లక్షాధికారుల గ్రామం


Sun,April 14, 2019 12:29 AM

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ గ్రామంలో సగానికి పైగా లక్షాధికారులే. ఒకప్పుడు తిండికి, తాగునీటికి, సాగునీటికి అలమటించిన ఆ గ్రామస్తులు.. నేడు వందమంది ఆకలి తీర్చేస్థాయికి ఎదిగారు. ఇప్పుడా గ్రామంలో పేదవాడు నిరుపేద కుటుంబం అనే మాటలే వినిపించవు. ఇంతకీ ఆ ఊరు ఉన్నది ఏ సింగపూర్‌లోనో, అమెరికాలోనో కాదు.. మన దేశంలోనే. ఎక్కడో తెలుసా?

అది 1970వ సంవత్సరం..

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా.. హివరేబజార్ గ్రామం.దాహమేస్తే ఆకాశం వంక.. ఆకలేస్తే నేల వంక చూసే రోజులవి..గతంలో పచ్చగా కళకళలాడిన గ్రామం.. వనరుల ధ్వంసంతో కళావిహీనంగా మారింది. సాగునీరు లేక వ్యవసాయం ఒట్టిపోయింది. బావుల్లోని నీరు అడుగంటిపోయింది. సస్యరక్షణ చర్యలు లేక భూగర్భజలం ఇంకిపోయింది. పొలాలు బీడువారాయి. వెరసి.. ఆకలికి ఆ గ్రామస్తులు అలమటించేవారు. అప్పటికి ఆ గ్రామంలో ఉన్నవి కేవలం 200 కుటుంబాలే. నమ్ముకున్న వ్యవసాయం వెక్కిరించడంతో.. పిల్లల భవిష్యత్ కోసం పట్టణాలకు వలస బాట పట్టారు.

ప్రస్తుతం..

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా.. హివరేబజార్ గ్రామం..ఆకలంటూ వచ్చిన వందమందికి కూడా అన్నం పెట్టగల కుటుంబాలు 500 వరకూ ఉన్నాయి. 1970 కంటే ముందు.. ఆ గ్రామం పచ్చగా ఎలా కళకళలాడిందో.. ఇప్పుడు అంతకు వందరెట్లు ఉన్నది.పంటకాల్వల్లో నీరు గలగల పారుతున్నది. చెరువులు నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి.పాతాళం నుంచి గంగమ్మ బావుల్లో ఎగిసిపడుతున్నది. పాడిపంటలతో.. ఎటు చూసినా ఊరంతా పచ్చగా కనపడుతున్నది. నాడు పూట గడువడమే గొప్ప అనుకున్న స్థితి నుంచి.. నేడు ఇంటికొక లక్షాధికారి పుట్టుకొచ్చాడు. ఇదే కదా విప్లవాత్మకమైన మార్పంటే.
Villegrs

ఊరిని మార్చేసిన గ్రామసభ!

ప్రభుత్వ పథకాలు గ్రామానికి చేరి.. ఊరు అభివృద్ధి దిశగా సాగాలంటే గ్రామసభ చాలా కీలకం. అలాంటి గ్రామసభను హివరేబజార్ గ్రామస్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామానికి, ప్రజలకు సంబంధించిన ఏ విషయమైనా దానికి ఆమోదం ఇవ్వాల్సింది గ్రామసభే. ఆ సభలో గ్రామస్తులందరిదీ ఒకటే మాట.. ఒకటే బాట కావడంతో సొంతంగా పంచవర్ష ప్రణాళికలు వేసుకునేవారు. అందుకే ఈ గ్రామం లక్షాధికారులకు నెలవు అయింది. రాళ్ల గుట్టలు, ముళ్లపొదలతో ఉన్న ఈ గ్రామానికి అభివృద్ధిని పరిచయం చేసింది పోపట్‌రావ్ అనే వ్యక్తి. 1972లో డిగ్రీ పూర్తిచేసి ఊరిలో అడుగుపెట్టిన పోపట్‌రావ్.. ఊరి దుస్థితికి చలించాడు. ఆ సమయంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామస్తులంతా ఆయనను ఎన్నికల్లో పోటీ చేయించి.. గెలిపించుకున్నారు. సర్పంచ్‌గా మొట్ట మొదట ఆయన చేసిన పని.. నాలుగో తరగతి వరకు ఉన్న పాఠశాలను పదో తరగతి వరకూ అప్‌గ్రేడ్ చేయించడం. ఫలితంగా గ్రామంలో అక్షరాస్యత పెరిగింది. తర్వాత జల సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టాడు. గొట్టం బావులను నిషేధించాడు. అడవుల నరికివేతను అడ్డుకొని, వేలాది మొక్కలను నాటించాడు. నీటిని సంరక్షించి.. భూగర్భ జలాన్ని పెంచేందుకు 4వేలకు పైగా ఇంకుడుగుంతలు తవ్వించాడు. తక్కువ నీటికి అనుగుణంగా ఆరుతడి పంటలను వేయించాడు. ఇవన్నీ గ్రామసభల ద్వారానే ప్రజలకు వివరించి.. వారిని ఒప్పించాడు పోపట్‌రావ్. తన ముందుచూపు వల్లే.. నేడు దేశమంతా హివరేబజార్ వైపు చూస్తున్నది.

ఊరి అభివృద్ధికి ఉపాధిహామీ..

హివరేబజార్ గ్రామం ఇంతలా అభివృద్ధి చెందడంలో కీలకమైంది ఉపాధి హామీ పథకం. దీని ద్వారా ప్రణాళికాబద్ధంగా ఊరిని అభివృద్ధి చేసుకున్నారు గ్రామస్తులు. గ్రామ సంసద్(గ్రామసభ)లో ఏయే పనులు చెయ్యాలో నిర్ణయించుకొని పంట పొలాలను బాగు చేసుకున్నారు. పంట కాల్వలను తవ్వుకున్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. చెరువులో పూడిక తీసి, ఎక్కువ నీరు నిల్వ ఉండేలా చెరువు విస్తీర్ణం పెంచారు. ఊరికి సమీపంలో ఉన్న గుట్టపై నీటిని నిల్వ చేసేందుకు 40 వేల కరకట్టలు నిర్మించుకున్నారు. కొత్తగా చెరువులు తవ్వుకున్నారు. నీరు నిల్వ ఉండేందుకు పొలాల వెంబడి 660 కొద్దిపాటి చెక్‌డ్యామ్‌లు తవ్వుకున్నారు. ఇలా ప్రతియేటా ఉపాధి పనుల్లో వేగం పెంచి.. కొద్దికాలంలోనే ఊరి స్థితిని, గతిని మార్చేశారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా డబ్బులు రావడంతో.. ఊరు బాగుపడింది. 1995లో కేంద్రం ప్రకటించిన ఆదర్శ గ్రామ యోజన కింద ఈ గ్రామం ఎంపికైంది. ఇందులో మద్యపాన నిషేధం, చెట్లను నరకడంపై నిషేధం, పశువులకు ఉచిత గ్రాసం, కుటుంబ నియంత్రణ, శ్రమదానం వంటివి తీర్మానాలుగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బులు గ్రామం కోసమే ఖర్చు పెట్టారు.

తలసరి ఆదాయం రూ.50 వేలపైనే!

ఈ గ్రామంలో ఉల్లిపంట, ఆకుకూరలు, కూరగాయలు, పుట్టగొడుగులు, ఆహారధాన్యాలు ఎక్కువగా పండిస్తున్నారు. వీటి వల్ల ఎప్పటికప్పుడు ఆదాయం కనిపించేది. ఈ పంటలకు నీటి వాడకం కూడా చాలా తక్కువ. సుందరబాయ్ గాయిక్వాడ్ అనే గ్రామస్తురాలి ప్రస్తుత తలసరి ఆదాయం రూ. 90వేలు. గ్రామంలో 70 కుటుంబాల సంవత్సరం ఆదాయం పది లక్షల రూపాయలకు దాటింది. గ్రామంలో పశుగ్రాసం 8 టన్నుల వరకూ పెరిగింది. వ్యవసాయ భూమి 300 హెక్టార్లకు పెరిగింది. 300లకు పైగా బావులున్నాయి. పాత ఉత్పత్తి 5వేల లీటర్లకు పెరిగింది. అనేక కార్యక్రమాల ఫలితంగా హివారే బజార్ దేశంలోనే అత్యంత ధనిక గ్రామాల్లో ఒకటిగా కొనసాగుతున్నది.
Villegrs1

1121
Tags

More News

VIRAL NEWS