లాటరీ టిక్కెట్


Sat,May 4, 2019 10:32 PM

రాయల్ లైఫ్ ఇన్సూరెన్సీ కంపెనీ ఆఫీస్ గది. వెబ్‌స్టర్ తన బాస్‌తో చెప్పాడు. మీడ్ కేస్ మీకు గుర్తుందా? మనం అతని భార్యకి ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చెల్లించకుండా ఉండాల్సింది. మీడ్ మరణంలో నాకు ఎలాంటి అనుమానాలు లేవు. డెత్ సర్టిఫికెట్‌ని నువ్వే చూసావు కదా? బాస్ గుర్తు చేసాడు. ఆ సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ లైసెన్స్‌ను తొలిగించారని ఇందాక పేపర్లో చదివాను. అతను మీడ్ భార్యని పెండ్లి చేసుకున్నాడు. అంటే, వారిద్దరూ కలిసి మీడ్‌ని చంపారంటావా?నేనా మాట అనలేదు. కానీ, మీడ్ భార్య మననించి పెద్ద మొత్తానికి మళ్ళీ కొత్తగా పాలసీ తీసుకుంది. బెనిఫిషియరీగా ఆమె రెండో భర్త డాక్టర్ ఆర్చర్ పేర. నేను ఆమెని ఓసారి కలుద్దామని అనుకుంటున్నాను.

మిసెస్ మీడ్! సారీ మిసెస్ ఆర్చర్! మీ చేతికి దెబ్బెలా తగిలింది? ఆమె చేతికట్టు చూసి వెబ్‌స్టర్ అడిగాడు.సెల్లార్ మెట్లమీంచి పడ్డాను. మెట్లకి అడ్డుగా ఓ గంపని ఎప్పుడు ఉంచానో నాకే తెలీదు. దాన్ని మా వారు ఉంచలేదట జెస్సీ నవ్వుతూ చెప్పింది.మీరు ఒకప్పుడు నటి కదా?అవును మిసెస్ ఆర్చర్, ఈమధ్య మీకు ఇంకేమైనా ప్రమాదాలు జరిగాయా? లేదు. ఎందుకు?మీ పేరున మీ రెండో భర్త ఆర్చర్ పెద్ద మొత్తానికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. మీకు ఇలా ప్రమాదాలు జరుగుతూంటే మా కంపెనీకి రిస్క్ కదా? సిగరెట్ తాగొచ్చా?తాగొచ్చు. మా వారు ఆఖరి పెన్నీదాకా ఇన్సూరెన్స్ పాలసీలోనే పెట్టారు. థాంక్స్. మరి, ఆయన ఎందుకు పాలసీ తీసుకోలేదు? ఇద్దరిదీ ఒకేరోజు తీసుకున్నారు జెస్సీ చెప్పింది. ఐతే, మా కంపెనీనించి కాదు అలాగా??? మీరు దాన్ని చూసి ఉండకపోతే అది తీసుకున్నారో, లేదో మనకి నిశ్చయంగా తెలీదు వెబ్‌స్టర్ సూచించాడు. తీసుకున్నానని అబద్దం దేనికి చెప్తారు? తీసుకునే ఉంటారు.
Lottery

