ఇంటింటా చెస్.. పెట్టేశారు మద్యానికి చెక్


Sun,April 14, 2019 12:26 AM

స్కూల్ నుంచి వచ్చిన పిల్లోడు రోజూ సెల్‌ఫోన్‌తో ఆడుకుంటున్నాడు. దీన్ని గ్రహించిన తల్లి ఫోన్ లాక్కుంది. సాధారణంగా పిల్లోడు ఏడ్వడం మొదలెట్టాడు. ఫోన్ చేతికి ఇవ్వడానికి ముందు ఓ పెన్సిల్‌ను, బొమ్మను చేతికి ఇచ్చింది. డ్రాయింగ్ వేస్తేనే ఫోన్ ఇస్తా అని చెప్పింది. పిల్లోడు డ్రాయింగ్ వేశాడు. ఫోన్ తీసుకున్నాడు. ఇలా రోజూ జరుగుతున్న క్రమంలో ఆ అబ్బాయి దృష్టి పూర్తిగా డ్రాయింగ్ వైపు మళ్లింది. ఇలా ఫోన్‌తో ఆడడానికి బదులు బొమ్మలు వేయడం అలవాటైంది.

ఒక చెడు అలవాటుకు దూరమవ్వాలంటే.. ఒక మంచి అలవాటుకు దగ్గరవ్వాలి. కొత్త అభిరుచిని అలవర్చుకోవాలి. దాని మీద దృష్టి పెట్టాలి. ఇలా సాధన చేయడం ద్వారా చెడు అలవాట్లకు దూరం అవొచ్చు. అచ్చం అలానే జరిగింది కేరళలోని త్రిశూర్ జిల్లా మరోత్తిఛల్ అనే గ్రామంలో. ఆరు వేల జనాభా ఉంది. జనాభాలో దాదాపు 90 శాతం మంది చెస్ క్రీడాకారులే. ఏ ఇంటికి వెళ్లినా చెస్ బోర్డు కనిపిస్తుంది. ఏ గల్లీకి వెళ్లిన చెస్ ఆడుతూ కనిపిస్తారు. ఎవరైనా కలుసుకున్నా చెస్ గురించే మాట్లాడతారు. ఖాళీ దొరికితే చాలు చిన్నా, పెద్దా, ఆడ, మగా తేడా లేకుండా పావులు కదుపుతూ, వ్యూహాలు ఆలోచిస్తూ కనిపిస్తారు. వాళ్లకు చెస్ అలవాటు కాదు. వ్యసనం. ఇంతలా ఎందుకు మారిందంటే వ్యసనాన్ని మాన్పించడానికి ఓ కుర్రాడు చేసిన ప్రయత్నం.
Chess

1960-70 ప్రాంతంలో ఆ గ్రామంలో సారాయి రాజ్యమేలింది. అందరూ మద్యానికి బానిసై నష్టపోతున్నారు. మరోవైపు దొంగతనాలకు పాల్పడుతున్నారు. గ్రామస్తులు ఎంత ప్రయత్నించినా సారాయికి అడ్డుకట్ట వేయలేకపోయారు. అధికారులకు సమాచారం ఇచ్చిన ఫలితం తాత్కాలికంగానే ఉండేది. కొన్నేండ్లు గడిచిన తర్వాత దీన్ని గమనించిన పద్నాలుగేండ్ల ఉన్నిక్రిష్ణన్ అనే అబ్బాయి ఎలాగైన మద్యాన్ని మాన్పించాలనుకున్నాడు. ఆ సమయంలోనే బాబీ షపర్ ప్రపంచ చెస్ చాంపియన్ అయ్యాడు. అతన్ని ఆదర్శంగా తీసుకొని గ్రామస్తులందరికీ చెస్ నేర్పి, మద్యానికి దూరం చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట అతను చెస్ నేర్చుకొని తన స్నేహితులతో ఆడుతూ అనుభవం పొందాడు. తర్వాత గ్రామంలోని ఓ టీ స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. అక్కడి టీ తాగడానికి వచ్చిన వారిని చెస్ ఆడడానికి ప్రోత్సహించాడు. సాధారణంగానే వాళ్లు టీ తాగుతూ చెస్ ఆటకు అలవాటయ్యారు. అలా ఒక్కొక్కరిగా మొదలైన చెస్ ఆట ఇప్పుడు గ్రామం అంతా వ్యాపించింది. ఇంటింటా పాకి చెస్ చాంపియన్లను చేసింది.

చెస్ వీరులు..

కొద్ది రోజుల్లోనే చెస్ ఆ ఊరంతా వ్యాపించింది. స్కూల్ పిల్లల దగ్గర్నించి పండు ముసలి వరకూ చెస్‌కు అలవాటయ్యారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా వెళ్లారు. అయితే పొద్దస్తమానం చెస్‌లోనే నిమగ్నం అవుతారనుకోకండి. నిజానికి ఎవరి పనులు వాళ్లకుంటాయి. ఖాళీ సమయంలో మాత్రమే చెస్ బోర్డులు ముందు వేసుకొని సమయం వెళ్లదీస్తారు. తీరిక దొరికినప్పుడు వ్యూహాలకు పదును పెడుతుంటారు. స్కూల్ పిల్లలు సైతం చెస్‌లో ప్రతిభ కనబరుస్తారు. దీంతో వారిలో మ్యాథ్స్, లాజికల్ థింకింగ్‌లో పరిజ్ఞానం పెరుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. పెద్దల్లో ఆలోచనా పరిధి విస్తరించిందనీ, అందరూ మద్యానికి దూరమయ్యారనీ, సహనం పెరిగిందని ఉన్నిక్రిష్ణన్ అంటున్నాడు. విపరీతంగా మద్యానికి బానిసైన తన గ్రామస్తులకు చెస్ అలవాటు చేయిండం, వాళ్లు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చడం నమ్మలేకపోతున్నానని అంటున్నాడు. దేశంలోని ఇతర గ్రామాల్లో చెస్ ఆడేవాళ్లు ఎక్కువ ఉండరనీ, కానీ వాళ్ల ఊర్లో వేల సంఖ్యలో చెస్ క్రీడాకారులు ఉండడం గర్వకారణం అని చెస్ అసోషియేషన్ మరోత్తిఛల్ ప్రెసిడెంట్ బేబీజాన్ అంటున్నాడు. ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన విశ్వనాథ్ ఆనంద్ ఈ గ్రామస్తులను అభినందించాడు. 2013లో వచ్చిన ఆగస్టు క్లబ్ అనే మలయాళం సినిమాలో ఈ గ్రామస్తులు కనిపించారు.
Chess1

781
Tags

More News

VIRAL NEWS