పందెపు పావురం రూ.10 కోట్లు!


Sun,April 14, 2019 12:32 AM

గుర్రపు పందాలు.. ఎడ్ల పందాలు.. పొట్టేళ్ల పందాలు.. కోడి పందాలు.. ఇప్పటి వరకూ చాలామందికి తెలిసిన పోటీలు ఇవే! కానీ, పావురాల పందాలు కూడా జరుగుతున్నాయి తెలుసా? మన దగ్గర వేలల్లో, లక్షల్లో పందాలు కడితే.. చైనా, బెల్జియం, జపాన్ వంటి దేశాల్లో కోట్లలో పందాలు కాస్తున్నారు. మన దగ్గర పందెంలో గెలిచిన గుర్రాలు, ఎడ్లు, పొట్టేళ్లు, కోళ్లు వేలం వేసినట్లే.. ఈ పందెపు పావురాలను వేలం వేస్తే.. ఎవ్వరూ ఊహించని ధర పలుకుతున్నాయి. ఇంతకీ ఈ పావురం ధర ఎంతో తెలుసా..? అక్షరాల పది కోట్ల రూపాయలు! ఇంత ధర పెట్టి దీన్ని కొంటున్నారంటే ఎన్ని ప్రత్యేకతలు ఉండాలి మరి?

అది బెల్జియంలోని పావురాల వేలంపాట కేంద్రం.వేలంలో 178 పావురాలు ఉన్నాయి. ఆ పాటలో పాల్గొనేందుకు పలు దేశాలకు చెందిన ఔత్సాహికులు వచ్చారు. వేలం మొదలైంది. వంద డాలర్లతో మొదలైంది పాట. తమ స్థోమతను బట్టి వేలం పాడుతున్నారు. ఓ పావురం దగ్గరకు రాగానే వేలం పాటలో వేగం పెరిగింది. ఒక్కసారే వెయ్యి డాలర్లకు వెళ్లింది. కొద్ది సమయంలోనే పదివేల డాలర్లకు చేరింది.అలా 50 వేల డాలర్లు.. లక్ష, రెండు లక్షలు, ఆరు లక్షల డాలర్ల వరకూ వచ్చింది.
ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. ఎందుకంటే ఓ పావురం అంత ధర పలుకడం అదే టాప్. అక్కడితో ఆ వేలం ఆగుతుందని అనుకున్నారంతా. కానీ.. అప్పుడే మొదలైంది అసలు వేలం పాట. బరిలో ఇద్దరు చైనీయులు ఉన్నారు. వారిద్దరూ పోటీ పడి మరీ వేలం వేస్తున్నారు. వారిద్దరి పోటీ చూసి.. మిగతావాళ్లంతా గమ్మునున్నారు. ఎందుకంటే వారు వేలంలో పాడుతున్న లక్షల రూపాయల్లో కాదు.. కోట్లల్లో. నువ్వా? నేనా? అన్నట్లు ఓ గంటపాటు సాగిన ఆ వేలం పాటలో.. ఈ పావురం అనూహ్యంగా 1.4 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే.. మన కరెన్సీలో దాదాపు పది కోట్ల రూపాయలు. ఇంతకీ ఆ పావురానికి ఎందుకంత ధర పెట్టారంటే..? ఇది వేల పావురాలను సైతం వెనక్కి నెట్టి ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. దాని రెక్కల వేగం.. రాకెట్‌తో సమానం. వేల కిలోమీటర్లను సైతం అవలీలగా ఛేదించగలదు.
Pegion-Race

ఆర్మాండో కింగ్ ఆఫ్ పిజియన్స్..

ఈ విలువైన పావురం పేరు ఆర్మాండో. వయస్సు ఐదేండ్లు. ఇది దాదాపు రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉంది. అయినా ఇంత ధర పలుకడం ఆశ్చర్యకరం. ఆ పావురం రెక్కల్లో అసాధారణమైన బలం, వేగంగా దూసుకెళ్లేతత్వమే ఇందుకు కారణం. ఓ పావురం ఇంత ధర పలుకడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఓ పావురం సుమారు రూ. 3 కోట్లు పలికింది. ఈసారి మొత్తం 178 పావురాలను వేలం వేశారు. వీటిన్నింటికీ కలిపి రూ.17 కోట్లు రావడం విశేషం. ఇప్పటివరకు నిర్వహించిన వేలం పాటల్లో ఇది మూడో అత్యధికం. పావురాలను కోట్లు కుమ్మరించి ఎందుకు సొంతం చేసుకుంటారని ఆశ్చర్యం కలుగొచ్చు. కానీ, ఆ పావురాలను పెంచేందుకు పడే కష్టం అంతా ఇంతా కాదు. సంక్రాంతి కోడి పందేలకు ఏడాదంతా కోళ్లను పోషించినట్టు.. పావురాల రేస్‌కు వీటిని సిద్ధం చేస్తుంటారు. రోజూ 12 గంటల పాటు పావురాల కోసం సమయం కేటాయిస్తుంటారు పోషకులు. అందుకే ఈ పావురాలకు అంత విలువ.

గంటకు 177 కి.మీల వేగం

ఆర్మాండో పేరు గల ఈ పావురం వేగంగా దూసుకెళ్లడంలో దిట్ట. ఇప్పటివరకు ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. తాజాగా లక్ష మంది వరకు ఉన్న బెల్జియం పావురాల రేసింగ్ క్లబ్‌లోని 90 వేల మంది తమ పావురాలతో పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో అన్ని వేల పావురాలను ఓడించింది ఆర్మాండ్. ఇది గంటలకు 177 కిలోమీటర్లు వేగంతో పయనించగలదు. ఈ పావురాల పోటీలు దాదాపు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకూ ఉంటాయి. బెల్జియంలో పీజియన్ రేసింగ్ వెబ్‌సైట్ PIPA.be అధికారికంగా వేలం, పావురాల పోటీలను నిర్వహిస్తున్నది.

పోటీలు ఇలా జరుగుతాయి..

నిర్వాహకులు పావురాల కాళ్లకు నెంబరింగ్ వేసిన బిళ్లలను కడతారు. పందెం రాయుళ్ల సూచనల మేరకు 100 నుంచి 500 లేదా వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని పందెంగా నిర్ణయిస్తారు. నిర్ణయించిన కిలోమీటర్లను బట్టి.. తమ పావురం అంతదూరం ఎగరగలదనుకుంటే.. పోటీల్లో పాల్గొంటారు పందెం రాయుళ్లు. వాటిని పెద్ద కంటైనర్లలో నిర్ణీత దూరం తీసుకెళ్లి.. వేల పావురాలను ఒక్కసారిగా వదులుతారు. అవి.. నిర్ణీత దూరం వెనక్కి ప్రయాణించి క్లబ్ వద్దకు చేరుకోవాలి. ఏ పావురం ముందుగా చేరుకుంటే అదే విజేత. పందెంగా లభించిన సొమ్మంతా గెలిచిన పావురం యజమానికి వెళ్తుంది. అందులో కొంత క్లబ్‌కు వెళ్తుంది. ఇదీ పోటీ. అయితే ఈ పోటీలు మన దేశంలో కూడా అక్కడక్కడా చాలా రహస్యంగా జరుగుతున్నాయట. చెన్నై, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఈ పోటీలు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. పూర్వకాలంలో రాజులకు, ప్రేమికులకు రాయబారులుగా ఉన్న పావురాలను.. ఇప్పుడు పందేలకు ఉపయోగిస్తున్నారు. పావురాలు ఒకసారి ఒక ప్రాంతాన్ని గుర్తుపెట్టుకుంటే.. ఎక్కడ వదిలినా మళ్లీ అక్కడికి తిరిగి వెళ్లిపోతాయి. ఆ సామర్థ్యాన్నే పందెపు రాయుళ్లు ఇలా జూదానికి వాడుకుంటున్నారు.

1167
Tags

More News

VIRAL NEWS