నవ్వు ఓ ఔషధం


Sat,May 4, 2019 09:44 PM

నవ్వుకి ఖరీదు లేదు.. అందుకే నవ్వు నలభై విధాల గ్రేటు.. హాయిగా నవ్వడంలో ఉన్న ఆనందం వెలకట్టలేనిది.. ముఖానికి నవ్వు ఒక ఆభరణం లాంటిది.. పలువరుస కనపడేలా.. మనసులో ఆనందమంతా కనపడేలా.. హాయిగా నవ్వుతున్న మనిషిని చూస్తే.. ఎంత చిరాకులో ఉన్నా అప్రయత్నంగా నవ్వేస్తాం.. అదే చిరునవ్వుకు ఉన్న మహత్యం.. ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఈ సందర్భంగా వివిధ నవ్వుల గురించే కాదు.. నవ్వు గొప్పతనం గురించే ఈ జంటకమ్మ..

-సౌమ్య పలుస

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు. కానీ ఒక్క రోజు నవ్వకపోయినా డాక్టరును మాత్రం కచ్చితంగా కలువాల్సిందేనంటున్నారు నిపుణులు. వైద్య శాస్త్ర ప్రకారం.. నవ్వుకి మించిన బెస్ట్ మెడిసిన్ ఏదీ లేదంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ భాష రాకపోయినా పర్వాలేదు కానీ నవ్వడం రాకపోతే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమేనట.

మొదలైంది ఇలా..

ఈ నవ్వుల దినోత్సవానికి ఆద్యం పడింది మన దేశంలోనే. ముంబైకి చెందిన ప్రముఖ వైద్యుడు మదన్ కటారియా ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రారంభించాడు. 10 మే 1998లో మొదటిసారిగా ఈ నవ్వుల దినోత్సవ ఉత్సవాలు జరిపారు. కాకపోతే ఇతర దేశాల్లో జనవరి 2వ ఆదివారాన్ని నవ్వుల దినోత్సవంగా అప్పటికే జరుపుకొంటున్నాయి. కానీ చాలా దేశాల్లో జనవరిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హాస్య ప్రియులు ఆ తేదీని మార్చాలని కోరారు. దీంతో లాఫర్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్లు ఈ దినోత్సవాన్ని మే మొదటి ఆదివారాన్ని నవ్వుల దినోత్సవంగా జరుపాలని నిర్ణయించారు. ప్రస్తుతం 105 దేశాల్లో లాఫర్ క్లబ్ వాళ్లు ఈ రోజును చాలా ఆనందంగా.. ఒక ఉత్సవంలా నవ్వుల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం.

ఆనాదిగా హాస్యం

నవ్వు అనేది ఒక రకంగా అందరికీ అర్థమయ్యే భాష. నవ్వులో కూడా చాలా రకాలున్నాయండోయ్. కొందరు కల్మషం లేకుండా నవ్వుతారు. అది ఎక్కువగా పసిపాపల్లో మనం గమనించవచ్చు. కొందరు ఫేక్ స్మైల్ చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. నవరసాల్లో హాస్యం ఒకటి అని అందరికీ తెలుసు. అయితే.. ఈ హాస్యానికి మన పూర్వీకులు ఎప్పుడో పెద్ద పీట వేశారు. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో బీర్బల్ అనే విదూషకుడు ఉండేవాడు. అతడి పని కేవలం రాజుగారిని నవ్వించడమే. ఇక శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు ఉండేవాడు. అతడి కథలు వింటే కడుపుబ్బ నవ్వడం ఖాయం. ఆ తర్వాత కాలంలో చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్ అనే వాళ్లు కేవలం మాటలు లేకుండా సైగలతోనే నవ్వించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మాత్రం నవ్వించడానికి లాఫర్ క్లబ్‌లు వెలిశాయి. పాశ్చాత్య దేశాల్లో అయితే నవ్వుల ఆసుపత్రులు కూడా వెలిశాయంటే అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది నవ్వుకు ఎలా ముఖం వాచిపోయి ఉన్నారో!
Smile

ఇదొక వర్కవుట్

నవ్వు మనం ఒక వర్కవుట్ చేసిన దానితో సమానం. మీరు నిజమే చదువుతున్నారు. ముఖ కండరాలకు మంచి వ్యాయామంగా నవ్వు పనిచేస్తుంది. ఆ సమయంలో కడుపు, డయాఫ్రామ్ కండరాలను బలపడేలా చేస్తాయి. మనం 15 నిమిషాలు నవ్వితే చాలు.. సుమారు 40 కేలరీలు కరిగిపోతాయట. అంతేకాదు.. మన ఆయుర్దాయం రెండు రోజులు పెరుగడంతో పాటు గుండె జబ్బుల నుంచి కూడా రక్షణ పొందిన వారమవుతాం. ఈ పదిహేను నిమిషాల నవ్వు.. మనం పది నిమిషాలు యోగా చేసిన దానితో సమానం కూడా. అందుకే.. గట్టిగా ఊపిరి పీల్చుకొని మనస్ఫూర్తిగా ఒక నవ్వు నవ్వితే చాలు అంటున్నారు నిపుణులు. నవ్వడం వల్ల మన మెదడులో ఎండార్ఫిన్లు, డోపమైన్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి సంతోషాన్ని, హుషారును తెచ్చి పెడుతాయి. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగినప్పుడు.. ఒక నవ్వు మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. అయితే కొన్ని చోట్ల హసయోగా అని ఇస్తున్నారు లాఫర్ క్లబ్ నిర్వాహకులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ లాఫర్ క్లబ్‌ల వాళ్లు కూడా చెబుతున్నారు. క్లినికల్ డిప్రెషన్‌లో ఉన్నవాళ్లు ఈ థెరపీ ద్వారా వారి పరిస్థితి 70శాతం వరకు మెరుగైనట్లు నిరూపితమైంది.

నవ్వు ఒక అంటువ్యాధి

1950లో సగటున ప్రతి ఒక్కరూ 18 నిమిషాలు నవ్వేవారు. ఇప్పుడు ఆ నవ్వు 4 నుంచి 6 నిమిషాలకు మించి ఉండడం లేదని జర్మనీకి చెందిన మానసిక నిపుణులు డా.మైఖెల్ టిట్జి పరిశోధనల్లో తేలింది. సగటున ప్రతి రోజు మనిషి రోజుకు 13సార్లు నవ్వుతారు. అయితే పెద్దల కంటే పిల్లలు మూడు రెట్లు ఎక్కువ నవ్వుతారట. నవ్వు ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుందా? ఇదేమైనా అంటువ్యాధా? అని పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. మన మెదడులో ఓ నవ్వు డిటెక్టర్ నిర్మితమై ఉంటుందట. అది కేవలం నవ్వు చప్పుడుకే ప్రతిస్పందిస్తుందని పరిశోధనలు చేసి మరి శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే చెవులకు గలగలమని నవ్వుల చప్పుడు వినపడగానే మన పెదవుల మీద అప్రయత్నంగానే దరహాసం నాట్యం చేస్తుందన్నమాట. మనం చేసే వివిధ పనుల కంటే ఇతరులతో ఉన్నప్పుడు 30రెట్లు ఎక్కువగా నవ్వుతామనేది పరిశోధనల్లో తేలింది. మనుషులకు మాత్రమే నవ్వు అనే యోగం ఉందనుకుంటే పొరపాటే. ఎలుకలు, పిల్లులు, కుక్కలు కూడా చిరునవ్వులు చిందిస్తాయి.

-మనస్ఫూర్తిగా నవ్వుతున్నారంటే.. కచ్చితంగా వాళ్ల పెదవులే కాదు, కళ్లు విప్పారుతాయి. కళ్లల్లో ఒక తెలియని ఆనందం, మెరుపు కనిపిస్తుంది. అలాంటి నవ్వుతో మిమ్మల్ని పలకరిస్తే వాళ్లు మీ మంచి కోరుతున్నట్లే. అంతేకాదు.. మిమ్మల్ని సంతోషంగా ఉంచాలనేది ఆ నవ్వులోని పరమార్థం.

-మరికొన్ని నవ్వులుంటాయి.. మూతి బిగించి, మూతిని ముప్పై ఆరు వంకర్లు తిప్పుతూ నవ్వును విసురుతారు. అలాంటి వారికి మీ ఎదుగుదల ఇష్టం లేదని అర్థం. ఒక నవ్వు అలా మీ మీదకి విసిరితే చాలు అనుకునే
టైపు నవ్వుల రాయుళ్లన్నమాట వాళ్లు.

-కొందరు పెదవులను పూర్తిగా మూసేసి, అంటే.. పండ్లు కనపడకుండా నవ్వుతుంటారు. ఈ నవ్వును ఎక్కువగా రాజకీయ నాయకుల్లో గమనించవచ్చు. అలా వాళ్లు నవ్వుతున్నారంటే.. వాళ్లకి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదనుకుంటున్నారని అర్థం.

-కొందరు ఒక పెదవిని పైకి లేపి మరీ నవ్వుతారు. అంటే.. అందులో కాస్త వెటకారం దాగి ఉందని అర్థం. మీకు మంచి అయిందిలే అని మనసులో అనుకుంటూ ఆ చిరునవ్వును మీ మీదకి విసురుతారు.

కొన్ని ఫేక్ స్మైల్స్

ఉంటాయి. హోటల్స్, విమాన ప్రయాణాలు చేసేటప్పుడు అక్కడి వాళ్లు మనల్ని చూసి నవ్వు రువ్వుతారు. అందులో ఎలాంటి ఆత్మీయత ఉండదు. కేవలం పెదవులను వెనుకకు బిగించి మరీ ఈ నవ్వు నవ్వుతారు. ఇలాంటి నవ్వులను మనం ఇట్టే పసిగట్టేయొచ్చు.

285
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles