వెండింగ్ మెషీన్ ఒక వండర్!


Sat,May 4, 2019 10:17 PM

బ్యాంకులో డబ్బులుండి అత్యవసరంగా చేతిలోకి కావాలంటే పక్కనే ఉన్న ఏటీఎంలోకి పరుగు పెడతాం. కానీ నిత్యావసరాలను కొనుగోలు చేయాలంటే దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లక తప్పదు.అలా కాకుండా మరి... ఏటీఎంల మాదిరిగా స్వైప్ చేస్తే నిత్యావసర సరుకులు కూడా అందించే మెషీన్లు ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా అనుకున్నారా? అవును! అన్ని రకాల వస్తువులను అడుగడుగునా అందించేందుకూ మెషీన్లు ఉన్నాయి. కానీ మన దగ్గర కాదు జపాన్‌లో..

బ్యాంకులో బ్యాలెన్స్ ఉండి, జేబులో స్వైప్ కార్డు ఉంటే చాలు. ప్రతి ఐటెం చేతిలో ఉన్నట్టే. మనీ నుంచి మాంసాహారం దాకా.. కాఫీ, టీల నుంచి కోకో కోలా దాకా అన్నీ అందుబాటులో ఉన్నట్టే. జపాన్‌లో వ్యాపారం అంతా ఇలా వెండింగ్ మెషీన్ల ద్వారానే జరుగుతుంది. ప్రతి 25 మందికి ఒక వెండింగ్ మెషీన్ ఉంటుంది. గల్లీ గల్లీలో ఇవి అందరికీ అందుబాటులో ఉండి అవసరాలను తీర్చుతాయి. మాంసం, కూరగాయలు, పిజ్జా, ఐస్‌క్రీం, సాప్ట్ డ్రింక్స్, బ్రేక్‌ఫాస్ట్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, సిగరెట్స్, బీర్లు మొదలైన వాటిని అందిస్తాయి. రోజువారి వస్తువులను అమ్మడానికి ఈ వెండింగ్ మెషీన్లు వాడతారు అక్కడ. ప్రపంచ వ్యాప్తంగా వెండింగ్ మెషీన్లను వాడే దేశంగా జపాన్ ముందుంది అని ఒక అంచనా..

ఫుట్‌పాత్‌లపై, అపార్ట్‌మెంట్ల దగ్గర, పబ్లిక్ ప్లేస్‌లో ఎక్కడంటే అక్కడ ఈ వెండింగ్ మెషీన్లు కనిపిస్తాయి. చిన్న చిన్న గ్రామాల్లోని వీధుల్లోనూ వెండింగ్ మెషీన్ల కల్చర్ ఉంది. చివరికి మౌండ్ ఫుజీ పర్వతం మీద కూడా వెండింగ్ మెషీన్లు ఉన్నాయి. స్వైప్ కార్డులనే కాకుండా ఇవి నగదును కూడా తీసుకుంటాయి. నోట్లను, కాయిన్లను స్వీకరించి అక్కడ ప్రజలకు కావాల్సిన వస్తువులను అందిస్తాయి. కొన్ని వెండింగ్ మెషీన్లు వినోదాన్ని కూడా అందిస్తాయి. కాఫీ, టీ, సిగరెట్ తాగుతున్నప్పుడు పాటలు కూడా పెట్టుకునే వీలుంటుంది. టెక్నాలజీని వాడి, సులువుగా ఆపరేట్ చేయడానికి వీలుంటాయి. మామూలుగా ఆ దేశంలో పెద్ద కంపెనీలే వీటి ద్వారా అన్ని రకాల వస్తువులు అమ్ముతాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వెండింగ్ మెషీన్లను కొని స్వతంత్రంగా వ్యాపారం చేస్తుంటారు. పెద్ద పెద్ద హోటళ్లలోని రూముల్లో కూడా వెండింగ్ మెషీన్లు ఉంచుతారు. దీని వల్ల ప్రతిసారి రూం సర్వీస్‌ను పిలవాల్సిన పని ఉండదు. కావాల్సిన మెషీన్ దగ్గరకు వెళ్లి కావాల్సిన ఐటెం నొక్కడమే ఆలస్యం క్షణాల్లో వస్తువు చేతిలో ఉంటుంది.
Japan

మొదటిసారి ఆ వెండింగ్ మెషీన్

జపాన్‌లో ఇంత డిమాండ్ ఉన్న వెండింగ్ మెషీన్లు ఈ మధ్య వచ్చినవి కావు. సుమారు 1888 ప్రాంతంలోనే తొలి వెండింగ్ మెషీన్ జపాన్‌లో తయారైంది. పొగాకును విక్రయించే యంత్రం ఈ దేశంలో తొలి వెండింగ్ మెషీన్. తవారయా కోషిచి అనే ఫర్నీచర్ కళాకారుడు దీన్ని తయారు చేసి బకాన్ అనే ప్రాంతంలో ఉంచాడు. అప్పుడే దీనిపై హక్కులు తీసుకున్నాడు. ఇప్పుడు జపాన్‌లో ఉన్న అతి పురాతనమైన వెండింగ్ మెషీన్‌కూడా అతను తయారు చేసిందే. అటోమేటిక్ స్టాంప్, పోస్ట్‌కార్డ్ డిస్పెన్సర్ చెక్క మెషీన్‌ను తయారు చేశాడు. దీన్ని మోసుకువెళ్లడానికి వీలుగా కొండీలను కూడా అమర్చాడు. ఇలా జపాన్‌లో మొదలైన వెండింగ్ మెషీన్లు 1950 తర్వాత పాపులర్ అయ్యాయి. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా వెండింగ్ మెషీన్లు తయారు చేసి జపాన్‌లో ఉంచాయి. మొదట్లో జ్యూస్, కూల్‌డ్రింక్ వెండింగ్ మెషీన్లు తయారు చేసి అభివృద్ధి చేశారు. 1967లో 2 లక్షలా 40వేలు ఉన్న వెండింగ్ మెషీన్లు మూడేండ్లలో పదిలక్షలకు చేరుకున్నాయి. 1984 వరకూ వాటి సంఖ్య యాభై లక్షలకు చేరువైంది. అప్పటి నుంచి మొదలైన వెండింగ్ మెషీన్ల కల్చర్ జపాన్లో అనివార్యమైంది. ప్రస్తుతం జపాన్‌లోని ప్రధాన నగరాల్లో ఒక వెండింగ్ మెషీన్ ద్వారా నెలకు కొన్ని లక్షల రూపాయాల వ్యాపారం జరుగుతున్నది.

ఎందుకిలా పాపులర్ అయ్యాయి

ప్రపంచ దేశాల్లో వెండింగ్ మెషీన్ల వాడకం ఉన్నప్పటికీ జపాన్‌లో మాత్రం వాటి ప్రభావం రెట్టింపు ఉంటుంది. మిగతా దేశాల్లో భద్రతా కారణాల దృష్ట్యా ఆఫీసుల్లో, గదుల్లో, లోపలి ప్రదేశాల్లో ఉంచుతారు. కాబట్టి వాటికి జనాదరణ తక్కువ. కానీ జపాన్‌లో ఉండే రక్షణ వ్యవస్థ, టెక్నాలజీ వల్ల దొంగతనాలు, దోపిడీలు జరిగే అవకాశం తక్కువ. దీనివల్ల వెండింగ్ మెషీన్లు బహిరంగంగా ఉంచుతారు. పైగా ఈ వెండింగ్ మెషీన్లు దొంగలను కూడా గుర్తించగలవు. గతంలో ఎప్పుడైనా పోలీస్ రికార్డులో ఉన్న దొంగలు బయట కనిపిస్తే పోలీస్ స్టేషన్‌కు చేరవేస్తాయి. అలా సమాచారం అందించేందుకు దొంగల వివరాలను, ఫొటోలను వెండింగ్ మెషీన్‌లో పొందుపర్చుతారు. కెమెరాలను, సెన్సర్లను ఆ రికార్డుల్లో ఉన్న వ్యక్తులు వీటి సమీపంలోకి వస్తే కంట్రోల్ రూంకు సమాచారం అందించేలా ప్రోగ్రామ్ చేసి ఉంచుతారు. ఎప్పుడైనా ఆ వ్యక్తులు వీటి పరిధిలోకి వచ్చినప్పుడు వెంటనే ఫొటోలు, లొకేషన్‌లోని పోలీసులకు చేరవేసి అప్రమత్తం చేస్తాయి ఈ వెండింగ్ మెషీన్లు.

280
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles