కూడా ఉంటుంది. చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ మ్యూజియం మొత్తాన్ని చుట్టేయొచ్చు.

బ్రిటీష్ మ్యూజియం

ప్రారంభ సంవత్సరం : క్రీ.శ.1753
స్థలం : లండన్, యూకే
సందర్శకులు : సుమారు 55,75,946 (సంవత్సరానికి)
బ్రిటీష్ సామ్రాజ్యానికి అద్దం పట్టేలా ఈ మ్యూజియం ఉంటుంది. ప్రపంచంలో మొదటి పబ్లిక్ నేషనల్ మ్యూజియంగా దీనికి పేరు. ఇందులో మనిషి చరిత్రకు ఆనవాళ్లు కనిపిస్తాయి. సుమారు ఎనిమిది మిలియన్ల ఆర్ట్ వర్క్స్ ఇక్కడ దర్శనమిస్తాయి. మునుపు బ్రిటీష్ లైబ్రెరీ కూడా దీనిలో భాగంగానే ఉండేది. కానీ 1997 తర్వాత నుంచి దాన్ని మ్యూజియం నుంచి వేరు చేశారు. ఈ మ్యూజియానికి ప్రత్యేక బ్లాగు ఉంది. దీనిద్వారా ఇందులో ఉన్న వస్తువులకు నకలు చేయించి వాటి అమ్మకాలు జరుపుతున్నారు దీని నిర్వాహకులు. ఆ ఆదాయంతో ఈ మ్యూజియాన్ని మరింతగా విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు.

టాటే మోడ్రన్

ప్రారంభ సంవత్సరం : 2000
స్థలం : లండన్, యూకే
సందర్శకులు : 53,04,710 (సంవత్సరానికి)
నాలుగు ఆర్ట్ మ్యూజియాలను కలిపి ఈ మ్యూజియాన్ని కట్టారు. కాంటెంపరరీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎప్పుడూ నడుస్తుంటుంది. 1897లో మొదట ఒక గ్యాలరీతో మొదలైంది. ఆ తర్వాత 1932లో మోడ్రన్ ఆర్ట్ పేరుతో ఈ మ్యూజియానికి పేరుండేది. ఆ తర్వాత టాటే గ్యాలరీగా దీని పేరు మార్చారు. 1500వ సంవత్సరం నాటి బ్రిటీష్ కళాఖండాల సంపదను ఇక్కడ చూడొచ్చు. పైగా ఇక్కడ ఆర్టిస్టులు ప్రత్యేకంగా ఆర్ట్ వేసుకోవడానికి గదిని ఏర్పాటు చేశారు. వాటిని ప్రదర్శించుకోవడానికి కూడా ఉచిత అనుమతినిస్తారు.

నేషనల్ గ్యాలరీ

ప్రారంభ సంవత్సరం : 1824
స్థలం : లండన్, యూకే
సందర్శకులు : 51,63,902 (సంవత్సరానికి)
మ్యూజియం అంటే కేవలం అక్కడి వస్తువులను చూసి వెళ్లడమే అనుకుంటారు. కానీ అక్కడ యాక్టివిటీస్‌తో కూడా అలరించొచ్చని నిరూపిస్తున్నది ఈ మ్యూజియం. క్లే కాస్టింగ్, స్టోరీ టెల్లింగ్, స్కెచ్ బుక్ పేరు మీద పిల్లలను ఆకర్షించేలా ఈ మ్యూజియాన్ని రూపొందించారు. ప్రత్యేక సమయాల్లో పిల్లలకు శిక్షణనివ్వడమే కాకుండా.. ఈ మ్యూజియాన్ని చుట్టి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇందులోనే ప్రత్యేకంగా షాపింగ్ చేసే వీలు కూడా కల్పించారు. పురాతన వస్తువులు, పురాతన పెయింటింగ్‌లతో ఈ మ్యూజియం ఆకట్టుకుంటుంది.

వాటికన్ మ్యూజియం

రోమన్ కాలంలోని శిల్ప సంపదను వీక్షించాలంటే ఈ మ్యూజియంలో అడుగు పెట్టాల్సిందే! 70 వేల పాత కళాఖండాల సంపద ఇక్కడ కొలువై ఉంది. అందులో కేవలం 20వేల పీస్‌లను మాత్రమే వీక్షించేందుకు వీలు కల్పించారట. ఈ మ్యూజియానికి రక్షణంగా 40 డిఫరెంట్ డిపార్ట్‌మెంట్‌ల్లో 640 మంది పనిచేస్తున్నారు. 16వ శతాబ్దంలో పాప్ జూలియస్ ఈ మ్యూజియాన్ని నిర్మించాడు. పాలరాతితో నిర్మించిన ఈ మ్యూజియాన్ని చల్లగా వీక్షించొచ్చు.

ప్రారంభ సంవత్సరం : క్రీ.శ.1506
స్థలం : వాటికన్ సిటీ
సందర్శకులు : సుమారు 50,64, 546 (సంవత్సరానికి)
Vatican-museum

నేషనల్ ప్యాలెస్ మ్యూజియం

ప్రారంభ సంవత్సరం : క్రీ.శ.1925
స్థలం : తైపీ, తైవాన్
సందర్శకులు : సుమారు 43,60, 815 (సంవత్సరానికి)
చైనా కళాఖండాల సంపదను చూడాలంటే ఈ ప్యాలెస్‌కి వెళ్లాల్సిందే! సుమారు 70వేల వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అందులో ఆర్ట్ పీస్‌లు, ఇతర నాణాలు, చైనీయుల చరిత్రను తెలుసుకోవచ్చు. ఇందులో ఉన్న చాలా వస్తువులు చైనా చక్రవర్తుల నుంచి సేకరించినవే! ముందు ఈ మ్యూజియాన్ని బీజింగ్‌లో నెలకొల్పారు. కానీ కొన్ని కారణాల వల్ల 1965లో తైపీలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.

సెంటర్ జార్జెస్ పాంపిడు

ప్రారంభ సంవత్సరం : క్రీ.శ. 1977
స్థలం : పారిస్, ఫ్రాన్స్
సందర్శకులు : సుమారు 38,00, 800 (సంవత్సరానికి)
హైటెక్ ఆర్కిటెక్చర్‌తో ఈ మ్యూజియాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద లైబ్రెరీ కూడా ఉంది. మోడ్రన్ మ్యూజియాల్లో ఇది అతి పెద్దదిగా పేరొందింది. 1969లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన జార్జెస్ పాంపిడు పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారట. 1977లో ప్రారంభమైన ఈ మ్యూజియాన్ని 2006వరకు 180 మిలియన్ల మంది సందర్శించినట్లు లెక్కలు ఉన్నాయి. ఎక్కువగా ఈ నిర్మాణాన్ని చూడడానికే సందర్శకులు వస్తుంటారని ప్రతీతి. ఇక్కడ కూడా ఎన్నో ఆర్ట్ పీస్‌లు, ఇతర కలెక్షన్స్ కూడా ఇక్కడున్నాయి.
centre-georges-pompidou

269
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles