వాస్తు


Sat,May 11, 2019 11:05 PM

ఇంటికి నాలుగు దిక్కుల సింహద్వారాలు పెట్టొచ్చా?జనార్దన్, కొంపల్లి

ముందు సింహద్వారం ఏది అనేది మనకు అర్థం కావాలి. వీధి ఉండి ఆ వీధికి ఎదురుగా ఇల్లుకట్టి అందరూ రాకపోకలు చేసే ప్రధాన ద్వారాన్ని సింహద్వారం అంటారు. అంటే ఇంటి శరీరానికి నోరు లాంటిది. దానికి ఎదురుగా తప్పక గేటు రావాలి. అయితే ఇంటికి ఎన్ని సింహద్వారాలు ఉంటాయి అనేది మరొక అంశం. వీధి ఉన్నప్పుడే ద్వారం వస్తుంది. దానిని సింహద్వారం అంటాము. అలా వీధులు మూడు వస్తే మూడు సింహద్వారాలు పెట్టుకోవచ్చు. ఇదికాక ఒక్క రోడ్డు ఉన్నా ఇల్లు కట్టుకొని దాని చుట్టూ ప్రహరీ నిర్మించి ఆ ఇంటికి నాలుగువైపులా ద్వారాలు పెట్టుకోవచ్చు. ఇదంతా ఇంటిని ఆ నాలుగు ద్వారాలు పెట్టుకునే విధంగా శాస్త్ర ప్రకారం నిర్మించినప్పుడు అంటే ఆ ద్వారం ఒక గదిని మాత్రమే కలిగి ఉండేదికాక ఇంటి ప్రధాన గర్భంలోకి తీసుకు వెళ్లగలగాలి. అవి మాత్రమే ముఖ్య ద్వారాలు అవుతాయి. అంటే ఆ గమన నిష్క్రమణ ద్వారాలు చత్రశాల భవంతికి తప్పక నాలుగు ద్వారాలు పెట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కట్టే ఇండ్లకు నాలుగు ద్వారాలు పెట్టే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఒకరిపేరు మీద కట్టిన ఇంట్లో మరొకరు నివాసం ఉండొచ్చా?పి.మానస, చంపాపేట

ఇల్లు అన్ని భావాల సమ్మేళనం. ఆ గృహ సభ్యులు తమ పేర్ల మీద మంచిరోజు చూసుకొని ముహూర్తాలు చేసుకుంటారు. గృహ ప్రవేశాలు చేస్తారు. ఇదంతా ఆ కుటుంబం కార్యకలాపం. ఇక ఆ ఇంటి సభ్యుల ప్రధాన వ్యక్తుల మీద ఆ ఇల్లు కట్టబడుతుంది. రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. ఇది ఒక అంశమైతే అందులో వేరేవారు నివాసం ఉండటం దోషం ఎందుకు అవుతుంది. కారు కంపెనీ ఒక పేరు మీద ఉంటుంది. కారుకొన్న వ్యక్తి దానిలో ప్రయాణం చేస్తాడు. కొనని వారు కూడా ప్రయాణిస్తారు. వారిని కారు ఇబ్బంది పెడుతుందా? నడువను అంటుందా? పంచ భూతాలతో తయారైన గృహం వ్యవహారగతంగా ఒక వ్యక్తికి ఆధీనం అవుతుంది. కానీ దాని గుణగణాలు అందరికీ ఉపకరిస్తాయి. పేరు వల్ల కొత్త శక్తులు రావు, పోవు. అయితే ఆ గృహం సకల శక్తుల నిలయంగా శాస్త్రబద్ధంగా తప్పక నిర్మితమై ఉండాలి.
vasthu

మాకు దక్షిణం, పడమర రోడ్లు ఉన్నవి. ఆ చోట కాంపౌండు వాల్ లేకుండా విల్లా కట్టవచ్చా?ఎనబోలు చంద్రం, ఎల్‌బి నగర్

అన్ని బ్లాకుల్లో నైరుతి బ్లాకు చాలా గొప్పది. చాలా భయంకరమైంది. కాబట్టి దాని విషయంలో జాగ్రత్త వహించాలి. వెన్నెముక ఎంత ప్రాముఖ్యమో ఇంటికి నైరుతి అంత. ఏ ఇంటికైనా చుట్టూ ప్రహరీలు చాలా అవసరం ప్రహరీలు లేని ఇల్లు స్ప్రింగులు లేని కార్లు అనొచ్చు. ఇల్లు ఎంత గొప్ప శాస్త్రంతో పథకం వేసి కట్టినా దానికి సంపూర్ణత ప్రహరీలతోనే వస్తుంది. పైగా మీది నైరుతిబ్లాకు దానికి కాంపౌండ్స్ చాలా శక్తిని ఇస్తాయి. దక్షిణం, పడమర ప్రహరీలు లేని నైరుతి ఇల్లు శ్మశానాన్ని తలపిస్తుంది. చాలా విల్లాస్‌లల్లో (గేటెడ్ కమ్యునిటీల్లో) చుట్టూ కాంపౌండ్స్ లేకుండా కట్టి నివాసం ఉంటున్నారు. అది ఎంత సోకైనా తాత్కాలికమే. అవి తప్పక కుటుంబాల మీద రేపు పెనుభారం మోపుతాయి.

పెరిగిన పడమర స్థలాన్ని పార్కింగ్‌కు వాడొచ్చా?వెంకటలక్ష్మి, కొలన్‌పాక

రోడ్డు పడమర వైపు ఉండి, ఇంటికి తూర్పుకన్నా పడమరలో ఖాళీ స్థలం ఎక్కువగా వదిలినప్పుడు అటువైపు ఉన్న అధిక భాగాన్ని రోడ్డులోకి కలిపినప్పుడు ఆ భాగంలో కారు పార్కింగ్‌గా వాడుకోవచ్చు. లేదా పెరిగిన ఆ పడమర స్థలంలో వీధికి అభిముఖంగా షాపులు కట్టి కూడా వాస్తు దోషం లేకుండా చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి దానిని వాడుకోండి. ఏదైనా ఇంటికి పడమర పెరుగుదల సరిచేయడం మీ ఉద్దేశం మంచిదే. పడమర వైపు రోడ్డు లేనప్పుడు ఆ భాగాన్ని సరైన కొలతలతో వేరు చేసి ఎత్తయిన ప్రహరీ కట్టాలి. దానిని మీరు మీ కుటుంబ సభ్యులు వాడవద్దు. మీ వెనకవారు అడిగితే ఇచ్చివేయాలి. అది వారికి శుభం కలిగిస్తుంది.

సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

199
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles