వేసవివేళ.. ఇల్లు చల్లగా!


Sat,May 4, 2019 10:05 PM

సూర్యరశ్మి నేరుగా గదుల్లోకి రాకుండా చూడాలి. ఒకవేళ అది ఎక్కడి నుంచైనా రిఫ్లెక్ట్ అయి వచ్చినా వేడి పుట్టడానికి కారణమవుతుంది. దీనిని నివారించడానికి కిటీకీలు, కర్టెన్లు, రిఫ్లెక్టివ్ విండో పానెల్‌లను ఉపయోగించాలి. గదిలోపలి కన్నా బయట చల్లగా ఉన్నప్పుడే కిటీకీలు, తలుపులు తెరిచి పెట్టడం మంచిది. రోజంతా కిటీకీలు తెరిచి ఉంచడం ద్వారా వేడి లోపల పెరుగుతుంది. ఇది రాత్రి వేళల్లో ప్రభావం చూపుతుంది. అందుకే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తెరిచి ఉంచాలి. సాధారణంగా ఉదయం 5 నుంచి 8 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి వరకూ తలుపులు, కిటీకీలు తెరిచి ఉంచుకోవచ్చు. రాత్రి వేళల్లో చల్లదనం ఇంటి చుట్టూ ఉంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి తలుపులు, కిటీకీలు తెరుచుకోవచ్చు.

కలర్ కోడింగ్

వేసవి కాలంలో కొన్ని రంగులు ఉష్ణోగ్రతను గ్రహించి వేడి ఉత్పన్నం అవడానికి కారణం అవుతాయి. అవే డార్క్ కలర్స్. వాటిని ఉపయోగించకుండా ఉండడం మంచిది. ఇంట్లో ఫర్నీచర్ ఎక్కువగా ఉంటే వేడి ఎక్కువ ఉంటుంది. ఆ ఫర్నీచర్ రంగు లైట్ కలర్‌లో ఉంటే వేడి నిలువకుండా ఉంటుంది. గోడలు కూడా డార్క్ కలర్‌లో ఉండటం మంచిది కాదు. సూర్యకిరణాలు ఇలాంటి రంగుల మీద రిఫ్లెక్ట్ అవవు. దీంతో గోడలు వేడెక్కుతాయి. ఈ వేడి అంతా రాత్రి సమయంలో గది ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం అవుతుంది.
CoolHouse

విండో పా్ంలటింగ్.. టెర్రస్ గార్డెనింగ్..

చల్లదనానికి చెట్లు, మొక్కలు ఎంత అవసరమో మనకు తెలుసు. కానీ వాటిని పెంచడానికి స్థలం ఉండకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు కొందరు. అలాంటి వారు టెర్రస్ గార్డెనింగ్, విండో ప్లాంటింగ్ ప్లాన్ చేయాలి. టెర్రస్ మీద మొక్కలు సాగు చేయడం, వాటికి ఉపయోగించే మట్టి, నీరు పరిసరాల ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. తీగజాతి మొక్కలను కిటికీల దగ్గర, గోడలకు, ఇంట్లో పెంచడం వల్ల చల్లదనం రెట్టింపు అవడమే కాకుండా ఇంటా, బయట అందమైన లుక్ వస్తుంది.

తెల్లసున్నం వేయండి

ఎండాకాలంలో ఇంటికి తెల్లటి సున్నం వేసుకోవడం మంచి ఉపాయం. దీని మీద పడిన సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి గోడల్లోకి చొచ్చుకొని పోకుండా ఉంటాయి. మార్కెట్‌లో తెల్లసున్నంతో పాటు కూలింగ్ సిమెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల పగటి వేళల్లో ఇండ్లలో 8 నుంచి 12 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. 90శాతం సూర్యకిరణాల నుంచి ఇంటిని కాపాడుతుంది. ఈ కూలింగ్ సిమెంట్ సామర్థ్యాన్ని బట్టి ఒక సీజన్‌కు, రెండు సీజన్లకు వస్తుంది.

కిటికీలకు మ్యాట్లు తగిలించండి..

బయట ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు వేడి గాలుల సమస్య ఎక్కువ ఉంటుంది. దీంతో ఉక్కపోత కూడా పెరుగుతుంది. కిటీకీలు తీయడం అనివార్యమైనప్పుడు నారతో తయారైన చాపలను వాడండి. వాటిని తడిపి కిటీకీలకు వేలడదీయాలి. నార చాపలు కాకున్నా కూలర్లలో ఉపయోగించే గడ్డి చాపలు, మ్యాట్లు మార్కెట్లో దొరుకుతాయి. వీటిని ఇంట్లో వాడొచ్చు. ఇవి నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచుతాయి. కాబట్టి బయట నుంచి వచ్చే వేడిగాలులను నివారించవచ్చు. వీటి ద్వారా ఐదు డిగ్రీల సెల్పియస్ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది.

మరికొన్ని

-రూంలో వేడి ఎక్కువైనప్పుడు టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్‌ను రివర్స్‌లో తిరిగేలా చేయాలి. దీని వల్ల వేడి బయటకు వెళ్లే అవకాశం ఉంది.
-వేసవిలో పగటి పూట వంట చేయడం మంచిది కాదు. దీని వల్ల కిచెన్ వేడెక్కి, అక్కడి పాత్రల నుంచి ఇతర గదిలోకి వేడి ప్రవహిస్తుంది.
-ఐస్‌ముక్కలను, చల్లటి నీటిని టేబుల్ ప్యాన్ ఎదురుగా పెట్టాలి. దాని నుంచి వచ్చే గాలి ఏసీ అనుభూతిని కలిగిస్తుంది.
-ఉతికిన బట్టలను కిటీకీల దగ్గర, తలుపుల దగ్గర ఆరేయాలి. బయట నుంచి వచ్చే వేడి గాలులు వీటిని తాకి చల్లగా మారి ఇంట్లోకి వస్తాయి.
-పగటిపూట ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువ వాడొద్దు. ప్లగ్గులు, చార్జర్లు అన్నీ తీసి పక్కకు పెట్టాలి. లైట్లు, టీవీలు, మైక్రోవోవెన్, వాక్యూమ్ క్లీనర్ వాడొద్దు. వాటి నుంచే ఎక్కువ ఉష్ణోగ్రత వచ్చే ప్రమాదం ఉంది.
-ఇంట్లో ఎక్కువ ఫర్నీచర్ వాడడం వల్ల కూడా వేడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

313
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles