రాణిర్కమ్


Sun,May 12, 2019 01:27 AM

అమృతా! యిమ్లిబన్ బస్‌స్టేషన్‌కి తొమ్మిది గంటలకు రా.. నేమంటా అని చెప్పింది. వోర్నీ తొమ్మిది బోయింది, పదిబొయింది పదకొండయితంది. యీ అమృత మా ఇరువైయేండ్ల స్నేహంల ఏనాడూ చెప్పిన టైముకు రాలేదు. నా టైముని పేలాలు తిన్నట్లు తింటది. యెంతసేపని బస్టాండుల వచ్చిపోయేటోల్లని, బస్సెక్కి దిగేటోల్లని, పిల్లల్ని, మోత బ్యాగుల్ని సమాలిచ్చే తల్లుల్ని, తండ్రుల్ని, బస్‌కోసం ఫలానీ బసప్పుడొస్తదనే ఎంక్వయిరీలు, బస్ టిక్కెట్ల కోసం నిలబడి అపసోపాలు బడ్తున్నోల్లని ఎంతసేపని సూస్కుంట కూసుందు. మద్దెమద్దెన ఫోంజేస్తే తీస్తలేదు. యీ అమృతకు మల్లా ఏం సడెన్ సవాలక్ష పనులొచ్చి పడ్డయో ఏమోనని చాలా కోపమొస్తుంది. పేపరు తీసి చదూదామన్నా సద్వబుద్దయితలేదు. నన్ను ముందు రమ్మని చెప్పి నన్ను గిట్ల పరేషాన్ జేసుడు యీమెకలువాటయింది చత్ అని తిట్టుకున్న. కనీసం ఫోనన్న లేప్తలేదు. ఏమైందో తెల్వది ఏం జెయ్యాలె, నేను ఇంటికి తిరిగి పోదామా! ఏ సంగతి చెప్తె బాగుండు. ఓ దిక్కు ఆకలి దంచుతంది అని ఆలోచించుకుంటాన్న. ఇంకొంచెం సేపు జూసి అదే పని జేస్త అని నిర్ణయించుకున్న.అమృత ఒక ఎన్జీవోల పంజేస్తుంది. యిద్దరం విద్యార్థి ఉద్యమాల్లో కల్సిపంజేసిన దోస్తానా ఉంది. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పదనే సూక్తి నాలికెలమీన్నే నలిగినయి. కానీ, వాస్తవంలో వల్లగాలే.

యీ చదువులే వద్దు యివి బానిస చదువులు, మెకాలె చదువులు మనకొద్దు. తత్వాలతో చదువుకునే వాల్లనే సమీకరించే దానికి మేము పై చదువుల్ల మిగిలినము. లేకుంటే నేను అమృత విద్యలేని వికార పశువులుగా మిగిలి పోయేటోల్లమే. అమృతకు ఉద్యమాల్లో కేసులుండి ప్రభుత్వ కొలువుకాక ఎన్జీవో సంస్థల జేరింది. యీ ఎన్జీవో, ఉద్యమాల్లో పంజేసి బచాయించి సర్కారు కొలువుల జేరిన. ఉద్యమాల నుంచి లొంగిపోతేనే కొలువిచ్చింది గవర్నమెంటు అని కొంతమంది చెప్పుకుంటరట. కానీ, నేను ఉద్యోగ పరీక్షల్ల ర్యాంక్ గొడితే ఉద్యోగమొచ్చింది మెరిట్ల. అమృతకు, నాకు దోస్తానీ ఉద్యమాల్నించి యిప్పటిదాకా ఢోకా లేకుంట సాగుతనే ఉంది. ఉద్యమాల్నించి బైటబడినా మాకు సామాజిక సేవ చావలే. మనుషులందరు సమాన న్యాయాలతో హక్కులతో, కుల, మత, జెండర్ వివక్షల్లేని సమాజం కోసం రకరకాల రూపాల్లో పంజేస్తనే వున్నము. అట్లా మా దోస్తాన కొనసాగుతూనే ఉంది.
Katha-raanirkam

డెబ్బయి మూడో (73) రాజ్యాంగ సవరణతోని పంచాయతీ రాజ్ చట్టమొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ మహిళలకు రిజర్వేషన్లొచ్చినయి. వాళ్లు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎన్నికైండ్రు. అయితే ఆ ఎస్సీ మహిళలు ఎట్లా పాలన జేస్తున్నరు? వాళ్ల అనుభవాలేంటియి. వాళ్ల సాధకబాధకాలు ఊరి పెద్ద కులాలతోని, మొగవాళ్లతోని పాలనాక్రమంలో వాళ్లెదుర్కుంటున్న సమస్యలెట్లున్నయి? వేల తరాలు బానిసలుగా బతికిన అంటరాని ఆడవాళ్లు, కూలినాలి చేసుకునే ఆడవాళ్ల చేతికి పాలన వచ్చింది. ఆ పాలన ఆచరణ, అనుభవాల మీదనే నా ప్రాజెక్టు. యివన్నీ రాయాలె నీకెవరన్నా తెలుసా? అని అడిగింది అమృత తన ప్రాజెక్టు గురించి చెబుతూ.. ఆ తెల్సినోల్లేంది మా పెద్దమ్మ కోడలున్నది సర్పంచిగా గెల్సింది. అట్లనే ఆ చుట్టుపక్కల వూల్లల్ల గూడ ఒకరిద్దరు ఎస్సీ మహిళలు ఎంపీటీసీలుగా గెలిసిండ్రన్న. అయితే యింకేంది పోదాంపా.. నువ్వు నా ప్రాజెక్టు కోసం వొక్క రోజు లీవు బెట్టుమని.. ఫలానా తేదీ, ఫలానా టైమని జెప్పింది. అట్ల ఆ రోజు తొమ్మిది నుంచి పదకొండున్నర దాక ఎదురు చూసిన. కోపమొచ్చి.. ఇంటికి బోదామని యామె యిక రాదని ఓ పదగుడులేసిన్నో లేదో.. ఎదురుగా అమృత గసబెట్టుకుంట దబదబ వస్తుంది. నాకు చిర్రెత్తుకొచ్చి తిట్టబోతే.. ఆమే అందుకొని నాకు బుద్దిలేదు. టైమ్‌సెన్స్ లేదు, బేకార్ ఆద్మీని సారీ అని మొదలు పెట్టంగానే నేను సగం సల్లారి పోయిన. సరిగ్గా బైల్దేరే టైముకు ఊరి కాన్నుంచి మా సుట్టపామెకు బాగా లేదని దిగింది. ఆమెను దావుకాండ్ల సూపిచ్చి వచ్చేటాలకు గీటైమైంది. మాఫ్ కీజియే డియర్ అని తన చెవులు బట్టుకున్నది. ఎండకన్నా కోపంతో ఎక్కువ మండుతున్న నాకు అమృత మాటలు అయిస్ నీల్లు జల్లినట్లు నేను చల్లచల్లగ కూల్ కూల్ అయిన.నల్గొండకు బోవాలె. ఏ బసు జూసినా పికాపికలుంటంది. సరే తినిపోదామనుకొని బస్టాండు హోటల్లో తినేటాలకు రెండయ్యింది. నల్గొండ బసెక్కి బోయేటాలకు సాయంత్రమైంది.

అసలు మా ప్రోగ్రామేంటిదంటే.. పొద్దుగాల బొయి రాత్రికల్లా తిరిగిరావాలని. కాని యీ లేట్ కమ్మర్ వల్లా ప్రోగ్రాం మొత్తం చెడింది. ప్లానంత మారిపోయింది. సరే యెట్లా సాయంత్రమైంది. యింక వూర్లకిప్పుడేడబోతము, యీ రాత్రి ఎక్కడన్నా హోటల్లుండి రేప్పొద్దున లేవంగనే ఏమన్నా టిఫిన్ జేసి యెల్లి పోదామ్ సరేనా! మనం గూడ అల్సిపోయినం.. వాల్లను యింటర్వ్యూ చెయ్యాలంటే ఏమేమి మాట్లాడాల్నో, అడగాల్నో మనం గూడ ప్రిపేరయిదామని ఫిక్స్ చేసింది అమృత. చలో.. అయితే యీ దగ్గర్లో ఏమి హోటల్సున్నయో చూద్దామా అని యిద్దరం కూడబలుక్కొని బైల్దేరినం. మా చేతిల పెద్దలగేజి లేదు. చేతి బ్యాగులుదప్ప. బస్టాండు నుంచి బైటికొచ్చి కొంత దూరం నడ్సినంక కొంచెం దూరముల గౌతమ్ హోటలు అని కనబడ్తుంది పెద్ద అక్షరాలతోని, రోడ్డు పక్కన పుచ్చకాయల కుప్ప కనబడితే.. యెండకాలం తియ్యగ సల్లగతినొచ్చని బేరమాడి, బేరమాడి ఒక పుచ్చకాయ కొన్నం. హోటలుకు బొయి పుసర్సత్‌గ తినొచ్చని, కొననయితే కొన్నం గానీ దాన్ని మోసుకొని నడుసుడు వల్లయితలే.. యెండ, యింకా రకరకాలుగ అల్సిపోయిన మాకు నడుసుడే కష్టమైతాంటె మెడకో డోలన్నట్లు తగిలిచ్చు కుంటిమి అన్న విసుగ్గ.

