పద్య రత్నాలు-2


Sat,May 11, 2019 11:10 PM

ఎంత చదివితేనేమి?

చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతు లెవ్వరు మెచ్చ రెచ్చటం
బద నుగ మంచికూర నల పాకము చేసిన నైన నందు నిం
పాదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య! భాస్కరా!
- భాస్కర శతకం

తాత్పర్యం:ఎంత చదివితే ఏం లాభం? అందులోని సారం గ్రహించనంత వరకు అదంతా వ్యర్థమే కదా. మంచి గుణవంతులుగా కావాలంటే చదువులోని పరమార్థాన్ని గ్రహించాలి. ఎలాగైతే, నలభీమ పాకాలకైనా సరే చిటికెడు ఉప్పు లేకపోతే అవి రుచించనట్టు. కనుక, పిల్లలైనా పెద్దలైనా ఏది చదివినా, ఎంత చదివినా మనసు పెట్టి చదవాలి. అందులోని సారాన్ని తెలుసుకోవాలి.
Entha-chadivithenemi

వినయమే కదా ఆభరణం!

ఏనాడైనను వినయము
మానకుమీ మత్సరమున మనుజేశులతో
బూనకు మసమ్మతము బహు
మానమునను బొందు మిదియె మతము కుమారా!
- కుమార శతకం

తాత్పర్యం:ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు. ఇంకా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలం.

ధర్మబద్ధంగా జీవించకపోతే ఎలా?

ఘడియల్ రెంటికొ మూటికో ఘడియకో కాదేని నేడెల్లి యో
కడనేడాది కొ యెన్నడో ఎరుగమీ కాయంబు లీ భూమి పై
బడగానున్నవి, ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్
చెడుగుల్ పదభక్తియుం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!
-శ్రీ కాళహస్తీశ్వర శతకం

తాత్పర్యం:ఈ భూమిమీద మానవ జీవితం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా సరే ఎంతటి వారికైనా మరణం తథ్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇది తెలియకో లేదా తెలిసి కూడా ఏమవుతుందిలే అని అనుకొంటారో కానీ చాలామంది పాపపు పనులు చేస్తూ అధర్మమార్గంలోనే జీవిస్తున్నారు. ఒక్క ధర్మాన్నయినా పాటించకుండా అజ్ఞానంతో వుంటున్న ఈ మానవులను సర్వేశ్వరుడివైన నువ్వే క్షమించాలి సుమా.

దుష్టులకు జ్ఞానబోధ వ్యర్థం!

భుజబలంబున బెద్దపులుల జంపగవచ్చు, పాము కంఠము జేత బట్టవచ్చు
బ్రహ్మరాక్షస కోట్ల బాఱద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగ వచ్చు, బదను ఖడ్గము చేత నదుమవచ్చు
గష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు, దిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చు
బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ దెలిపి
సజ్జనుల జేయలేడెంత చతురుడైన
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
- శ్రీ నరసింహ శతకం

తాత్పర్యం:భయంకరమైన పెద్దపులులనైనా భుజబలంతో చంపగలం. పాముకంఠాన్ని చేత్తో పట్టుకోగలం. కోటి బ్రహ్మరాక్షసులనైనా పారదోలగలం. మనుషుల రోగాలనూ మాన్పగలం. నాలుకకు రుచింపని చేదునైనా మింగగలం. పదునైన కత్తిని చేత్తో అదుమగలం. కష్టమైనా సరే, ముండ్లకంపలోకి దూరగలం. ఆఖరకు, తిట్టేవాళ్ల నోళ్లనైనా కట్టడి చేయగలం. కానీ, దుష్టులకు జ్ఞానబోధ చేసి, వారిని మంచివారిగా మాత్రం మార్చలేం. ఎంతటి చతురులకైనా ఇది సాధ్యపడదు సుమా.

163
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles