నృగుడు


Sun,April 14, 2019 01:35 AM

ఒక జీవితం ఆదర్శాన్ని నేర్పితే, ఒక జీవితం గుణపాఠం నేర్పుతుంది. అనుభవాలకు ఆనవాలైన జీవితం ఎవరిది వారికి ఒక దృష్టికోణంలో అర్థమైతే. అదే జీవితం ప్రపంచానికి వివిధ కోణాల్లో కనిపిస్తుంది. జీవితాల్ని మించిన పాఠాలు మరే శాస్ర్తాల్లోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. మనుషుల మనస్తత్వాలు ప్రభావితమయ్యేటువంటి ఆకర్షణకు ప్రతిరూపాలు. మనిషి తనదైన జీవితంలో బతుకుతూనే. తనను ఆకర్షించిన జీవితాదర్శాలను అనూనయించుకోవడమో, తనదైన జీవితమే గుణపాఠంగా మరిన్ని జీవితాలను జాగృతపరుచడమో చేయవచ్చనే దృక్పథానికి ప్రతీక నృగుని చరితం. మానవత్వం, మేథస్సు కలగలిసిన మూర్తిమత్వం నృగుడు. జీవితంలో జరిగిన సంఘటనలకు వెన్నుచూపించక ప్రాయశ్చిత్తానికి సిద్ధపడ్డ ఉన్నతుడు నృగుడు.

-ఇట్టేడు అర్కనందనాదేవి

ధర్మయుగం అయిన త్రేతాయుగంలో వైవస్వతుని కొడుకైన నృగుడు అఖండమైన కీర్తి ప్రతిష్టలతో భూమిని పాలించాడు. విచక్షణ, వ్యవహారం తెలిసినవాడు. ఆచార, సంప్రదాయాలను విశ్వసించేవాడు. సత్యనిష్ఠ ధర్మపాలన తన విద్యుక్త ధర్మాలుగా మలుచుకున్నవాడు నృగుడు.నృగుడు అంటే కేవలం పాలించే రాజుగానే కాదు మనసున్న మహారాజనే పేరుండేది. మనుషుల జీవితాలను అర్థం చేసుకోగల విశాలభావచింతన నృగునిది. ప్రజలంటే బాధ్యత అనుకొని చాలా జాగ్రత్తగా వారి బాగోగులను చూసుకునేవాడు. దానాలు చేయడంలో చేతికి ఎముకే లేకుండా పుట్టాడనే ప్రశంస నృగునికే చెందింది. పుష్కర సమయంలో దానధర్మాలు చేయడం రాజ్యక్షేమానికి దోహదపడుతుందనే మంత్రుల సూచన మేరకు బంగారంతో అలంకరించిన ఆవులను కోట్ల సంఖ్యలో దానం చేశాడు. దానివల్ల ఎంతోమంది కుటుంబాలకు ఆధారం దొరికింది. అయితే నృగమహారాజు దానం చేసే సమయంలో, అదే రాజ్యంలో ఉండే ఒక పేదవాడి ఆవు, దూడ కూడా రాజు దానం చేసిన ఆవు గుంపులో కలిసిపోయి వేరేవారికి దానంగా వెళ్ళిపోయాయి. ఆ పేదవాడికి జీవనాధారం ఆ ఆవు. పొలాల్లో పంటకుప్పలను తరలించిన తర్వాత పొలంలో పడిపోయిన ధాన్యపు గింజలను ఏరుకునే పరిగపని మాత్రమే.నృగుడు చేసిన దానంలో తన ఆవు వెళ్ళిపోయిందని తెలియక పేదవాడు ఆవుకోసం వెతుకని రాష్ట్రం లేదు, ఊరూ లేదు. చివరికి ఒక ఊరిలో పేదవాడి గొంతు విని పరుగెత్తుకుంటూ వచ్చింది ఆవు. దాని వెనుకే పరిగెత్తుకుంటూ వచ్చాడో వ్యక్తి. ఆవు తనదని పేదవాడు, ఆవు తనకు దానంగా లభించిందని ఆ ఊరి వ్యక్తి వాదనకు దిగుతారు.పేదవాడిది బంధమైతే, దానం తీసుకున్న వ్యక్తిది హక్కు.
Nrugudu

వారి వాదన చివరికి నృగమహారాజే తీర్చగలడని నిర్ణయించుకొని ఇద్దరూ నృగుని రాజభవనానికి వెళతారు. నృగమహరాజు ముఖ్యమైన పనుల్లో నిమగ్నం అవడం వల్ల రాజును సంప్రదించకుండానే సేవకులు వారిని కోటలోకి అనుమతించరు. వాళ్ళు దాదాపు మూడు రోజుల పాటు రాజదర్శనం కోసం ఎదురుచూసి విసుగు చెంది కోపంతో ముఖ్యమైన పనికోసం, న్యాయం కోసం రాజు దగ్గరికి వస్తే మాకు దర్శనమివ్వలేదు, తొండగా పుట్టమని శాపం ఇచ్చి వెళ్ళిపోతారు.నృగమహారాజు తర్వాత సేవకుల ద్వారా విషయం తెలుసుకొని వారిద్దరినీ పిలిపించి వారికి న్యాయం చేసి వారి దగ్గరున్న ఆవుకు వయసై పోవడం వల్ల దాన్ని రాజ్య పోషణలోనే చివరిదాకా ఉండేలా చూస్తాడు నృగుడు. పేదవాడు, దానం పొందిన వ్యక్తి రాజుపట్ల వారి తొందరపాటుకు సిగ్గుపడి మరుసటి యుగంలో శాపానికి విమోచనం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోతారు.నృగుడు తన ప్రమేయం లేకుండా తన జీవితంలో ఎదురైన సంఘటన తనకు శాపంగా మారిందని కుంగిపోక, తన మంత్రివర్గాన్ని పిలిచి మూడు నూతులను వర్షం, చలి, వేడి బాధ ఉండనివి, నున్నతి రాతితో నిర్మించమని పురమాయించాడు. తన కొడుకుకు పట్టాభిషేకం చేసి రాజ్యభారం అంతా అప్పజెప్పి తన శాపాన్ని అనుభవించడానికి వెళతాడు. నృగుడు తన కొడుకుతో పాటు ప్రపంచాన్ని పాలించే పాలకులకూ, ఉన్నత పదవులలో ఉన్నవారికీ చెప్పిన సందేశం ఏంటంటే, తమ కోసం వచ్చిన అత్యవసర సమయాల్లో రాజును ఆశ్రయిస్తారనీ, వారినెప్పుడూ నిరాశపరచకూడదనీ, అది రాజుకూ పాలకులకూ దోషమనీ వివరించాడు. నృగుడు చెప్పిన ఈ ధర్మాన్నే రాముడూ ఆచరించి, నృగుని గాథను లక్ష్మణునికి చెప్పాడట.రాజధర్మం జీవిత ధర్మంలో భాగమనే విషయం, జీవిత ధర్మం జీవితాన్ని ఎలా నడిపిస్తే ఆ దారే మనం నడిచేదారనీ నృగ మహారాజు జీవిత సందేశం.

563
Tags

More News

VIRAL NEWS