మీ మొదటి భర్త మీడ్ మరణంలోని ఒకటి, రెండు విషయాలు నాకు అర్థం కాలేదు. ఆయన చావుకి ముందుదాకా ఎలాంటి అనారోగ్యమైనా ఉందా?లేదు. కాని ఎప్పుడో ఒకప్పుడు అనారోగ్యం మొదలవచ్చు కదా? పెండ్లికి చాలాకాలం ముందు నించే మీకు ఆర్చర్తో పరిచయమా? అవును. మేం చాలా కాలంగా స్నేహితులం. మీడ్‌కి డాక్టర్ ఆర్చర్ చికిత్స మొదలు పెట్టిన కొద్దిరోజులకే మరణించారు. అంటే నా రెండో భర్త నా మొదటి భర్తని చంపారని మీరు ఆరోపిస్తున్నారా? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. నేను ఇంకా ఆరోపించలేదు. ఇలా మాట్లాడితే నేను మీ కంపెనీకి మీ మీద ఫిర్యాదు చేస్తాను. బయటికి నడవండి ఆమె కోపంగా అరిచింది.మిసెస్ ఆర్చర్! 1983లో ఒకామె మెట్లమీంచి జారిపడి మరణించింది. ఆమె కొడుకైన ఆర్చరీకి మా కంపెనీ లక్షా పాతిక వేల డాలర్ల ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లించింది.నాకు ఆయన ఈ విషయం చెప్పారు.ఆయన తమ్ముడి కారు స్టీరింగ్ వీల్ ఎందుకు తిరగలేదో కాని ఆ ప్రమాదం జరిగాక మీ రెండో భర్తకి మా కంపెనీ నించి ఇంకో లక్షన్నర ముట్టింది.కాని నా మొదటి భర్త పోవడం వల్ల మా వారికి ఇన్సూరెన్స్ సొమ్మేమీ ముట్టలేదు.కానీ, మీరు ఆ సొమ్ముతో ఆయనకి దొరికారు.మిస్టర్ వెబ్‌స్టర్. నాతో ప్రేమలో పడ్డ డాక్టర్ ఆర్చర్ నన్ను డబ్బుకోసం చంపుతారని నేను అనుకోవడం లేదు జెస్సీ చెప్పింది.కానీ, డాక్టర్ ఆర్చర్ ఇన్సూర్ చేయడానికి తనకు ఓ మనిషి అవసరం ఉంది. ప్రేమ నటిస్తే కాని ఆ మనిషి దొరకదు. మీరు చెప్పాల్సిందంతా చెప్పారా? ఇది తప్ప.. మీరు తెలివిగల వాళ్ళైతే జాగ్రత్తగా ఉంటారు. చెప్పాల్సిందంతా చెప్పాను
ఇక వెళ్ళండి జెస్సీ కోపంగా చెప్పింది.

డాక్టర్ ఆర్చర్ తను కొని తెచ్చిన ఓ పెద్ద దీపాన్ని భార్యకి చూపించి చెప్పాడు.జెస్సీ! ప్రతీ రోజు దీని కింద నువ్వో పది నిమిషాలు కూర్చుంటే, అది నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ సిగరెట్స్ ఎక్కడివి? వీటిని తాగితే నీ ఆరోగ్యం ఏం కాను? కోప్పడ్డాడు.అవి నావి కావు. ఇన్సూరెన్స్ కంపెనీ నించి వచ్చిన అతను మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఇన్సూరెన్స్ కంపెనీ మనిషా? ఏం కావాలిట? నా పాలసీ గురించి వచ్చాడు ఏమిటిట? సరిగ్గా ఆ సమయంలో ఫోన్ మోగింది. అది వెబ్‌స్టర్ నించి.మీ ఆయనకి నేను చెప్పినవి చెప్పకండి మిసెస్ ఆర్చర్. నేను చెక్ చేసాను. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నించి మీ ఆయన తనకి పాలసీ తీసుకోలేదు. అర్థమైందా?రిసీవర్ పెట్టేసాడు. ఆ ఇన్సూరెన్స్ మనిషి ఏం అడిగాడు? నా పాలసీ మొత్తాన్ని పెంచమని కోరడానికి వచ్చాడు. నేను నో చెప్పాను జెస్సీ అబద్ధం చెప్పింది.

ఇవాళ ఒకరు మేస్హోలో పడి మరణించారని క్లెయిమ్ వచ్చింది. నిన్న సన్ లేంప్ బాత్ టబ్‌లో పడి షాక్‌కు గురై మరణించారని ఓ క్లెయిమ్ వచ్చింది. ఓసారి వాటి సంగతి చూడు బాస్ వెబ్‌స్టర్‌ని కోరాడు.ఫోన్ మోగింది. ఆయన దానికి ఆన్సర్ చేసి వెబ్‌స్టర్‌కి ఇచ్చాడు. జెస్సీ ఫోన్లో చెప్పింది- మీరు చెప్పింది గుర్తొచ్చింది నాకు. నిన్న రాత్రి సరిగ్గా గుర్తు పట్టలేదు. ఆయనకి నేనంటే ప్రేమ. నా ఆరోగ్యం కోసం సన్ లేంప్‌ని కూడా తెచ్చారు.

