ఆమె నడిపితే కానీ..


Sun,April 14, 2019 12:22 AM

మార్కెట్‌లోకి కొత్త కార్ వచ్చిందా? అయితే ఆమె నడుపాల్సిందే! దాని ఖరీదెంతైనా సరే, ఏ కంపెనీదైనా సరే ఆమె స్టీరింగ్ తిప్పాల్సిందే. దాని స్పీడ్ ఎంతైనాసరే ఆమె రయ్‌మంటూ దూసుకెళ్లాల్సిందే. అవకాశాలను అందిపుచ్చుకొని ప్రపంచంలో అతి ఖరీదైన కార్లను నడుపుతూ టెస్ట్ రైడర్‌గా జీవితాన్ని మార్చుకుంది ముప్పై ఆరేండ్ల అలెగ్జాండ్రా మేరీ హిర్సిచ్చి. పురుషులే ఎక్కువ ఉండే ఈ రంగంలో తనదైన శైలిలో గుర్తింపు పొందుతున్నది ఈ మోడ్రన్ ఉమెన్. సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని అరబ్ దేశాల్లో పాపులారిటీ సాధించింది.

అదిరిపోయే కార్లు, అందమైప ఫీచర్లు విలాసానికి ఆనవాళ్లు. ప్రపంచంలోనే అలాంటి కార్లను టెస్ట్ రైడ్ చేసి కస్టమర్లకు అందిస్తున్నది అలెగ్జా. ఎటువంటి కారునైనా నడిపేసి దాని పని తీరు తెలియజేస్తుంది. ఖరీదైన కార్లను నడిపి ఫేమస్ టెస్ట్‌రైడర్‌గా, సోషల్‌మీడియా స్టార్‌గా దుబాయ్, సౌదీలో గుర్తింపు తెచ్చుకుంటున్నది.

ఆస్ట్రేలియా టు అరబ్..

అలెగ్జా పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో. మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం చేసింది. నాన్నతో ఎప్పుడూ కార్లో తిరిగేది. దీంతో చిన్నప్పుడే అలెగ్జాకు కార్లపై అమితమైన ఆసక్తి ఏర్పడింది. 2008లో భర్తతో కలిసి ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్లింది. ఓ రేడియోలో ఆర్‌జేగా ఉద్యోగం చేసింది. అప్పుడే ఆ దేశపు కార్ల గురించి తెలుసుకుంది. సూపర్ కార్స్ క్లబ్ ఆఫ్ అరేబియాలో సభ్యురాలిగా చేరింది. ఈ క్రమంలో దుబాయ్‌లో జరిగిన ఓ సూపర్ కార్ రేసింగ్‌లో పాల్గొన్నది. 60 మంది సభ్యులతో కలిసి నిర్వహించిన ఈ పోటీ యూఏఈ, సౌదీ అరేబియా సరిహద్దులో జరిగింది. సుమారు వెయ్యి కిలోమీటర్లు కార్లో ప్రయాణించింది. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన 60 కార్లు వేగంగా వెళ్తుంటే వాటికి దుబాయ్ పోలీసులు రక్షకులుగా ఉన్నారు. హెలికాప్టర్ నుంచి పర్యవేక్షణ చేశారు. అది అలెగ్జాకు ఎంతో థ్రిల్‌ను ఇచ్చింది. ఆ థ్రిల్ ఎప్పటికీ ఉండిపోవాలనుకుంది. అంతే అప్పటి నుంచి వరుసగా కార్లను నడుపుతూ రోజులు గడిపింది. చివరికి ఆర్‌జే ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి డ్రైవింగ్‌కి పరిమితమైంది.
Alex-Hirschi

ఏ కారైనా.. ఎంత వేగమైనా...

ఉద్యోగానికి రాజీనామా చేసిన అలెగ్జా పూర్తిగా కార్ల టెస్ట్ రైడర్‌గా మారిపోయింది. ఎలాంటి కారునైనా, ఎంత వేగమైనా, ఎన్ని మైళ్ల దూరమైనా నడిపి దాని వివరాలు కస్టమర్‌కు తెలియజేస్తుంది. వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల వేగంతో కార్లను నడుపగలదు. ఇప్పటి వరకూ అలెగ్జా నడిపిన వాటిలో బుగట్టి చిరోన్, రోల్స్ రాయిస్, ఫెరారీ, బీఎండబ్ల్యూ ఐ8, 488 స్పైడర్, బెంట్లీ, మెర్సిడెస్ ఏఎంజీ, మెక్లారెన్, అంబోర్గినీ సహా మరెన్నో అత్యాధునిక కార్లను నడిపింది. ఆ అనుభవంతో కారు పనితీరు, మైలేజీ, సామర్థ్యం, ఫీచర్లు అన్నీ వివరాలు కస్టమర్లకు తెలియజేస్తుంది.

మాస్ మీడియా వదిలేసి సోషల్ మీడియాలోకి

జర్నలిజం చేసిన అలెగ్జా దుబాయ్‌లోని మీడియా కంపెనీల్లో పని చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఆసక్తి కార్లమీదకు మళ్లడంతో మీడియాను వదిలేయాల్సి వచ్చింది. తన నడిపిన కార్ల ఫొటోలను, వీడియోలను తన పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో షేర్ చేసేది. ఇలా రోజూ పెద్ద పెద్ద కార్లను నడుపుతూ ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. వాటికి పెద్ద ఎత్తున్న స్పందన రావడంతో అలెగ్జా ఆశ్చర్యపోయింది. దీంతో పాటు మరిన్ని పెద్ద కార్లు నడిపే అవకాశాన్ని దక్కించుకున్నది. ఇలా కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్‌గా ఉండడం ప్రారంభించింది. supercarblondie పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ ఖాతాలు తెరిచి వీడియోలు షేర్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఆమె పేజీని 50 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇలా ఆమె యూఏఈ, సౌదీఅరేబియా అంతా పాపులర్ అయింది. 2018లో అరబ్ బిజినెస్ అనే మ్యాగజైన్ 50 మంది ప్రభావశీలుర జాబితాను విడుదల చేసింది. అందులో అలెగ్జాకు కూడా చోటు దక్కింది. 2019లో విడుదల చేసిన జాబితాలో టాప్ 30లో ఆమె నిలిచింది. కార్లను అమితంగా ఇష్టపడే కుటుంబం నుంచి రావడం, కార్లు నడపడం అంటే ఆసక్తి ఉండడంతో ఈ రంగంలో ఉండగలుగుతున్నాను అంటున్నది.
Alex-Hirschi1

-అత్యంత ఖరీదైన, విలాసవంతమైన 60 కార్లు వేగంగా వెళ్తుంటే వాటికి దుబాయ్ పోలీసులు రక్షకులుగా ఉన్నారు. హెలికాప్టర్ నుంచి పర్యవేక్షణ చేశారు.

832
Tags

More News

VIRAL NEWS