ఇడ్లీ, దోశ పిండితో.. రోజూ రూ.2 కోట్ల వ్యాపారం!


Sat,May 4, 2019 10:36 PM

మీరు చదివింది నిజమే. కేవలం ఇడ్లీ, దోశ, వడ పిండితో రోజుకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ యువకుడు. ఇతను కోటీశ్వరుడి కొడుకు కాదు.. ఇతనిది వారసత్వంగా వచ్చిన వ్యాపారం అంతకన్నా కాదు. మూడుపూట్ల తిండి దొరకని ఓ కూలీ కొడుకు. నలుగురు దోస్తుగాళ్లతో సరదగా మొదలెట్టిన వ్యాపారం.. కోట్లు కుమ్మరిస్తున్నది. వేలాదిమందికి ఉపాధి చూపిస్తూ.. కోట్లాది మందికి రుచికరమైన అల్పాహారాన్ని అందిస్తున్నది.

కేరళలోని ఎక్కడో మారుమూల గ్రామం. ఆ ఊరి పేరు చెన్నలోదే. రోడ్లు, కరంట్ సౌకర్యం కూడా సరిగా లేని పల్లె అది. అందులో ఓ సాధారణ రైతు కూలీ కొడుకు ముస్తఫా. ఆరో తరగతి ఫెయిలయ్యి తండ్రితో పాటు కూలీ పనులకు వెళ్లాడు. అన్ని సబ్జెక్టుల్లో రాణించలేకపోయినా లెక్కల్లో ఎప్పుడూ తప్పలేదు. అందుకే వంద రూపాయలతో పెట్టుబడితో చిన్నప్పుడే స్వీట్‌షాపు నడిపాడు. ఇంట్లో మూడు పూటలా తిండి దొరకని ఆ ఇంటికి లెక్కల మాస్టారు మాథ్యూ వచ్చాడు. ముస్తఫాను మళ్లీ బడికి పంపాడు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్లాస్ ఫస్ట్ వచ్చేలా తీర్చిదిద్దాడు. ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్.. ఎంసెట్‌లో స్టేట్ 63వ ర్యాంక్‌తో చదువుల్లో దూసుకెళ్లాడు. ఇంజినీరింగ్ తర్వాత కేవలం 6 వేల రూపాయలతో ఉద్యోగంలో చేరాడు. తర్వాత పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ జీవితాలను చదివాడు. దుబాయ్‌లోని ఓ కంపెనీలో నెలకు లక్ష రూపాయల వేతనంతో సెటిలయ్యాడు. ఒక నెల శాలరీతో తండ్రి అప్పుల్ని తీర్చాడు. అందమైన ఇల్లు కట్టుకున్నాడు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏడేండ్ల ఉద్యోగం తర్వాత బెంగళూర్‌కు వచ్చి.. ఐఐఎంలో ఎంబీఏ జాయిన్ అయ్యాడు.

కిరాణా కొట్టు దగ్గర ఆలోచన

ఎంబీఏ చదువుతున్న రోజుల్లో తిప్పసాంద్రలో తన కజిన్ ఇంటికి వెళ్లాడు ముస్తఫా. అక్కడ నాజర్ కిరాణా షాప్ వద్ద దోస్తుగాళ్లతో ఒడవని ముచ్చట. వాళ్లంతా ముచ్చట్లలో ఉంటే.. ముస్తఫా ఆలోచన మాత్రం షాపు అతను అమ్మే దోశ, ఇడ్లీ పిండిపై ఉన్నది. నిమిషాల వ్యవధిలోనే చాలా ప్యాకెట్లు అమ్ముడుపోయాయి. వండుకొని తినడానికి సిద్ధంగా ఉన్న పిండి అది. అప్పుడే వారితో తన ఆలోచన పంచుకున్నాడు ముస్తఫా. అందుకు స్నేహితులు అబ్దుల్ నాజర్, సంషుద్దీన్, జాఫర్, నౌషద్‌లు ఒప్పకొని రూ.25 వేలతో ఐడీ ఫ్రెష్ ఫుడ్ వ్యాపారం ప్రారంభించారు. ఇందులో ముస్తఫా వాటా 50 శాతం. మిగతా 50 శాతం స్నేహితులది. ఇప్పుడా ఆలోచన ఖరీదు 300 కోట్ల రూపాయలు.
MUSTHAFA

రూ.కోట్లలో వ్యాపారం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు రూ. 2 కోట్ల వ్యాపారం చేస్తుంది ఐడీ ఫ్రెష్ ఫుడ్. మొత్తం ఆదాయంలో బెంగళూరు నుంచి 40%, హైదరాబాద్ నుంచి 16% వాటా ఈ సంస్థకు వస్తున్నది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 275 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది ఐడీ ఫ్రెష్ ఫుడ్. వచ్చే ఐదేండ్లలో రూ.వెయ్యి కోట్ల టర్నోవర్‌ను చేరుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 1,600 మంది ఉద్యోగులున్నారు. ఇందులో హీలియన్ వెంచర్ పార్టనర్స్ రూ. 35 కోట్లు, అజీజ్ ప్రేమ్‌జీ రూ. 150 కోట్లు పెట్టుబడులు పెట్టారు. పాకెట్ మనీ కూడా లేని ఒక రోజు కూలీ కొడుకు.. నేడు కోట్ల రూపాయలకు అధిపతి. తాజాగా ట్రస్ట్ షాప్‌లను ఏర్పాటు చేశాడు. వీటిల్లో గుమస్తాలు ఉండరు. నచ్చిన వస్తువు తీసుకెళ్లి.. డబ్బులు బాక్సులో వెయ్యడమే.

8 ఉత్పత్తులతో.. 20 వేల స్టోర్లు

ప్రస్తుతం ఐడీ ఫ్రెష్ నుంచి ఇడ్లీ, దోశ, వడ, రాగి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, మలబార్ పరాఠా, గోధుమ పరాఠా, పన్నీర్ పిండి వంటి 8 రకాల ఉత్పత్తులున్నాయి. త్వరలోనే ఫిల్టర్ కాఫీ డికాక్షన్, టమాట, కొబ్బరి చట్నీలను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. వచ్చే రెండేండ్లలో 15 ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావాలన్నది ఐడీ ఫ్రెష్ ఫుడ్ లక్ష్యం. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, దుబాయ్‌లో 6 తయారీ కేంద్రాలున్నాయి. ఆయా ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 15 లక్షల ఇడ్లీలు. త్వరలోనే బెంగళూరులో మరో భారీ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. దీని ద్వారా వారి లక్ష్యం రోజుకు కోటి ఇడ్లీలకు చేరుతుంది. పిండి రుబ్బడానికి అమెరికా సంస్థతో కలిసి సొంతంగా మిషన్లను అభివృద్ధి చేశారు. ఈ మిషన్ గంటకు 1,500 కిలోల పిండి రుబ్బుతుంది. మన దేశంతో పాటు దుబాయ్‌లోనూ ఐడీ ఫ్రెష్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. మొత్తం 20 వేల స్టోర్లున్నాయి. హైదరాబాద్‌లో 2,200, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లో 1,200 స్టోర్లున్నాయి. వచ్చే ఏడాది కాలంలో హైదరాబాద్‌లో 3 వేల స్టోర్లతో పాటు వరంగల్, కర్నూల్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలని టార్గెట్ పెట్టుకున్నారు.

1199
Tags

More News

VIRAL NEWS