అమృత యీ బాదంతెందుకు ఆటోకు పోదాం పా.. అని ఆటోను పిలిసి గౌతమ్ హోటలుకి ఎంత? అని అడిగింది. ఆటో అతనికి అర్థమైంది నాలుగడుగుల్లేని హోటలుకు గూడ వీల్లు ఆటో అడుగుతుండ్రనీ బక్రాలని అర్తమైంది. ముప్పయి రూపాయలన్నడు. వార్నీ.. మామూలుగ యీ పుచ్చకాయ లేకుంటే. మంచిగ నడ్సిపోదుము. రూ. 20 ల పుచ్చకాయ కోసం ముప్పయి రూపాయల ఆటో అని గునిసింది అమృత. చారాణ కోడికి బారాణ మసాలన్నట్లున్నది పుచ్చకాయ. యీ పుచ్చకాయ సల్లగుండ అడుగు దూరానికి ఆటో ఎక్కించిందనీ పడిపడి నవ్వుకున్నం ఆటో దిగుకుంటా.. రిసెప్షన్ కాడికి (హోటల్) బొయినం. ఆ హోటలు పరిసరాలల్ల అంతా మొగోల్లు, ఒకట్రెండు ఆడమగ జంటలు. కానీ మాలాగ యిద్దరాడవాల్లు రావడాన్ని చూసి రిసెప్షనిస్టు మమ్మల్ని కిందకి మీదకి వింతగ జూస్తుండు. అమృత మాకు ఒక రూమ్ కావాలి యీరోజు రాత్రికి, రేపొద్దున వెళ్లి పోతం అని చెప్పింది. రిసెప్షనిస్టు రిజిష్టరు తెరచి పేరు అడ్రసు రాయమని చెప్పి రూమ్ బాయ్‌ని పిలిచి ఫలానా రూములోకి తీస్క పొమ్మని తాళంచెవిచ్చిండు. హోటల్ రూమ్‌లకు బొయి రిఫ్రెష్ అయినం. మమ్మల్ని అవుసరం లేకున్నా ఆటో యెక్కిచ్చిన పుచ్చకాయ పని బడ్దామా అన్న పుచ్చకాయను చేతుల్లోకి తీస్కుంటా.. నేను ఎట్ల తిందామ్ కత్తి లేదుగద రిసెప్షన్‌కి జేసి ఫోన్ కత్తి పంపుమందామా అని ఫోంజేసి అడిగింది. కాని రిప్లయి లేకుంటనే కట్టయినదట. ఆ వెంటనే రూమ్ బాయి వచ్చి కత్తెందుకమ్మా?.. అని కళ్లన్ని అనుమానం కాయలు జేసుకొని అడిగిండు బయం బయంగ.
తర్వాత యింకిద్దరు రూమ్ బాయ్‌లొచ్చిండ్రు కత్తెందుకమ్మా?.. అని ఆదుర్దాగ ఏం జరగబోతుందని.. బాబూ గీ పుచ్చకాయను కోస్క తిందామని అడిగినం తేపోండ్రి కత్తి. దీనికి గింతమందేంది అని చిదురుకున్నట్లన్న. మీకు కత్తి రూములకియ్యద్దమ్మా.. కాయిస్తే కోసి తీసుకొస్తము ముక్కలు అని తీస్కపోయిండ్రు పుచ్చకాయను. నేను అమృత కండ్లల్ల నీల్లొచ్చేదాకా పడిపడి నవ్వుకున్నము పుచ్చకాయ మన మీద బాగనే కసిదీర్చుకుంటంది. యిది ఏ జన్మ కసినో యిట్లా తీర్చుకుంటందనీ పుచ్చకాయ మీద జోకులేసుకుని నవ్వుకుంటాంటె.. రూమ్ బాయ్ వచ్చి ముక్కలిస్తే.. సగం వుంచుకొని సగం అతనికిచ్చేసినమ్. అయినా మమ్మల్ని అనుమానం చూపులు చూస్తానే పోయిండు రూమ్ బాయ్. ఓర్నీ హోటలుకొచ్చుడు నేరమైంది. దొంగల్ని లంగల్ని జూసినట్టు జూస్తుండ్రు ప్రతోల్లు. ప్రశాంతంగ పంజేసుకునే పరిస్థితి లేనట్టుంది. అమృత గునిగింది. సరే రాత్రి ఏదో టిఫిని తెప్పిచ్చుకొని తిన్నం. రేపటి యింటర్వ్యూకు అమృతతో పాటు నేంగూడ ప్రిపేరై నిద్రబోయినం.

తెల్లారి లేసి తయారై రిసెప్షన్‌ల తాళం చెవి ఇచ్చి, డబ్బులు కట్టి బస్టాండుకొచ్చి దమ్మక్కపేట బసెక్కి మా పెద్దమ్మ యింటికి బొయినం. మా పెద్దమ్మ కొడుక్కు ఫోన్ జేస్తె ఔట్ ఆఫ్ కవరేజి ఏరియా అని వస్తంది. యిగ సర్పంచి నంబరు గిట్ల నా దగ్గెర లేదు. ఆమెకు ఫోనున్నట్లు గూడ తెలువది. యింటికి బొయేటాలకు యింట్ల యెవ్వరు లేరు. పది పన్నెండేండ్ల పిల్లలు బాసాండ్లు తోముతుండ్రు, నీల్లు బోరింగు కాన్నుంచి మోస్కుంటుండ్రు. కోల్లు గోడల పోంటి మట్టిని తవ్వుతున్నయి, ఓ దిక్కు కుక్కలు పండుకున్నయి, యింకో దిక్కు దుడ్డె మేస్తుంది. యిల్లు గూన పెంకిల్లు. దానికానుకొని పాకున్నది. పాకముందట మంచం నిలబెట్టి వుంటే.. పోసవ్వలేదార అని పిల్లలనడుగుతూ కూసున్న. మీ అమ్మేది అమృత అడిగింది మంచాలకూసుండుకుంటా. పోసవ్వ వూల్లెకు బొయింది, మా అమ్మ పటేలు సేనుకు నీల్లు బెట్ట బొయిందని బాసాండ్లు తోమే బుజ్జి చెప్పింది. నేను వాల్లకు మేనత్తను కావాలననే సంగతి తెలువది. ఎప్పుడో వాల్లమ్మ నాన పెండ్లికి వచ్చి మల్లా గిప్పుడొచ్చిన. మద్దె మద్దెన వాల్లమ్మ నానలు కల్సినా పిల్లలతో పరిచయం లేదు. మా పెద్దమ్మను గూడ పెండ్లీలల్ల, సావులల్ల చూసుడే గానీ యింటికొచ్చింది లేదు గానీ, ఆమె కోడలు సర్పంచయిందని తెలుసు. అమృత చేసే ప్రాజెక్టు మా పెద్దమ్మ యింటికి తీసుకొచ్చింది. సరే! అమృతా యెవ్వల్లేరింట్ల అట్లా వూరి లోపలికి బొయి తిరిగొద్దాంపా మా పెద్దమ్మ వూల్లెకు బొయిందట, కలుస్తదిపా... అని వూల్లెకు బైల్దేరదీసిన అమృతను. వూల్లెకు నడుచుకుంట పోతాంటె వూరికి కొంచెం మధ్యలో గ్రామ పంచాయతీ ఆఫీసు అని రాసుంది. అది గూడ గూనపెంకులున్న కప్పుతోని వుంది. ముందు అరుగులున్నయి. తాళం బుర్ర గాలితో తాళం గొడ్తుంది. అరుగుల మీద యిద్దరు ముగ్గురు ముసలోల్లు కూసోని ఉన్నరు ఏందో ముచ్చట బెట్టుకుంటుండ్రు.అమృత ఆ పెద్ద మనుసుషులతోని ఏమన్నా మాట్లాడుదాంపా అనంటే ఇద్దరం పోయినం వాల్ల కాడికి. మమ్ముల జూడంగనే ఏ వూరమ్మ మీది? యేడికొచ్చిండ్రు అన్నడు అండ్లో పెద్దాయిన.

మేము మీ వూరి సర్పంచి కోసముకొచ్చినము అని చెప్పింది అమృత. సర్పంచా! యాడ దొర్కుతది మీకు సర్పంచి, మాకే దొర్కది ఒక తెల్ల మీసాలైన. ఆ.. గీ కూల్నాలి గాల్లకు, అమాంతం సరిపంచిని జేత్తె ఏం జేత్తరు! సరిపంచి అనరానోల్లల్లగ్గూడ గౌరుమెంటు సర్పంచుల నేంది, జెట్‌పీటీసీలను జేసె, ఎంపీటీసీలను జేసె. అంత జేసినా గీల్లేం నిలబెట్టుకుంటండ్రు.. గదే మాదిగిర్కెమ్ ఉపసర్పంచిగున్న మన పటేలు చంద్రారెడ్డే లెక్కలు బొక్కలు జూత్తడాయె. యింకో పెద్దముసలాయన నోరంత సమాలిచ్చుకుంట.మనూల్లె గా మెల్కటి పోసి కోడల్ను సర్పంచిని జేత్తిమి. సేత్తేమైంది రోజు కూలి నాలి కురుకుడే సరిపోతంది. నీ తల్లి... గీల్లను సర్పంచులను జేత్తే సర్పంచిగిరిని యిజ్జద్దీస్తుండ్రు. గాల్లు రాజిర్కమేంజేత్తరు?యే.. వొక్క మనూరేనా.. వూర్ల పోంటంత గిదే కతయీల్లది.తువ్వాలలు దులుపుకుంట యెల్లిపోయిండ్రు పొద్దు బారెడెక్కిందనుకుంటా.. ఏమన్నా సల్లబడాలనుకుంటా.. కూలినాలి జేసుకునే అంటరాని కులాలు సర్పంచి గుండొద్దనే దురహంకార ఆధిపత్య కుచ్చితాలకు కడుపంత సలసల మరిగింది. ఎస్సీ సర్పంచులను అందులో మహిళా సర్పంచుల పట్ల వాల్ల కడుపుల చెత్తనువిన్న నారాజుల్తో సర్పంచి యింటిదారి బట్టినంక ఎదురుగా.. నెత్తిమీద బండెడు కట్టెల మోపుతో ఎదురైంది సర్పంచి.కట్టెల మోపు వాకిట్ల యెత్తేసి మొకాన సెముట తూడ్సుకుంటా.. బాగేనా ఎప్పుడొస్తిరి అనుకుంట దగ్గరికొచ్చి కూసున్నది.అమృత మీరు సర్పంచి గదా! గట్లాంటి మొద్దు బరువు పనులెట్ల జేస్తవు అని అడిగింది బాదగ. మరి బువ్వకెట్లెల్లాలె, యింట్ల పొయి మీదికి, పొయి కిందికి నేనే జూసుకోవాలె. అయినా పంచాయిదాఫీసుల వూల్లె రాజర్కంతర్వాతనే ఏ కూలి నాలైనా! యింత జేసినా వూల్లె మనుషులు హేళన జేస్తనే ఉంటరు. పని లేనప్పుడే ఆ కూలి, యీ కూలి జేస్త. యెట్ల బత్కాలె యెన్కముందటేమి లేనోల్ల మైతిమి. అన్న ఆమె ఆత్మ విశ్వాసానికి ఆశ్చర్యపోయిన. అమృత సర్పంచి యింటర్వ్యూకు రికార్డు సెట్ చేస్కుంది ఉత్సాహంగా.. యిది రాజర్కం గాదు రాణిర్కమ్ అనుకుంటా.

జూపాక సుభద్ర, సెల్: 9849905687

225
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles