ఓటమి తొలిపాఠం.. విజయం మలిపాఠం!


Sat,May 4, 2019 11:29 PM

ఓడిపోయామని ఓ మూలన కూర్చుంటే గెలుపు మనల్ని వెతుక్కుంటూ రాదు. ఓటమిని పరిచయం చేసిన దారుల వెంట విజయాన్ని శోధిస్తూ పోతే.. విజయం సాధించవచ్చు. పరుగు ఆపితే.. పందెంలో గెలుపో, ఓటమో ఎలా తెలుస్తుంది? ప్రపంచాన్ని శాసించిన చాలామంది జీవితంలో చాలా దశల్లో ఓడిపోయినవాళ్లే. అంతమాత్రాన వారు అక్కడే ఆగిపోలేదు. ప్రయత్నం ఆపలేదు. ఫలితం.. విజయం వారి వాకిట్లో తిష్ట వేసింది. ఎంతోమంది జీవితాలకు వారు ఆదర్శమయ్యారు. జగజ్జేతలుగా నిలిచారు. ఎందరో మహానుభావులు.. వారు కూడా మీలాగే ఓడారు. కానీ.. ఆగిపోలేదు. ఓటమి భయంతో, బాధతో చచ్చిపోలేదు. నిలిచి.. గెలిచారు. విజయగాథలు చదివితే ఎంతో కొంత స్ఫూర్తి వస్తుంది. కానీ.. ఓటమి కథలు చదివి వారు ఎలా గెలిచారో చదివితే.. గెలుపు బాటలో ఎలా నడువాలో తెలుస్తుంది. అందుకే.. ఈ వారం బతుకమ్మ అందిస్తున్న ప్రత్యేక కథనం.. మీకోసం..

-ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412
Life

పరీక్షలో ఫెయిల్ అయ్యామని విధ్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉద్యోగం రాలేదని మొన్నటికి మొన్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇలా రోజూ ఎన్నో జీవితాలు ఓటమిని భరించలేక ఆత్మహత్యలకు ప్రాణాలు బలిపెడుతున్నాయి. ఓడిపోతే ఆలోచించాల్సింది ఆత్మహత్య గురించి కాదు.. ఆత్మైస్థెర్యం గురించి. జీవితాన్నిమార్కులతో కాదు.. మార్పులతో, విజయాలతో నింపాలి. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నప్పుడే గెలుపు మనదవుతుంది. అప్పుడే మన జీవితం మరొకరికి పాఠం అవుతుంది. ఓడిపోయామని, ఫెయిల్ అయ్యామని బాధపడొద్దు. దాన్ని గెలుపు వైపు మళ్లించు.. అదే నీ విజయానికి దారి. ఆల్ ది బెస్ట్ !

ధీరూబాయ్ అంబానీ

ధనిక కుటుంబంలో పుట్టలేదు. తండ్రి టీచర్ అయినప్పటికీ.. ఆర్థిక పరిస్థితుల వల్ల పదో తరగతితో చదువు ఆపేశాడు. యెమెన్‌లోని ఓ చిన్న గ్యాస్‌స్టేషన్‌లో నెలకు రూ.300 జీతానికి పనికి కుదిరాడు. ఆ తర్వాత ప్రమోషన్ మీద మరో బ్రాంచీకి మారాడు. కానీ, ఆ ఉద్యోగం ఆయనను స్థిరంగా ఉండనివ్వలేదు. అక్కడి నుంచి ఇండియా వచ్చేశాడు. అప్పటికి ఆయన దగ్గర ఉన్నవి కేవలం రూ.500 మాత్రమే. ముంబైలో ఓ చిన్న గది అద్దెకు తీసుకొని భార్యాపిల్లలతో జీవనం మొదలుపెట్టాడు. ఏడెనిమిదేండ్లు రకరకాల చిన్నా చితకా వ్యాపారాలు చేశాడు. మసాలాలు, దుస్తుల వ్యాపారం చేశాడు. చిన్నాన్న కొడుకులతో కలిసి 1960లో రిలయన్స్ పేరుతో కంపెనీ మొదలుపెట్టాడు. పాలిస్టర్‌ను దిగుమతి చేసుకోవడం, మసాలాలు ఎగుమతి చేయడం వీరి వ్యాపారం. కొన్నిరోజుల్లోనే చిన్నాన్న కొడుకులిద్దరూ వ్యాపార భాగస్వామ్యం నుంచి వైదొలిగారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒంటరిగానే వ్యాపారాన్ని కొనసాగించాడు. మెల్లగా లాభాలు వచ్చాయి. అహ్మదాబాద్‌లో సొంతంగా మరో టెక్స్‌టైల్స్ కంపెనీ ప్రారంభించాడు. అది కూడా సక్సెస్ అయింది. కేవలం రూ.500లతో మొదలుపెట్టిన జీవితం.. పదేండ్లు తిరిగేసరికి రూ.70 కోట్లకు చేరింది. ఆ విజయంతో ఆయన ఆగిపోలేదు. ఎంత ఎక్కువ కష్టపడితే.. అంత ఎక్కువ ఎదుగుతాం అనే మాటను నమ్మాడు. నిత్యం తన కంపెనీల్లో పనిచేసే కార్మికులకు పేదవాడిగా పుట్టడంలో తప్పులేదు.. పేదవాడిగా చచ్చిపోతే మాత్రం అది కచ్చితంగా నీ తప్పే అని చెప్పేవాడు. అందుకే.. పేదవాడిగా పుట్టి, పెరిగిన ధీరూబాయ్ ఇప్పుడు ఎంతోమంది పేదవాళ్లకు ఆశ్రయమిచ్చే నీడ అయ్యాడు. కొన్నివేల కోట్లు సంపాదించాడు. వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.. అని చెప్పే ధీరూబాయ్ ఆ మాటలను నిజం చేశాడు. ఫోర్బ్స్ కంపెనీ కుబేరుల జాబితాలో చోటు సంపాదించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

-లక్ష్యాన్ని చేరుకోడానికి కష్టపడండి. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోండి
- ధీరూబాయ్ అంబానీ
Life1

ఏపీజే అబ్దుల్ కలాం

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అబ్దుల్ కలాంకి లెక్కలంటే చాలా భయం. యుద్ధ పైలట్ కావాలనుకున్న కలాం కల ఒక్కస్థానం కోల్పోవడం వల్ల నెరవేరలేదు. కానీ.. ఆ తర్వాత ఎన్నో యుద్ధవిమానాలకు ఆయన సృష్టికర్తగా మారాడు. మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఆయనకు అంత పట్టు ఉండేది కాదు. ఆ సబ్జెక్ట్ మీద పట్టు సాధించడానికి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడు. అక్కడి నుంచి మద్రాస్ రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ న్యూస్‌పేపర్ పార్శిల్ తీసుకొని ఇంటింటికి తిరిగి పేపర్ పంచేవారు. ఆ తర్వాత మళ్లీ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవాడు. సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కిరోసిన్ దీపం పెట్టుకొని చదువుకునేవాడు. కష్టపడి చదివి చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు సాధించాడు. అక్కడ కలాం ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. ఆయన పనితనం చూసి ప్రొఫెసర్లే ఆశ్చర్యపోయేవారు. భారత సైన్యం కోసం హెలికాప్టర్ తయారుచేయడం ద్వారా తన మేధాశక్తికి పనిచెప్పిన కలాం ఇస్రోలో ఎస్‌ఎల్‌వీ-3 ప్రయోగానికి డైరెక్టర్‌గా, రాష్ట్రపతిగా, పద్మవిభూషణ్, భారతరత్నగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఒక ప్రాజెక్టు మొదలుపెట్టాడంటే.. అది పూర్తయ్యేవరకు అన్నం తినేవాడు కాదు. నిద్ర కూడా పోయేవాడు కాదు. ఆ పట్టుదల ఆయనను ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తను చేసింది. దేశం గుండెలకు హత్తుకుని గర్వించింది. ఎన్నో అణ్వాయుధాలు దేశానికి అందించి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నాడు.

-కలల్ని నిజం చేసుకోవడానికంటే ముందు.. ఏ కలల్ని నిజం చేసుకోవాలనుకుంటున్నావో.. కలగను
- ఏపీజే అబ్దుల్ కలాం
Life2

రజినీకాంత్

శివాజీ రావ్ గైక్వాడ్ రజినీకాంత్ అసలు పేరు ఇది. బస్ కండక్టర్‌గా ప్రయాణికులకు టిక్కెట్లిచ్చే రజినీకాంత్ దేశం గర్వించదగ్గ సూపర్‌స్టార్ స్థాయికి ఊరికే ఎదగలేదు. చిన్నప్పటి నుంచి సినిమా నటుడిగా స్థిరపడాలన్న కోరిక ఉన్నప్పటికీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండేవి. కానీ.. నిజ జీవితంలోనైనా హీరోగా ఉండాలన్న ఆలోచనతో తనకు మాత్రమే సొంతమైన ైస్టెల్స్, మేనరిజమ్స్ ప్రదర్శించేవాడు. బస్సులో ప్రయాణికులకు టిక్కెట్లిచ్చే క్రమంలో ఆయన ైస్టెల్స్ కోసం ప్యాసింజర్స్ రజినీ ఉన్న బస్ వచ్చేదాకా ఎదురుచూసి మరీ ఎక్కేవారట. చదువు అయిపోగానే.. కుటుంబ ఖర్చుల కోసం రజినీ కార్పెంటర్, కూలీ పనులు కూడా చేశాడు. ఫిలిం చాంబర్‌లో యాక్టింగ్ కోర్సు చేసే సమయంలో రజినీకి చాంబర్ ఫీజు కట్టే స్థోమత కూడా ఉండేది కాదు. ఓ వైపు బస్ కండక్టర్‌గా చేస్తూనే.. నాటకాల్లో నటించేవాడు. డైరెక్టర్ బాలచందర్ ఓ సినిమాలో హీరోగా అవకాశమిచ్చినా.. ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రలే వచ్చాయి. ఏ పాత్ర అయినా సరే.. ఇది రజినీ మాత్రమే చేయగలడు అనేలా కష్టపడ్డాడు. ఆ తర్వాత రజినీ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

-దేవుడు చెడ్డవాళ్లకు చాలా ఇచ్చాడు. కానీ.. వారు ఓడిపోతారు. దేవుడు మంచివాళ్లకి ఏమీ ఇవ్వడు. పరీక్షలు పెడతాడు. కానీ.. ఓడిపోనివ్వడు
- రజినీకాంత్
Life3

అమితాబ్ బచ్చన్

నీ మొహం అద్దంలో చూసుకున్నావా అన్నారు. ఏం గొంతు నీది.. ఈ గొంతుతో డబ్బింగ్ చెప్తావా.. వెళ్లవయ్యా.. వెళ్లు అని వెళ్లగొట్టారు. నీ అందం, పొడుగు సినిమాల్లో పనికిరావు అంటూ పంపించేశారు. రేడియో జాకీగా ప్రయత్నిద్దామని చూశాడు.. బేస్ ఎక్కువ ఉండడంతో అక్కడ కూడా నో చెప్పారు. ఎక్కడికి వెళ్లినా అవకాశాలు దొరకలేదు. అయినా.. అమితాబ్ తన ప్రయత్నాన్ని ఆపలేదు. కష్టపడి సినిమా అవకాశం సంపాదించాడు. ఆ సినిమా పేరు సాత్ హిందుస్తానీ. అది బాగా ఆడలేదు. ఆ తర్వాత వరుసగా తొమ్మిది సినిమాల్లో అవకాశం వచ్చింది. అన్నీ ఫ్లాపయ్యాయి. చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు. వాయిస్ ఓవర్, డబ్బింగ్ కూడా చెప్పాడు. పెద్దగా సక్సెస్ రాలేదు. అందరూ ఆయనను ఐరన్‌లెగ్ అన్నారు. ఈ సమయంలోనే ఇంకో సినిమా చాన్స్ వచ్చింది. అదే.. జంజీర్. ఆ సినిమాతో అమితాబ్ ఒక్కసారిగా వెలిగిపోయాడు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మంచి పేరొచ్చింది. అదృష్టం ఫెవిక్విక్‌లా అతుక్కుపోయింది నీకు అన్నారు అందరూ. మళ్లీ బ్యాడ్‌టైమ్ స్టార్టయింది. ఎన్నో సమస్యలు. నిద్రలేని రాత్రులు గడిపాడు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో మొదలుపెట్టిన నిర్మాణ సంస్థ దివాళా తీసింది. ఆర్థికంగా చాలా పోగొట్టుకున్నాడు. సన్నిహితులు, ఫ్రెండ్స్ ఆ కంపెనీ మూసేయమని సలహా ఇచ్చారు. కానీ.. అమితాబ్ మూసేయలేదు. కమర్షియల్ ప్రోగ్రామ్స్, టీవీ ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే కౌన్ బనేగా కరోడ్‌పతి అనే కార్యక్రమానికి రూపుతెచ్చాడు. అది ఆయన జీవితంలోనే కాదు.. ఎంతోమంది జీవితాలను మార్చింది. మనం సాధించాలనుకున్న దాని కోసం ఎంత కష్టమైనా ఓర్చుకోవాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాలి. అప్పుడే మనం కోరుకున్నది మనకు దక్కుతుంది. ఈ మాటలు అమితాబ్ జీవితంలో నిజమని తేలాయి. ఆయన హార్డ్‌వర్కే ఆయనను తిరుగులేని విజేతగా నిలిపింది. పరాజిత నుంచి విజేతగా నిలిచిన అమితాబ్‌లా మనం కూడా సవాళ్లను, ఓటములను అధిగమిస్తే.. విజేతలుగా నిలవవచ్చు.