జెస్సీ! సన్ బాత్ చేస్తున్నావా? నా పర్స్ ఎక్కడ ఉందో చూసావా? కోట్లో లేదు. డ్రెస్సర్ మీదా లేదు డాక్టర్ ఆర్చర్ గట్టిగా అడిగాడు.డ్రాయర్లో ఉందేమో చూడండి అక్కడా లేదు. బాత్‌రూంలో ఉందేమో? అతను తలుపు విసురుగా తెరచి లోపలకి రాగానే సన్ లేంప్ కింద పడింది. అది విరిగిందా? బాత్ టబ్‌లోని జెస్సీ ఆందోళనగా అడిగింది. లేదు, విరిగితే ఇంకోటి కొనే వాడిని.డోర్ బెల్ మోగితే వెళ్ళి తెరిచాడు. సంతకం చేసి, కొరియర్ కవర్ తీసుకున్నాడు. డ్రెస్ చేసుకుని బయటకి వచ్చిన జెస్సీ దాన్ని తెరచింది. చదివి అరిచింది.స్వీప్ స్టేక్స్ లాటరీలో నాకు లక్షన్నర డాలర్ల బహుమతి వచ్చింది. అతను దాన్ని అందుకుని చదివి ఆనందంగా ఆమెని ఆలింగనం చేసుకున్నాడు.కానీ నేను స్వీప్ స్టేక్స్ లాటరీ టిక్కెట్లని ఎన్నడూ కొనలేదు.లేకపోతే ఎందుకు ఇది పంపుతారు? కవర్‌మీద మిసెస్ జేమ్స్ మీడ్ అని ఉంది. అంటే, మన పెండ్లికి మునుపు. ఐతే మీడ్ కొని నాకు చెప్పడం మర్చిపోయి ఉంటాడు. ఒకటి, రెండుసార్లు ఇలా కొన్నాడు. అదే అయి ఉంటుంది ఆర్చర్. విజేత టిక్కెట్‌తో రావాలని రాసారు.లేకపోతే నువ్వే దాని యజమానురాలివని వాళ్ళకి ఎలా తెలుస్తుంది. దాన్ని వెదకాలి. మీడ్ ఇలాంటివి ఎక్కడ దాస్తాడు? ఆర్చర్ అడిగాడు.ఇద్దరూ ఇల్లంతా వెదికారు. కానీ, దొరకలేదు. ఇంకా వెదుకు. లక్షన్నర డాలర్లు. విన్నావా? లక్షన్నర! ఆర్చర్ కఠినంగా ఆజ్ఞాపించాడు. వెదుకుతున్నా. ఎక్కడా లేదు.మీడ్ పోయాక అతని బట్టలన్నీ ఇచ్చేసావు. ఆ కోటు జేబుల్లో ఉండి ఉండొచ్చా? ఆర్చర్ అడిగాడు. జేబులన్నీ వెదికే ఇచ్చాను. ఓ జేబులో ఏడు డాలర్లు దొరికాయి కూడా. కానీ, నీలం రంగు సూట్ మాత్రం కనపడలేదు.

ఐతే అందులోనే దాచి ఉంటాడు. అదెక్కడుందో వెదుకుదాం. గుర్తొచ్చింది. ఆ సూట్లోనే మీడ్‌ని పాతిపెట్టాం జెస్సీ విచారంగా చెప్పింది. ఐతే లక్షన్నరా పోయినట్లే ఆర్చర్ బాధగా చెప్పాడు. పోలేదు. టిక్కెట్ ఎక్కడుందో మనకి తెలుసుగా. కోర్ట్ ఆర్డర్ తీసుకుని సమాధి తెరచి టికెట్ తీసుకుందాం. సమాధి లోంచా? ఒద్దు అతను అంగీకరించలేదు. ఎందుకు ఒద్దు? పెద్ద మొత్తం కదా? జెస్సీ ఆత్రంగా అడిగింది. ఎందుకంటే... ఎందుకంటే... అర్థమైందా? అడిగాడు. అర్థమైంది ఆమె బలహీనంగా చెప్పింది.
కానీ, డాక్టర్ ఆర్చర్ లాంటి వాడు లక్షన్నర డాలర్లు వదులుకోలేడు. కొద్దిసేపటి తర్వాత అతను ఒకరికి ఫోన్ చేసి చెప్పాడు.నీతో ఓ చిన్న పని పడింది ఛార్లీ. ఓసారి వచ్చి నన్ను కలువు.

అర్ధరాత్రి మీడ్ సమాధిని తవ్వాక ఛార్లీ అడిగాడు పాతేప్పుడు అతని జేబుల్లో డబ్బు లేదు. నేను తణిఖీ చేసాను. మీడ్ శవం జేబులు వెదికి ఆర్చర్ చెప్పాడు బోల్తా పడ్డాను. టికెట్ ఇతని జేబుల్లో లేదు. అసలు ఎవరూ ఆ టిక్కెట్ కొనలేదని నాకు ఇప్పుడు అర్ధమైంది. మళ్ళీ కప్పేయండి.పోలీస్ విజిల్స్ వినపడటంతో తవ్విన వాళ్ళతోసహా అంతా పారిపోయారు. మర్నాడు ఛార్టీకి ఫోన్ చేసి అడిగితే, పోలీసులు వచ్చి చూసి శవం పెద్దగా కుళ్ళలేదని, ఆర్సెనిక్ పాయిజనింగ్ అని అనుకుని, శవపేటికని వేన్‌లో ఎక్కించుకుని తీసుకెళ్ళారని చెప్పాడు. ఆర్చర్ బల్ల దగ్గరకి వెళ్ళి ఓ కాగితాన్ని తీసుకుని ఎడం చేత్తో రాసాడు. నేను మాత్రమే మీడ్ మరణానికి కారణం. దేవుడు నన్ను క్షమించుగాక. కింద జోసెఫీన్ ఆర్చర్ అని తన భార్య సంతకాన్ని ఫోర్జరీ చేసాడు. ఆ ఉత్తరంతో భార్య బెడ్‌రూంలోకి వెళ్ళాడు. లే. తొమ్మిదైంది చెప్పాడు. నిన్న రాత్రి మీ కోసం చాలాసేపు ఎదురు చూసి నిద్రపోయాను జెస్పీ చెప్పింది. రాత్రి ఓ రోగి ఇంటినించి ఫోన్ వస్తే వెళ్ళాను. నువ్వు లేచి సన్‌బాత్ చెయ్యి కోరాడు ఆర్చర్. ఆ లక్షన్నర డాలర్లని మనం పోగొట్టుకున్నట్లేనా? ఆమె అడిగింది.అది తర్వాత మాట్లాడదాం. బాత్ టబ్ తిప్పాను. నీళ్ళు నిండాయి. లేంప్ కాంతి నీళ్ళల్లోకి పడేలా అమరుస్తాను లే.సరిగ్గా ఆ సమయంలోనే ఫోన్ మోగింది. అది ఛార్లీ నించి. డబ్బు గురించి. మర్నాడు ఉదయం ఇస్తానని చెప్పాడు. జెస్సీ బాత్రూంలో ఉందని గ్రహించి దాని తలుపు దగ్గరకి వెళ్ళాడు. తలుపుని గట్టిగా లోపలకి నెట్టగానే లేంప్ టబ్‌లోని నీళ్ళల్లో పడి మెరుపులు కనిపించాయి. డోర్ బెల్ మోగింది. తలుపు మూసి వెళ్ళి తలుపు తీసి, పోలీసులని చూసి చెప్పాడు.నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఓ ఘోరం జరిగింది. అది గొప్ప షాక్. దీన్ని చూడండి కోట్ జేబులోంచి తను రాసిన ఆమె ఆత్మహత్యా ఉత్తరాన్ని చూపించాడు.ఈ రాతేమిటి.. ఇలా ఉంది? లెఫ్టినెంట్ అడిగాడు.మా ఆవిడ కుడిచేతికి దెబ్బ తగిలింది. ఎడం చేత్తో రాసి ఉంటుంది. ఇది బాత్‌రూంలో శవం పక్కన నేలమీద దొరికింది.ఏమిటీ? మీ ఆవిడ మరణించిందా?? అవును. సన్ లేంప్ టబ్‌లో పడేసుకుని షాక్‌తో మరణించింది. జాగ్రత్తగా ఉండమని ఆమెకి ఎన్నిసార్లు చెప్పానో?నేను జాగ్రత్తగానే ఉన్నాను ఆర్చర్. మీరు టబ్‌లోకి దాన్ని పడేసినప్పుడు నేను అందులో లేను. వెబ్‌స్టర్ ఇలా జరగొచ్చని నన్ను హెచ్చరించాడు. స్వీప్ స్టేక్స్‌లో గెలవడం, లాటరీ టిక్కెట్లు మొదలైనవి అతని ఆలోచనే. ఆ ఉత్తరాన్ని అతనే పంపాడు అక్కడికి వచ్చిన జెస్సీ నవ్వుతూ చెప్పింది. థాంక్స్ డాక్టర్! సమాధిని తవ్వి తీసే శ్రమని పోలీసులకి తప్పించినందుకు. ఆర్సెనిక్ విషాన్ని డాక్టర్లే ప్రయోగిస్తారు వెబ్‌స్టర్ చెప్పాడు.
(కార్నల్ ఊల్ రిచ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

419
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles