విశ్వనగరం


Sun,April 14, 2019 12:55 AM

ప్రపంచంలో ఏయే నగరాలు నివాసయోగ్యమైనవి అని మెర్సర్ అనే సంస్థ చేపట్టిన అంతర్జాతీయ స్థాయి నగరాల లిస్టులో మన హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల కంటే ముందంజలో ఉన్నది. దేశంలోని ప్రముఖ నగరాల కంటే మెరుగైన స్థానం సంపాదించి ప్రపంచస్థాయి నగరాల సరసన నిలిచింది మన హైదరాబాద్. ఈ సందర్భంగా మన భాగ్యనగరానికి ఆ స్థానం ఎందుకు దక్కింది? ఏయే అంశాల్లో మిగతా నగరాల కంటే హైదరాబాద్ ముందుంది అనే అంశాలతో ఈ వారం బతుకమ్మ ముఖచిత్ర కథనం.

-ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

విరోజూవారి జీవితం చౌక

ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో ఒక్క పూట భోజనానికే వంద రూపాలయ వరకు చదివించుకోవలసి ఉంటుంది. అదే హైదరాబాద్‌లో అయితే మూడుపూటలా భోజనం చేయొచ్చు. నగర జీవనం కూడా చాలా చౌక. మూడువేల రూపాయలకే కిరాయి ఇల్లు దొరుకుతుంది. ఉప్పు, పప్పు, సబ్బులు, షాంపూలు, రవాణా ఖర్చులు, ఒకటి కాదు రెండు కాదు.. నగరంలో బతుకడానికి కావాల్సినవన్నీ చాలా తక్కువకే దొరుకుతాయిక్కడ. ఈ విషయంలో మిగతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాదే నయం అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. కూలీనాలీ చేసుకునేవారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవాళ్లు అందరికీ అందుబాటులో ఉండే నగరజీవనం కేవలం హైదరాబాద్‌లో మాత్రమే దొరుకుతుంది. ఇది మేము చెప్పే మాట కాదు. మెర్సర్స్ అనే అంతర్జాతీయ సంస్థ చేసిన ప్రకటన. వీలైనంత తక్కువ ఖర్చుతో బతుకడమే కాదు, అసలు బతుకడం రానివారికి కూడా బతకడం ఎలాగో నేర్పిస్తుంది మన హైదరాబాద్. అందుకే హైదరాబాద్ బెస్ట్ సిటీ.
Nehru-zoological-park

హైదరాబాద్‌ని బెస్ట్ సిటీగా నిలబెట్టిన మరిన్ని అంశాలు..

భద్రతకు భరోసా..

అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అన్నాడు గాంధీజి. హైదరాబాద్‌లో మాత్రం ఈ స్వాతంత్య్రం ఎప్పుడో వచ్చింది. మిగతా ప్రపంచంతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ ఎక్కువ. మహిళల మీద జరిగే దాడులు, నేరాల శాతం కూడా మిగతా నగరాల కంటే హైదరాబాద్‌లో తక్కువే. ఇప్పుడు కాదు నిజాం కాలం నాటి నుంచే లోకం మీద లేని దవాఖానలు హైదరాబాద్‌లో ఉన్నాయి. పిల్లల కోసం, గర్భిణీల కోసం, స్పెషల్ హాస్పిటల్స్ , రకరకాల వైద్యాలకు హైదరాబాద్ చిరునామాగా ఉండేది. ఇప్పటికీ ఉంది. రోగమొచ్చినా, నొప్పొచ్చినా మేమున్నామంటూ 24 గంటలూ వైద్య సేవలందించే హాస్పిటల్స్ కూడా హైదరాబాద్‌లో ఎక్కువే. మిణుకుమిణుకు మంటున్న ఇంటిదీపాలకు చేతులు అడ్డుపెట్టి కాపాడిన ఘటనలు హైదరాబాద్ చరిత్రలో లెక్కలేనన్ని ఉన్నాయి. అందుకే వైద్యరంగంలో ఎన్నో అద్భుతాలకు హైదరాబాద్ కేంద్రమయింది. బెస్ట్ హాస్పిటాలిటీ ఉన్న నగరాల్లో మన పట్నం కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. రక్షణ, ఆరోగ్యం విషయంలో ఏమాత్రం రాజీపడదు హైదరాబాద్.
INDUSTRIAL

చదువుల కేంద్రం..

19 ప్రపంచస్థాయి యూనివర్సిటీలు, 50 పరిశోధనా సంస్థలు, 57 ఇంజినీరింగ్ కాలేజీలు, 4 మెడికల్ కాలేజీలు, లెక్కకు మించి ఇంటర్, డిగ్రీ కాలేజీలు, గల్లీకో హైస్కూల్, కాలనీకో ప్లేస్కూల్.. ఇట్స్ నాట్ ఎ ట్రాక్ రికార్డ్.. ఇట్స్ మై హైదరాబాద్ ఆల్ టైం రికార్డ్. అవును.. దేశంలో ఏ నగరంలోనూ లేనన్ని విద్యాసంస్థలు మన హైదరాబాద్‌లో ఉన్నాయి. అమీర్‌పేట్ నుంచి మొదలుపెట్టుకుంటే హయత్‌నగర్ వరకు కాలేజీలకు, స్కూళ్లకు కొదవే లేదు. బిడ్డల్ని మంచి చదువులు చదివించాలనుకునే తల్లిదండ్రులకు ముందుగా గుర్తొచ్చేది హైదరాబాదే. ఉస్మానియా విశ్వవిద్యాలయం లాంటి చారిత్రత్మక సరస్వతీ నిలయాలకు హైదరాబాద్ చిరునామా. దేశం గర్వించే ఐఏఎస్, ఐపీఎస్‌లను, ప్రపంచానికవసరమయ్యే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను, మనిషి మనుగడను కాపాడే శాస్త్రవేత్తలను నిత్యం పరిచయం చేస్తున్నది హైదరాబాద్. ప్రపంచదేశాల నుంచి మన నగరానికి విద్య కోసం ఎంతోమంది విద్యార్థులు క్యూ కడుతున్నారు.

మొక్కవోని ఆత్మైస్థెర్యం

ఆత్మవిశ్వాసానికి, ఆత్మైస్థెర్యానికి హైదరాబాద్ పెట్టని కోట. అందుకే ఎన్నోసార్లు పక్కనే బాంబు పేలినా, శరీరాలు తునాతునకలయ్యినా, అప్పటికప్పుడు అందరి బాధ్యతగా సహాయక చర్యలు చేపట్టింది. ఒక్క రాత్రి గడిచి తెల్లారగానే మొక్కవోని ధైర్యంతో, ఆత్మైస్థెర్యంతో రోజూవారి జీవితాన్ని కొనసాగించింది. ఎన్నో కల్లోలాలు చుట్టుముట్టినా నగరజీవి ఆత్మబలాన్ని మాత్రం బెదిరించలేకపోయాయి. ఎన్ని వివాదాలు ముసురుకున్నా పట్నం కలిమిబలిమిని ఏమాత్రం దెబ్బకొట్టలేక పోయాయి. ఇదే హైదరాబాద్‌కి కొండంత బలం. తరతరాల నుంచి హైదరాబాద్ మీదున్న ప్రేమ, యే మేరా హైదరాబాద్ హై.. హమ్ హైదరాబాదీ హూ అంటూ పట్నాన్ని ప్రేమించే కపటమెరుగని గుణం కల్ల పట్నం బిడ్డలు హైదరాబాద్‌కి బలం. కొత్తవారితో సైతం క్షణంలో కలిసిపోయి ఇరానీ ఛాయ్‌తో మర్యాద చేసే హైదరాబాద్ అందుకే ప్రపంచంలో, దేశంలో బెస్ట్ సిటీగా నిలిచింది. మేరా హైదరాబాద్.. మేరా షాన్.
INDUSTRIAL1

ఐటీలో సాటిలేదు..

కూర్చున్న చోటి నుంచే ప్రంపచాన్ని నడిపించే ఐటీ రంగంలో హైదరాబాద్ మేటి నగరంగా పలుసార్లు ప్రశంసలందుకుంది. స్పెషల్ ఐటీ హబ్‌లు, ప్రసిద్ధ ఐటీ క్లబ్‌లు హైదరాబాద్ ఒడిలో ఎన్నో ఉన్నాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ ఉన్న పలు ఐటీ సంస్థలు కూడా మన నగరాన్ని దేశంలో మొదటిస్థానంలో నిలబెట్టడానికి కారణమయ్యాయి. విప్రో, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ లాంటి ఐటీ దిగ్గజలైన ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌ని తమ కార్యకలాపాల నిర్వహణకు సరైనదిగా ఎంచుకున్నాయి. టెక్నాలజీ డెవలప్‌మెంట్ పరంగా చూస్తే హైదరాబాద్‌లో నూటికి 94 మంది చేతిలో మొబైల్స్ ఉన్నాయి. 47 శాతం మందికి ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. వందకు 78 శాతం ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది కనీసం గంటలో ఐదు నుంచి ఆరుసార్లు గూగుల్‌లో బ్రౌజ్ చేస్తున్నారు. ఐటీలో కూడా మనమే మేటి.

ఇక్కడ ఉపాధి ఉంది..

ఎంతమందికి వడ్డించినా మరొకరికి సరిపడ ఆహారాన్నివ్వగలదు అక్షయపాత్ర. హైదరాబాద్ కూడా ఎంతమందికైనా ఆశ్రయమిస్తుంది, ఉపాధి చూపిస్తుంది. ఆకలితో వచ్చినవారికి కడుపు నిండా అన్నం పెడుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చేవాళ్లకు హైదరాబాద్ కొండంత అండ. పల్లెసీమల్లో కరువు కరాళ నృత్యం చేస్తే నేనున్నా.. రా.. బిడ్డా అంటూ హైదరాబాద్ ఎన్నో కుటుంబాలకు పెద్దదిక్కయింది. చేతి నిండా పని దొరకక ఊరు వెక్కిరిస్తే పట్నం ఎన్నోసార్లు చెయ్యందించి బతుకు నిలబెట్టింది. రోజూ పొద్దున్నే అడ్డా మీద కూలీలకు తొమ్మిది పదింటికల్లా ఏదో ఒక పని చూపించి, సాయంత్రానికల్లా వారి కష్టానికి ప్రతిఫలం ఇచ్చే చౌరస్తాలు నగరంలో లెక్కలేనన్ని ఉన్నాయి. బజ్జీల నుంచి బర్గర్ల దాకా, ఇస్త్రీ చేసేవారి నుంచి ఇంజినీర్‌గా పనిచేసే వారి దాకా ప్రతీ ఒక్కరూ హైదరాబాద్‌లో కనిపిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్. వ్యాపార నిర్వహణలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాలను వెనక్కి నెట్టింది మన ముత్యాల నగరం. అందుకే మన పట్నం మిగిలిన పట్నాల కంటే బెస్ట్‌గా నిలిచింది.
INDUSTRIAL2

ప్రపంచాన్ని ఆకర్షించే పర్యాటకం..

చుట్టూ సుందరవనాలు, నట్టనడుమ చరిత్రాత్మక కొలను, శాంతిని బోధించే బుద్ధతత్వం, ఘనమైన గోల్కొండ కోట, చరిత్రకు సాక్షి చార్మినార్, రకరకాల సంస్కృతీ సంప్రదాయాలు, వెరసీ హైదరాబాద్ గొప్ప పర్యాటక కేంద్రంగా విలాసిల్లుతున్నది. దేశదేశాల అతిథులను తన దగ్గరికి రప్పించుకుంటున్నది. కాలంతో సహా ముందుకెళ్లి మరిన్ని వన్నెలద్దుకున్న చారిత్రాత్మక నిర్మాణాలు కొన్నయితే, కాంక్రీట్ ధాటికి పోటీగా నిలుస్తూ ఇప్పటికీ దీటుగా నిలబడ్డ ఎన్నో చారిత్రాత్మక నిర్మాణాలు. ముత్యాలను కుప్పలుగా పోసి అమ్మిన నగరంగా పేరుగాంచి మత సామరస్యానికి చిరునామాగా నిలిచింది. కార్పొరేట్ హంగులతో అతిథులకు రాచమర్యాదలు చేసే ఎన్నో ప్రపంచస్థాయి హోటల్స్, నగరం చుట్టూ నిత్యం జరిగే అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు నగరాన్ని పర్యాటక కేంద్రంగా ముందుకెళ్లే కారణాంశాలుగా నిలిచాయి. వీటన్నింటినీ మించి నోరూరించే ఇరానీ ఛాయ్, నాలుకకు పట్టిన తుప్పు వదిలించే గరమ్, గరమ్ ధమ్‌కా బిర్యానీ మన హైదరాబాద్‌ని పర్యాటకరంగంలో సుపరిచితం చేశాయి. అందుకే మన పట్నం ది బెస్ట్.

సాంస్కృతిక కళలకు కాణాచి..

టీ నగర్ నుంచి ఫిలిం నగర్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉండే కళలన్నీ హైదరాబాద్‌లో చూడొచ్చు. రోజంతా శారీరకంగా, మానసికంగా అలసిపోయిన నగరజీవికి మనసు కుదుటపడేందుకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. కళలను పోషించిన నిజాం రాజు వారసత్వం హైదరాబాద్ నేటికీ సకల కళలకు రాజపోషకులుగా ఉంది. అందుకే నగరం చుట్టూ మల్టీప్లెక్స్‌లు, నగరంలో బోలెడు థియేటర్లు, కళా నిలయాలు ఉన్నాయి. రోజూ ఏదో ఒక మూలకు రకరకాల ఈవెంట్లు జరుగుతాయి. ఆవిష్కరణలు, ప్రదర్శనలు, కళాకారుల విన్యాసాలు ఇలా ఎన్నో అద్భుతాలకు హైదరాబాద్ నిలయం. ప్రపంచం నివ్వెరపోయే సినిమాలు, వాటికవసరమైన స్టూడియోలు నగరంలో కోకొల్లలు. చెన్నై నుంచి తరలొచ్చిన సినీ ఇండస్ట్రీ ఇప్పుడు చెన్నై దర్శక, నిర్మాతలు వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకునేటంతగా డెవలప్ అయింది.ఇలా హైదరాబాద్ గురించి ఎంతసేపు చెప్పినా ఒడవదు. అవును మన హైదరాబాద్ చరిత్ర, మన పట్నం గొప్పతనం ఒడువని ముచ్చట. ఇరానీ ఛాయ్‌తో పరిచయం చేసుకుని, ధమ్‌కా బిర్యానీతో బంధం బలపరుచుకునే గొప్ప మానవత్వం, వ్యక్తిత్వం ఉన్న మన హైదరాబాదీలు ఎప్పటికీ గ్రేటే. మన హైదరాబాద్ ఎప్పటికీ బెస్టే. అందుకే జై తెలంగాణ.. జయహో హైదరాబాద్.
INDUSTRIAL3

-దశాబ్ద కాలంలో 36 శాతం పెరిగిన పట్టణీకరణ.
-తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం మంది హైదరాబాద్‌లోనే జీవనం
-2001లో 98.53 లక్షలున్న పట్టణ జనాభా 2011 వరకు 1.36 కోట్లకు చేరింది.
-హైదరాబాద్‌లో నివసించే వారి తలసరి ఆదాయం రూ. 1, 04,587 (ఏడాదికి)
-ఆరోగ్యం సూచీల్లో 0.888 పాయింట్లు విద్యలో 0.774 పాయింట్లతో తెలంగాణలో టాప్‌లో నిలిచింది.
-హైదరాబాద్‌లో ఏ మూల నుంచి ఏ గల్లీకైనా సులభంగా వెళ్లగల రోడ్డు మార్గాలు, రవాణా సౌకర్యం ఉంది.
-హైదరాబాద్‌లో ప్రతీరోజు లక్షా అరవై వేల మంది ఒకచోట నుంచి ఇంకోచోటకు ప్రయాణం చేస్తారు.
-నగరంలో మొత్తం 31 ైఫ్లె ఓవర్లున్నాయి. అందులో పీవీ నరసింహరావు ైఫ్లె ఓవర్ దేశంలోనే పొడవైనది.
INDUSTRIAL4

ప్రపంచ టాప్‌టెన్ నగరాలు

1. వియన్నా - ఆస్ట్రియా 2. జ్యూరిచ్ - స్విట్జర్లాండ్
3. వాంకోవర్ - కెనడా 4. మ్యూనిచ్ - జర్మనీ
5. ఆక్లాండ్ - న్యూజిలాండ్ 6. డస్సెల్‌డార్ఫ్ - జర్మనీ 7. ఫ్రాంక్‌ఫర్ట్ - జర్మనీ 8. కోపెన్‌హెగన్ - డెన్మార్క్ 9. జెనీవా - స్విట్జర్లాండ్ 10. బసెల్ - స్విట్జర్లాండ్


మెర్సర్ ప్రకటించిన జాబితాలో ఇండియాలోని పలు నగరాలు వరుసగా

1. హైదరాబాద్ - 143
2. పుణే 143
3. బెంగళూరు - 149
4. చెన్నై - 151
5. ముంబై - 154
6. కోల్‌కతా - 160
7. ఢిల్లీ - 162

1163
Tags

More News

VIRAL NEWS