ఆమెకు అండగా ఆ నలుగురు


Sat,May 4, 2019 10:22 PM

స్త్రీల కోసం స్త్రీలు, మహిళా సంఘాలే పోరాటం చేయాలా.. పురుషులెందుకు వారి పక్షాన నిలబడకూడదు? వారికి ఎందుకు అండగా ఉండబడకూడదు? అనే ఆలోచనే వారిని స్త్రీల సమస్యలపై పోరాడేలా చేసింది. మహిళల భద్రత కోసం వారిని పోరాట బాట పట్టించింది. ఆమెకు అండగా ఎందర్నో జాగృతం చేసిన ఆ నలుగురి ప్రయత్నం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమవుతున్నది.

ముంబై కేంద్రంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించాడొక యువకుడు. స్త్రీల తరఫున పోరాటం చేయడానికి 1990 సమయంలోనే ముందుకొచ్చాడు. తన వంతుగా చిన్న చిన్న కార్యక్రమాలు చేసి మహిళలకు, అత్యాచార బాధితులకు అండగా నిలబడ్డాడు. అతనే హరీష్ సంధాని.. కానీ అతడు అంతటితో ఆగిపోలేదు. తనలాంటి ఆలోచనలున్న వారిని కూడా తనతో పాటు నడిపించాలనుకున్నాడు. అందుకోసం 1993లో మెన్ ఎగైనెస్ట్ వాయిలెన్స్ అండ్ అబ్యూస్(MAVA) ను ముంబై కేంద్రంగా ప్రారంభించాడు. మహిళలపై హింసను నివారించడంలో హరీష్ స్థాపించిన సంస్థ భారతదేశంలోనే మొదటిది. ఇంతకీ హరీష్ సంధాని ఏం చేస్తున్నాడంటే.. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపేందుకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాడు. మవ సంస్థ ఆధ్వర్యంలో లింగవివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. లింగ భావన లేని సమాజం కోసం అతడు కృషి చేస్తున్నాడు. ఇందుకోసం స్థానిక యువతను భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తున్నాడు.
Destroy

రైల్వే రౌడీల భరతం పడుతూ..

నిర్భయ ఘటన అనంతరం దేశం ఉలిక్కిపడింది. ఆ తర్వాత అనేక ఘటనలు పట్టణాలు, నగరాలు, పల్లెల్ని వణికించాయి. అనేక చట్టాలు వచ్చినా మహిళలపై వేధింపులు ఏదో ఒక మూలన పెరుగుతూనే ఉన్నాయి. కొంత మేరకైనా వేధింపుల్ని తగ్గించేలా.. మహిళలకు అండగా నిలబడాలని ప్రయత్నం చేశాడు ముంబాయికి చెందిన దీపక్ టాంక్. 2013లో దీపక్ టాంక్ తన 9 మంది స్నేహితులతో కలిసి వార్ ఎగైనెస్ట్ రైల్వే రౌడీస్(WAAR) సంస్థను ప్రారంభించారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులు జరగకుండా చూడాలనుకున్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లలో వేధింపులకు పాల్పడే వారిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్తున్నారు. ఇప్పటి వరకు వేధింపులకు పాల్పడుతున్న 150 మందిని రైల్వే పోలీసులకు అప్పగించారు.

గ్రామగ్రామాన శక్తివాహిని

వారు ముగ్గురు అన్నదమ్ములు. నిశి, రిషి, రవికాంత్. వారంతా పశ్చిమబెంగాల్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం చేయాలనుకున్నారు. శక్తివాహిని సంస్థ ఏర్పాటు చేసి గ్రామాల్లో ఇంటింటా తిరిగి ఆడపిల్లల తల్లిదండ్రులకు లింగసమానత్వంపై అవగాహన కల్పించారు. గ్రామాల్లోని యువతను ఒకచోట చేర్చి స్త్రీలను గౌరవిస్తామని, వారిహక్కుల కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేయించేవారు. గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేశారు. తమ సంస్థ ద్వారా భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, బాలికల రవాణా, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ ఇతర వ్యాధులపై అవగాహన కల్పించారు. వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై కూడా వీరు బాగా చైతన్యవంతం చేస్తున్నారు. వీరంతా మహిళలకు బాసటగా ఉంటున్నారు. వేలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

స్త్రీల కోసం స్త్రీ వేషమేసి..

శిల్పా ఫడ్కే, సమీరా ఖాన్, శిల్పా రాణదే లాయిటర్ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగా ముంబైకి చెందిన నేహ సింగ్, దేవినా కపూర్ స్త్రీ పాత్రలు గల నాటకాల్ని ప్రదర్శించేవారు. జన సందోహం ఉన్న చోట ఈ కార్యక్రమాలు కొనసాగేవి. వాటిని సచిత్ పురాణిక్ ఆసక్తిగా చూసేవాడు. వారితో కలిసి పనిచేయాలనుకున్నాడు. మామూలుగా చెబితే ఎవ్వరూ పట్టించుకోరని తెలుసు అతడికి. అందుకే ఆడ వేషం వేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాతి రోజు నుంచే ఆడవాళ్ల దుస్తులు ధరించే వాడు. ఆడవారిని అనుకరించేవాడు. ఆడవారి షూలు ధరించి వారిలా నడిచేవాడు. అలా వేషం మార్చి మరీ సమానత్వం కోసం ప్రచారం ప్రారంభించాడు. ముంబై వీధుల్లో తిరుగుతూ మహిళల సమస్యల పరిష్కారానికి గొంతెత్తాడు. అతడి ప్రచారానికి మరో 20 మంది పురుషులు అండగా నిలబడ్డారు. ఈ బృంద సభ్యులంతా లేడీస్ డ్రెస్‌లు ధరించి లింగవివక్షత, మహిళలపై అత్యాచారాలు నశించాలని వీధివీధినా గొంతెత్తుతున్నారు. మహిళల రక్షణ కోసం స్థానికులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

328
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles