చీకట్లో దొంగ


Sun,April 14, 2019 12:14 AM

హెన్రీ సినిమా హాల్లోకి వెళ్ళాక ఆ చీకటికి తన కళ్ళు అలవాటయ్యే దాకా ఆగి తన సీట్ నంబర్ వెతుక్కొని కూర్చునేసరికి న్యూస్ రీల్ చూపిస్తున్నారు. అతను కుర్చీలో వెనక్కి వాలి, ముందు సీట్లో ఎవరూ లేకపోవడం గమనించి దాని మీద కాళ్ళుంచి సౌకర్యంగా సర్దుకొని కూర్చొని, తెర మీద కనపడేది చూడసాగాడు.న్యూస్ రీల్ పూర్తె బగ్స్ బన్నీ కార్టూన్ మొదలైంది. హెన్రీకి కార్టూన్లంటే ఇష్టం. అది పూర్తయ్యాక ప్రకటనలు వేశారు. అవి పూర్తవగానే హెన్రీ అసలు సినిమా మొదలవడానికి వేచి ఉన్నాడు. కానీ, అవి పూర్తయ్యాక సినిమా ఆరంభం కాలేదు. కొద్దిసేపు తెరంతా చీకటి. కొందరు ఈలలు వేసారు. ఏమైంది? అతను చాలా సంవత్సరాలుగా సినిమాలకి వస్తున్నాడు. ఎన్నడూ అతనికి ఇలాంటి అనుభవం కలుగలేదు.
దాదాపు ఓ నిమిషం గడిచాక చీకట్లోని ప్రేక్షకుల్లో అసహనం పెరుగసాగింది. ఏయ్! ఏం జరుగుతున్నది? చీకట్లో ఓ కంఠం పెద్దగా వినిపించింది.తర్వాత మరి కొన్ని కంఠాలు కూడా ప్రశ్నించాయి. అకస్మాత్తుగా మళ్ళీ లైట్లు వెలిగాయి. స్పీకర్లోంచి ఓ మనిషి మాటలు వినిపించాయి.లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. నేను మీ హాల్ మేనేజర్ని ఇవాళ ఇక్కడ ఎదురు చూడనిది ఒకటి జరిగింది. మీ పూర్తి సహకారాన్ని మేం కోరుతున్నాం.వెంటనే చిరాకుతో కూడిన అనేక కంఠాల గుసగుసలు హెన్రీ విన్నాడు.
మా గేట్‌మెన్ మీ సీట్ల దగ్గరకి వచ్చి పోయిన ఓ ముఖ్యమైన కవర్ కోసం వెతుకుతారు. అది దొరుకగానే సినిమా మళ్ళీ మొదలవుతుంది.ఛ! ఇది ఈ ఆటకే జరుగాలా? అని హెన్రీ విసుక్కున్నాడు. సినిమా అయ్యాక తన గర్ల్ ఫ్రెండ్‌ని రాత్రి భోజనానికి రెస్టారెంట్లో కలువాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెకి వేచి ఉండడం చిరాకు.ఆ కవర్లో ఉన్నవి చాలా విలువైనవి. అది మీ కుర్చీల్లోని ఓ కుర్చీ కింద ఉంది. మీరంతా దయచేసి లేచి నిలబడి మీ సీట్ అడుగు భాగాన అది ఉందేమో దయచేసి చూస్తారా? మీ సీట్ కింద లేకపోతే మీ పక్కన గల ఖాళీ సీట్ల కింద కూడా చూడండి. అది దొరికిన వాళ్ళు వెంటనే సమీపంలోని గేట్‌మెన్‌కి ఇవ్వండి. థాంక్స్.నీలం రంగు యూనిఫాంలోని గేట్‌మెన్ ఆ పనిలో శిక్షణ పొందిన నిపుణుల్లా ఒక్కో వరుసలోకి వెళ్ళి సీట్ల కింద తడుముతూ వెతుకసాగారు.
Thief

అకస్మాత్తుగా ఆ హాల్లో సీట్లు వెదికే శబ్దం మొదలైంది.ఎవరికైనా దొరికిందా? నిమిషం తర్వాత ఓ ఆడకంఠం విసుగ్గా ప్రశ్నించింది.ఇద్దరు టీనేజర్స్ వేగంగా హెన్రీ ముందు వరుసలోని సీట్ల కింద వెతుకడం హెన్రీ చూశాడు. వాళ్ళు ఆ వరుస పూర్తి చేసి తన వరుసలోకి రాగానే హెన్రీ తన సామ్రాజ్యంలోకి దాడి చేసిన శత్రువుల్లో వాళ్ళ వంక చూసి కఠినంగా చెప్పాడు.నేనీ వరుసలోవన్నీ చూశాను. లేదు.వాళ్ళు తన గొప్ప ఆనందాన్ని దొంగిలించే వారి వంక చూసినట్లుగా హెన్రీ వంక చూసి అతని వెనక వరుసలో వెతుకడానికి వెళ్ళారు.దయచేసి త్వరగా వెతకండి. అది దొరుకగానే సినిమా ఆరంభిస్తాం. లేదా మీకు ఆలస్యం కావచ్చు ఇందాకటి కంఠం మైక్‌లో వినపడింది.గేట్‌మెస్ ఆఖరి వరుసలోని ఖాళీ సీట్ల కింద కూడా వెదికాక ఒకరు అరిచారు.సినిమా వేయండి.దయచేసి వినండి. అప్పుడు ఆ కవర్ అవసరం ఏమిటో మీకు అర్థ్ధమవుతుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా హాల్ క్యాషియర్ పాతిక వేల డాలర్లతో పారిపోయాడు. మా సినిమా హాల్ పరువు పోకూడదని ఇది పేపర్లలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఫ్లోరిడాలోని జాక్సనవిల్ నుంచి ఐదు నిమిషాల క్రితం పోలీసులు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఆ క్యాషియర్ని అక్కడ ఉదయం అరెస్ట్ చేశారు. అతను ఆ డబ్బుని ఓ కవర్లో ఉంచి దాన్ని ఇక్కడ సీట్లలోని ఓ సీట్ కింద సెలిఫోన్ టేప్తో అతికించానని చెప్పాడు.

తక్షణం ఆ హాల్లో గుండుసూది పడితే వినిపించేంత నిశ్శబ్దం ఏర్పడింది. తర్వాత హెన్రీకి ఎక్సైటెడ్ కంఠాలు వినిపించాయి.లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. మీలో ఎవరికీ అది దొరకలేదు కాబట్టి క్యాషియర్ పోలీసులకి చెప్పింది అబద్దమని తేలింది. ఈ సంగతి ఫ్లోరిడా పోలీసులకి తెలియచేస్తాం. మీ సహనానికి, సహకారానికి థాంక్స్. మీకు కలిగించిన ఆలస్యానికి క్షమాపణలు. సినిమా ఆరంభిస్తున్నాం. మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం.వెంటనే లైట్స్ ఒక దాని తర్వాత మరొకటి ఆగిపోయాయి. ప్రొజెక్టర్ గది రంధ్రంలోంచి బలమైన కాంతి కిరణం తెర మీద ప్రసరించి ఎంజీఎం సింహం రెండుసార్లు గర్జించింది. హెన్రీ తన సీట్‌లో వెనక్కి వాలాడు. సంగీతం ఆరంభమైంది.పాతిక వేల డాలర్ల కోసం చక్కటి ఉద్యోగాన్ని వదలుకున్న ఆ మూర్ఖుడు ఎవరా అని హెన్రీ అనుకున్నాడు. అతని మీద జాలి కూడా కలిగింది.పేరు తర్వాత చివరగా దర్శకుడి పేరు తెర మీద కనిపించగానే సంగీతం ఆగిపోయింది. హెన్రీ సినిమా మీద మనసుని కేంద్రీకరించలేకపోయాడు. ఫ్లోరిడాలోని ఓ జైల్ సెల్లో ఉన్న ఆ క్యాషియర్ మనఃస్థితి గురించి ఊహిస్తున్నాడు.

న్యూయార్క్ నగరంలో ఉదయం దృశ్యం తెర మీద జరుగుతున్నది. వీధిని ఊడ్చే వాళ్ళు ఊడుస్తున్నారు.ఎవరికైనా ఆ కవర్ దొరికిందా? వాళ్ళు దాన్ని ఇవ్వలేదా? దొరికిన వాళ్ళు కోట్ జేబులో ఉంచుకొని సినిమా అయ్యాక బయటకి వెళ్ళొచ్చని మేనేజర్ ఊహించలేడా? తనకా కవర్ దొరికితే తనేం చేస్తాడు? తన మేనేజర్ పెర్కిన్స్ రెండు వారాలు సెలవు కావాలని చెప్పి, తన గర్ల్ ఫ్రెండ్‌తో ఫ్లోరిడాకి వెళ్ళొచ్చు అనే ఆలోచన కలిగింది. లేదా ఒంటరిగా వెళ్తే అక్కడే ఓ అందమైన అమ్మాయి తారసపడవచ్చు. డబ్బు ఖర్చు చేసే యువకుడితో ఎండకి తెల్లటి చర్మం గోధుమరంగుకి తిరిగిన ఏ అందమైన మోడల్ గర్ల్ గడపడానికి అంగీకరించదు? లేదా కొత్త కారు, కొత్త టి.వి సెట్. ఇంకాస్త విశాలమైన అపార్ట్‌మెంట్‌ని అద్దెకి తీసుకోవచ్చు.సినిమా ఆసక్తిగా ఉంది. పోలీసులు దేనికోసమో హోటల్ గదులని వెదుకుతున్నారు. తన దగ్గర ఆ క్యాషియర్ దగ్గర కూడా పాతిక వేల డాలర్లు లేవు. తను స్వేచ్ఛగా ఉన్నాడు. అతను ఓ జైల్ సెల్లో ఏడుస్తూ ఉంటాడు. సినిమా హాలంతా వెదికినా అది దొరుకలేదంటే మూడు జరిగి ఉండొచ్చు. క్యాషియర్ అబద్ధం చెప్పి ఉండొచ్చు. లేదా దాన్ని ప్రేక్షకుల్లో ఎవరైనా కొట్టేసి ఉండొచ్చు. మూడోది ఇంతకు మునుపు ఆటల్లోని ప్రేక్షకుల్లో ఎవరికైనా అది దొరికి ఉండచ్చు... లేదా నాలుగోది కూడా జరిగి ఉండచ్చు. అది తన సీట్ కింద ఉండి ఉండొచ్చు. లేదా తన పక్క సీట్ల కింద. ఈ వరుసలో తను రాని, ఎవరూ కాని వెదుకలేదు.

తను వెదకడం తన వెనక వరసలోని వాళ్ళు చూడకూడదు అనుకున్నాడు. తల తిప్పి వెనక్కి చూశాడు. తన వెనక రెండు వరసల్లోని సీట్లు ఖాళీగా ఉన్నాయి..తెర మీద పోలీస్ రిసెప్షనిస్ట్‌ని ఓ మూడు నెలల పసిపిల్ల, తల్లి గురించి ప్రశ్నిస్తున్నాడు. హెన్రీ నేల మీద మోకాళ్ళ మీద కూర్చొని తన సీట్ కింద చేత్తో తడిమాడు. ఉబ్బెత్తుగా చేతికి ఏదో తగలగానే అతని గుండె క్షణకాలం లయ తప్పింది. నెమ్మదిగా దాన్ని సీట్ నుంచి పీకాడు. చేతిలోకి ఓ కవర్ వచ్చింది. తన సీట్లో కూర్చొని దాన్ని కోట్ లోని రహస్య జేబులో కుక్కుకున్నాడు.తిరిగి బయటకి వెళ్ళేటప్పుడు అందర్నీ వెతుకుతారా? అసాధ్యం. ఎంత మంది ప్రేక్షకులు ఉన్నారు? వంద మందా? రెండు వందల మందా? ఇంకా ఎక్కువ మందా? వెతక్కపోవచ్చు. ఒక వేళ వెతుకుతుంటే దాన్ని ఎక్కడైనా దాచి తర్వాతి షోకి వచ్చి తీసుకోవచ్చు. ఎక్కడ? సీట్ కింద అతికించడానికి టేప్ లేదు. గోడకి తగిలించిన నిప్పునార్చే యంత్రం వెనుక కుక్కవచ్చు.అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. సినిమా కథ మీద మనసుని కేంద్రీకరించలేకపోయాడు. కళ్ళు తెర మీది దృశ్యాలని చూస్తున్నా వాటిని మెదడు గ్రహించడం లేదు.మిస్టర్ హెన్రీ. ఇన్వాయిస్‌లను అన్నింటినీ ఫైల్ చేయి. మిస్టర్ హెన్రీ. స్టాక్ స్టేట్‌మెంట్ రెడీ చేసావా? మిస్టర్ హెన్రీ. అది చేశావా? ... ఇది చేశావా? ల నుంచి తను కొద్ది వారాలు తప్పించుకోవచ్చు. తను ఆ కవర్తో బయటకి వెళ్ళగలిగితే ఇక ఉదయం అలారం కొన్ని వారాల పాటు నిద్ర లేపదు. చేతి గడియారంలోని రేడియం డయల్ వంక చూసుకున్నాడు. ఇంకా గంట పైనే. ఇప్పుడు తను బయటకి వెళ్తే తనని తప్పక అనుమానిస్తారు. బయట ఇప్పటికే పోలీసులు ఉన్నారేమో? చివరి దాకా వేచి ఉండాలి. అందరితో కలిసి గుంపుగా బయటకి వెళ్ళాలి.వారానికి 513 డాలర్ల 60 సెంట్లు సంపాదించే తను జీవితంలో మొదటిసారి వారానికి ఐదు వేలు ఖర్చు చేసి ఎలా జీవించవచ్చో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు అనుకున్నాడు. తను క్షేమంగా బయటకి వెళ్ళగలిగితే, అతని మనసులో ఓ మూల నుంచి ఓ కంఠం ఆ కవర్ని ఇచ్చేయ్ అని హెచ్చరిస్తున్నది. కానీ, ఆ నైతిక కంఠాన్ని హెన్రీ విస్మరిస్తున్నాడు. చిట్టచివరికి దాదాపు సంవత్సర కాలం అనిపించేలా గంట గడిచాక తెర మీద ది ఎండ్ కనిపించింది. హాల్లో లైట్లు వెలిగి, అంతా లేవగానే ఒక్క సారిగా సీట్ల చప్పుళ్ళు, మాటలు వినిపించాయి. హాల్లో వృద్ధులే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళతో కలిసి నిర్భయంగా బయటకి నడిచాడు.

బయట గోడకి అతికించిన సినిమా పోస్టర్లని చూస్తూ ఓ కంట బయటకి వెళ్ళే ప్రేక్షకుల్ని వెతుకుతున్నారా అని కనిపెట్టి చూశాడు. అలాంటి సూచనలేమీ హెన్రీకి కనపడలేదు. అతను మెయిన్ ఎగ్జిట్ లోంచి బయటకి వెళ్తూంటే ఎవరూ అతని మీదకి దూకి పట్టుకోలేదు. ఆ సినిమా థియేటర్లోంచి అతను బయటకి వెళ్ళాక దీర్ఘంగా నిట్టూర్చాడు. వేచిఉన్న గర్ల్‌ఫ్రెండ్‌ని విస్మరించి హుషారుగా ఈల వేస్తూ సమీపంలోని ఓ రెస్టారెంటికి వెళ్ళాడు. బీర్, హేండ్ విచ్లని ఆర్డర్ చేసి ఓ సారి ఆ కవరు ఉందా అని తనిఖీ చేసుకున్నాడు. ఉంది. రాత్రి భోజనాన్ని అక్కడే పూర్తి చేసి అక్కడ నుంచి థర్టీ ఫిష్ స్ట్రీట్‌లోని సబ్ ఎక్కి గంట తర్వాత తన అపార్ట్‌మెంట్ చేరుకున్నాడు.తన జేబులోని కవర్ తీసి మంచం మీద పడేసి, బూట్లు, కోట్ విప్పాడు. తర్వాత మంచం మీద కూర్చొని ఆ కవర్ని అందుకొని పరిశీలించాడు. ఆ హాల్ పేరు, అడ్రస్ ముద్రించిన తెల్లటి దళసరి కవర్ అది. సీట్ కింద దాన్ని అతికించిన మేర ఇంటూ ఆకారంలో సెలిఫోన్ టేప్ కనిపించింది. కత్తెరని తీసుకొని వణికే చేతులతో దాన్ని కట్ చేస్తూ అనుకున్నాడు.ఆఖరికి ఆఫీస్ డబ్బు కూడా తను ఒక్క సారిగా పాతిక వేలు చూడలేదు. అలా చూడడం తన జీవితంలో మొదటిసారి. బహుశా అందులో తన డబ్బు కూడా కొంత ఉండొచ్చు. తను అనేకసార్లు ఆ హాలుకి వెళ్ళి టికెట్లు కొన్నాడు. ఆ ఆలోచన అతనికి నవ్వుని తెప్పించింది. కవర్లోకి వేళ్ళని చొప్పించి బయటకి ఓ దొంతరని తీశాడు. అన్నీ వంద డాలర్ల నోట్లు. అందుకే అంత ఉబ్బెత్తుగా ఉంది. రబ్బర్ బ్యాండ్‌లతో కనిపించిన మడతలు పెట్టిన కాగితాన్ని తీసి మడతలు విప్పి దాని మీద టైప్ చేసింది చదివాడు.డియర్ ప్రేక్షక మహాశయా,మాకు మనిషి బలహీనతలు తెలుసు కాబట్టి మిమ్మల్ని క్షమిస్తున్నాం. వచ్చే సోమవారం నుంచి మా హాల్లో ప్రదర్శించబడే నేరస్తుడు అనే సినిమాని ప్రమోట్ చేయడానికి ఈ కవర్ మీ సీట్ కింద ఉంచబడింది. ఆ సినిమా కథలో నేరస్తుడు పాతిక వేల డాలర్లు దొంగిలించడంతో అతను ఎదుర్కొన్న చిక్కులే ఆ సినిమా కథ. ఈ కవర్ని కనుక మీరు సినిమా హాల్లో మేనేజర్‌కి ఇచ్చుంటే, అందరి ప్రేక్షకుల ముందు మీకో ఐదు వేల డాలర్లని ఇచ్చేవాళ్ళం. అది పబ్లిసిటీ ఖర్చు.ఒక వేళ మీరా ఐదు వేలు పొందకపోతే, ఈ దొంతరలోని డబ్బు సినిమాల్లో నాటకాల్లో ఉపయోగించడానికి అచ్చు వేసిన నకిలీ నోట్లని తెలియచేస్తున్నాం. ఇవి అసలు నోట్లు కావు కాబట్టి వీటిని మార్చే ప్రయత్నం చేయడం నేరమని హెచ్చరిస్తున్నాం. నేరస్తుడు సినిమాని చూసి మీరు ఆనందిస్తారని ఆశిస్తూ, ఈ ఉత్తరాన్ని మేనేజర్‌కి ఇస్తే, నేరస్తుడు సినిమాకి మీరు నాలుగో వారంలో చెల్లుబాటయ్యే రెండు కాంప్లిమెంటరీ టికెట్లు తీసుకోవచ్చు.
- మేనేజ్ మెంట్ (మేన్ రూబిస్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి

661
Tags

More News

VIRAL NEWS