ఒక నియంత ఆత్మహత్య


Sat,May 4, 2019 11:09 PM

1945 మే 1న సాయంత్రం చీకటిపడుతున్నది.సోవియట్ యూనియన్ దళాలు బెర్లిన్ సమీపిస్తున్నాయి. జర్మనీతో వారి యుద్ధం ఆఖరి దశకు చేరుకుంది. జర్మన్ స్టేట్ రేడియో వార్తలు ప్రచారమవుతున్నాయి. శ్రోతలు ఇప్పుడు ఒక ముఖ్యమైన వార్తను వినబోతున్నారని అందులో ప్రకటించారు. మొదట గంభీరమైన సంగీతం వినిపించారు. ఆ తర్వాత హిట్లర్ మరణించారని ప్రకటించారు. బోల్షేవిజ్మ్‌లో పోరాడుతూ హిట్లర్ నేలకొరిగారని అందులో ప్రకటించారు. ఆ వార్తను చాలా గంభీరంగా చెప్పారు. ఇంతకీ ఆయన ఎలా చనిపోయారు. నిజంగా యుద్దంలో చనిపోయారా? ఆత్మహత్య చేసుకున్నారా? ఆయన మరణానికి అంత ప్రాధాన్యం ఏంటీ?

-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

Hitler

తన యుద్ధోన్మాదంతో ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నేత, జర్మనీ నియంత అఢాల్ప్ హిట్లర్. 60 లక్షలమంది యూదుల మరణానికి కారణమవ్వడమే కాకుండా రెండవప్రపంచ యుద్ధానికి ఆజ్యం పోసినవాడు హిట్లర్. ప్రజాస్వామ్య విధానాలతో ఎదిగి జాత్యహంకారంతో నియంతగా మారి లక్షలాదిమందిని ఊచకోత కోసిన నరరూప రాక్షసుడు. పోలండ్, డెన్మార్క్,నార్వే, బెల్జియం, నెదర్లాండ్స్,లక్సెంబర్గ్ దేశాల ఆక్రమణలోభాగంగా చేసిన యుద్ధాల్లో సాధించిన విజయాలతో ఇక ప్రపంచాన్ని జయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు హిట్లర్. అయితే అప్పటికే జర్మనీ నియంత చేతిలో చిక్కి విలవిల్లాడుతున్న దేశాలు అగ్రరాజ్యాల శరణుజొచ్చాయి. హిట్లర్ విజయగర్వంతో పొంగిపోతుంటే ప్రపంచ దేశాలు మాత్రం యుద్ధ భయంతో వణికిపోతున్నాయి. అదే సమయంలో అగ్రరాజ్యాలుగా ఉన్న సోవియట్ యూనియన్, బ్రిటన్, అమెరికాలు ఒక్కటయ్యాయి. హిట్లర్ విజయకాంక్షతో ముందడుగు వేస్తే తమ ఉనికికి భంగం కలుకగ తప్పదని అవి గుర్తించాయి. ఆయనను నివారించాలంటే ఒక్కటిగా జతకట్టాలన్న నిర్ణయానికి అవి వచ్చాయి. అంతే మూడు దేశాలు సంకీర్ణపక్షాలుగా ఏర్పడి జర్మనీని నియంత్రించాలనే లక్ష్యంతో ముందుకు కదిలాయి. ఒకవైపు సోవియట్ దళాలు, మరోవైపు బ్రిటన్, అమెరిక దళాలు జర్మనీని చుట్టూ ముట్టాయి.ప్రపంచదేశాల్ని జయించిన విజయగర్వంతో ఉన్న నాజీ సైనికులు అంతే వేగంతో ముందుకు కదిలారు. అయితే అప్పటి వరకు ఏదో ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ధరంగానికి దూకే జర్మనీ సైన్యానికి ఒకేసారి మూడు అగ్రరాజ్యాల సైనికులను ఎదుర్కోవడం కష్టంగా మారింది. అయినా తన ప్రసంగాలతో జర్మనీ పౌరులను ఆకట్టుకుని తను చేస్తున్న యుద్ధం సరైనదే అని నిరూపించే ప్రయ త్నం చేశాడు హిట్లర్. ఆయన ఉపన్యాసాలతో యుద్దోన్మాదులుగా మారిన నాజీ సైనికులు విజయమో వీరస్వర్గమో అన్నట్లు కదనరంగంలోకి దూకారు.

అగ్రరాజ్యాల నుంచి ఎదురవుతున్న దాడిని తట్టుకోవడం వారితో కాలేదు. ఒకవైపు వరుస యుద్ధాలు చేసి అలసిపోయిన సైనికులు, మరోవైపు అగ్రరాజ్యాలు అనుసరిస్తున్న యుద్ధతంత్రాలు నాజీలను కకావికలం చేశాయి. 1944లో యుద్ధం పూర్తిగా మిత్ర రాజ్యాలవైపు మొగ్గింది. సోవియెట్ సేనలు అప్రతిహతంగా పురోగమిస్తూ జర్మన్ దళాలను రష్యా నుండి పారదోలడమే కాకుండా పోలాండ్, రుమేనియాలలోకి చొచ్చుకుపోయాయి. అదే సమయంలో అమెరికా-బ్రిటన్-ఫ్రాన్స్ ఉమ్మడి సేనలు ఐరోపా ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్‌లను విముక్తం చేశాయి. తూర్పు నుండి సోవియెట్ సైన్యాలు, పశ్చిమం నుండి మిత్రరాజ్యాల సైన్యాలు ఏకకాలంలో ముట్టడించడంతో జర్మనీ ఊపిరాడని స్థితిలో చిక్కుకుంది. అప్పటికే యుద్ధం మొదలై నెలలు గడుస్తున్నాయి. మూడు వైపుల నుండి సంకీర్ణసైన్యాలు చుట్టు ముట్టడంతో జర్మనీ దళాలు తోకముడిచాయి. ఏప్రిల్ 15,16 తేదిల్లో బెర్లిన్ నగరం తూర్పున ఉన్న జర్మనీ దళాలపై సోవియట్ దళాలు ఫిరంగి గుండ్లు కురిపించగానే, రాత్రికి రాత్రే ఆ నగరంపై ఆఖరి దాడులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 21 నాటికి రెడ్ ఆర్మీ బెర్లిన్ శివార్లలోకి ప్రవేశించింది. శివారు పట్టణాలన్నీ స్వాధీనం చేసుకుంది. ఏప్రిల్ 27న జర్మనీలోని ఎల్బీ నది దగ్గర కలిసిన సోవియట్, అమెరికా దళాలు జర్మనీ సైన్యాన్ని రెండుగా విభజించడంలో విజయవంతం అయ్యాయి.
Hitler1

అప్పటి వరకు విజయం తనదే నన్న నమ్మకంతో ఉన్న హిట్లర్‌కు చావు భయం పట్టుకుంది. నిజానికి బెర్లిన్ నగరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నది సోవియట్ సేనలే. హిట్లర్ సామ్రాజ్య పతనం గ్యారంటీ అని అర్థం అయ్యాక పశ్చిమ రాజ్యాలు, సోవియట్ యూనియన్ మధ్య హిట్లర్ సామ్రాజ్యంలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని వశం చేసుకోవాలన్న పోటీ అంతర్గతంగా నడిచింది. సోవియట్ ఆధీనంలోకి ఎంత ఎక్కువ దేశాలు వెళ్తే కమ్యూనిజం ప్రమాదాన్ని అంత ఎక్కువ ఎదుర్కోవలసి వస్తుందని పశ్చిమ రాజ్యాలు భయపడ్డాయి. ఈ నేపథ్యం లో ఒకవైపు పశ్చిమ దిశ నుండి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు జర్మనీని ఆక్రమించుకోగా, తూర్పు దిశ నుండి సోవియట్ యూనియన్ ఆక్రమించుకున్నాయి. ఆ విధంగా తూర్పు జర్మనీ సోవియట్ యూనియన్ ఆధీనంలోకి వెళ్ళ గా మిగిలిన భాగాన్ని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు తలా ముక్కా పంచుకున్నాయి. అనంతరం ఓ పదిహేనేళ్ళ తర్వాత అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఒక ఒప్పందానికి వచ్చి తమ మూడు భాగాలను ఐక్యం చేసి పశ్చిమ జర్మనీని ఏర్పాటు చేశాయి.

జర్మనీ పతనానికి ముందు ఇటలీ నియంత ముసోలినిని స్థానిక (మిలన్) ప్రజలు దాడి చేసి పట్టుకున్నారు. జర్మనీ సైన్యంతో కలిసి జర్మనీ సైనికుల యూనిఫారం ముసుగులో పారిపోతుండగా ముసోలినిని పట్టుకున్నారు. ఇటలీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ముసోలిని, అతని భార్యను కాల్చి చంపగా జనం వారి శవాలను మిలన్ నగరంలో ఓ బహిరంగ ప్రదేశంలో తాళ్ళకు కట్టి తలకిందులుగా వేలాడదీశారు. వేలాడదీసిన శవాలను కూడా వదలకుండా జనం ఇష్టం వచ్చినట్లు కొట్టి, తన్ని, లాగి, పీకి దాదాపు ఆనవాళ్ళు లేకుండా చేశారు. చివరికి అధికారులు,సైనికులే వారిని నియంత్రించాల్సి వచ్చింది.

ఏప్రిల్ 28, 1945 తేదీన ముసోలిని దంపతులను కాల్చి చంపగా ఏప్రిల్ 29 తేదీన వారి శవాలను వేలాడదీసి ఇష్టం వచ్చినట్లు కొట్టిన సంఘటన జరిగింది. ఈ సమాచారం హిట్లర్‌కు చేరింది. తన పరిస్ధితి కూడా అదే అవుతుందని హిట్లర్ భావించాడు. శత్రువుకు పట్టుబడడం జరగనే కూడదని శపథం చేశాడు. ఇక తనకు చావు తప్పదని తేలగానే బెర్లిన్ నగరంలో నిర్మించుకున్న భూగృహంలోకి వెళ్లిపోయాడు. తనకు ఆప్తులైన కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నారు.
Hitler2

ఆయన చాలాకాలం పాటు తనను పోలిన వ్యక్తులను ముందుంచి యుద్ధం నడిపించేవాడని, తను తినే ఆహారాన్ని కూడా తను ముందుతినేవాడు కాదని అంటారు. అన్నట్లే రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయం లో తమ ప్రాణాలకు తెగించి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రాణాన్ని కాపాడే విధులను 15 మంది మహిళలకు అప్పగించారు. హిట్లర్ కోసం తయారు చేసిన పదార్థాల్లో విషం కలిపారేమో తెలుసుకో డానికి ఆయన కంటే ముందు వాటిని రుచిచూడడమే ఆ యువతుల పని. 2012 డిసెంబర్ ముందు వరకూ ఈ విషయం ఎవరికీ తెలీదు. మార్గట్ వోక్ అనే ఒక మహిళ 70 ఏళ్ల తర్వాత మౌనం వీడడంతో ఈ రహస్యం వెలుగులోకి వచ్చింది. హిట్లర్ ప్రాణాలు కాపాడేందుకు అతడి వంటలు రుచిచూసే ఆ టీంలో తను కూడా పనిచేశానని ఆ మహిళ బయటపెట్టింది. ఎంతోమంది ప్రాణాలు తీసిన హిట్లర్ పూర్తిగా శాఖాహారి అని కూడా పేర్కొంది.

అనుకున్నట్లే హిట్లర్ తన నిర్ణయాన్ని తన సహచరులకు తెలిపాడు. చనిపోవడానికి 40 గంటల ముందు తన ఫియాన్సే ఇవా బ్రౌన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటే చావు గ్యారంటీగా సంభవిస్తుందో తన వ్యక్తిగత వైద్యుడిని అడిగి తెలుసుకున్నాడు. సైనైడ్ మింగడం మంచిదన్న ఇతరుల సలహాపై అనుమానం వ్యక్తం చేశాడు. (సైనైడ్ మింగి అనుకున్నట్లు చనిపోకపోతే తనను శత్రువుకు అప్పగించాలని చూస్తున్నట్లుగా హిట్లర్ అనుమానించాడు). సైనెడ్ మింగి ఆ తర్వాత తుపాకితో కాల్చుకొమ్మని డాక్టర్ సలహా ఇచ్చినట్లు హిట్లర్ టేస్టర్ బృందంలోని ఒక సభ్యురాలు వెల్లడించినట్లు ఇటలీ రచయిత రోజెలా పాస్టోరినా తను రాసిన లా కాటాదోరా అనే పుస్తకంలో వెల్లడించారు.

ఇక తను మరణించాలని నిర్ణయించుకున్న తర్వాత తన భద్రతాసిబ్బందిని పిలిచి ముఖ్యమైన కాగితాలన్నీ శత్రుసేనలకు చిక్కకుండా తగులబెట్టమన్నాడు. వారు ఆ పని చేస్తుండగానే తన పెంపుడు కుక్కలైన వుల్ఫ్, బ్రాండీలపై విషప్రయోగం చేసి చంపేశాడు. తనతో పాటు బంకర్‌లో దాక్కొని యుద్ధం నడిపించడంలో సహాయం చేసిన సైనికాధికారులు, ఇతర సిబ్బందిని పేరుపేరునా పలకరించి వీడ్కోలు పలికాడు. అప్పటికే తన జీవితంలో అదే చివరిపేజీ అని ఆయన నిర్ధారించుకున్నారు.

ఏప్రిల్ 30 తేదీన సాయంత్రం 3 గంటలకు బెర్లిన్‌లో ఛాన్సలర్ భవనం కింద బంకర్‌లోని తన స్టడీ రూంలోకి భార్యతో సహా వెళ్ళి తలుపు వేసుకున్నాడు. భార్యకు విషపు సెనైడ్ ఇచ్చి చంపేశాడంటారు. కొద్ది సేపటికి తుపాకి పేలిన శబ్దం వినిపించింది. సహచర సైనికాధికారులు తలుపు తెరిచి చూడగా ఇవా బ్రౌన్ పక్కకు వాలిపోయి చనిపోయి ఉండగా, హిట్లర్ తల ముందుకు వాలి ఉందని అతని తలకు ఒక పక్క నుండి రక్తం కారుతోందని చూసినవారు చెప్పినట్లుగా సమాచారం. గదిలోకి వెళ్ళినవెంటనే సైనైడ్ వాసన ఘాటుగా తగిలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం వ్యాప్తిలో ఉంది. హిట్లర్ చనిపోయాక ఆయన ముందు ఇచ్చిన ఆదేశాల ప్రకారం బంకర్ నుండి పైకి తెచ్చి భవనంలో ఒకచోట బాంబు దాడి వల్ల కలిగిన గోతిలో వేసి కాల్చారు. హిట్లర్, ఇవా బ్రౌన్ ల ఇద్దరి శవాలను పెట్రోలుతో తడిపి కాగితాలను కాల్చి ముట్టించారు. ఆ విధంగా హిట్లర్, ఇవాలు మరణించారు అని రచయిత రోజెలా తన లా కాటాదోరా పుస్తకంలో వెల్లడించారు. అయితే మే1న జర్మన్ రేడియో హిట్లర్ మరణించాడని ప్రకటించింది. అయితే ఆయన యుద్ధంలో మరణించాడని చెప్పడం విశేషం.

అయితే వారిద్దరికి పోస్ట్ మార్టం చేయడానికి శవాలు మిగల్లేదు. మొదటిసారి అక్కడికి చేరుకున్న సోవియట్ సేనలకు వారి దంతాలు మాత్రమే దొరికాయి. దానితో హిట్లర్ అసలు చనిపోలేదని, పశ్చిమ రాజ్యాల వైపుకి పారిపోయి వారి దగ్గర రక్షణ పొంది ఉండవచ్చని సోవియట్ నేతలు అనుమానించారు. వారి అనుమానమే హిట్లర్ మరణం చుట్టూ గోప్యత అల్లుకోవడానికి కారణం అయింది. కానీ హిట్లర్ బుల్లెట్ గాయం వల్లే బెర్లిన్‌లోనే 1945లో చనిపోయాడని ఫ్రెంచ్ పరిశోధకులు తేల్చారు. హిట్లర్ దంతంపై చేసిన పరిశోధన ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. మాస్కో నుంచి ఈ దంతాన్ని సేకరించారు. ఈ దంతమే ప్రామాణికం. ఇంకెలాంటి అనుమానం లేదు. హిట్లర్ 1945లోనే చనిపోయాడని మా పరిశోధన నిరూపించింది అని ఫ్రెంచ్ బృందానికి నేతృత్వం వహించిన మెడికల్ అండ్ లీగల్ ఆంత్రోపాలజీలో నిపుణుడైన ప్రొఫెసర్ ఫిలిప్పీ చార్లియర్ తెలిపారు. నియంత మరణం వెనుక ఉన్న కుట్ర సిద్ధాంతాన్ని ఆయన కొట్టిపారేశారు. అయితే సైనెడ్ వల్ల లేక బుల్లెట్ గాయంతో హిట్లర్ చనిపోయడా అనేది తమకు తెలియదని.. కాకపోతే ఈ రెండూ అతని మరణానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురించారు.

హిట్లర్‌కు జర్మన్ షెపర్డ్ అంటే చాలా ఇష్టం. హిట్లర్ పెంపుడు కుక్క బ్లాండీ ఒక జర్మన్ షెపర్డ్. వియెన్నాలో ఉంటున్నప్పుడు ఎవరో ఆయనకు ఒక జర్మన్ షెపర్డ్‌ను ఇచ్చారు. అప్పుడు హిట్లర్ యువకుడిగా ఉండేవారు, ఆర్టిస్ట్ కావాలనుకునే వారు. కానీ అప్పుడు హిట్లరుకు కుక్కను పెంచే స్థోమత లేదు. దాంతో ఆయన దాన్ని తిరిగి ఇచ్చేశారు. కానీ ఆ కుక్కతో బంధం ఏర్పడడంతో దాన్ని తిరిగి తెచ్చుకున్నారు. అప్పటి నుంచీ ఆయనకు జర్మన్ షెపర్డ్ అంటే ఇష్టం ఏర్పడింది.

730
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles