సామాన్యులే హీరోలు! హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్


Sun,April 14, 2019 02:10 AM

ఈ జగత్తులో ఉన్న మానవులకు ప్రతీ ఒక్కరికీ ఒక కథ ఉంటుంది. ఎవరి కథలో వాళ్లే హీరోలు. ప్రతీ కథకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అందులో జీవం ఉంటుంది. జీవితం ఉంటుంది. అలాంటి కథలకు ఓ వేదిక ఉండాలి. అన్నింటినీ కలిపే ఒక వారధి కావాలి. సామాన్య రచనలకు పెద్దపీట వేస్తూ ప్రారంభమైన హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు తుమ్మల రచనా చౌదరిని బతుకమ్మ పలుకరించింది.

-అజహర్ షేక్, సెల్: 9963422160

హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ కోటీ ఎనభై లక్షల లైక్స్ ఉన్న ఒక ఫేస్‌బుక్ పేజీ. న్యూయార్క్ కేంద్రంగా ఉండే సాధారణ జనాల వ్యథలను, వ్యాపకాలను, వ్యాసాలను రాసే ఒక ఆన్‌లైన్ పోర్టల్. దీని తర్వాత ఇలాంటి చాలా వచ్చాయి. అమెరికాలో చదువుకున్న రచనకు హైదరాబాద్‌కి కూడా ఇలాంటి ఒక పేజీ ఉంటే బావుండు అనిపించింది. దీని నుంచే భిన్నమైన మనుషులు, వారి స్వభావాలను పరిచయం చేయాలనే ఆలోచన పుట్టింది. 2016 ఏప్రిల్ 29న పురుడు పోసుకున్న ఈ సంస్థ ఇప్పటివరకు సుమారు 500 మంది సామాన్యులపై వ్యాసాలు ప్రచురించింది. మూడేళ్లు అవుతున్న సందర్భంగా విభిన్న రంగాలలో రాణిస్తున్న మహిళలను తీసుకొచ్చి రౌండ్ టేబుల్ సమావేశం, చర్చాకార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే హ్యూమన్స్ ఆఫ్ ఆంధ్ర కూడా మొదలుపెట్టారు. హ్యూమన్స్ ఆఫ్ చెన్నై కూడా రిజిస్టర్ చేశారు. భవిష్యత్తులో దీన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా కథనాలను రాయొచ్చు. ఫేస్‌బుక్ పేజీలో సంప్రదిస్తే పూర్తి వివరాలను తెలియజేస్తారు.
HYDLogo

రచన విదేశాల్లో ఎక్కువ రోజులు ఉండడం వల్ల వివిధ రకాల మనుషులు, వారి మనస్తత్వాలు గమనించింది. స్పానిష్ వంటి విదేశీ భాషలు కూడా నేర్చుకున్నది. ఎక్కువ కాలం బయట ఉండడం వల్ల సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు, వాటి నుంచి జరిగే పరిణామాలు, పర్యవసానాలు బాగా తెలుసుకున్నది. ప్రధాన మీడియా స్రవంతి ప్రచురితం చేయని సామాన్యుల కథలను, కథనాలను పరిచయం చేయాలనే ఆలోచనతో హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్‌ను స్థాపించింది. కొత్త సంప్రదాయాలను, వ్యక్తిత్వాలను, వారి ఆలోచనా తీరును పదిమందికి చేర్చితే అది మరింత మందికి ఆదర్శమవుతుందని భావించింది. అన్ని వయసుల వారు ఆదరించాలని, అన్ని రకాల కథలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం దాని ప్రత్యేకతలు, హైదరాబాద్‌లో చాలామందికి తెలియని ఆసక్తికరమైన ప్రదేశాలు, విశేషాలను కూడా పరిచయం చేస్తున్నారు. హ్యుమన్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతోనే భవిష్యత్తులో వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టణాల నుంచి కూడా కథనాలను తెప్పించి ప్రచురితం చేయాలనుకుంటున్నారు. కథనాలతో పాటు విజువల్ డిమాండ్ ఉన్న కథనాలను వీడియో డాక్యుమెంటరీలను కూడా చేస్తున్నారు. ఒక్కరితో మొదలైన ఈ ప్రయాణం ప్రస్తుతానికి ఏడుగురితో నడుస్తున్నది. భవిష్యత్తులో మరింతమందికి ఉపాధిమార్గంగా మారి మరిన్ని కథనాలను పరిచయం చేయనున్నది.

రచనా చౌదరి అమెరికాలో ఉన్నత చదువులు పూర్తిచేసింది. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎలక్షన్స్(సఫాలజీ) కోర్సు పూర్తి చేసి అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చింది. ఎన్జీ మైండ్ ఫ్రేమ్స్ పేరుతో సంస్థను స్థాపించి పొలిటికల్ పోలింగ్ సర్వీస్ చేసింది. ఒకవైపు సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొనసాగుతూనే హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టింది. ప్రజలను కలిసి వారితో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకొని వాటిని అధికారుల, పాలకుల దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యతగా భావిస్తున్నది. హ్యూమన్స్ లైబ్రెరీ పేరుతో స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టి వ్యక్తుల అనుభవాలు, కష్టాలనే పుస్తకాలుగా, గురువులుగా రూపొందించాలనుకుంటున్నది. త్వరలోనే దీన్ని కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలనుకుంటున్నది. ప్రతీ మనిషికి ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం వెనుక ఉన్న కథను, కష్టాలను పదిమందికి తెలియజేయాలనే సంకల్పంతో చేస్తున్న కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. భవిష్యత్తులో దీన్ని మరింత ఎత్తుకు తీసుకుపోవాలనుకుంటున్నది. ఆసక్తిరమైన కథనాలు, మరిన్ని వివరాల కోసం facebook.com/ TheHumans OfHyderabad పేజీని చూడండి.

672
Tags

More News

VIRAL NEWS