మనం ఏదైతో పోగొట్టుకున్నామో.. అది అంత సులభంగా పొందింది కాదు.. మనం ఏదైతే పొందామో.. అది అంత సులభంగా మనల్ని వదిలిపోదు
- అమితాబ్ బచ్చన్
Life4

సచిన్ టెండుల్కర్

సిక్స్ కొడితే.. ఇది సచినే కొట్టాడు అనిపించేలా బంతిని బాదే.. సచిన్ టెన్త్‌లో ఆరు మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి జులాయిగా తిరిగేవాడు. అదే పదో తరగతిలో ఫెయిల్ అయ్యేలా చేసింది. తండ్రి ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగి. తన చేష్టల వల్ల ఎప్పుడూ తండ్రితో చివాట్లు తినేవాడు. నీ వల్ల ఏం కాదు రా అనేవాడు తండ్రి. చదువు మీద తప్ప మిగతా అన్ని విషయాల మీద ధ్యాస ఉండేది. ఆ తర్వాత సచిన్‌కి క్రికెట్ పరిచయమయింది. తను చదువుతున్న స్కూల్ తరపున బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగాడు. అప్పటికి సచిన్ వయసు 14 సంవత్సరాలు మాత్రమే. 326 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ముంబై అంతా సచిన్ పేరు మార్మోగిపోయింది. కానీ.. ఆ తర్వాత మ్యాచ్‌లో సచిన్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. సచిన్ ఫెయిల్ అని మరునాడు పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో అచ్చయింది. ఆ తర్వాత మరో రంజీ ట్రోఫీలో సచిన్ బ్యాటింగ్‌కి దిగాడు. అప్పటి వరకు సచిన్ ఫెయిల్ అన్నవారంతా ఆసక్తిగా సచిన్ బ్యాటింగ్ చూస్తున్నారు. రెండున్నర గంటలు బంతిని గ్రౌండ్ మొత్తం తిరిగేలా కొట్టాడు. కట్ చేస్తే.. సచిన్ స్కోర్ 192. ఆ తర్వాత కొద్దిసేపటికి సచిన్ ఔట్ అయ్యాడు. సచిన్‌ని ఔట్ చేసిన ఆటగాళ్లు ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి కూడా వారి ఒంట్లో శక్తి లేకుండా గ్రౌండంతా పరుగెత్తించాడు. ఓడిపోయానని నిరుత్సాహపడిపోతే.. 14 పరుగులకే ఔట్ అయ్యానని సచిన్ కుంగిపోతే.. ఇప్పుడు మనకు మాస్టర్ బ్లాస్టర్ ఉండేవాడు కాదు. అందుకే.. కష్టపడితే.. ఫలితం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.

-ఎప్పుడైతే జనాలు నీ మీద రాళ్లు వేస్తారో.. ఆ రాళ్లనే నీ విజయాన్ని చిరునామాగా చూపే మైలురాళ్లుగా నాటుతూ సాగిపో
- సచిన్ టెండుల్కర్
Life5

నవాజుద్దీన్ సిద్ధిఖీ

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలో ఉన్న బుధన అనే చిన్న పట్టణంలో ఎనిమిది మంది సంతానం గల పేద దంపతులకు పెద్ద కొడుకుగా పుట్టాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. పేద కుటుబంలో పుట్టిన ఈ పెద్ద కొడుకుకు చిన్నప్పటి నుంచి కష్టాలే. ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే వదిలేశాడు. సినిమాలంటే చాలా ఇష్టం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని కలలు గనేవాడు. పనిచేసుకుంటూనే గ్రాడ్యుయేషన్ చేశాడు. ఓ పెట్రో కెమికల్ కంపెనీలో కెమిస్ట్‌గా పనికి కుదిరాడు. ఏడాది తర్వాత అక్కడి నుంచి ఢిల్లీ బయల్దేరాడు. చేతులో పైసల్లేవు. కానీ.. థియేటర్ ఆర్ట్స్ చేయాలని కోరిక. ఐదేండ్లు వాచ్‌మన్‌గా పనిచేస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ పట్టా పట్టుకొని బాలీవుడ్‌లో అవకాశాల కోసం తిరిగాడు. బస్సు చార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. నడుచుకుంటూనే.. స్టూడియోలు, సెట్‌ల చుట్టూ తిరిగాడు. ఎన్‌ఎస్‌డీలో పరిచయమైన ఓ సీనియర్ నవాజ్‌ని తన రూమ్‌లో ఉంచుకోడానికి ఒప్పుకున్నాడు. కాకపోతే రెండుపూటలా వండిపెట్టి, బట్టలుతికి బండెడు చాకిరీ చేయాలి. ఇలా చేస్తుండగా అమీర్‌ఖాన్ సినిమాలో చిన్న అవకాశం దొరికింది. ఆ తర్వాత పదేండ్లు చిన్న చిన్న సినిమాలు, షార్ట్‌ఫిలింస్, వీడియోలు చేశాడు. పతంగ్ అనే సినిమాలో ఓ పాత్ర దొరికింది. అది అంతర్జాతీయ స్థాయి ఫిలిం ఫెస్టివల్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పీప్లి లైవ్ అనే సినిమాలో అవకాశం. జనాలు గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమా ఛాన్సులు వచ్చాయి. 2012లో వచ్చిన కహానీ, గాంగ్స్ ఆఫ్ వసేపూర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి. వాచ్‌మన్ నుంచి మంచి నటుడిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ స్థిరపడి ఇప్పుడు నవాబులా బతుకుతున్నాడు. కష్టేఫలి అనే మాటకు నవాజ్ నిదర్శనంగా నిలిచాడు. సక్సెస్ కావాలంటే మామూలుగా రాదు.. కష్టపడాలి, ఓపికగా ప్రయత్నించాలి. అప్పుడే విజేతగా నిలుస్తాం.

-నా ప్రత్యేకత ఏంటో నాకు తెలియాలి. అని మానసికంగా ఫిక్సయ్యా. ప్రతిరోజూ నటించడం ప్రాక్టీస్ చేశా. డ్యాన్సర్లు, గాయకులు అవకాశాలు రాకపోయినా.. నిత్యం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కదా! నేనెందుకు చేయకూడదు అనుకున్నా. ఆ ప్రాక్టీసే నేను సక్సెస్ అవడానికి తోడ్పడింది
- నవాజుద్దీన్ సిద్ధిఖీ
Life6

ఇంకా ఎంతోమంది..

ఓటమిని గెలుపునకు దారిగా మలుచుకున్న విజేతల గురించి చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎంతోమంది నిత్యం మనకు స్ఫూర్తినిస్తుంటారు. వారిలో.. 27 సంవత్సరాలు సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిగా ప్రజలతో ఎన్నుకోబడిన నెల్సన్ మండేలా జీవితం ఒక స్ఫూర్తి. పదివేల సార్లు ఫెయిలై పదివేల ఒకటోసారి బల్బును కనిపెట్టడంలో విజయం సాధించిన థామస్ ఆల్వా ఎడిసన్, పడుకోడానికి కూడా స్థలం లేక స్నేహితుల ఇండ్ల తలుపుల దగ్గర నిద్రపోయిన స్టీవ్ జాబ్స్, హోటల్స్‌లో వెయిటర్‌గా టేబుల్స్ తుడిచిన అక్షయ్ కుమార్, నీకు నటనే రాదు అని హాలీవుడ్ మెడబట్టి బయటకు గెంటేసిన చార్లీ చాప్లిన్, నువ్వు అందంగా లేవు.. నీకు సినిమా ఛాన్సులు ఇవ్వలేం అని చెప్పినా పట్టు వదలకుండా ప్రయత్నించిన మార్లిన్ మన్రో ఇలా ఎంతోమంది. జాబితా రాసుకుంటూ పోతే.. ఈ పుస్తకం మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది గెలిచిన వారి గురించి కాదు.. వారు ఓటమి నుంచి పొందిన స్ఫూర్తి గురించి.

నీలో శక్తిని గుర్తించు..

ర్యాట్ రేస్ ర్యాంకు రావాలంటే వేగంగా పరుగెత్తాలి. నీకు సరిగ్గా పరుగెత్తడం రాలేదు. ఫెయిల్ అయ్యావు. అయితే.. నీకు గాలిలో ఎగిరే శక్తి ఉన్నది. నీ ఎగిరే శక్తిని ఈ పరీక్షల సిస్టమ్ గుర్తించలేదంటే. ఇంకా పెద్ద పోటీలకు వెళ్లు గెలుస్తావు. ఆత్మహత్య చేసుకుంటే ఏం లాభం? నేను కూడా ఫెయిలయ్యాను. సీఏ పూర్తి చేయడానికి మూడేండ్లు పట్టింది. చిన్న విత్తనం నాటితే అది మహావృక్షం అవుతుంది. మధ్యలో తుఫాను రావచ్చు. చెట్టు కొట్టుకుపోవడానికి పదిశాతం ఛాన్స్ ఉంది. నీరు లేక మొక్క మొలకెత్తకపోవచ్చు. దీనికి 25 శాతం ఛాన్స్ ఉంది. మొత్తం కలిపితే మొక్క మొలకెత్తని ఛాన్స్ 35 శాతం మాత్రమే. అసలు విత్తనమే నాటకపోతే 100 శాతం విత్తనం మొలకెత్తదు. ప్రయత్నం కూడా అలాంటిదే.
- యండమూరి వీరేంద్రనాథ్, రచయిత, నవలకారుడు

ఓడిపోతేనే.. గెలుస్తాం!

తల్లిదండ్రులు స్పోర్ట్స్ కోచ్‌లా ఉండాలి. ఒకసారి ఓడిపోతే.. బెటర్ లక్ నెక్స్ టైమ్ అని ఉత్సాహ పరుచాలి. అంతేగానీ.. నీ వల్ల కాలేదు. నిన్ను నమ్మి వేలకు వేలు ఫీజులు కట్టాను అని పిల్లలను నిందించొద్దు. చదివించడం వల్ల పిల్లలకు తెలియాల్సింది జ్ఞానం. మార్కులు కాదు. మార్కులు రాని వారికి, ఫస్ట్‌ర్యాంక్‌లో పాసైన వారి కంటే ఎక్కువ విజ్ఞానం ఉండొచ్చు. ఇక పిల్లల విషయానికొస్తే.. ఆత్మహత్య అనే ఆలోచనే రానివ్వకండి. ఎగ్జామ్‌లో ఫెయిలవడం, ఉద్యోగం రాకపోవడం, జీవితంలో ఎదగకపోవడం అనేవి కొద్దికాలం మాత్రమే. తాత్కాలిక సమస్యలకు ఆత్మహత్య అనే శాశ్వత పరిష్కారం విధించుకుంటే ఎలా? నేను కూడా ఎగ్జామ్‌లో ఫెయిలయ్యాను. ఇప్పుడు సక్సెస్ కాలేదా? ఎంతోమంది ప్రముఖులు ఎక్కడో ఒక దశలో ఓడిపోయినవాళ్లే.. పట్టుదలతో ప్రయత్నించి విజయ తీరాలను తాకారు. మీరు కూడా అంతే.
- బీవీ పట్టాభిరామ్, సైకాలజిస్ట్

811
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles