కేజీఎఫ్ ని మించిన కథ!


Sun,April 14, 2019 12:43 AM

అది ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన బంగారు గని. భూగర్భంలో దాదాపు నాలుగు కిలోమీటర్ల లోతులో బంగారం వెలికితీస్తారు. ఒక టన్ను రాయిలో పదిగ్రాముల బంగారం వెలికితీసినా.. లాభాలే లాభాలు. ఇదీ.. ప్రపంచానికి తెలిసిన నిజం. కానీ.. జనానికి తెలియని నిజాలు ఆ బంగారు గనిలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఘోస్ట్‌మైనర్ల గురించి..!!

ఇటీవల విడుదలైన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో మనకు తెలిసిందే. ఆ సినిమా కథంతా బంగారు గనుల మధ్యే తిరుగుతూ.. ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లింది. ఇలాంటి బంగారు గనుల్లో బయటి ప్రపంచానికి తెలిసిన నిజాలకంటే.. తెలియని నిజాలే చాలా ఉన్నాయి. ఈ భూమిపై అత్యంత లోతైన ప్రదేశం.. ఎమ్‌పొనెంగ్ గోల్డ్ మైన్. ఇది సౌతాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనుల్లో ఇది ఒకటి. అత్యంత లోతైన మానవ నిర్మాణం కూడా. భూ ఉపరితలం నుంచి 4 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. కిందకు వెళ్లడానికి లిఫ్టులలో గంటకు పైగా సమయం పడుతుంది. అలాంటి బంగారు గనుల్లో.. ఘోస్ట్‌మైనర్లు బంగారం అక్రమంగా వెలికితీసి.. స్మగ్లింగ్‌కు పాల్పడుతుంటారు.
GOold_Mine

ఎవరీ ఘోస్ట్‌మైనర్లు..?

దక్షిణాఫ్రికా దేశంలో ధనవంతులతోపాటు.. పేదలూ ఉన్నారు. ఎమ్‌పొనెంగ్ మైన్ చుట్టుపక్కల నివసించే పేదలను కొందరు అక్రమార్కులు ఆకట్టుకుంటారు. వారికి డబ్బు ఆశ చూపి, మైనింగ్ ఎంట్రెన్స్‌లో సెక్యూరిటీని డబ్బుతో మేనేజ్ చేసి.. వారిని లోపలికి పంపుతారు. ఇలా అక్రమంగా వెళ్లిన వారిని ఇల్లీగల్ మైనర్లు, ఘోస్ట్‌మైనర్లు అంటారు. ఇక ప్రత్యేకించి ఘోస్ట్‌మైనర్లు అని ఎందుకు పిలిచేవారంటే.. వీరు నెలల తరబడి వెలుతురుకు దూరంగా గనిలో ఉండాలి. అందులోని దుమ్ము, ధూళీ కారణంగా చర్మం మొత్తం పాలిపోయి తెల్లగా మారుతుంది. అన్నిరోజుల తర్వాత ఒక్కసారిగా బయటికి వస్తే వీరి రూపాలు దెయ్యాల్లా కనిపిస్తాయి. అందుకనే వీరిని ఘోస్ట్ మైనర్లని పిలుస్తారు. వీరు గనిలోకి వెళ్లిన తర్వాత.. అందులో అధికారుల కళ్లుగప్పి బంగారం వెలికితియ్యాలి. దానిని ఎవ్వరికంట పడకుండా స్మగ్లింగ్ చెయ్యాలి. వీరికి కావాల్సిన ఆహారం గనిలోకి వచ్చే కార్మికులే తీసుకొస్తారు. తాము కట్టుకొచ్చే బాక్స్‌లోనే కొంచెం ఎక్కువగా అన్నం, నీళ్లు తీసుకొచ్చి వారికి ఇస్తారు. ఇలా చేసినందుకు ఇల్లీగల్ మైనర్ల వద్ద ఎక్కువ మొత్తం వసూలు చేస్తారు కార్మికులు. గనిలో కొందరు అధికారుల సాయంతో వీరికి గన్స్ (ఏకే-47), మద్యం బాటిళ్లు, వేశ్యలను కూడా సప్లయ్ చేస్తారు. ఎంత సెక్యూరిటీ ఉన్నా.. ఈ తతంగం అనధికారికంగా జరుగుతూనే ఉంటుంది. గనిలో రోజూ కార్మికులు షిఫ్టుల వారీగా విధులకు వెళ్లినట్లే.. కొన్ని నెలలకు ఇల్లీగల్ మైనర్లు కూడా షిఫ్టులు మారుతూ ఉంటారు.

వీరి బతుకే ఓ సవాల్..!

ఈ ఘోస్ట్‌మైనర్ల బతుకే ఓ సవాల్. వెలుతురు లేని కారణంగా నిత్యం ప్రమాదకర బ్యాక్టీరియాతో వీరు పోరాటం చెయ్యాలి. ఒక్కోసారి గాలి కూడా సరిగా అందని పరిస్థితి. ఆక్సిజన్ లెవల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీంతో అనారోగ్యం పాలవుతుంటారు. అవన్నీ భరిస్తూనే బంగారం వెలికి తియ్యాలి. వీరికి గ్రనేడ్లు కూడా సప్లయ్ చేస్తారు. గ్రనేడ్లతో రాళ్లను పేల్చినప్పుడు కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు కూడా. వీరు ఏ పనులు చెయ్యాలన్నా హెడ్‌లైట్లే ఆధారం. ఇంత కష్టపడి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తే.. వీరికి అక్రమార్కులు ఇచ్చేది కొద్దిమొత్తమే. కుటుంబసభ్యుల కోసం, పేదరికాన్ని జయించేందుకు ఈ ఇల్లీగల్ మైనర్లు ప్రాణాలకు తెగించి గనుల్లో పోరాటం చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 10 నుంచి 20 శాతం ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటుంది. ఈ మాఫియా సంవత్సరానికి దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువ గల బంగారాన్ని కంట్రోల్ చేస్తుందని సమాచారం.

ఎమ్‌పొనెంగ్ గోల్డ్‌మైన్ ప్రత్యేకతలు..

-4 కి.మీల సొరంగమైన ఈ బంగారు గనిలో నిత్యం 4 వేల మంది కార్మికులు పనిచేస్తారు.
-120 మందిని తీసుకెళ్లగలిగే కేజ్ లాంటి ఒక లిఫ్ట్.. కార్మికులను 2.5 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి ఇంకో లిఫ్టులో రెండో లెవెల్‌కి వెళతారు. అక్కడి నుండి మైనింగ్ చేసే ప్రాంతానికి నడువాలి.
-లోపలి భాగంలో అధిక ఉష్ణోగ్రత దాదాపు 66 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. వేడిని కంట్రోల్ చెయ్యడానికి ఉప్పుతో కలిపిన మంచు ముద్దలను పై నుంచి వదులుతారు.
-ఈ బంగారు గనిలో రోజూ 5,400 మెట్రిక్ టన్నుల రాయిని తవ్వుతారు. ఒక గ్రాము బంగారం వెలికి తీయాలంటే 19 డాలర్లు ఖర్చవుతుంది. ప్రతీ టన్ను రాయికి 10 గ్రాముల బంగారం తీసినా ఎమ్‌పొనెంగ్ లాభాలను ఆర్జిస్తున్నట్లే.
-టనెల్ గోడలు ఉక్కు, కాంక్రీట్‌తో కట్టి ఉంటాయి. దాని పైన అదనపు రక్షణగా స్టీల్ మెష్‌ను ఏర్పాటు చేశారు.
-భూకంపాలను పసిగట్టడానికి సెన్సర్లతో కూడిన సిలిండర్‌లను 30 అడుగుల లోపల ఏర్పాటు చేశారు.
-కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్)లో 12 వేల ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు కొనసాగేవి.
-భారత జాతీయ ప్రభుత్వం 2001 మార్చి 21న ఈ గనులను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
GOold_Mine1

2294
Tags

More News

VIRAL NEWS