హృదయగానం


Sat,May 4, 2019 10:01 PM

ఒక సంపన్నుడు గొప్ప భవనంలో నివసించేవాడు. అతని భవనం పైనుంచి చూస్తే దూరంగా పెద్ద పర్వతం, చుట్టూ పచ్చని మైదానం కనిపించేది. అతని మనసుకు ఎంతో ఆనందం కలిగేది. అటువంటి వ్యక్తికి ఒకసారి ఉన్నట్లుండి ఆరోగ్యం దెబ్బతింది. కదలలేని పరిస్థితి ఏర్పడింది. భవనం పై అంతస్థులో పడక మీద ఉండేవాడు. వైద్యుడు ఎన్నో మందులిచ్చాడు. అతని ఆరోగ్యాన్ని అవి బాగుపరచలేకపోయాయి.
మేడ పై భాగంలోని కిటికీ గుండా నిశ్చల పర్వతాన్ని పచ్చిక మైదానాన్ని సంపన్నుడు చూస్తూ గడిపేవాడు. క్రమక్రమంగా అతని ఆరోగ్యం కుదుటపడింది. అది వైద్యుని మందుల వల్లకాదు. కొంత వరకు పర్వతం, పచ్చిక మైదానం అతనికి ఓదార్చునిచ్చాయి. అంతకుమించి అతని ఆరోగ్యం కుదుటపడడానికి ఒక ముఖ్యమైన కారణముంది. ఆ భవనం ఎదురుగా ఒక వసతి గృహం ఉండేది. ఆ వసతి గృహం వరండాలో ఒక దర్జీ బట్టలు కుట్టేవాడు. వసతి గృహం యజమాని ఆ దర్జీ మంచివాడు కనుక అతనికి అక్కడ నిలువనీడ నిచ్చాడు. దర్జీ అతని పట్ల కృతజ్ఞతగా ఉండేవాడు. దర్జీ మంచి గాయకుడు. దైవ భీతి గలవాడు. ఉదయాన్నే తన పని మొదలు పెట్టేముందు దైవాన్ని కీర్తిస్తూ పాటలు పాడేవాడు. చల్లని గాలి ఆ పాటల్ని మోసుకుని ఎదురుగా భవనంపై నున్న సంపన్నుని చెవుల్ని తాకేది. ఆ పాటలు మాధుర్యంతో సంపన్నుని మనసు చల్లబడేది. ప్రతిరోజూ ఆ పాటలు వింటూ ధనవంతుడు మెల్లగా కోలుకున్నాడు. లేచి కూర్చోగలిగాడు.

ఒకరోజు ఆ ధనవంతుడు ఎదురుగా ఉన్న వసతి గృహం యజమానికి కబురు చేసి ఆ దర్జీని తన దగ్గరకు పంపమన్నాడు. దర్జీ ఆశ్చర్యంగా సంపన్నుని దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించి నిలబడ్డాడు. సంపన్నుడు దర్జీని ప్రేమగా చూసి బాబూ! నీ మధుర గానంతో నా మనసును నింపావు. అనారోగ్యంగా ఉన్న నన్ను స్వస్థత చెందేలా చేశావు. నా ఆరోగ్యం కుదుటపడింది. నీ రుణం తీర్చుకోలేను. ఏదో నాకు తోచినంత యిస్తున్నా. కాదనకుండా తీసుకో అని ఒక డబ్బు సంచిని ఇచ్చాడు. దర్జీ ఆనందంతో ఆ సంచి తీసుకొని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు.మరుసటి రోజు ఉదయాన్నే ఎదురుగా ఉన్న వసతి గృహం వరండా నుంచి ఎటువంటి పాటా వినిపించలేదు. ఎందుకు ఈ రోజు పాట వినిపించలేదు.. దర్జీకి ఏమైంది అని అనుకుంటూ సంపన్నుడు ఓపిక తెచ్చుకొని ఆదుర్దాగా మేడ దిగి వసతి గృహం వరండాలోకి వచ్చాడు. అక్కడ దిగులుగా కూర్చున్న దర్జీని చూసి ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఎందుకు పాట పాడడం లేదు అని అడిగాడు.
Heart

దర్జీ అయ్యా! మన్నించండి. నేనే వద్దామనుకునేంతలో మీరే వచ్చారు. చిన్నతనంలో మా పక్కింట్లో ఉండే ఒక పెద్దాయన వచ్చారు. ఈ పాటలు నేర్పాడు. నేను ప్రతీరోజూ ప్రతిఫలాపేక్ష లేకుండా హృదయ పూర్వకంగా పాటలు పాడేవాణ్ణి. అవి దైవాన్ని ఉద్దేశించినవి. ఆకాశం నా పాటలు వింటున్నదని ఆనందపడేవాణ్ణి. కానీ, నిన్న మీ దగ్గర ధనం తీసుకున్నప్పటి నుంచీ నేను పాడుదామంటే గొంతుపెగలడం లేదు. నాకూ దైవానికి మధ్య ఈ డబ్బు సంచి గొంతులో వెలక్కాయలా ఉంది. దయచేసి ఈ డబ్బు సంచి మీరు తీసుకోండి. అప్పుడే నేను స్వేచ్ఛగా పాడగలను. మీకోసం కాక దైవం కోసం మాత్రమే పాడగలను. అప్పుడు అది మీకు కూడా వినిపిస్తుంది అని ఆ డబ్బు సంచిని సంపన్నునికి తిరిగి ఇచ్చేశాడు.
అతని ఆంతర్యాన్ని, ఔన్నత్యాన్ని గ్రహించిన సంపన్నుడు ఆ ధనం సంచి తీసుకొని ఆ దర్జీకి తలవంచి నమస్కరించాడు.

-సౌభాగ్య

244
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles