పద్య రత్నాలు


Sat,May 4, 2019 09:48 PM

కొడుకులు లేకపోతేనేం?


కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నేగతుల్
వడసెం? పుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం మపుత్రుకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
- శ్రీ కాళహస్తీశ్వర శతకం

తాత్పర్యం:కొడుకులు పుట్టనంత మాత్రాన ఉత్తమగతులు కలగవని చాలామంది అజ్ఞానంతో బాధపడుతుంటారు. కౌరవేంద్రుడైన ధృతరాష్ర్టునకు వందమంది పుట్టినా, వారివల్ల అతడు ఏం ఉత్తమగతిని పొందాడు? అలాగే, బ్రహ్మచారిగా ఉండి, పుత్రులు లేని శుకమహర్షికి ఏమైనా దుర్గతులు సంప్రాప్తించాయా? ఇదంతా వట్టి భ్రమే తప్ప మరోటి కాదు. పుత్రులు లేని వారికి మోక్షమార్గం ఎప్పుడూ మూసుకుపోదు సుమా.

ఎలాంటి పనులు చేయాలి?


చేయకుము కాని కార్యము
పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబున
గూయకు మొరుమనసు నొచ్చు కూత కుమారా!
- కుమార శతకం

తాత్పర్యం:మన వల్ల సాధ్యం కాని పనిని ఎప్పుడూ చేయబోకండి. అలాగని మంచిపని చేయకుండా ఊరుకోకూడదు కూడా. అట్లాగే, పగవారి ఇంట్లో భోజనం చేయరాదు. అంతేకాదు, తోటివారిని బాధపెట్టేలా నిష్ఠూరపు మాటలు మాట్లాడకూడదు.
Poems

సార్థకత ఎప్పుడంటే?


సిరిగలవాని కెయ్యెడల, జేసిన మే లది నిష్ఫలం బగున్;
నెఱి గుఱి గాదు; పేదలకు, నేర్పునం జేసిన సత్ఫలం బగున్;
వఱపున వచ్చి మేఘండొకచొ, వర్షము వాడిన చేలమీదటన్
కురిసినం గాక, యంబుధుల గుర్వగ నేమి ఫలంబు భాస్కరా!
- భాస్కర శతకం

తాత్పర్యం: ఏ సహాయమైనా, పని అయినా సార్థకత సిద్ధించాలంటే అర్హతగల వారికే చేయాలి. ఎలాగంటే, సంపన్నులకు ధనసహాయం చేయడం వృథా. అదే పేదవారికి చేస్తే ప్రయోజనం కలుగుతుంది. అలాగే, వానలు లేని కాలంలో ఎండిపోయే చేలపైన మేఘాలు వర్షాన్ని కురిపిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కానీ, సముద్రంపై వానలు పడితే ఏం లాభం ఉండదు కదా.

శరీరం శాశ్వతం కాదు!


కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు
ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను
ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు
కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు
జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన
నిలుచునా దేహమిందొక్క నిమిషమైన?
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
-శ్రీ నరసింహ శతకం

తాత్పర్యం:మన దేహాన్ని ఎంత రక్షించుకుంటే ఏం లాభం? అది శాశ్వతంగా నిలిచేది కాదుగా. ఎప్పుడు, ఏ రోగం వచ్చి ఏ రకంగా నశిస్తుందో ఎవరికీ తెలియదు. ఎంత మంచి చికిత్స చేసినా అది తాత్కాలికమే అవుతుంది. కోటి వైద్యులు వైద్యం చేస్తున్నా రానున్న మరణాన్ని ఎవరూ ఆపలేరు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని రక్షించుకోవాలనే తాపత్రయం తప్పు కాకపోవచ్చు. కానీ, అంత్యకాలమంటూ వస్తే దానిని ఎవరూ ఆపకలేకపోగా, ఒక్క క్షణమైనా అది నిలవదు.

223
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles